Next Page 
అపరాజిత పేజి 1

                           అపరాజిత
                                          గొలుసు నవల
                                        నలుగురు రచయిత్రుల సంయుక్త రచన
                                                                       --సి. ఆనందరామం

                   

మాధవి అడుగులు గాలిలో తేలిపోతున్నాయి. సంతోషంతో మనసు దూది పింజై మధుర లోకాలలోకి ఎగిరెగిరి పోతోంది.
    హమ్మయ్య! తనకు విముక్తి వచ్చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా అలవాటుపడ్డ గానుగెద్దు యాంత్రిక జీవితంనుండి విముక్తి వచ్చేస్తోంది.
    ఉదయం లేస్తూనే వంట, చాకిరీ, కాలేజీ-లేబరేటరీ ఏసిడ్ లు, టెస్ట్ ట్యూబ్ లు, పిల్లల అల్లరి-లెక్చరర్ల సన్నాయి నొక్కులు - పెద్ద నాన్న అతి గడుసు దెప్పుళ్ళు - పెద్దమ్మ దీనమైన జాలిముఖం - వీటన్నిటినుండీ విముక్తి, బురదగుంటలాంటి జీవితంలోంచి బృందావనంలోకి హైజంప్.
    బృందావనమా? అవును మరి, మధు తన ప్రక్కనుంటే-అతనితో కలిసి జీవితాన్ని పంచుకొంటూంటే - ఎక్కడుంటే అక్కడే బృందావన మవుతుంది. అదేదో పాటలేదూ?..... 'ఎందుకోయీ స్వామి బృందావనాలు... .........' తర్వాత గుర్తు లేదు. మొదలూ గుర్తు రావటం లేదు - వెధవది ! తన కసలు పాట లంటే - ఇష్టంలేక ఒక్క పాటా నేర్చుకోలేదు కాని. ఎంచక్కా ఇంగ్లీషు ట్యూన్ లో తెలుగుపాట అరవంలా పాడుకోవలసిన మూడ్ కదూ ఇది?
    మాధవి ఇంటి గడప తొక్క బోతుంటే మధుదాన్ని దాటి ఇవతలి కొచ్చాడు.
    మధును చూసీ చూడగానే సిగ్గు పడబోయి అంతలో తెల్లబోయి చూసింది.
    తనను చూడగానే చిలిపిగా నవ్వే మధు అలా మూతి ముడుచుకోవటమేవిఁటీ?
    ఎప్పటి కంటే ఎంతో సంతోషంగా పలక రిస్తాడని ఆశ పెట్టుకున్న సమయంలో ఎప్పుడూ లేనంత చిరాగ్గా ఉండటమేవిటీ?
    'నువ్వుకూడా ఇంత కపటంగా ఉండగలవన్నమాట.'
    పరమసత్యాన్ని ప్రప్రధమంగా కనిపెట్టి ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని అర్చకుడిలా ముఖంపెట్టి కటువుగా అన్నాడు మధు-
    'నేను కపటంగా ఉన్నానా?'
    'మరి ఇంతమాత్రపు శుభవార్త నువ్వే నాకు చెప్పచ్చుగా! ఇక్కడిదాకా రప్పించి మీ పెద్దనాన్న ద్వారా చెప్పించటం దేనికి?'
    ఇప్పటికి మాధవికి కూడా కోపమొచ్చే సింది-తను మధును ప్రేమిస్తున్నమాట నిజమే! అతనంటే అపారమైన గౌరవం ఉన్నమాట నిజమే! అంత మాత్రం చేత నిజమేవిఁటో తెలుసుకోకుండా, విషయ మేవిఁటో వివరించకుండా నిందారోపణలకు పూనుకుంటే సహించగలదా?
    'నీ సస్పెన్స్ తర్వాత ఎంజాయ్ చేస్తాలే కాని, విషయం చెప్పు-'
    తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేసే శాంత గంభీర స్వరంతో అంది-
    అక్కడితో తన ముఖంలోని చిరాకుని కాస్త కరిగించుకుంటూ ఒక్కసారి- కొంత చురుగ్గానే-మాధవి ముఖంలోకి చూసాడు-
