Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 22


                                   25
    దుర్గ మొగ పిల్లవాడిని ప్రసవించింది. శంకర్ స్వయంగా, గిరికీ, ఉమకూ, హరికీ టెలిగ్రాం లు ఇచ్చాడు. గిరి, ఉమ, తమ శుభాకాంక్షలు టెలిగ్రాం ద్వారా తెలియ పర్చారు. హరి తనే వచ్చాడు. జానకి ఈ వార్త తెలియగానే, వెంటనే వచ్చి , హాస్పిటల్ లో ఉన్న దుర్గనూ, పండు లాంటి పసి వాడినీ చూసి నవ్వుతూ "ఆరోజుల్లో ఒక పతివ్రతా తన భర్త సౌఖ్యం కోసం సూర్యుడ్నీ అపుచేసిందట! ఈనాడు మా దుర్గ సృష్టిని వాయిదా వేసింది. ఇంచుమించు పదకొండు నెలలు మోసావు -- ఇంత నీరసంగా , కన్నావెం?' అంది.
    దుర్గ నీరసంగా నవ్వింది. "ఈ మాత్రంగా ఉంటేనే గండ మయింది. ఇంకా ఉంటె అడగాలా?' అంది.
    జానకి తాను తెచ్చిన లాగూ చొక్కా పిల్లవాడి దగ్గర పెట్టి కాస్సేపు కూర్చుని వెళ్లిపోతుంటే గేటు దగ్గిర హరి ఎదురయ్యాడు. తనను చూసి చిరునవ్వు నవ్విన హరికి, సమాధానంగా తనూ నవ్వి "మీరొక్కరే వస్తున్నారేం?' అంది.
    "అదేం ప్రశ్న ? నేనింకా పెళ్లి చేసుకోలేదు."
    "అది తెలుసు, నేను గిరిని గురించి అడుగుతున్నాను. దుర్గ ప్రసవించిందనే వార్త తెలిస్తే అయన రాకుండా ఎలా ఉండగలిగారు?"
    హరి ముఖం గంబీరంగా మారిపోయింది.
    "మీరు కూడా దుర్గ విషయంలో ఇలా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు."
    జానకి తెల్లబోయింది.
    "అవమానకరం ఏమిటీ?"
    "మీకంతా తెలిసే, ఇలా మాట్లాడటం లో అర్ధమేమిటి మరి!?"
    "ఏమిటి, అంతా తెలియటం?"
    "మీరు అమాయకత్వం నటించనక్కర్లేదు. ప్రసాద్ నాకంతా చెప్పాడు."
    ఇప్పటికి జానకి కి విషయం అర్ధమైంది. గిరి ఈ మధ్య అసలు కనుపించక పోవటానికి కూడా కారణం తెలిసింది.
    "హరి గారూ! మీరు కాస్త సావకాశం చూసుకుని ఒకసారి మా ఇంటికి రండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి."
    హరి, ఆశ్చర్యంగా చూసాడు.
    "దయచేసి తప్పకుండా రండి -- నేను మీకంతా తెలుసుననుకుంటున్నాను. ఏమీ తెలియదని ఇవాళ తెలిసింది."
    హరికి కుతూహలం కలిగింది. "ఏమిటో?" అన్నాడు.
    "ఇక్కడ కాదు. స్థలమూ, సమయమూ కూడా అనువైనవి కావు మాట్లాడటానికి- మా ఇంటికి రండి-- మరచి పోవద్దు. అశ్రద్ధ చేయవద్దు."
    అని జానకి వెళ్ళిపోయింది ----
    హరి లోపలకు వెళ్లి దుర్గను పలుకరించి అల్లుడిని ముద్దు పెట్టుకున్నాడు.
    గిరిని గూర్చి అడగాలని నాలుక చివరి వరకూ వచ్చినా అణచు కుంది దుర్గ --
    "గేటు దగ్గర జానకి కనుపించింది." అన్నాడు హరి.
    "అవును ఇప్పుడే, నా దగ్గర నుండి వెళ్ళింది."
    "ఎందుకో, వాళ్ళింటికి రమ్మని మరి, మరి చెప్పింది. నాతొ చాలా మాట్లాడాలిట!"
    దుర్గకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఉమ విషయం కావచ్చు ననిపించింది. అయినా, తానేమీ, మాట్లాడక వూరుకుంది.
    హరి వెళ్ళిపోయాక శంకర్ వచ్చాడు.
