Next Page 
సమాంతర రేఖలు పేజి 1


                         సమాంతర రేఖలు
                                                       ---పసుపులేటి మల్లికార్జునరావు

                                  

    కళాశాలలో విద్యార్ధి సంఘం ఎన్నికలు జరుపుకుంటున్నది. అందుకని హడావిడిగా ఉన్నది. ఇరుపక్షాలవారు విద్యార్ధుల్లో తమ ప్రాపకంకోసం, తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఏ విద్యార్ధి కలిసినా,  ఓ అయిదు నిమిషాలు నిలబెట్టి తమ పార్టీని గురించి, గెలిస్తే తాము విద్యార్ధులకు చేయబోయే సేవను గురించి చెపుతున్నారు. రెండు పక్షాల్లోనూ, అరవింద్ పక్షాలవాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు.
    సునీత ఆ ఏడే కాలేజీలో చేరింది. సాధ్యమైనంత వరకు ఈ గొడవలకు దూరంగా మసులుతూంది. ప్రిన్సిపాల్ గారమ్మాయి సుజన, సాహిత్య శాఖకు వేణు పార్టీ వైపునుండి పోటీ చేస్తూంది.
    వేణుమాత్రం దేనికీ పోటీ చెయ్యటం లేదు. అతను పోయిన సంవత్సరం కార్యదర్శిగా పనిచేశాడు. ఈ ఏడు అతను, ఆ పదవికి తన స్నేహితుడైన విశ్వాన్ని బలపరిచి నిలబెట్టాడు. ఇంకా ఉపాధ్యక్షుడు, గ్రంథాలయం, ఆటలు మొదలైనవాటికి తన స్నేహితుల్లో సమర్దులని ఎంచుకున్నవారిని నిలబెట్టాడు. విశ్వం బి.ఎ. ఫైనల్, వేణు బి. కామ్. ఫైనల్ చదువుతున్నారు. వాళ్లిద్దరు బాల్యంనుంచి స్నేహితులు.
    వేణుకు కాలేజీలో చాలా పలుకుబడి ఉంది. అతను అన్ని కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ, కార్య దర్శిగా వాటన్నిటినీ నిర్వహించేవాడు. అన్నీ బహుమానాలు పొందకపోయినా, అసలు లేకుండా మాత్రం ఉండేవి కావు. చదువులో ఢంకా బజాయించినట్లు సెకండ్ క్లాస్ మార్కులు తెచ్చుకోగలడు. డబ్బున్న కుటుంబంలోనుంచి వచ్చినవాడు కనక రకరకాల ఫాషన్లకు అతను ఇతర విధ్యార్ధులకు ఆదర్శంగా ఉండే వాడు.
    ఇతర స్థానాలకు అందరు నిర్ణయింపబడ్డారు. కానీ విద్యార్ధినులకు ప్రతినిధిగా ఎవర్ని నిలబెట్టాలా అన్నది సమస్య అయింది వాళ్ళకు. సుజన, సునీత పేరు సూచించింది.
    ఆ పేరు విని వేణు, "ఆమే? వద్దండీ" అన్నాడు.
    సుజన నవ్వుతూ, "దాని సంగతి మీకు తెలీదు. పైకి అలా ఉన్నా ఎంతో మంచిది. వెళ్ళి అడుగుదాం. "ఒప్పుకోవచ్చు" అంది.
    వేణు వద్దనటానికి కారణం ఉంది. కాలేజీలో చేరి కొద్దిరోజులే అయినా తెగింపు, ధైర్యంగల అమ్మాయని, ఒక్క మాట పొరపాటున జారినా బుద్ది చెపుతుందని అందరికీ తెలుసు. సునీత ప్రవర్తనే అలాంటిది. సుజన తప్ప ఆమెకు, కాలేజీలో ఎవరూ స్నేహితులు లేరు. అవసరమైతే తప్ప విద్యార్ధినులతో నైనా ఒక్క మాట మాట్లాడదు. ఎవరితోనన్నా మాట్లాడవలసి వస్తే, వాళ్ళు మగపిల్లలయినా నిస్సంకోచంగా మాట్లాడుతుండేది. చాలామంది ఆమెలో ఈ తలబిరుసుతనాన్ని ఏవగించుకునేవారు. అగ్నిజ్వాల, టపాకాయ లాంటి నిక్ నేమ్స్ కూడా పెట్టారు. సునీత లెక్కచేయదు. పైగా అందుకు తగ్గట్లే ప్రవర్తిస్తుంటుంది.
