Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 23


                                      26

             
        
                                                                                         హైదరాబాద్,
                                                                                          4-7-1956
    డియర్ జానీ!
    నా వివాహ శుభలేఖ కోసం ఎదురు చూసే నీకు నా ఉత్తరం ఆశ్చర్యం కలిగించ వచ్చు. నీకేమిటి? నాకే అంతా తమాషాగా ఉంది. మన దుర్గ నా ఒడిలో తలపెట్టి ఏడ్చింది. తాను గిరిని ప్రేమించాననీ, కానీ అతడు తిరస్కరించాడనీ చెప్పింది. దుర్గను సంతోష పెట్టడానికి దుర్గ తరపున లేని చనువు తీసికొని గిరితో మాటలు పెంచుకున్నాను. గిరి ఎవరని ఆశ్చర్య పడతావు కదూ! మా బావకు అత్మీయుడైన స్నేహితుడు లే! అతనితో మాట్లాడిన క్షణం నుంచీ నాలో విచిత్రమైన మార్పు కలిగింది. నాకు తెలియకుండానే అతని ఆకర్షణ కు లొంగి పోయాను. మా బావ మీద నాకున్నది కేవలం వాత్సల్యమని , ప్రేమ కాదనీ అనిపించసాగింది. క్రమంగా ఆ భావన నాలో బలపడింది. బావను పెళ్లి చేసుకో లేకపోయాను. చేసికోననీ చెప్పలేక పోయాను. అందుకే కాస్త వూపిరి తీసుకుందామని మెడిసిన్ లో చేరాను.
    ఏమంటావూ? నాది చంచలమైన మనసని తిడ్తావా? నిజమేనేమో?
    తొందరగా సమాధానం వ్రాయవూ? నీ పెళ్లి విశేషాలన్నీ వివరంగా వ్రాయి.

                                                                                             నీ
                                                                                            ఉమ.

                                                                                      హైదరాబాదు,
                                                                                        6-9-1958
    డియర్ జానీ!
    దుర్గ వివాహం జరిగింది. పెళ్లి కొడుకు చాలా బాగుంటాడు. చదువు కోలేదు. వ్యాపారం లో నిపుణుడు. గిరి ప్రోత్సాహమే ఈ వివాహానికి కారనమంది దుర్గ.
    ఇన్నాళ్ళు గా వూగిసలాడిన నా మనసు ఒక నిశ్చయానికి వచ్చేసింది. బావను , బావగా అభిమానించగలనే కాని, భర్తగా అరాధించ లేను. నా మనసులో గిరి తిష్ట వేసుకు కూర్చున్నాడు. గెంటినా పోవటం లేదు.
    నేను ఎంత కలివిడిగా ఉందామని ప్రయత్నించినా, నాతొ చాలా ముభావంగా ఉంటున్నాడు గిరి. మునుపున్న కొద్దిపాటి స్నేహం కూడా లేకుండా పోయింది. బహుశా నేనంటే అతనికి ఇష్టం లేకపోయి ఉండచ్చు. అయినా, అతనిని ఆరాదించ కుండా ఉండలేను జానీ! నా ఆరాధన అతడు స్వీకరింపకపోనీ, అతనిని నా మనసులో ధ్యానించుకుంటేనే చాలు, నాకు ఎక్కడ లేని తృప్తీ కలుగుతుంది. బావ సంగతి తల్చుకుంటే నాకెంతో వ్యధ కలుగుతుంది. వ్యంగ్యంగా ఎన్నిసార్లు నా అభిప్రాయం వ్యక్త పరచినా , అర్ధం చేసుకోడు-- మా బావది ఎట్లాంటి ఆవేశమో, ఉద్రిక్త స్వభవమో నీకు తెలుసుగా. తన గోలేమో తనది తప్ప ఇంకేమీ ఆలోచించడు. అయినా పాపం తన తప్పేమీ ఉంది? చిన్నతనం నుంచీ నన్ను తన దానిని గా భావించాడు. ఎక్కువగా ఈ విషయాల్ని గురించి ఆలోచించని నేను కూడా మొన్నటి వరకూ , అతని భావనను ప్రోత్సహమిచ్చాను. నా నోటితో బావకు అసలు విషయం ఎలా చెప్పగలను? బావనూ, భగవంతుడినీ, ఈ దోషం క్షమించమని ప్రార్ధించటం కంటే నేను చెయ్యగలిగిందేముంది?
    అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని నీ ఉత్తరాలు కొంత వోదారుస్తున్నాయి. తిరుగు టపాలో జవాబు వ్రాయాలి మరి!