    'నీకు తెలియని విషయం కాదు గనుక చెప్పవలసిన అవసరం లేదనుకున్నాను-నువ్వు రాజారావుగారిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నప్పుడు నన్ను మీ పెద్దనాన్న దగ్గిరకు రప్పించటం దేనికి? 'ఒక్కసారి మర్యాదకు ఆయన్ను అడగండి-ఇప్పుడిక ఏ ఆటంకాలూ లేవు గనుక ఆయన వప్పుకుంటారు=' అని నువ్వనబట్టి గదా నేనాయన దగ్గిరకొచ్చింది?-రాజారావుతో నీ పెళ్ళి నిశ్చయమయినట్లు నువ్వే నాకు చెప్పచ్చుగా! ఈ నాటకాని కర్ధమేవిఁటి?'
    'రాజారావుగారితో నాకు పెళ్ళా?'
    'అంత ఆశ్చర్యపోతున్నావు - ఈ విషయం నీకు తెలియనే తెలియదని నమ్మమంటావా? ఏమోలే! ఈ సంభవాసంభవాల చర్చ నాకు దేనికి? నేను వెడుతున్నాను-విష్ యు ది బెస్ట్ ఆఫ్ లక్.'
    ముందుకు గబ గబ నాలుగడుగులేసి ఒక్కసారి వెనక్కు తిరిగాడు మధు-
    చిత్తరువులా నిలబడి పిచ్చి చూపులు చూస్తోంది మాధవి-
    గబుక్కున దగ్గిరగా వచ్చేసి మాధవి భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు- తెప్పరిల్లి 'ఏవిఁటీ?' అంది అయోమయంగా మాధవి-    
    కోపం తెచ్చుకోవాలో, జాలి పడాలో, ఆవేదన ప్రకటించాలో, సానుభూతి చూపించాలో అర్ధం కాలేదు మధుకి-పరిష్కరించుకోడానికి అలవికాని సమస్యలతో బుర్ర వేడెక్కిపోయినప్పుడు-అసలు ఆలోచించటమే మానేసినట్లు అర్ధరహితంగా చూస్తోంది మాధవి. ఆ చూపులలోఅర్ధమయిపోయింది అసలు విషయం మధుకి-
    'మాధవీ! కొందరు మూర్కులుంటారు - పసిపిల్లలు తమ బొమ్మల్ని అపురూపంగా చూసుకొంటూ వాటితోనే తమకి ప్రపంచమంతా సృష్టించుకొనేట్టు -ఏవో ఆదర్శాలూ-ఆశయాలూ- విలువలు-అంటో కొన్ని పదాలు పట్టు కుంటారు. నిజానికి అర్ధాలు తెలిసి ఆ పదాలు వాడరు-పడికట్టు రాళ్ళలా ఆ మాటల్ని ఉపయోగించుకుంటారు- బంగారం లాంటి బ్రతుకును ఆ వట్టి మాటలకోసం వట్టి పోగొట్టుకుంటారు- చివరికి తీరిగ్గా కూచుని కన్నీళ్లు కారుస్తారు - అలా కారుస్తో తామేదో సాధించినట్లు తమని తాము వోదార్చుకుని సంతృప్తి పడతారు - ఎన్ని కన్నీళ్లు కారిస్తే అంతగొప్ప-ఇలాంటి వాళ్ళంటే నాకు సానుభూతి లేదు-పైగా వళ్ళు మంట-మంచి చెడ్డలు-విలువలు - ఇలాంటివి ఎక్కాల పుస్తకాలలో మానాలలా ఒక పరిధిలో ఇమిడి ఉండే విషయాలు కావు-ఒక స్థిరమైన ఆకారమూ లేదు వీటికి- నీ ముందున్న బ్రతుకును మనిషిలా నిండుగా బ్రతకటాన్ని మించిన ఆదర్శం ఎక్కడుందో అర్ధం కాదు - అణాలు పోయి నయాపైస లొచ్చినా, రూపాయణాపైసలు లెక్కలు చేయించే వీధిబడి పంతుల్లా - మాటల్లోతప్ప జీవితానికి అన్వయించని విలువల్ని పట్టుకు వేళ్ళాడే చచ్చిపోయిన జాతికి చెందిన మనష్యులు ఏనాటికి మళ్ళీ జీవం పోసుకుంటారో ఊహించలేను--
    మాధవి నలాగే వదిలి వీధిలో కొచ్చేసాడు మధు-ఎంతటి అయోమయావస్థలొఉన్నా తన మాటల్ని వినకుండా ఉండగలిగే శక్తి మాధవికి లేదని మధుకు తెలుసు- విన్నాక ఆలోచించక మానదు- ఆలోచించి ఏం చేస్తుందనేది వేరే విషయం-అదేచూడాలి! కానీ ఆలోచించడం మాత్రం ఆలోచిస్తుంది-
    