    క్లాసులో ఫస్టు మార్కులు ఆమెవే.
    సునీతకు స్వశక్తిమీద అచంచల విశ్వాసం. ఆమె ఆర్ధిక స్థితికి అందరానిదే అయినా ఆమె కాలేజీలో చదువుతున్నదంటే ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చు కోవాలి.
    వేణు, సుజన, విశ్వం సునీతను కలుసుకున్నారు.
    ముందు సుజన తాము వచ్చిన సంగతి చెప్పింది. తరవాత వేణు అందుకున్నాడు.
    "సుజనగారితో అడిగితే, మీకన్నా సమర్దులెవరూ లేరన్నది. మీరు మా పార్టీ నుండి విద్యార్ధినుల ప్రతి నిధిగా పోటీ చెయ్యాలి."
    ఆమె అదోవిధంగా చూసి, "ఇక్కడకూడా ఈ రాజకీయాల గొడవలు వదలనట్లుందే?" అంది.
    వేణు మందహాసం చేశాడు. విశ్వం అన్నాడు: "మనం వద్దనుకున్నా అవి మన వెన్నంటి ఉంటూనే ఉంటాయి. పోవద్దు అనుకుంటూనే వాటిలో తల దూరుస్తాం! ఇంతకూ వచ్చిన పనేదో తేల్చండి."
    "నేను కాలేజీకి కొత్తదాన్ని. నాకీ పరిస్థితులు అంతగా తెలీవు. మీరు కోరినట్లు నేనీ పోటీకి నిలవ లేవేమో?"
    "ఇందులో తెలియవలిసిం దేముంది?"
    "క్షమించండి. అందరిలా నేనీ బాధ్యతను నిర్వహించలేను. ఒకవేళ నేను గెలిస్తే ఎప్పుడూ ఏదో సమావేశాలు, సభలు చేయించుతూ, ఏవో పనులు చూపించే ఈ పదవి నా చదువుకు స్వస్తి చెప్పిస్తుంది."
    "అంటే?" వేణుకు అర్ధమవలేదు.
    "అంటేనా? అంతే! అంతకన్నా ఎక్కువగా వ్యక్తి గత విషయాలను అడిగి తెలుసుకోవటం అంత మంచి అలవాటు కాదు. మీరు వెళ్ళవచ్చు. నమస్తే!" రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది.
    వాళ్ళిద్దరూ అక్కడినుంచి నిష్క్రమించారు. సుజన అక్కడే ఉంది. వాళ్ళు వెళ్ళాక, "ఏమే! పోటీ చేస్తే ఏమైందే?" అన్నది.
    సునీత అడ్డంగా తల ఊపి, "అన్నీ తెలిసి నువ్వే అలా అంటే నేను జవాబు చెప్పటం కష్టం!" అంది.
    వేణుగానీ, విశ్వంగానీ సునీత అంత ఖచ్చితంగా తెగేసి చెబుతుందనుకోలేదు. తరవాత సుజన ద్వారా ఆమెను గూర్చి తెలుసుకున్నారు. మరొక అమ్మాయిని ఆ స్థానంనుంచి పోటీ చేయించారు.
    శనివారం నాడు ఎన్నికలు జరిగాయి. వేణు మద్దతు కనక మొత్తం స్థానాలన్నీ ఆ పక్షంవాళ్ళే గెలుచు కున్నారు. ప్రచారం చెయ్యడం క్లాసులు చెడగొట్ట కుండా, ప్రతి విధ్యార్దినీ కలుసుకుని, వాళ్ళకు తను నిలబెట్టిన అభ్యర్ధులను పరిచయం చేస్తూ, విసుగెత్తని విధంగా చేశారు. అందువల్ల ఎక్కువ ఖర్చు చెయ్యనవసరం కూడా కలగలేదు. ప్రత్యర్ధులు అరవింద్ తో సహా చిత్తుగా ఓడిపోయి, తలెత్తుకుని తిరగలేక పోయారు.
    సునీత మాత్రం ఈ గొడవలో అసలు కనిపించ లేదు. గెలిచిన రోజు మాత్రం వాళ్ళందరినీ కలుసుకుని శుభాకాంక్షలు చెప్పింది.
