Next Page 
ముత్యాల పందిరి పేజి 1


                          ముత్యాల పందిరి
                                                       ----పోరంకి దక్షిణామూర్తి

                            


    "ఊఁ!" అంట సేతులు సాపిండు.
    "ఉఁహూఁ!" అన్నది ముత్తాలు.
    "ఊఁ! అంటే!"
    "ఉఁహూ అంటే!"
    ముత్తాలు సేతులందియలేదు.
    "ఆఁ!" అంట ఉరిమిండు చంద్రం.
    బావ అరుపు యినేతలికి, ముత్తాలుకు కొడతడంట బయమయింది. సక్కంగ నగి, మూతి మెలితిప్పి, చంద్రలకు సేతులందిచ్చింది.

                     
    చంద్రం అట్లనే సూస్తండు. ఆ సూపు పక్కంగపోయి లోపల గుచ్చుకుంటంత జరంత సిగ్గయినది.
    బావ సూపుల సురుకు తగిల్నంక, అప్పుడన్నది ముత్తాలు-"మల్ల ఆడదమంటున్న గద?" అంట.
    చంద్రం సెయ్యి ముత్తలు సేతిల ఉన్నది. ముత్తాలు సెయ్యి చంద్రం ఏళ్ల నడుమున్నది. ఇద్దరిద్దరు ఎదురెదురు కాళ్ళు నెట్టి ఒప్పుల కుప్ప ఆడతన్నరు.
    చంద్రంకు ఒప్పులకుప్ప తిరగడం ఎరికనే. మంచిగ తెలుసు. 'ఉయ్యాలవాడ'ల చంద్రంత ఒప్పులకుప్ప తిరగని పిల్లలేదు. తిప్పి తిప్పి, కళ్ళు తిరిగీదన్క తిప్పి, సేతులు కాళ్ళు పట్టు జరీదన్క తిప్పి, సౌలత్ చూసి సేతు లిదిలిపిచ్చుకుంటడు. ఒయ్యారి భామ కుప్పల కూలిపడతది. పెయ్యంత నొస్తది పాపం! అట్ల, బాట పాంటెబోయె అవ్వ మీద పడ్డదా అంటే, తిట్లు తప్పవు. ఈపుసీరి యిస్తార్లు కుడతది. అసొంటప్పుడు చంద్రం ఆడనించి పారిపోతడు.
    "ముత్తాల పందిట్ల ముగ్గు లెయ్యంగ!" చంద్రం.
    "రతనాల పందిట్ల రంగు లెయ్యంగ!" ముత్తాలు.
    "ముత్తాలు మెడల నే పుస్తె కట్టంగ!" చంద్రం అన్నడు.
    ముత్తాలకు సిగ్గయింది. అయినకాని బావత శానసేపుదాన్క ఒప్పలకుప్ప తిరిగింది. తిరుగుతా ఉంటే, కళ్ళు తిరుగతా ఉంటే, అప్పుడే బావ సెయ్యి జారిపోత ఉంటే అల్లల్లాడింది ముత్తాలు. అప్పుడే సుంకులమ్మ ఆడికొస్త, ముత్తాలును అంది పట్టుకున్నది. ముత్తాలు అత్త మెడసుట్టు సేతులు పెనవేసుకున్నది.
    చంద్రం, అమ్మని చూస్తనే పారొస్తమను కున్నడు. పారొస్తే, దోస్తులు చుట్టుసేరి నవ్వుతరంట సెప్పి, ఆళ్ళ నడుమకుపోయి దూరి కూసున్నడు.
    చంద్రంకు అమ్మంటే బయంలేదు. నాయ నంటేనే ఉన్నది. అమ్మకు కోపమొస్తే కండ్లెర్ర జేస్తది. కాని తిట్టడం, కొట్టడం ఎన్నడు చెయలేదామె. ఆడకీ, తను యినకుంటే గమ్ము నూకుంటది. తన దిక్కు సూడదు. చెబితే యినదు. సప్పుడు సెయ్యదు. మూగామె లెక్కనుంటధీ. అమ్మ ఊకుంటే చంద్రం యింట్ల ఉండలేడు. అందుకంట, అమ్మ తన్కి పోయి. నీ మాటనే యింటనంట చెప్తడు. నీ కాల్మొక్కుత, మాటాడమంటడు. సుంకులమ్మ నవ్వుకుంటుంది. చంద్రంకు ఆ నవ్వే సాలు!