    "దుర్గా! నేను గిరి దగ్గరకు వెడుతున్నాను." అన్నాడు.
    దుర్గ మనసు, ఆనందంతో పొంగిపోయింది.
    "నీకు కష్టం కలిగించ వద్దని ఎన్ని విధాలుగానో చెప్పాడు గిరి నాకు. నేను కూడా అతని మాటలు పాటించాలనే అనుకున్నాను. కానీ, ఎందుకనో అంతా అలా అయిపొయింది. బహుశా, ఈ కారణం వల్ల గిరికి, నా మీద కోపం వచ్చి ఉండవచ్చు-- నేనే వెళ్లి బ్రతిమాలి తీసుకు వస్తాను. గిరి రాకపోతే , ఈ సంతోషమంతా సంతోషం లాగే లేదు నాకు."
    దుర్గ తన కళ్ళలోనే సంతోషము, అంగీకారము, కృతజ్ఞతా తెలియ పరచుకుంది.
    శంకర్ పొత్తిళ్ళ లో పసివాడిని చేతులలోకి తీసుకుని వెంటనే భయంగా పడుకో బెట్టేశాడు. దుర్గ హాయిగా నవ్వింది -- రైలుకు టైమవుతుందని శంకర్ వెళ్ళిపోయాడు.
    తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించింది జానకి-- ఒక ప్లేటు లో బిస్కెట్లూ, ఏపిల్ ముక్కలూ, అరటి పళ్ళూ పెట్టి మంచినీళ్ళు కాఫీ కప్పు దగ్గర పెట్టింది.
    హరి మొహమాటంగా "ఇప్పుడీదంతా ఎందుకూ? మీరేదో మాట్లాడతానంటే వచ్చాను." అన్నాడు.
    జానకి నవ్వింది. "ఇప్పుడు మాత్రం మాట్లాడనన్నానా? తింటూ మాట్లాడు కోవచ్చు."
    హరి ఇంక వాదించక , సంగతేమీటన్నట్లు చూశాడు.
    "ప్రసాద్ అన్నయ్య మీతో ఏం చెప్పాడు?"
    "మీరు చెప్పిందే చెప్పాడు.
    "నే నసలు , ఏం చెప్పలేదు. అన్నయ్యే, నాతొ ఏదో చెప్పబోతుంటే , నేను చెప్పనియ్యలేదు. నాకు చెప్పబోయింది బహుశా మీకు చెప్పి ఉంటాడు."
    హరి ఆశ్చర్యంగా "ప్రసాద్, కంత అవసర మేమొచ్చింది?" అన్నాడు.
    "అవసరం ఏం లేదు. ఉడుకు మోతుతనం -- ఒక రకం తిక్క-- తమ తిక్క వల్ల ఎదుటి వాళ్ళకు అవస్థ కలుగుతుందని గుర్తించలేని తెలివితక్కువ -- కాకపోతే మూర్కత్వం , మీ బావగారి సంగతి మీకు తెలుసుగా! ఆయనకు దుర్గ మొగవాళ్ళ తో మాట్లాడటం ఇష్టం ఉండదు. అందుకని దుర్గ అన్నయ్య ను తమ ఇంటికి రావద్దని చెప్పింది. తోటి స్నేహితుడైన గిరి, అంత ఆత్మీయంగా చూడబడటమూ, తనను ఇంటికి రావద్దనటమూ ప్రసాద్ మనసులో ఈర్ష్యను కలిగించి ఉండాలి. అందుకనే మీతో అలా మాట్లాడాడు."
    "మరి చుట్టూ ప్రక్కల వాళ్ళంతా అనుకుంటున్నారట శంకర్ ఇంట్లో ఉండని సమయం లోనే, గిరి వస్తాడట!'
    'చుట్టూ ప్రక్కల వాళ్ళు అనుకునేటంత వెర్రిగా గిరి కానీ, దుర్గ కానీ, ఏనాడూ ప్రవర్తించ లేదు-- సరే! ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు. అయన ఇంట్లో లేరు. అంటే మీరు....."
    నవ్వుతూ ఆగిపోయింది జానకి.
    జారి ముఖం ఎర్రబడగా "ఛ!' అన్నాడు.