    "ఇవ్వాళ సాయంత్రం మీటింగ్ ఉంది. మీరు స్టేజ్ మీదికి వచ్చి రెండు మాటలు మాట్లాడాలి!"
    వేణు మాటకు నవ్వి, "నాలుగున్నరకు నేను డ్యూటీ ఒకటి నిర్వహించుకోవలసి ఉంది. నేను రాలేను" అంది.
    ఇక ఏమడిగినా లాభం ఉండదని అందరికీ తెలుసు. ఆమె వెళుతూ, "ఈ విజయానికి కారకులు వేణు గారు. వారు విజయసారధులు. మీకూ నా అభినందనలు" అని చిరునవ్వు నవ్వింది.
    వేణు థాంక్స్ చెప్పాడు.
    ఎందుకో విశ్వాసానికి సునీత అంటే పరిపూర్ణమైన సానుభూతి ఏర్పడింది. కాని అతనికి ఆమెపట్ల ఏ దురుద్దేశ్యమూ ఉండేది కాదు. సంఘ కార్యదర్శిగా ఆమెకు తాను చెయ్యగలిగిన సహాయం చేస్తుండేవాడు. తన పేరును రహస్యంగా ఉంచ ప్రయత్నించేవాడు. వేణుకు మాత్రం చెబుతాడు. అయినా సునీత అన్నీ తెలుసుకునేది. ఏ స్కాలర్ సిప్ రావడానికి అతను ప్రిన్సిపాల్ కు రికమెండ్ చేశాడో, ఏ ఫ్రీషిప్ దొరకడానికి అతను కారకుడో ఆమెకు బాగా తెలుసు. విశ్వం ఎక్కడ కనిపించినా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించేది.
    మరొక రెండు నెలలు గడిచాయి. ఒక రోజు-
    ఉదయం కాషన్ బెల్ కావటానికి ముందు పోస్టు వస్తుంది. ఎన్నడూ సునీతకు ఒక ఉత్తరం అయినా రాలేదు. ఆ వేళ పోస్టుమన్ ఆమెను వెతుక్కుంటూ వచ్చి, రిజిస్టరు కవరు ఉందన్నాడు. సునీతకు విస్మయం కలిగింది. ఎవరు పంపి ఉంటారు? సంతకం చేసి కవరు తీసుకుని దస్తూరి చూసింది. అక్షరాలన్నీ గుర్తుపట్టటానికి వీల్లేకుండా ఎర్ర సిరాతో పలకలు పలకలుగా వ్రాసి ఉన్నాయి. పోస్టు ముద్ర అది ఆ ఊళ్ళోనే పోస్టు చెయ్యబడ్డట్లు తెలుపుతూంది. కవరు చింపి లోపలి కాగితం తీసి చూసింది.
    రెండు కార్టూను బొమ్మలు-ఒక స్త్రీ, ఒక పురుషుడు-చెట్టాపట్టాలేసుకుని షికారు వెళుతున్నట్లు ఉన్నాయి. ఆడ బొమ్మమీద సునీత అని, విశ్వం అని మగబొమ్మమీద వ్రాసి ఉన్నాయి. ఆ అక్షరాలు గూడా పలకలుగా ఉన్నాయి. ఏమీతోచక ఒక క్షణం అలాగే నిల్చుండిపోయింది.
    తోటి ఆడవాళ్ళు నవ్వుతున్న ధ్వనులు.
    సునీత రెచ్చిపోయింది. అప్పుడే ప్రిన్సిపాల్ గారి కారు వచ్చి, సుజనను, ఆయనను దింపి వెళ్ళిపోయింది. సుజన పిలుస్తున్నా ఆగకుండా, ఆయన ఆఫీసు రూమ్ వైపు వెళ్ళింది.
    సునీత వెళ్ళిన చాలా సేపటివరకూ, ఆమె జోరుగా మాట్లాడుతున్న మాటలే వినపడ్డాయి. చాల మంది విద్యార్ధులూ, లెక్చరర్లూ అదేమిటో బోధపడక ఉత్కంఠతో, ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు.

                                         
    ఫ్యూన్ ఒకడు బి.ఏ ఫైనల్ క్లాసుకు వెళ్ళి, విద్యార్ధి సంఘ కార్యదర్శి విశ్వాన్ని, అర్జెంటుగా ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారని తీసుకు వెళ్ళాడు. అప్పటివరకు విశ్వానికి, సునీతకు ఓ కవరు వచ్చిందన్న సంగతి కూడా తెలీదు.