                                                                                             నీ
                                                                                           ఉమ

                                                                                        హైదరాబాద్
                                                                                         27-10-61
    డియర్ జానీ!
    నీ ఉత్తరం ఈసారి నాకెంతో ఆశాభంగం కలిగించిందో చెప్పలేను. అన్నీ విషాద వార్తలు వ్రాసావెం? దుర్గ సంసారం లో కలతలా? మీవారికి గుండె జబ్బా?! అబ్బా! పరిపూర్ణత ను ప్రసాదిస్తే మనం తనను మరిచి పోతామని కాబోలు-- ఏ ఒక్కరికీ పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించడు భగవంతుడు.
    నేను గిరికి ఎన్ని ఉత్తరాలు వ్రాసినా సమాధానం వ్రాయలేదు. మొదట్లో పొడిగా, ఒకటి, రెండు వాక్యాలతో సమాధాన మిచ్చాడు. కానీ, తరువాత అది కూడా లేదు. దురదృష్ట వంతురాలిని జానీ! అతని హృదయంలో నాకు స్థానం లేదు. ఈ ఆవేదన నేను భరించలేను. బావతో ఉన్న విషయం ఉన్నట్లు చెప్పేస్తాను. పోనీ అతడైనా తన కనుకూలమైన యువతిని వివాహమాడి సుఖ పడ్తాడు.
    మీవారికి మీ అన్నయ్య కు నా నమస్కారా లందజేయి. ఉంటా.!

                                                                                           నీ
                                                                                          ఉమ.
    
                                                                                       తేజ్ పూర్
                                                                                        28-9-62
    డియర్ జానీ!
    మన దేశాన్నంతనీ అట్టుడికినట్టుడికించిన ఈ యుద్ధం నా జీవితానికి వరమయింది. ఏ దారీ తెన్నూ కానక కొట్టుకుంటూన్న నాకు చక్కని మార్గం చూపించింది. ఇక్కడకు వచ్చేసాను. పాపం! బావ ఎంత బాధపడ్డా డనుకున్నావే? దుర్మార్గురాలిని. అతని కంత ఆవేదన కలిగించిన నేను ఎంతటి శిక్ష కయినా అర్హురాలిని. ఇక నా తల్లిదండ్రుల ఆవేదన వర్ణించటానికి మాటలు దొరకటం లేదు. బావ దుఃఖాన్నంతటిని మరిపించగల స్త్రీ ఎవరైనా, అతని జీవితంలోకి తొందరగా వస్తే బాగుండును.
    విచిత్రం , గిరి కూడా ఎంతో బాధపడ్డాడు. నేనంటే కనీసం స్నేహ భావమైనా, లేని పెద్ద మనిషి. అంత బాధపడట మెందుకు! బహుశా తన మిత్రుడు హరి కోసమై ఉంటుంది. వాళ్ళ స్నేహం ఎంత గాడమైనదనుకున్నావూ! అట్లాంటి స్నేహం పొందగలగటం కూడా అదృష్టమే!
    ఇక్కడ జీవితం నాకు బాగుంది. ఇక్కడి వాతావరణమే తమషాగా ఉంది. ఎనిమిదయినా సరిగ్గా తెల్లవారదు. నాల్గింటి కే చీకటి పడుతుంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు జనులందరూ మంచి దృడ కాయులు, కష్ట జీవులు, సరదాలకు అవకాశం చాలా తక్కువ. కానీ, ప్రతిదీ చాలా ఖరీదు గా ఉంటుంది. మొన్న ఒక తువ్వాలు ఏకంగా పదిహేను రూపాయలు చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూస్తె "ఇండియా లో తయారైంది మేడం!" అన్నాడు గొప్పగా -- నా కెంతో నవ్వు వచ్చింది. ఈ యుద్ధం గొడవలు లేక మునుపు వీళ్ళంతా ప్రశాంతంగా జీవించే వారను కుంటా! కానీ, ఇప్పుడందరూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. అయినామంచి ధైర్య వంతులు. స్త్రీ పురుష, బాల వృద్ద భేదం లేకుండా అందరూ సైనిక శిక్షణ పొందుతున్నారు. సైరన్ మ్రోత వినం గానే ఏ పని చేస్తున్న వాళ్ళం ఆ పని వదిలేసి క్రింద పడుకోవటం చాలా తమాషాగా ఉంటుంది. నిజంగా శత్రు సైనికులు రాక పోయినా శిక్షణ కోసం ఇలా జరుగు తుంది.
    రామకృష్ణ పరమహంస నీతి కధల్లో ఒక కధ గుర్తుందా? ఒక దొంగ తనను పట్ట వచ్చిన వారి నుంచి తప్పించికోవటానికి సన్యాసి వేషం వేసుకుంటాడు. కానీ, ఆ వేషం లోని ఉదాత్తత , అతనిని నిజంగా సన్యాసిని చేస్తుంది. న విషయమూ సరిగ్గా అట్లాగే ఉంది. మొదట్లో నా నిరాశను భరించలేక , ఇక్కడకు వచ్చినా, ఇప్పుడిది వదిలి రాలేను. మన దేశం కోసం ప్రాణాలను ధారపొయ్యడానికి సిద్దపడిన త్యాగ మూర్తులకు నేను చెయ్య గలిగిన సహాయం చెయ్యటం లో నాకెంతో సంతృప్తి కలుగుతుంది. ఇట్లాంటి అవకాశం దొరికినందుకు నేనెంతో గర్విస్తున్నాను.

