Next Page 
విశాలి పేజి 1

 

                               విశాలి
                                                        ---తమిరిశ జానకి

                         

    "నోర్ముయ్!" లోపల సింహగర్జనలాంటి అరుపు.
    అప్పుడే లోపల అడుగు పెట్టబోయిన సువర్ణ కాలు వెనక్కి తీసుకుని తలుపు వారగా నిలబడిపోయింది.
    బయటికి వస్తున్న అడుగుల చప్పుడు దగ్గరయింది.     
    విసురుగా బయటికి వచ్చిన రామం తలుపుపక్క నిలబడ్డసువర్ణని గమనించలేదు. ఏదో మనసులో గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు.
    ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయిన సువర్ణ తెప్పరిల్లి లోపలికి నడిచింది.
    అనుకున్న దృశ్యమే కంటపడింది.
    కొంగుతో కన్నీ రద్దుకుంటూ గోడకానుకుని నిలబడి ఉంది విశాలి.
    "ఏమైంది, విశాలీ?" ఒక్క ఉదుటున వెళ్ళి విశాలి చేతిని ప్రేమగా అందుకుంది.
    "ఓ! నువ్వా!" తత్తరపాటుని కప్పిపుచ్చుకుందుకు ప్రయత్నం చేసింది విశాలి.
    "కూర్చో" అంటూ కన్నీరు దాచుకుందుకు తల వంచుకుంది.
    "ఏం జరిగిందో చెప్పు ముందు." మంచంమీద మెల్లిగా విశాలిని కూర్చోబెట్టి పక్కనే తనుకూడా కూర్చుంది సువర్ణ.
    "ఏముందీ? మా కిది మామూలేగా! మా ఇంట్లో  ఏదో ఒక గొడవలేని రోజు ఉండదని నీకు మాత్రం తెలియదూ?" నవ్వింది విశాలి.
    అది నవ్వుకాదు. గుండెని చీల్చుకుని వచ్చిన వేదన. మనసుని మథించి వెలువడిన మూగ బాధ. కష్టమైనా, నష్టమైనా జీవితాన్ని దిగమింగదలుచుకున్న చిన్న చిరునవ్వు చివరి కది.
    "అబ్బబ్బ! అసలు సంగతి ఏమిటో చెప్పు ముందు." ఆత్రత నణుచుకోలేని సువర్ణ అడిగింది.
    "అన్నయ్య మళ్ళీ స్కూల్ ఫైనల్ తప్పాడు. ఈ వేళే రిజల్ట్సు వచ్చాయి. అందుకే నా మీద ఎగురు తున్నాడు." నిర్లిప్తంగా అంది విశాలి.
    "బాగుంది. తన పరీక్ష పోతే మధ్యన నిన్ను తిట్టడం ఎందుకూ?" ఆశ్చర్యాన్ని నింపుకున్నాయి సువర్ణ కళ్ళు.
    "ప్రతిసారీ అన్నయ్య పరీక్ష పోవడానికి నేనే కారణంట. తను పరీక్ష ఎప్పటికీ పాస్ అవకూడదనీ, తనని చూసి నలుగురూ నవ్వాలనీ, నన్ను చూసి బుద్ధిమంతురాలనీ, తెలివిగలదనీ మెచ్చుకోవాలనీ నేను దేవుడిని ప్రార్ధిస్తానుట. అందుకే నా మూలంగా తను స్కూల్ ఫైనల్ గట్టెక్కలేకపోతున్నాడుట."
    కోపం కళ్ళలో చిందులేస్తుండగా విసుక్కుంది సువర్ణ. "అర్ధంలేని మాటలు మీ అన్నయ్య మాట్లాడు తుంటే వింటూ ఊరుకున్నావన్న మాట. నేనే కనక నీ స్థితిలో ఉంటే తగ్గ సమాధానం చెప్పి నోరు మూయించే దాన్ని."
    జాలిగా చూసింది విశాలి. "ఏమని సమాధానం చెప్పేదానివి?"
    "నీ చెల్లెలు నీకంటే తెలివిగలదయి చదువులో నిన్ను మించిపోతోందన్న ఈర్ష్యతో ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావని గట్టిగా చెప్పేదాన్ని."
    ఆప్యాయంగా స్నేహితురాలి చేతి నందుకుంది విశాలి.
    "నా మీద ప్రేమతో ఇలా అంటున్నావుగానీ, నీకు మాత్రం తెలియదూ మా అన్నయ్యంటే నా కెంత ఇష్టమో?"
    "ఎంత ఇష్టమయితే మాత్రం, నిన్నొక పురుగులా అతను చూస్తుంటే ఊరుకుంటావా? హద్దూ పద్దూ లేని అతని ప్రవర్తనని క్షమించకూడదు. ఎన్నాళ్ళిలా గడుపుతావు?" సువర్ణ కన్నుల్లో నీరు తిరిగింది.
    అది చూసిన విశాలి మనసు కరిగింది.    
    "పిచ్చిపిల్లా! నువ్వు కన్నీరు పెట్టుకుంటావెందుకూ?" సువర్ణ భుజంమీదుగా చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది విశాలి.
    "ఇంకెన్నాళ్ళో లేదులే, సువర్ణా! ఈ ఏడాదితో నా చదువు పూర్తవుతుందిగా? డిగ్రీ చేతికి వస్తుంది. ఏదో ఉద్యోగం చూసుకుని జీవితం సాఫీగా గడిపేస్తాను." తేలిగ్గా నిట్టూర్చింది విశాలి.