    సునీత చాలాసేపు వాదించింది. అది విశ్వం వ్రాసిందేనని. అలా చేస్తే గత్యంతరం లేక తను లొంగి పోతానని, అతను తనకు చేసే సహాయాల్లో గల ఉద్దేశ్యం అర్ధమయిందనీ, దీన్ని అటో ఇటో తేల్చకపోతే తను కాలేజీ ఆవరణలో నిరసనవ్రతం చేస్తానని అంది.
    విశ్వం ప్రమాణంచేసి చెప్పాడు, దాన్ని తను వ్రాయలేదని సునీత అసలు వినలేదు. ఎవరు వ్రాసినా అందులో తనపేరుతోబాటు విశ్వంపేరుకూడా ఉందని, దానికి జవాబుదారీ అతనే నని నిష్కర్షగా చెప్పేసింది.
    విశ్వం, ఆమె తన మొండిపట్టు విడవదని, క్షమార్పణ వ్రాసి ఇచ్చుకున్నాడు. అప్పటికి గానీ సునీత శాంతించలేదు. అతనిచ్చిన కాగితాన్ని అక్కడే సర్రున చింపేసి, ఇలాంటి సంఘటనలు ఇకముందు జరిగినా, లేక దీని ఊసెవరు ఎత్తినా కఠినంగా చర్య తీసుకుంటానని ప్రిన్సిపాల్ గారిచేత వాగ్ధానం చేయించుకుని గానీ అక్కడినుంచి కదలలేదు.
    ఆ మధ్యాహ్నం వెయిటింగ్ రూంలో కూర్చుని, ఉదయం తెచ్చుకున్న పూరీలను తినబోతుండగా, ఆమె కోసం ఎవరో వచ్చినట్లు చెప్పిందొక విద్యార్ధిని. పూరీని టిఫిన్ బాక్స్ లో పడేసి, పుస్తకాలు తీసుకుని ఇవతలకు వచ్చింది. పక్కింటి శంభయ్య, తను తోలే రిక్షాతో సహా  నిలుచున్నాడు.
    "ఏమిటి, శంభయ్యా?"
    "అవ్వకు పానాల మీదికొచ్చింది. నిన్ను యద్జేస్తున్నది రిక్షా తెచ్చిన జల్దీల రావాలె!"
    వెనక్కు అయినా తిరిగిచూడకుండా రిక్షాలో కూర్చుంది. శంభయ్య ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. అప్పటికే ఆ వృద్దురాలు, సునీత అమ్మమ్మ చివరి క్షణాల్లో ఉంది.
    ఆమె సునీతను చూసి కన్నీరు నింపుకుంది. పొద్దు గూకుతుండగా ఆమె మరణించింది. సునీత ఎన్నడూ ఊహించని రహస్యం ఒకటి చెప్పింది.
    సునీత తండ్రి ఎవరో తెలియదనీ, తల్లి తెలుసనీ, చాలా దూరపు బంధువనీ, సునీత తల్లి కాలుజారిన ఫలితంగా జన్మించిన సంతానమే సునీత అనీ చెప్పింది.
    సునీత నిర్ఘాంత పోయింది.
    "నిన్నూ, నీ తల్లినీ పరువు ప్రతిష్ఠలకోసం వేరు చేశాడు నీ మేనమామ..."
    సునీత అతని పేరు చెప్పమంది.
    ఆమె జీవంలేని నవ్వు నవ్వి, "ఎందుకమ్మా? తెలుసుకొని ఏం లాభం? ఆయన నిన్ను చేరదీసి ఆదరిస్తాడా? తన పరువు ప్రతిష్టలకోసం నిన్నూ, నీ తల్లినీ విడదీసినవాడు ఆ పని చెయ్యలేడమ్మా! అంత దయగలవాడైతే పుత్తడిబొమ్మవైన నిన్ను నా కెందుకిస్తాడు? తెలుసుకుని నువ్వు బాధపడటం తప్ప మరేమీ ఉండదు. నా శక్తికొద్దీ నీకు చదువు చెప్పించాను. కష్టపడి టైపు నేర్చుకున్నావు. చేతుల్లో శక్తి ఉన్నంతవరకూ, ఒకరిమీద ఆధారపడకుండా జీవించు" అంది.