    ముత్తాల్ని ఏడిపియ్యకంట చెప్పింది సుంకులమ్మ. ఇంటడా? ఉఁహుఁ! చాటున మాటున జడపట్టుక గుంజుతడు. చెవులు మెలిపెడ్తడు. ముక్కు నులుపుతడు. నోరు మూస్తడు. బుగ్గలు గిల్లుతడు, అబ్బో! ఆ పోరడు తక్కువోడంటనా? ఆ బిడ్డ ఎన్నడు తెగువుచేసి అత్తకి శికాయత్ చేయలేదు. చెయదంట ఆడి కెరికనే. కాని, యీపొద్దు అమ్మ చూసినదిగద! ఏమంటదో ఏందో? ఏమన్న అననీ, ఏమన్న సెయనీ! నాయనకు చెప్పకుంటే సాలు!
    చంద్రం గుంపులకెల్లి చూసిండు. అమ్మ ముత్తాలు బుగ్గలు ముద్దెట్టు కుంటున్నది. చెంపలు నిమిరింది. ముత్తాలుకు చక్కిలిగిలి పెట్టినదో, ఏమికతనో, కిలకిల వాగుతున్నది.
    అమ్మ తనకొరకు చూసింది. ఈడ కనిపిస్తడా? చుట్టూ కోటకట్టినట్ల దోస్తులందరు నిలుస్తున్నఋ కద?
    చంద్రంకు అమ్మమాట లినపడినయి.
    "ఇగ్గో! ఈ పోరగాడు మంచోడు కాడు, బిడ్డ! ఎప్పటికి యీడిట్లనే చేస్తడు. ఆడకిరా. నాతన్న కూసుంటే, మంచిగ కండెలు వడతం నేరిపిస్త! ఒస్తవా, మల్ల?"
    "ఒస్తనత్త!" అన్నది ముత్తాలు. అత్తెనకనె నడిచింది. నడుస్త, ఎనకకు చూసింది. బావ ముకం కనపడింది. ఆన్నె నిలవడి వగింది.
    ఆడనే తను ఉన్నట్ల అమ్మకి తెలుస్తదంట చంద్రంకు బయమైంది. అమ్మకు చెప్పకంట ముత్తాలుకు సైగచేసి మొక్కిండు.
    ముత్తాలు కిలకిలా నగింది.
    సుంకులమ్మ ఎనక్కు తిరిగి చూసింది.
    చంద్రం తల దింపుకున్నడు.
    మల్ల ముత్తాలు ఉరుక్కుంటొచ్చి అత్తత నడిసింది.
    ఇద్దరు పోయిన్రు.
    చంద్రం యీరుడు లెక్కలేసి, నాలిక మెలేసి ఉసికూత యేసిండు.
    పోరగాండ్లంత కిలకిల నవ్వుకుంట, పలకలు బలపాలు తీసుకోని బడి దిక్కుకు పోతున్రు. ఒక పాటకాదు, ఒక పదం కాదు. ఏందేందో ఉశారుగ పాడుకుంట, ఉరుక్కుంట పోతున్రు. ఒకల్లా, యిద్దరం? సాలెబండ దిక్కుకెల్లి పదిమంది పోరగాళ్ళు పన్లిడిసి సదూకుంటమంట బడికి పోతున్రు.    
    ఏందో, యిసిత్రం! ఎన్నడన్న యిన్నరా యిట్ల? పది, పదేనేండ్ల పోరగాళ్ళు కూడా రాటమిడిసి, పుస్తకాలు కొన్చుబోయి గాడ మందిల కూసుంటే కండె లొచ్చేదెట్ల? మొగ్గంలనాడే ఆడేదెట్ల? చిన్న పిలగాడి దిక్కుకెల్లి పండు ముసలవ్వ దన్క సిన్నోల్లు, పెద్దోల్లు-ఉన్నోల్లంత యింట్ల కూసుకుని మంచిగ సేత్తెనే పనయితది. లేకుంటే, బువ్వ యాడకెల్లొస్తది? ఈయాల్రేపు కరుసులెట్లున్నయి, మల్ల? గరీబోల్లు కూడా గిట్ల చేస్తారువయ్య? మన మెవల్లం? మనం యాడున్నం? మనం ఎట్ల పనిచెయ్యాలే, అంట జర సొంచాయించుకోరాదు? కండెలు