                                                                                      సెలవు,
                                                                                         నీ,
                                                                                        ఉమ.

                                                                                    తేజ్ పూర్
                                                                                     28-9-62
    డియర్ జానీ!
    నా ఆనందాన్ని నీకెలా వర్ణించనే! వరద గోదావరి లా , నా హృదయం , ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. నా జన్మ వ్యర్ధం కాలేదు. సార్ధక మయింది. అసలు విషయం చెప్పకుండా సోది చెప్తున్నానని విసుక్కుంటూన్నావా? అయితే విను.
    గిరి ఇక్కడకు వచ్చాడు. ఒక్కరోజు ఉన్నాడు. ఆ ఒక్క రోజులోనే , నా జీవితాని కంతకూ సరిపోయే, ఆనందం కలిగించాడు. ఇన్నాళ్ళ కు నేను గిరి హృదయంలో  నాకు స్థానముందని గ్రహించాను. గిరీ, తన నోటితో తను ఒప్పుకున్నాడా విషయం. అయినా తన ప్రాణ మిత్రుని భార్యగా మాత్రమే నన్నెప్పుడూ గౌరవిస్తానని చెప్పాడు. హరి, నేను లేకుండా బ్రతకలేదు కనక, హిందూ సమాజం లో అవివాహితులైన స్త్రీ మసలటం కష్టం గనుక నన్ను హరిని పెళ్లి చేసుకోమని బ్రతిమాలాడు. అందుకోరకే తను వచ్చినట్లు చెప్పాడు. ఈ జన్మ లో తను నన్ను వివాహం చేసికోవటం అసంభవం , అని వ్యంగ్యంగా దృడంగా చెప్పాడు.
    అతని మాట మీద గౌరవంతో , బావ మీద జాలితో బావను పెళ్లి చేసుకుని అతనిని మనసార ప్రేమించలేక పోయినా, భార్యగా నా కర్తవ్యం నెరవేర్చి, అతనిని సుఖ పెట్టాలనే నిశ్చయించుకున్నాను. బావకు ఉత్తరం వ్రాసాను. నా ఉద్యోగం వదలనని కూడా వ్రాసాను. ఉద్యోగం వదిలి తేనే గాని పెళ్లి చేసుకోనని బావ సమాధానం వ్రాసాడు. ఇంతలో ఉంది బావ ప్రేమ! పోనీలే బావకు నా మీద గాడానురాగమని ఇన్నాళ్ళు ఎంతో ఆవేదన పడే దానిని. ఇప్పుడెంతో తేలికగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఒకటే సంసారం. ఇప్పుడ దేశమంతా నా సంసారమే! గిరిని ధ్యానించుకుంటూ, జీవితమంతా ఇలాగ గడిపేస్తాను. అన్ని అపార్దాలకూ, అతీతమైన వృద్ధాప్యంతో అతని సన్నిధికి చేరుకుంటాను. నన్ను స్వీకరిస్తాడనే నా నమ్మకం. ఆసమయం కోసం నిరీక్షిస్తూ ఉంటాను.
    అల్లరి దుర్గ అప్పుడే తల్లి కాబోతుందా? నేనక్కడికి వస్తే పాపకు మంచి బహుమానాలు తెస్తానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పు.
    సాధారణ పరిస్థితులలో అక్కడికి రావటం నాకు పడదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, నాకు టెలిగ్రాం ఇయ్యి.