                                  *    *    *

    పెళ్ళనేది వ్యక్తిగత విషయం కాదు. నూటికి నూరుపాళ్ళూ సామాజిక విషయం. వ్యక్తిగత విషయాలుగా మనం భ్రమపడే చాలా విషయాలు సామాజిక విషయాలే! సమ్మతించని వివాహాలు భగ్నమవుతాయి. సాధారణంగా - సమాజం సమ్మతించని వివాహమే అయినా కొన్నిసార్లు అది ఫలవంతం కావచ్చు- అలాంటిది ఒకే ఒక సందర్భంలో మాత్రం సాధ్యమవుతుంది-అది ఆ దంపతులు ధనికులయినప్పుడు-
    ధనం తుచ్చమయినది-నిజమే!    
    ఐశ్వర్యానికి అంతనేదిలేదు. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది-ఎంతలో అంత సరిపెట్టుకోవచ్చు-ఇదీ నిజమే!
    మనిషి వ్యక్తిత్వపు విలువ ముందు దబ్బు గడ్డిపోచ-ఎవరూ కాదనలేరు-కానీ-ఈనాటి సమాజాన్ని డబ్బు పరిపాలిస్తోంద-సౌఖ్యజీవితానికి ఒక ఉపకరణం మాత్రమేకాదు ఐశ్వర్యం ఈనాడు - అది కారాన్నంతటినీ హస్తగతం చేసుకున్న మహాశక్తి - మేధావులూ -మూర్కులూ- ఉన్నతులూ, నీచులూ-అందరూ అధికారికి తలవంచక తప్పదు- అందుకే - సహజంగానే- మిగిలిన అన్ని విలువలూ డబ్బుకు గులాం చేసేస్తున్నాయి -
    పార్వతి తనవాళ్ళనందరినీ కాదని రాధా కృష్ణను చేసుకున్నప్పుడు ఈ సంగతు లేవీ ఆలోచించలేదు. తనకు రాధాకృష్ణ కావాలి. అతను లేకుండా బ్రతకలేదు. అంతవరకే తెలిసింది- ప్రేమకు తనూ రాధాకృష్ణా మాత్రం చాలనీ -కానీ పెళ్ళయి పిల్లపాపలతో గృహజీవనం గడపటానికి ఇకా చాలా విషయాలతో ప్రమేయం ఉంటుందని ఆనాడు పార్వతి ఆలోచనలలోకి రాలేదు-పాపం, ఆవిడ మనసంతా రాధాకృష్ణే ఆవరించుకోవటంవల్ల ఆలోచనకు స్థానమే లేక పోయింది-
    పార్వతి శుద్ధ శ్రోత్రియుల కుటుంబంలో పిల్ల -రాధాకృష్ణది నాయుళ్ళ కుటుంబం-రెండు కుటుంబాల ఆర్ధిక స్థితీ అంతంత మాత్రపుదే! పార్వతి థర్డ్ ఫారం దాటి చదువుకోలేదు- రాదా కృష్ణ బి.ఎ. పాసయి ఆఫీస్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు-
    రాధాకృష్ణ బి.ఏ. చదివే రోజుల్లో పార్వతి కుటుంబమూ రాధాకృష్ణ ఓకే ఇంట్లో వేరువేరు భాగాల్లో అద్దెకుండే వారు- అలా ఏర్పడిన పరిచయమే పెళ్ళి వరకూ వచ్చింది-
    పెళ్ళయిన రెండేళ్ళ వరకూ పార్వతి తాను పొరపాటు చేసానని ఎప్పుడూ అనుకోలేదు-అలా అనుకునే అవసరం రాలేదు-అంతా సవ్యంగా ఉంటే ఆ తరువాత కూడా ఎన్ని ఒడుదుడుకు లొచ్చినా తన చర్యకు పార్వతి పశ్చాత్తాప పడేది కాదేమో! కాని పాపం సరిగ్గా పార్వతి జీవనాడి మీద దెబ్బ తీశాడు విధాత-వారం రోజుల జ్వరంతో అయిదు నెలల గర్భంతో ఉన్న పార్వతిని సమాజానికి వదిలి శాశ్వతంగా కళ్ళు మూసాడు రాధాకృష్ణ-ఒక ప్రక్క శరాన్యమయిన జీవితం-మరో ప్రక్క తనలో ఎదుగుతున్న మరో జీవి-'మాబాగా అయింది శాస్తి' అనే ధోరణిలో వస్తున్న ఓదార్పులు-పార్వతి తల గిర్రున తిరిగిపోయింది- అభిమానం చంపుకుని తండ్రి కుత్తరం రాసింది-తిరుగు టపాలో వచ్చింది జవాబు - అందులో సారాంశం-
    'ఆనాడు ఎంత చెప్పినా మా మాటలు నీ తలకెక్కలేదు-మాకు నువ్వొక్కదానివే కాదు- ఇంకా నీ తరువాత ఇద్దరు ఆడ పిల్లలున్నారు-నువ్వు చేసిన ఘనకార్యం కారణంగానే వాళ్ళకి సంబంధాలు కుదర్చలేక చస్తోంటే, నువ్వొచ్చి మా నెత్తిన కూర్చుంటే వాళ్ళకీ జన్మలో పెళ్ళి కాదు-మనం చేసిన కార్యాలు సంఘసంస్కరణలుగా వెలిగి పోటానికి మనం డబ్బున్న వాళ్ళం కాము-అంచేత నువ్వు మా దగ్గిరకి రావటానికి వీల్లేదని చెప్పటానికి చింతిస్తున్నాను - నువ్వు మమ్మల్ని కాదన్నా మేం నిన్ను కాదనలేం గనుక, పిల్లలకు తల్లిదండ్రుల లెక్క లేకపోయినా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ పోదు గనుక - నాకున్న దానిలో ఉన్నంత-నెలకు ఇరవై రూపాయలు పంపు తాను - నేను చెయ్యగలిగిన దింతే!'
    ఇక పార్వతికి రుక్మిణమ్మను ఆశ్రయించక తప్పలేదు-ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, రుక్మిణమ్మ కూ పార్వతిని భరియించక తప్పలేదు-ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, రుక్మిణమ్మకూ పార్వతిని భరించక తప్పలేదు-ఎదుకంటే అందరిలా అన్ననూ వదిననూ వెలెయ్యగలిగే అవకాశం రుక్మిణమ్మకు లేకపోయింది- రుక్మిణమ్మ మొగుడు కనీసం మెట్రిక్ కూడా పాసవలేదు. రాధాకృష్ణ, చెల్లెల్నీ చెల్లెలి మొగుణ్ణి కూడా తన దగ్గిరే ఉంచుకుని బావమరిదికి ఉద్యోగ ప్రయత్నాలు చేసాడు-దగ్గిర దగ్గిర నాలుగేళ్ల వరకూ బావమరిదికి ఉద్యోగం దొరకలేదు-అన్ని రోజులూ చెల్లెలి కుటుంబాన్ని రాదా కృష్ణే భరించాడు. రాధాకృష్ణ కి పెళ్ళి కానంతవరకూ రుక్మిణమ్మకు పరమానందంగా ఉండేది-వాళ్ళాయనకు ఉద్యోగం దొరక్కపోతేనే బాగుండేదని కోరుకునేది మనసులో. పైకి 'అన్నయ్యా! ఎంత కాలం ఇలా ఉంటావ్? పెళ్ళి చేసుకో!' అంటూనే లోలోపల అన్న ఎక్కడ పెళ్ళి చేసేసుకుంటాడో అని భయపడిపోయేది-పార్వతిని చేసుకోవాలని ఏనాడో నిశ్చయించుకున్నా రుక్మిణమ్మ కుటుంబంలొ ఒక గట్టున పడేవరకూ పెళ్ళి చేసుకో కూడదనే రాధాకృష్ణ ఆగాడు.
    అతి కష్టం మీద రుక్మిణమ్మ భర్తకి ఎలిమెంటరీ స్కూల్లో మాస్టరుద్యోగం దొరికింది-
    ఈ వార్త విన్న రుక్మిణమ్మ పొంగి పోక పోయినా సంతోషించింది-ఉద్యోగ ముంటే చేదా? తిండి అన్న ఇంట్లో గడిచిపోయినా జీతంరాళ్ళు పై ఖర్చుల కయినా వస్తాయి-
    కానీ రాధాకృష్ణ వేరే ఇల్లు చూసానని చెప్పగానే మాత్రం కృంగిపోయింది.
    అది గమనించి లోలోపల నవ్వుకున్నా పైకి గంభీరంగా అడిగాడు రాధాకృష్ణ.
    'అదేం రుక్మిణి! అలా అయి పోయావ్? బావకు ఉద్యోగం దొరికిందిగా! ఇంక వేరే ఉండటానికేం? ఇంటద్దెచాలా తక్కువ....'
    'అహ! అది కాదన్నయ్యా! ఒంటరివాడిని- ఇంత కాచి ఉడకేసేవాళ్ళు లేకుండా...'
    'ఆ బాధ లేదులే! మీ వదిన వచ్చేస్తుంది-'
    'వదినా?! పెళ్ళి చేసుకున్నావా? నాకు తెలీకుండా.'


Next Page 

WRITERS
PUBLICATIONS