పట్టెదన్కనె యాస్టాస్తన్నాది? తాతలు పుట్టిన పంది, సాలెపని ఉన్నదేనాయె! సాలెపని శావ కష్టమేనాయె! ఈ మాటెవల్ల కెరికెలేదు? అట్లంట మానుకున్నరా ఎవలన్న? లేదుకద! గట్లనే మనం కూడ చెయ్యాలె. ఇగ్గో, దునియల కష్టంలేని పనున్నాది? ఏ పనన్నకాని పనంటే కష్టమంటనే లెక్క. అప్పటి సంది పెద్దోల్లంత చెప్పెడి ముచ్చటేనాయె! గింతనేఎరికుండొద్దా? ఉండాలికద! కదా? హవు!
    చంద్రం గుంపుల నర్సిగాడున్నడూ నాగయ్యున్నడూ యోగయ్యున్నడూ యాదగిరి ఉన్నడూ పిలగాండ్లు మంది శానున్నరు. సాలోళ్ళ పిలగాల్లెంబళె మాలీ పటేల్ కొడుకున్నడూ. పోలీస్ పటేల్ బామ్మర్దున్నడు. పట్వారి పెద్దన్న కొడుకు కూచున్నడు.
    అందరొక్కీడు కాదు, పాడు కాదు. ఎన్మిదేండ్ల కాడకెల్లి, పదేను పదారేండ్ల దన్క ఉన్నరు. అందరి దొక్కటే జత. కలిసి ఆడుకుంటరు. సదూకుంటరు. తింటరు. కలిసి పండ్తరు. అసాంటోల్లు వాండ్లల ఉశారు శానెక్కువ. అందుకనే యిండ్లకెల్లి పారొచ్చిన్రు. అబ్బబ్బ! వాండ్ల దంతనే తరీక!
    పక్క బాట పొంటె పోత ఉన్న లక్ష్మయ్య పిలగాండ్లను చూసిండు. చూసి, ముక్కుమీదే లేసుకున్నడు.
    వాండ్లల నాగయ్యను చూసిండు.
    "ఈడేంది, పిలగాల్లెంబడి పోతుండూ? యాడికో, ఏమొ?" అంట సెప్పి ఆడికెల్లి పిలిసిండు.
    పడిశేల తగిలిన లెక్క ఎనక్కు తిరిగిచూసిండు నాగయ్య. లక్ష్మయ్య సేటు నప్పుడినంగనె శెమట్లు కక్కుకున్నడు కద? చూపు సూడంగనె ఉరికిపోవాలంటు అనుకున్నడు. కాని దొర చూసి వంక అట్లెట్ల? పెద్ద లొల్లి చేస్తడు. దాని దిక్కు కెల్లి బయమయి, ఏడుపుమొకం పెట్టిండు. కళ్ళు నులుపుకుంట ఆడనే నిలుసున్నడు.
    "బడికి పోయెతందు కేడుస్తారుర?" అన్నడు చంద్రం దాపుకొచ్చి.
    "లేదన్నా! గాడికెల్లి లచ్మయ్య సేటు పిలస్తండు."
    "మా మామనా?"
    "అవు."
    "బడికి పోతున్ననంట చెప్పరాదు?"
    "పని యిడిసి పెట్టి పొత్తంబడతనంటే బొక్క లిరగదంతడు, సెంద్రయ్యా!"
    "గంత పిరికోడి లెక్క ఏడుస్తవేందిర? నేను కూడొస్త. పోదం పా" అంట నాగయ్యెంబడి సెంద్రం కూడ, మామ నిలుసున్న కాడకి బోయిండు.
    లక్ష్మయ్య చంద్రమొంక సూడనన్న లేదు. నాగయ్య కండ్లల అలుగులు గుచ్చినట్ల చూస్తండు. నాగయ్య ముడుసుక పోతండు.
    "యాడ బోతన్నవురా?" అంటడిగిండు లక్ష్మయ్య.
    నాగయ్య చంద్రమొంకకు సూసిండు.
    "బడికిపోతన్నం, మామా!" అన్నడుచంద్రం. లక్ష్మయ్య చంద్రమొంకకు సూడనట్ల ఉన్నడు. "పల్కవేందిర?" అంట అరిసిండు.
    "అవు! మందిత పోతన్న" అంట బయం బయంగ సెప్పిండు.


Next Page 

WRITERS
PUBLICATIONS