                              *    *    *

    విశాలిని ఈ భూమిమీద పడేసి కన్ను మూసింది పార్వతమ్మ. పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకుందన్న అపవాదుతో పుట్టింది విశాలి.
    నలుగురూ అనుకునే మాటలు విన్నాడు రామం. తల్లి చనిపోవడానికి కారణం చెల్లెలే అని నిర్ణయించుకున్నాడు లోకులనుకునే మాటలు నమ్మి. ఆ చిన్న మనసు అంతకంటే మరేమీ ఆలోచించలేకపోయింది. ఫలితం -చెల్లెలి మీద కసి, ద్వేషం మనసంతా అల్లుకు పోయాయి. రాను రాను చెల్లెల్ని ప్రతిదానికీ కసురు కోవడం, నిర్లక్ష్యంగా చూడటం ఎక్కువయ్యాయి. ఇద్దరూ ఒక చోటే పెరిగి పెద్దవారయ్యారు కానీ, ఏనాడూ కలసిమెలసి ఆడుకోవటంగానీ, కబుర్లు చెప్పుకోవటంగానీ జరగలేదు. విశాలికి అన్నమీద ప్రేమ ఆకాశమంత.
    ఇరుగు పొరుగు పిల్లల్లాగే తనుకూడా అన్న చేయి పట్టుకుని తిరగాలనీ, హాయిగా ఆన్నతో ఆడుకోవాలనీ ఉవ్విళ్ళూరేది.
    కానీ, ఆ కోరిక అందరాని పండే అయింది.
    అన్న చూసే అదో రకమైన చూపుతో అడుగులు తడబడుతూ జారుకునేది.
    విశాలికి పదో ఏడు నడుస్తుండగా తండ్రికూడా కరువయ్యాడు.
    రామంది మొద్దుబుర్ర.    
    ప్రతి క్లాసూ రెండు మూడేళ్ళు పావనం చేస్తూ ప్రస్తుతం నాలుగవసారి స్కూల్ ఫైనల్ డింకీ కొట్టించాడు.
    చెల్లెలు తనకంటే తెలివిగలదై చదువులో తనని మించిపోయినందుకు, చిన్నప్పటినించీ చెల్లెలంటే ఉన్న ద్వేషం మరింత పెరిగిందేతప్ప ఆవంతయినా తరగలేదు. తండ్రికూడా కరువయ్యాక పిల్లలిద్దరి భారం వహించాడు పార్వతమ్మ తండ్రి బలరామయ్య. ఆయనకి రామం ఒక సమస్య అయి కూర్చున్నాడు.
    రామంలో తెలివితేటలు సున్న.
    కోపాలూ, పంతాలూ మిన్న.
    దీనిమూలంగా బాధ అనుభవిస్తున్నారు ఆ ఇంట్లో మిగిలిన ఇద్దరూ- తాతా, మనమరాలూ.
    తెలివైన విశాలిని చూసి ఎంత మురిసిపోతాడో రామాన్ని చూసి అంత బాధపడతాడు బలరామయ్య. తండ్రి తెలివితేటలు సొంతం చేసుకు పుట్టిన విశాలి మీద ఎంత ప్రేమ ఉందో అంత మమకారమూ రామం మీద లేకపోలే దాయనకి. కానీ, అది సరిగా అర్ధం చేసుకోలేని రామం మనసు చెల్లెలికీ, తాతయ్యకీ విరోధి అయి కూర్చుంది.
    