    "దుర్గ విషయమూ అంతే! హరిగారూ! అయినా, మీరీ విషయాన్నింతగా సాగదీస్తున్నారు. మీకు మొదటి నుంచీ అన్ని విషయాలూ తెలియవు కాబోలు! తెలిస్తే ప్రసాద్ కాదు. బ్రహ్మ చెప్పినా దుర్గా, గిరి లను గూర్చి మరొకలా భావించే వారు కాదు."
    "మీరు తెగ వూరిస్తున్నారు. అసలు విషయం చెప్పకుండా!" విసుగ్గా అన్నాడు హరి---
    "శాంతించండి! దుర్గ మొదట్లో తాను గిరిని ప్రేమించా ననుకునేదట -- కానీ గిరీ, ఆమె మనసులో ఉన్నది వాత్సల్యం కానీ, ప్రేమ కాదనీ, తానూ కూడా ఆమెను చెల్లెలి లాగ అభిమానిస్తాననీ నచ్చజెప్పి, తానె ప్రోత్సహపరిచి శంకర్ తో వివాహం జరిపించాడట! ఇక శంకర్ గానీ, దుర్గ కు గానీ, గిరి పట్ల వేరొక భావ మెందుకొస్తుంది? అదీగాక శంకర్ కు మొదటి నుంచీ , గిరి అండగా నిలబడి అతనిని ఆదుకున్నాడు. గిరి వ్యక్తిత్వం పట్ల శంకర్ కు ఎంతో గౌరవం-- ప్రపంచం లో ఎవ్వరినీ గౌరవించని శంకర్ గిరి ని గౌరవిస్తాడు. ఎవ్వరినీ విశ్వసించని వాడు, గిరిని మనసారా విశ్వసిస్తాడు. అతని మాట వేదమను కుంటాడు. అట్లాంటి గిరికీ, సాధారణ స్నేహితుడైన ప్రసాద్ కూ పోలిక ఏమిటీ?"
    ",మీకీ సంగతులన్నీ ఎలా తెలుసూ? దుర్గ చెప్పిందా? నాతొ చెప్పలేదేం?"
    "మీకు చెప్పటానికి మొహమాట పడి ఉండవచ్చు. నాకీ సంగతులన్నీ దుర్గ చెప్పింది . ఉమ ఉత్తరాల వల్ల కూడా తెలిసాయి."
    "ఉమ మీకు ఉత్తరాలు కూడా రాస్తుందా?" ఆశ్చర్యంగా అడిగాడు హరి.
    "అవును నేనూ, దుర్గా, ఉమా చిన్నతనం లో విడిపోయాం. ఉమ మళ్ళీ నాకు కాలేజీ లో కలిసింది. పి.యు.సి తో మానేసి నేను పెళ్లి చేసుకున్నాను. ఉమ మెడిసిన్ లో చేరింది. ఆ ఒక్క సంవత్సరం లోనే మేమెంతో ఆత్మీయులమయ్యాం. మేం విడిపోయిన దగ్గర్నుండీ ఎప్పుడూ ఉత్తరాలు వ్రాసుకుంటూనే ఉన్నాం. ఈ సంగతి దుర్గకు కూడా తెలుసు.
    "అయితే ఉమ మెడిసిన్ చదవటానికి కారణం తెలుసా?' సందేహంగా అడిగాడు హరి.
    "తెలుసు. ఇంకా చాలా తెలుసు. మీకే, ఏమీ తెలియదు. నేను మీకు ఉమ ఉత్తరాలిస్తాను. చదువుకోండి. మీకే తెలుస్తుంది. నేను గిరిని మంచి వాడుగా నిరూపించడానికి ఈ ప్రయత్నం చెయ్యటం లేదు. మీకు అసలు విషయం తెలియక ముసుగులో గుద్దులాట అనుభవిస్తున్నారు. ఉన్నది లేనట్లు తెలిసి కున్నాక మీ ఇష్టం వచ్చినట్లు విచారించండి."
    జానకి తన బీరువా తెరిచి ఒక పెద్ద ఉత్తరాల గుట్ట బయటకు తీసింది. అది చూసి హడలి పోయాడు హరి. అది గమనించి జానకి నవ్వుతూ " బెదిరి పోకండి. ఇవన్నీ ఇవ్వను. మీకు అవసరమయినవే ఇస్తాను.' అంది.
    కొంచెం సేపు ఆ ఉత్తరాలన్నీ వెతికి, కొన్ని ఏరి హరి కందించింది జానకి-- హరి వాటిని జేబులో పెట్టుకుని జానకి కి "థాంక్స్" చెప్పి బయటకు నడిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS