వసుంధర కథలు
అజ్ఞాత ఉద్యోగం
---వసుంధర
"నమస్కారమండీ!" అన్నాను.
మూర్తిరాజుగారు నవ్వి "అలా కూర్చో!" అన్నాడు. అయినా నేను కూర్చోలేదు. అవసరం నాది కాబట్టి అతి వినయం చూపాలని తెలుసు నాకు.
"కూర్చోవోయ్ ఫరవాలేదు!" అన్నాడు మూర్తిరాజు.
"మీబోటి పెద్దల ముందు కూర్చోలేనండి" అన్నాను.
మూర్తిరాజు బలవంత పెట్టలేదు. "బియ్యే కదూ పాసయ్యానన్నావ్" అన్నాడు కుర్చీలో జారగిలబడి.
"అవునండి ఏ ఉద్యోగమైనా చేయడానికి సిద్దంగా వున్నానండి" అన్నాను.
మూర్తిరాజు ఏదో ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి "రాయుడుగారికి లెటరిస్తాను" అన్నాడు.
రాయుడుగారు సామాన్యులు కాదు. కుక్కలపాలెం ప్రెసిడెంటు. భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడైనా ఆయన ఉద్యోగమిప్పించగలడని అంతా చెప్పుకుంటూంటారు. అయితే ఆయన్ను ముఖతః కలుసుకోవడానికి ఎంత గొప్పవారికీ కూడా సాధ్యపడదు. మూరతి రాజుగారిలాంటి వల్ల ఉత్తరాలు అందుకు ఎంతైనా సహకరిస్తాయి.
అసలు మూర్తిరాజుగారి దర్శనమే నాబోంట్లకు దుర్లభం. అలాంటిది ఆయన నా కోసం ప్రత్యేకంగా కబురు పెట్టాడంటే నేనాశ్చర్యపడ్డాను. మా నాన్నగారికి మూర్తిరాజుగారు తెలుసు కానీ నమస్కరించడానికి మించి ఏమైనా మాట్లాడే టంత చనువు కూడా నాన్నగారికి లేదు.
అలాంటిది మూర్తిరాజుగారు స్వయంగా నాన్నగారితో "మీవాడికి ఉద్యోగమింకా దొరకలేదుటగా. నా దగ్గరకు పంపించు. ఏదైనా చూస్తాను" అన్నాడట. క్షణాలమీద వార్త నాకు చేరగా నేను మూర్తిరాజుగారిల్లు చేరాను.
మాకిప్పుడు నా ఉద్యోగం చాలా అవసరం. అక్కయ్య పెళ్ళికి చేసిన అప్పు యింకా తీరలేదు. చెల్లెలు పెళ్ళికి సిద్దంగావుంది. తమ్ముడు టెన్తుక్లాసు చదువుతున్నాడు. నాన్నగారి రెక్కలమీద ఇన్ని అవసరాలూ తీరవు. నేనుద్యోగంలో చేరితే ఓ రెండేళ్ళలో అన్నింటినీ నిలదొక్కుకో గలుగుతాం. ఆ తర్వాత నేను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను.
నేను చాలా చోట్లకు అప్లై చేశాను కానీ ఇంకా ఒకటీ తగల్లేదు. రిజల్స్టు రావలసినవి వున్నాయి కానీ రికమండేషన్ లేదు కాబట్టి తగిలే ఆశలేదు. మూర్తి రాజుగారు ఆఫర్ నాలో కొత్త ఆశలు రేపింది.
రాయుదుగారికి కాబోలు మూర్తిరాజు మొదలు పెట్టిన ఉత్తరం పూర్తయింది. ఏం రాశాడో కాని పావుటావు సైజు కాగితానికి రెండు పక్కలా రాశాడు. దాన్ని కవర్లో పెట్టాడు. కవరుకు జిగురు రాసి అతికించాడు.
"ఆరంభంలోనే నెలకు ఆరేడొందలు వచ్చే విధంగా చూడమని రాశాను....." అన్నాడు మూర్తిరాజు-"కాబట్టి నువ్వు రేపుదయానికల్లా వెళ్ళి రాయుణ్ణి కలుసుకో. సర్టిఫికెట్లూ అవీ కూడా తీసుకెళ్ళు-"
నాకు చాలా ఆనందం కలిగింది. ఆత్రుతగా ఆ కవరు అందుకున్నాను.