                                                                                             బై, బై
                                                                                               నీ
                                                                                              ఉమ.
    పార్కులో కూర్చుని ఉత్తరాలన్నీ చదివిన హరి వాటిని మడచి జేబులో పెట్టు కున్నాడు. అక్కడి ప్రతి ఒక్కరూ తన ముఖం లోకి వింతగా చూడటం గమనించాక, కానీ హరికి తన కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయని అర్ధం కాలేదు. సిగ్గుపడి రుమాలుతో ముఖం తుడుచుకుని బయలుదేరాడు. అతని హృదయం క్షోభ తో కుమిలి పోతుంది. అమాయకురాలిని దుర్గను తానెంత క్షోభ పెట్టాడు. ఎప్పుడూ ప్రాణానికి ప్రాణంగా ఉండే గిరిని ఎంత పొరపాటుగా అర్ధం చేసుకున్నాడో? రెక్కలు కట్టుకుని వాలి, అతనిని గట్టిగా కౌగలించు కోవాలనీ, క్షమాపణ చెప్పుకోవాలని , తహతహ లాడసాగింది హరి మనసు.
    దుర్గ హరి ముఖం చూడగానే కంగారుగా "ఏమయిందన్నయ్యా!' అంది. హరి దుర్గ చేతిని తన చేతిలోకి తీసికొని "నన్ను క్షమించు దుర్గా! వెర్రి వాడినయి, నేను బాధపడిందే కాక నిన్నూ గిరినీ కూడా క్షోభ పెట్టాను. నాకంటే కూడా గిరే, నీకు నిజమైన అన్న" అన్నాడు.
    దుర్గ తేలికగా నిట్టూర్చింది. హరి చేతిని ఆప్యాయంగా నిమురుతూ "నీ మనసు నవనీతం అన్నయ్యా! ఒళ్ళు తెలియని ఉద్రేకం లేకపోతె నువ్వు బంగారు తండ్రివి. జానకి అంతా చెప్పిందా?'
    "అవును."
    "నేనే చెప్దామనుకున్నాను. కాని నువ్వు వినిపించుకునే లాగ లేవు. విధి లేక నోరు మూసుకున్నాను. ఒక్క నా విషయమేనా? ఇంకా చెప్పిందా?"
    హరి బరువుగా నిట్టూర్చాడు.
    "అన్ని సంగతులూ తెలుసుకున్నాను.' అన్నాడు.
    దుర్గ జాలిగా అన్న చెయ్యి నిమురుతూ ఏదో అనబోయేటంతలో శంకర్ వచ్చాడు.
    దుర్గ సంభ్రమంగా "గిరి ఏడీ?' అంది.
    శంకర్ దిగాలుగా "రాలేదు. కొన్ని కారణాల వల్ల ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాడట. తన మనసులో మన మీద కోపమేమీ లేదట! తానెప్పుడూ మనసారా మన సుఖం కోరుతుంటాడట!-- నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. ఎన్ని విధాల బ్రతిమాలినా, ఇక్కడకు రావటానికి మాత్రం ఒప్పుకోలేదు. విధి లేక వచ్చేసాను." అన్నాడు.
    దుర్గ ముఖం మలిన మయింది. హరి ముఖం వంక చూపులు తిప్పింది. హరి లజ్జతో ముఖం దించు కున్నాడు.
    దుర్గ కన్నీళ్ళ తో "హరి అన్నయ్యా! మనకూ గిరికీ, ఋణం తీరినట్లే నా?' అంది.
    హరి చటుక్కున లేచి 'దిగులు పడకు దుర్గా! గిరిని నేను తీసుకు రాగలను." అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS