Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 1


                        ఆచరణ లో అభ్యుదయం
                                                        ఉన్నవ విజయలక్ష్మీ

                       
    సాబ్ బులా రహే హైం.....'
    తల వంచుకుని కరస్పాండెన్సు చూసుకోబోతున్న మురళీ ఫ్యూన్ మాటలు విని, ఉత్తరాల బొత్తి మీద పేపరు వెయిట్ పెట్టి లేచి మేనేజరు గదివేపు నడిచాడు.
    స్వెంగ్ డోర్ తెరుకుచుని లోపలికి అడుగు పెడుతుండగానే ఆ గదిలో మేనేజరు టేబిలు కెదురుగా కుర్చీలో కూర్చున్న మరో వ్యక్తి మీద దృష్టి పడింది.
    కొత్తగా అప్పాయింట్ చేసినావిడ ఈవిడే కాబోలు అనుకుంటూ ;లోపలికి నడిచి మేనజర్ని విష్ చేసి,
    'పిలిచారట , ఎందుకు?' అన్నట్లు చూశాడు అతని మొహంలోకి.
    'ఆవిడ మిస్ కళ్యాణి. ఇవాళే జాయిన్ అయారు....ఇతను మిస్టర్ మురళీధర రావు' అంటూ వాళ్ళిద్దర్నీ పరిచయం చేశాడు మేనేజరు లింగమూర్తి- నమస్కార ప్రతినమస్కారాలయ్యాయి.
    'ఈవిడికి సీటు చూపించి పనీ అది అప్పగించండి.' లింగమూర్తి మురళీ తో అని, ఇంక నువ్వెళ్ళి పని చూసుకో అన్నట్లు కళ్యాణి వంక చూశాడు.
    'వొకే సర్.' అని మురళీ, ఆ తరువాత మేనేజరు దగ్గర సెలవు తీసుకుని కళ్యాణి ఇవతల హాల్లోకి వచ్చేశారు. తలవంచుకుని ఎవరి పని వాళ్లు చేసుకుంటున్న వాళ్ళంతా ఒక్క క్షణం పని ఆపి తలలు ఎత్తి ఆ కొత్త వ్యక్తిని చూసి మళ్లీ తమ పనిలో మునిగి పోయారు.
    కళ్యాణి కి సీటు చూపించి, ' ఆ డ్రాయరు లో నోటు బుక్కు వుంటుంది. మీరు అది, పెన్నూ తెచ్చుకుంటే నేను లెటర్స్ డిక్టేటు చేస్తాను.' అని చెప్పి సీటు వేపు నడిచాడు మురళీ.
    కళ్యాణి వుత్తరం తీసుకు వెళ్లి వుత్తరాలు వ్రాసుకుని వచ్చి టైప్ చెయ్యటానికి వుపక్రమించింది.
    ఈ రకం వుద్యోగం తనకి కొత్త , అందులో మొదటి రోజు. కళ్యాణి కి ఏమిటో బెదురుగా , చేతులు వణుకు తున్నట్లుగా వుంది. 'ఇంత ఖంగారు లో తప్పులు వస్తాయేమో, మొదటి రోజే తప్పులు చేస్తే ఏమను కుంటారో,' అని వో ప్రక్క నుంచి కాస్త బెదురుగా వున్నా, 'ఇవాల్టి కి కాస్త నిదానంగా పని చేసి టైము ఎక్కువ తీసుకున్నా, ఎక్కడయినా పొరపాటు వచ్చినా సర్దుకు పోయే ;లాగే వున్నాడు ఈ మురళీ ధరరావు.' అని తనకి తనే కాస్త ధైర్యం చెప్పుకుంది. మొదటి పరిచయం లోనే అతనంటే వో మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న కళ్యాణి.
    లంచ్ అవర్ లో మిగిలిన వాళ్లతో కూడా పరిచయం అయింది కళ్యాణి కి....అవధాని, వీర్రాజు, నరసింహ మూర్తి, రమణ మూర్తి, కామేశ్వరరావు, జగన్నాధం, జనార్దనం, కమల, తారా, అందరితో నమస్కార ప్రతి నమస్కారా లయ్యాయి.
    మొగవాళ్ళు కేంటిన్ వేపుకి వెళ్లి పోయారు. ఆడవాళ్ళు ముగ్గురూ ఆ ప్రక్కనే వున్న వెయిటింగ్ రూమ్ లోకీ దారి తీశారు.
    'మీరు ఇదివరకు ఏ ఆఫీసులో పని చేశారు?' అంది తాత తన టిఫిన్ కారియరు ,మూత తెరుస్తూ.
    'ఇదే నా మొదటి వుద్యోగం -- అసలు ఇక్కడ ఆడవాళ్ళు ఎవరైనా వున్నారో లేదో, తీరా నేను సెలక్టు అయితే నేను ఒక్కదాన్నే అయిపోతానేమో అని కాస్త భయపడుతూనే అప్లై చేశాను. ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడే తెలిసింది మీ ఇద్దర్నీ గురించి-- నాకెంతో ధైర్యం వచ్చింది ......' కళ్యాణి ఎలాంటి అరమరికలు పెట్టుకోకుండా తన భావాలు అలా బైట పెట్టేస్తుంటే --
    'నువ్వు ఏ శతాబ్దానికి చెందిన దానివి , ఏ యుగం నాటి భావాలు నీవి.' అన్నట్లు కాస్తంత నిరసనగా ఆమె వైపు చూస్తూ,
    'అలాంటి భయాలు సంకోచాలూ పెట్టుకున్న వాళ్ళు వుద్యోగాలకి అసలు పనికిరారు-- పదిమంది మొగవాళ్ళ మధ్య ఒక్క ఆడది పనిచేయాల్సి వస్తే మాత్రం భయం ఎందుకు -- ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుపోతే తీరిపోతుంది.' అంది తార.
    ఆ అమ్మాయి మాట తీరుకు కళ్యాణి కాస్త చిన్న బుచ్చుకున్నా పైకి మరేమీ అనకుండా ఒక్క నిట్టుర్పు విడిచి వూరుకుంది.
    'ఆహా భయం అని కాదనుకో -- వో మనిషికి వో మనిషి సాయం వుంటే కాస్త  అండగా వుంటుందని - ఒక్కొక్కరే అయితే ఏమిటో బిక్కుబిక్కు మంటూ వుంటుంది కదా?' అంటూ ఫ్లాస్కు లో కాఫీ వో గ్లాసులో పోసి కళ్యాణి ముందు పెట్టింది కమల.
    'ఆహా-- ఎందుకండీ -- నేను ప్యూన్ చేత తెప్పించు కుంటాను. ఇది మీరు తీసుకోండి.' అంది కళ్యాణి మొహమ్మాట పడుతూ.
    'మరేం ఫరవాలేదు. నాకూ వుంది -- మరోసారి తాగాలనిపిస్తే వుంటుంది కదా అని ఫ్లాస్కు నిండా పోసి తెచ్చుకుంటాను రోజూ-- తీసుకోండి.' అంది కమల బలవంతం చేస్తూ.
    'అయితే మీ కింకోసారి కేమీ మియగలను ' అంటూ చిన్నగా నవ్వుతూ గ్లాసు చేతిలోకి తీసుకుంది కళ్యాణి. తను కాఫీ తాగి గ్లాసు కడిగి తెచ్చి యిచ్చాక కమల కూడా తాగి, గ్లాసు, ఫ్లాస్కు కడిగి తన ప్లాస్టిక్ బ్యాగ్ లో సర్దుకుంది. అప్పటికి  తార భోజనం కూడా అయింది. బాత్ రూమ్ లోకి వెళ్లి గిన్నెలు వోసారి కడిగేసి కారియరు సర్దేసి వో మూల పెట్టి తన హాండ్ బాగ్ తెరిచి మూడు వక్కపొడి పొట్లాలు తీసి కమల కీ, కళ్యాణీ కి కూడా చేరోటీ ఇచ్చింది. ముగ్గురూ వక్కపొడి నములుతూ కాస్సేపు ఆ ఖబురూ, ఈ ఖబురూ చెప్పుకున్నారు. ఆ తరువాత ఎవరి పనిలో వాళ్ళు జొరబడి పోయారు. ఐదు గంటల దాకా అలా టైప్ చేస్తూ కూర్చున్నా కళ్యాణి కేమీ విసుగని పించ లేదు-- ' మొదటి రోజు చాలా తృప్తిగా సరదాగా గడిచిపోయింది-- ఆ తార అన్నమాటలకి కాస్త మనస్సు ఒక్కసారి చివుక్కు మన్నా అదేమంత పట్టించు కావలసింది కాదు. కొంతమంది మాటతీరే అంత. వాళ్లు అనదల్చుకున్నదేదో మొహం మీదే గబుక్కున అనేస్తారు-- ' అనుకుంటూ ఆఫీసు గేటు దాటి బస్సు స్టాపు వేపు అడుగులు వేసింది కళ్యాణి.
    నెలరోజులు గడిచి పోయాయి.
    ఉదయం ఆఫీసులో ఎప్పటి లాగే కళ్యాణి కి లెటర్స్ డిక్టేటు చేసి, 'ఇదుగో , ఈ హెవీ ఇంజనీరింగు వాళ్ళ వుత్తరం చాలా అర్జెంటు-- ఈ పూట పోస్టులో వెళ్లిపోవాలి-- ముందు ఇది టైపు చేసి ఇచ్చేసేయండి.' అన్నాడు మురళి.
    'అలాగే ' అని చెప్పి వెళ్లి తన సీటులో కూర్చుంది. లెటరు హెడ్డూ కార్బను పేపరూ కాఫీ పేపరూ బొత్తి పెట్టి టైపు రైటరు కి బిగించింది. చూపులు తను వ్రాసుకు వచ్చిన వుత్తరం మీద వున్నాయి. వేళ్ళు టకటక ఆ మేటరు ను టైపు చేస్తున్నాయి. కాని కళ్యాణి ధ్యాస మాత్రం వాటి మీద లేదు-- ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచీ కళ్యాణి మనస్సు ఎలాగో వుంది. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు అడ్డదిడ్డంగా అల్లుకుపోయి తలంతా బరువేక్కిపోయేలా చేస్తున్నాయి. అలా ఆ ధోరణి లో పడి కొట్టుకుంటూ పరధ్యానంగా టైపు చేస్తున్న కళ్యాణి దగ్గరికి ఫ్యూన్ వచ్చి నిలబడటంతో తల తిప్పి చూసి చిరాగ్గా మొహం ముడుచుకుని, "నువ్వెందు కొచ్చావ్?' అన్నట్లు చూసింది.
    'ఆ, అర్జెంటు వుత్తరం పూర్తయితే ఇమ్మన్నారు.' అన్నాడు యాదగిరి.
    కళ్యాణి ఈసారి తల ఇటు తిప్పి చూసింది.
    'ఔను. నేనే పంపించాను. త్వరగా పూర్తి చేసి ఇవ్వండి.' అన్నట్లున్నాయి మురళీ చూపులు.
    చివరి రెండు లైన్లూ కూడా గబగబా టైపు చేసి వుత్తరం పూర్తి చేసి కాగితాలు పైకి తీసి యాదగిరి చేతికిచ్చింది. అతను వెళ్ళిపోయాక మరో ఉత్తరానికి పేపర్లు బిగిస్తూ యాదాలాపం గానే మురళీ సీటు వంక చూసింది.
    ఫక్కుమని రాబోయిన నవ్వుని అపుకోటానికి ప్రయత్నిస్తూ అరచెయ్యి నోటికి అడ్డం పెట్టుకుంటున్నాడు మురళీ. కాని అతని కళ్ళల్లో మొహంలో అదొకలాంటి నవ్వు, పసివాళ్ళు అమాయికంగా ఏ తప్పు చేస్తే వాళ్లని దండించాలనే సంగతి కూడా మరిచిపోయి ముచ్చటగా, వినోదంగా ఆ పనినే చూసి నవ్వుకుంటున్న ప్పటి భావాలు అందంగా దోబూచులాడు తున్నాయి.
    కళ్యాణి బిత్తరపోతూ లేచి వెళ్లి ఎక్కడయినా పొరపాటు దోర్లిందా-' అని అడిగింది భయపడుతూనే.
    మురళీ సమాధానం చెప్పకుండా, ఆ వుత్తరం ఆమెకి కనిపించేలా కాస్త ముందుకి జరిపాడు. అది చూస్తూనే కళ్యాణి కి వులిక్కి పడింది.
    'అసలే పరధ్యానంగా టైపు చేసిన తను దాన్ని ఒకసారి చదవనైనా చదవకుండా , కనీసం దాన్ని చేతిలోకి తీసుకుని చూడనైనా చూడకుండా అలాగే ఇచ్చేసింది హడావిడిగా. ఇప్పుడు చూస్తుంటే ఏముంది ? ఉత్తరం నిండా కొశ్చన్ మార్కులే. దాన్ని చూస్తె ఎవరికైనా నవ్వొస్తుంది-- నవ్వే అన్నమాటేమిటి మూడ్ సరిగ్గా లేకపోతె చిరాకుతో చిందులు తొక్కుతూ ఆ వుత్తరం నా మొహన్నా గిరవాటువేసేవారు మరొకరైతే అనుకుంది.
    'కామా టైప్ చెయ్యాల్సిన దగ్గరంతా మీరు కొశ్చన్ మార్కు టైప్ చేసేశారు.' అన్నాడు మురళీ ఆమె చేసిన పొరపాటు ని తెలియ చెప్తున్న ధోరణిలో. అతని మాటల్లో చిరాకు హేళన లాంటి వేమీ లేకుండా యధాలాపంగా చెప్తున్నట్లే వుంది.
    'ఈసారి జాగ్రత్తగా చేసి తీసుకు వస్తా-' సిగ్గుతో చితికిపోతూ వుత్తరం చేతిలోకి తీసుకో బోయింది.
    'ఇవాళ మీ ఇంట్లో బాగుండలే నట్లుంది.' వ్యక్తిగతమైన ప్రశ్న రావటంతో తల ఎత్తి  చూసి -- 'ఆహా, అంత అనారోగ్యం ఏమీ కాదు -- కాస్త తలనొప్పిగా వుంది.' అంటూ నసిగేసింది.
    'నేను ఇందాక మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఇప్పుడీ వుత్తరం చూస్తుంటే ఆ తలనొప్పి అదీ మరీ భరించలేనంతగా వుందేమో ననిపిస్తోంది ...... ఇది నేను టైప్ చేసేస్తాను.....' అంటూ అతను కుర్చీ లోంచి లేస్తుంటే -
    'అబ్బే --ఎందుకూ- నేనే ఈసారి జాగ్రత్తగా చేసి తీసుకువస్తా .' అంది కళ్యాణి ఎంతగానో నొచ్చుకుంటూ.
    'మరేం ఫరవాలేదు-- ఇది అర్జెంటుగా వెళ్లిపోవాలి. నేను చేసేస్తాను-- మిగతా వుత్తరాలన్నీ మీరు నిదానంగా పూర్తి చేద్దురు గాని...' అంటూనే కళ్యాణి సీటు లోకి వెళ్లి కూర్చున్నాడు . ఆమెకి  మరో మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా---


Next Page 

WRITERS
PUBLICATIONS