"కవరు జాగ్రత్త! అది పారేసుకున్నావంటే రాయుడు గారినిచూడటం నీ వల్లకాదు-" అన్నాడు మూర్తిరాజు.
"ప్రాణాలకంటే భద్రంగా చూసుకుంటానండి. మీ ఉపకారం ఈ జన్మకు మర్చిపోలేను....." అని అక్కణ్ణించి బయటపడ్డాను.
నేను బయల్దేరే ముందు మూర్తిరాజు నా వంక అదో రకంగా చూడటం గమనించాను. ఆ చూపులోని భావం నా కర్ధంకాలేదు. అందులో సంతోషం బదులు జాలి, బాధ ఉన్నట్లు నాకు అనిపించింది.
2
అంత సులభంగా రాయుడుగారి దర్శనం నాకవుతుందని అనుకోలేదు. అందులోనూ ఆయన ఎంతో ఆప్యాయంగా అభిమానంతో పలకరించేసరికి నేను ఇంకా బాగా ఆశ్చర్యపడ్డాను. నిజానికిదంతా మూర్తి రాజుగారి ప్రభావం.
ఉత్తరం చదవక మునుపు రాయుడుగారు నా వంక అంత శ్రద్దగా చూడలేదు. ఉత్తరాన్ని కూడా నిర్లక్ష్యంగానే అందుకుని- చదవడం కూడా నిర్లక్ష్యంగానే మొదలుపెట్టాడు. ఉత్తరం సగం చదివేసరికి ఆయన ముఖంలో మార్పు వచ్చింది. హఠాత్తుగా ఆయన నా వంక ఆప్యాయంగా చూసి-"అరే ఇంకా నిలబడే వున్నావేమిటి? కూర్చో" అన్నాడు.
అయితే నేను కార్యసాధకున్ని కాబట్టి కూర్చోలేదు. కానీ రాయుడుగారూరుకోలేదు. తను లేచి నిలబడి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అప్పుడు తను కూర్చుని మళ్ళీ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరం చదవడం పూర్తయ్యేక నాకు టిఫిన్ తెప్పించి పెట్టించాడు.
"నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నెలకు ఆరువందల రూపాయల జీతం. పని బాగుంటే యింకా పెరుగుతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఉన్నపళంగా జాయినవ్వాలి. అంగీకారమేనా?" అన్నాడు రాయుడు.
నాకు నోటమాటరాలేదు. అదృష్టమింత త్వరగా నన్ను కరుణిస్తుందని నేను కల్లోకూడా అనుకోలేదు. కృతజ్ఞతలు ప్రకటిస్తూ నా మామూలు డైలాగులు చెప్పాను.
"ఇప్పట్లో నీ యింటికి వెళ్ళడం కుదరదు. కావాలంటే అయిదారు నెలలజీతం అడ్వాన్సుగా తీసుకుని యింటికి పంపించుకోవచ్చు-" అన్నాడు రాయుడు.
అయిదు నెలలజీతం. నెలకు ఆరువందలు చొప్పున అయిదునెలలకు మూడు వేలవుతుంది. అంత డబ్బు ముందుగా అడ్వాన్సుగా ముడుతుందంటే-ఇది యెటువంటి ఉద్యోగం? ఈ ఉద్యోగంలో నాకున్న బాధ్యతలు యేమిటి?
నా అంగీకారాన్ని తెలిపేముందు అసలు నా ఉద్యోగమేమిటో, నానుంచి ఆశింపబడుతున్న బాధ్యతలేమిటో రాయుడుగారిని అడిగాను.
"అవన్నీ తర్వాత చెబుతాను. ముందు ఈ మూడు వేలూ తీసుకొని, డ్రాఫ్టుగామర్చి మీవాళ్ళకు పంపించుకో అన్నాడు రాయుడు.
చేతికివస్తున్న లక్ష్మిని కాలదన్నుకోలేను. అందుకే డబ్బు తీసుకుని బ్యాంకుకు వెళ్ళి ద్రాఫ్టుగా మార్చి, పోస్టాఫీసులో రిజిస్టరుపోస్టులో అది పంపించాను. నాకుద్యోగం దొరికిందనీ-అయిదునెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చారనీ మిగతా వివరాలు తర్వాత రాస్తాననీ ఉత్తరంకూడా రాసి ఆ కవర్లోనే పెట్టాను.