                            *    *    *

    "ఒరేయ్! రామం!"
    తాతయ్య పిలుపు విని, రోడ్లు కొలవడానికి పోతున్న రామం చిరాగ్గా ముఖం పెట్టుకుని వచ్చాడు.
    "ఇలా రా! కూర్చో!" మంచంమీద తనపక్క జాగా చూపించాడు బలరామయ్య.
    "చూడు, రామం! నిన్నుబాధ పెట్టాలనికానీ, చిన్నబుచ్చాలనికానీ నా ఉద్దేశం కాదు. ఉన్న మాట చెపుతున్నాను. సరస్వతీ దేవి కటాక్షం నీ మీద లేదు. నేనా - మృత్యువుకి చేరువవుతున్నవాడివి. నువ్వేదైనా పనిలో చేరడం మంచిది. నేను రేపు షావుకారు వెంకయ్యతో మాట్లాడతాను. వాళ్ళ కొట్లో ఏదన్నా పని ఇప్పిస్తాడు."
    విసుగ్గా లేచాడు రామం. "ఏం పనిప్పిస్తాడు? కొట్టుకి కాపలా పడుకోవడమా?"
    బలరామయ్య మీసాలచాటున జీవితాన్ని కాచి వడబోసిన చిరునవ్వొకటి విరిసింది.
    "ఊరికే బలాదూరు తిరగడంకంటే పరువు, మర్యాద లకి భంగం రాని ఏ చిన్న పని చేసుకు బ్రతికినా అది బ్రతుకే అవుతుందిరా. అందులో సిగ్గుపడవలసింది గానీ, బాధపడవలసిందిగానీ ఏమీ లేదు." సహజ శాంతస్వరం పచ్చి నిజాన్ని పలికింది.
    నిర్లక్ష్యంగా, మౌనంగా అక్కడినించి వెళ్ళిపోయాడు రామం.
    "చూశావా, అమ్మా? వాడికి నువ్వన్నా, నేనన్నా ఎంత అలక్ష్యమో! నా బాధ నాదేకాని వాడికి చీమ కుట్టినట్టయినా లేదు. ఎంతసేపూ సినిమాలూ, షికార్లూ, ఆటలేతప్ప ఒక్కనాడయినా శ్రద్దగా చదువుకున్నాడా? శ్రద్దగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, నలుగురి చేతా భేషనిపించుకోవాలి అన్న ఆలోచన వాడిలో ఎక్కడైనా ఉందా అసలు? అలాంటి ఉద్దేశమే ఉన్నవాడైతే ఇలా ఎందుకుంటాడు? నాకా రోజులు దగ్గిరపడుతున్నాయి. పోయేముందై నా వాడో దారిలో పడటం చూసి మరీ కన్ను మూద్దామని ఈ ముసలిప్రాణం కొట్టుకుంటోంది, అంతేనమ్మా నా బాధ. నా మనసు కోరే దంతకంటే మరేమీ లేదు." ఉప్పెనలా దగ్గు ముంచుకువచ్చి రెండు నిమిషాల పాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు బలరామయ్య.
    వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి మెల్లిగా తాతయ్యచేత తాగించింది విశాలి.
    "డాక్టరుగారేమో రెస్టు తీసుకోవాలి అంటారు. నువ్వేమో రోజూ గంటలకొద్దీ అన్నయ్యని గురించి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకుంటావు. మనసుకి శాంతి లేనిదే మనిషికి బలమెలా వస్తుంది, తాతయ్యా?" మనసులో వేదన మాటల్లో తెలిపింది విశాలి.
    "పిచ్చిపిల్లా! వయసు ముదిరి వంగిపోయిన ఈ ముసలివాడి కింక బల మేమిటమ్మా! దేవుడైన ఆ రాముడు రమ్మంటుంటే, తెంచుకోలేని బంధాలు ఉండమంటుంటే ఇహపరాలకి మధ్య ఇలా వేలాడుతోంది నా ప్రాణం." బలరామయ్య మాటల్లో వేదాంతం; మనసులో వేదన.
    "ఏమిటి, తాతయ్యా, అస్తమానం అలా మాట్లాడతావ్?" విశాలి కన్నుల్లో బాధ నింపిన నీరు.
    మనమరాలి కన్నుల్లో నీరు చూసిన తాతయ్య మనసులో జాలి నింపిన ఆలోచనలు.
    ఆప్యాయంగా మనమరాలి తలమీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయాడు బలరామయ్య. ఆయన వైపే చూస్తూ అలాగే కూర్చుండిపోయింది విశాలి.
    