    కనీసం తల్లి పేరయినా చెప్పమన్నది సునీత.
    ఆమె ఏమిటో గొణిగింది. ఆ మాట పక్కనున్న శంభయ్యకు కూడా వినిపించలేదు. సునీత మాత్రం వినగలిగింది.
    చివరి మాటలు చెప్పింది. అవినీతికి, నాగరికత ముసుగు తొడిగి చెలామణి చేస్తున్నారు. మనం కూడా అలా అనుకుని నైతిక పతనం చెందటం అవివేకం. క్షణికో ద్రేకాలకు లొంగి, నైతిక పతనం చెందకుండా, జీవితం గడపడం సార్ధకత. శీలవతిగా సాధించలేనిది వేశ్యవై సాధించవచ్చు. కాని అదొక నరకం. ఒకసారి చేసిన పొరపాటుకు శిక్షగా, నిన్ను-అజ్ఞాతంగా-నాబోటి దిక్కులేనిదానికి పెంచుకోటానికిచ్చింది నీ తల్లి. అందుకే నువ్వు 'అమ్మా' అన్న పదానికి నోచుకో లేకపోయావు. నీ ఎడబాటును భరించలేని మీ అమ్మ, ఆత్మహత్య చేసుకుంది...."
    "ఆత్మహత్యా?" సునీత మళ్ళీ అంది.
    "..." అవునమ్మా! ఏమైనా నువ్వీ విషయంలో జాగ్రత్తగా వుండాలి. ఎంతోమంది నిన్ను మోసంచేసి, నిన్ను  తమ ఆటవస్తువుగా చేసుకుని, నీ జీవితంతో చెలగాటాలాడ ప్రయత్నిస్తారు. వాళ్ళ నుండి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నిప్పుకణిక ఎర్రగా మెరుస్తూ, అందంగా ఉంటుంది. పట్టుకుంటే కాలుస్తుంది. అలాగే పెరిగావు. మున్ముందు అలాగే జీవించు..."
    శంభయ్య సహాయంవల్ల అంత్యక్రియలు నెరవేర్చగలిగింది. శంభయ్య తను దాచుకున్న డబ్బు కొద్దిగా ఉంటే, అందుకే వినియోగించాడు. ఇంటాయనకిచ్చే అద్దెతప్ప అప్పులంటూ ఏమీలేవు. కాలేజీ మానెయ్యదలుచుకుంది. పుస్తకాలన్నీ సెకండ్ హాండ్ బుక్స్టాలులో అమ్మేసింది. అద్దెబాకీ పోగా ఓ పదిహేను రూపాయలు మిగిలినాయి.
    శంభయ్య ఆమెకు తన గుడిసెలోనే ఉండమన్నాడు. అప్పటికే అది చిన్నది. అయినా శంభయ్యకు వెనకా ముందూ ఎవరూ లేరు కనక అంతగా ఇబ్బంది లేక పోయింది. నెలనెలా అద్దె బరువు తప్పింది.    
    సునీత ఉద్యోగాన్వేషణలో పడింది. తనకున్న అర్హతలలో ఏ ఉద్యోగం గూర్చిఅయినా ప్రకటన పడితే, దానికల్లా దరఖాస్తు పెడుతూనే ఉంది. అంతవరకూ ఆమె చెపుతున్న ట్యూషన్లే ఆమెకు ఆధారమైనాయి.

                                   2

    రిజల్స్టు తెలిశాయి. విశ్వం, వేణు-ఇద్దరు పాసయ్యారు.
    ఆ రోజు విశ్వం వెళ్ళిపోతున్నాడు. ఒకరికొకరు తమ తమ గుర్తుగా ఏమేమిటో ప్రజంట్ చేసుకున్నారు. రాత్రి బండికి విశ్వం ప్రయాణం. ఆ రోజు వేణు తన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశాడు. భోజనాలయ్యాక విశ్రాంతిగా డాబామీద కూర్చున్నారు. ఆరు గంటల వరకూ వాళ్ళు ఏమిటో మాట్లాడుతూనే ఉన్నారు.
    ఉండి ఉండి వేణు, "విశ్వం ! నీకు తెలీని తప్పు ఒకటి చేశానురా!" అన్నాడు.
    "తప్పా?"


Next Page 

WRITERS
PUBLICATIONS