                            *    *    *

    వారం రోజులు ఒక దానివెంట ఒకటి పరుగెత్తాయి. ఎలాగైతేనేం? ఆ రోజు రామాన్ని ఒప్పించి షావుకారు వెంకయ్య తేనేం? ఆ రోజు రామాన్ని ఒప్పించి షావుకారు వెంకయ్య కొట్లో సరుకుల పద్దు వ్రాసే  పనిలో కుదిర్చాడు బలరామయ్య.
    "తృప్తిగా ఉండచ్చు, తాతయ్యా, ఇంక నువ్వు. అన్నయ్య గురించే ఆలోచిస్తూ విశ్రాంతి లేకుండా చేసుకోనక్కర్లేదు. అవునా?" రామం ఉద్యోగంలో చేరిన మరునాడు తాతయ్య ప్రక్కన కూర్చుంటూ మనసులో నిండిన మమతతో మనఃస్ఫూర్తిగా అంది విశాలి.
    అవునన్నట్టుగా తల ఊపాడు బలరామయ్య.
    "ఔనుగానీ, తాతయ్యా, ఈ మధ్యనీకు నీరసం, దగ్గూ మరీ ఎక్కువైపోయాయి. ఇంకనించీ ఎక్కువగా లేచి తిరగడం మానేయి."
    "బలేదానివి, మనమరాలా! కాటికి కాళ్ళు చాచి ఉన్న నన్ను, నీ దగ్గిర ఎంతకాలమని కట్టేసుకోగలవు?" నవ్వా డాయన.    "అదిగో మళ్ళీ మొదలుపెట్టావ్?" లేనిపోని కోపం ప్రదర్శించబోయింది.
    "ఆఁ! సరేలే, అమ్మా! నీకు కష్టంగా ఉంటే ఇంకెప్పుడూ అలా అనన్లే!"
    "మరే! తాతయ్యా! మన పక్కింట్లోకి నిన్న కొత్తగా వచ్చారు చూడు, ముకుందరావుగారని, వాళ్ళమ్మాయి ఎంత ముద్దుగా ఉందనుకున్నావు! పొద్దున్నా పిల్ల వాళ్ళ గుమ్మంలో నిలబడి ఉంటే రమ్మని పిలిచాను. సిగ్గుపడుతూ మెల్లిగా వచ్చింది. నీ పేరేమి టని అడిగితే 'చిట్టి' అంటూ రివ్వున పరుగెత్తి పోయింది."


Next Page 

WRITERS
PUBLICATIONS