Next Page 
ఉదాత్తచరితులు పేజి 1

 

                                       ఉదాత్తచరితులు
                                                  ----చిట్టారెడ్డి సూర్యకుమారి

                       


    ఆకాశం నిర్మలంగా ఉంది. ఝల్లరి చురుగ్గా లోనికి వస్తూ, నేరుగా తనలోకి ప్రవేశించి ఏదో రక్తినిస్తున్నట్లుగా భావించింది వీణ.
    ఆ వెలుగులోనే నడిచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. సూర్యునితో కళ్ళు కలపలేక కనుదోయి రెపరెప లాడించింది.
    'ఈ రోజుతో తన జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఇంతవరకు తను వీణ.ఇకమీదట వీణ, ఎమ్. బి. బి. ఎస్. స్టూడెంటు. మరి ఆరు సంవత్సరాలలో డాక్టర్ వీణ, ఎమ్. బి. బి. ఎస్.'
    మల్లెపువ్వులాంటి కోటులో ఠీవిగా వార్డులోకి రాగానే గౌరవంతో, భక్తితో, నమ్మకంతో అంజలి ఘటిస్తున్న రోగులు. తన వారిని కాపాడిన దేవతగా కృతజ్ఞతతో చూస్తున్న రోగుల ఆత్మీయులు.......మధ్య తను-వీణ.
    "వీణా..... వీణా....!"
    ఆ పిలుపుతో ఊహాలోకంనుండి బయటపడి, పిలుస్తున్న మామ వైపు చూసింది వీణ.
    మామ నవ్వుముఖంతో, "ఏమమ్మా! రెడీయేనా! మరి కాలేజీకి పోదామా!" అన్నారు.
    మెడికల్ కాలేజీలో అడుగు పెట్టలేదు. కాని, ఊహలు చాలా దూరం వరకు వెళ్ళాయి. సిగ్గుగా తల ఊపింది.        సూటుకేసునుండి తెలుగు కాలెండరు తీసి చూసి ఆ వెంటనే వాచీవైపు చూస్తూ, "మరో అయిదు నిముషాలు ఆగాలి" అంటూ రాగయుక్తంగా పలికారు మామ.
    అంతగా అలవాటు, చనువు లేని మామను చూస్తూ ఉంటే తమాషాగా ఉంటుంది వీణకు.
    వీణ మేనమామ రమణగారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసరుగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు.
    సంసారం పచ్చగా ఉండే తరుణంలో అనుభవించే గీత లేని అత్త కన్ను మూసింది. ఇద్దరు ఆడపిల్లల బాధ్యత రమణ మామదే అయింది.
    ఒక మంచి హాస్టల్లో ఉంచి, హైస్కూలు చదువు ముగియగానే పెళ్ళిళ్ళు చేసి భారం దించుకొన్నా మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. కొత్త బాధ్యతలు నెత్తిన వేసుకో లేదు. అంటే బ్రహ్మచర్యం అవలంబించారని కాదు. అ ఊరికి వెళ్ళినప్పుడల్లా తనకు భౌతిక ఆనందాన్ని చేకూరుస్తున్న లీలావతిని అడిగారు- భార్యగా ఉంటావా?" అని.
    గౌరవప్రదమైన జీవితాన్ని కోరిన ఆమె వెంటనే ఒప్పుకొంది. అతనికంటే ఎంతో చిన్నదైన ఆమె, దాదాపు పది సంవత్సరాలనుండి చక్కగా సంసార జీవితాన్ని గడుపుతున్నది.
    వీణను కాలేజీలో చేర్పించే బాధ్యత తీసుకొన్నారు.
    మామకు ఒక్క అడుగు వెనకనున్న వీణ పరిసరాలను పరిశీలిస్తున్నది. ఎంతమందినైనా తనలో ఇముడ్చుకోగల పెద్ద బిల్డింగులోకి వెళ్ళారు.
    మామ ఆఫీసు గదిలోకి వెళ్ళారు. ఎంతో గంభీరంగా ఉన్న వీణ హృదయాన్ని తెలియని భీతి ఆవహించింది. చేతిలో ఉన్న సర్టిఫికేట్సునే చూస్తూ ఉండిపోయింది.
    "హల్లో!..... హల్లో!"
    తననే! కన్నులు కొద్దిగా ఎత్తి ఓరగా చూసింది. అంతే! గుండె దడదడలాడింది. ఎదురుగా ఓ గుంపు. అందరూ అబ్బాయిలే!
    "ఏ ఊరు? ఏ కాలేజీ? ఏం పేరు?" అంటూ ప్రశ్నలవర్షం కురుస్తున్నది.
    తెల్లబోయింది వీణ.
    ఆ అబ్బాయిలను రాచుకొంటూ ఇద్దరమ్మాయిలు ముందుకు వచ్చారు.
    "ఓ! ఈ సంవత్సరం బ్యూటీ!" అంది ఒక అమ్మాయి.
    "తొందరపడి బిరుదు ఇచ్చివేయకు- అందరినీ చూడందే" అని అందుకొంది రెండో అమ్మాయి. ఆ కంఠంలో ఈర్ష్య దాచుకొందామన్నా దాగలేదు.
    "పెర్సంటేజి ఎంత?" ఆ కంఠస్వరం కరుకు తనానికి అటు చూడకుండా ఉండలేకపోయింది వీణ.
    ప్రశ్నించిన అబ్బాయికళ్ళు ఎగతాళిగా నవ్వుతున్నాయి.
    తన కెన్ని మార్కులు వచ్చాయో చెప్పి ఈ కళ్ళలో ఆశ్చర్యం చూడాలనుకొంది. ఎండిన గొంతులోనుండి మాట సాఫీగా రాలేదు.
    ఏమిటో, ఏమైందోనన్న ఆత్రంతో, "వీణా! వీణా!" అంటూ వచ్చారు రమణమామ.
    అక్కడి గుంపు చెల్లాచెదరైంది. నిస్సహాయంగా నిలబడి ఉన్న వీణను చూస్తూ, "ఏమీలేదండీ! కొత్తవారిని పరిచయం చేసుకుంటున్నాము" అంటూ నవ్వుకొంటూ వెళ్ళారు అమ్మాయిలు.
    వీణని ఏదో నిస్సత్తువ ఆవహించింది. హాస్టల్లో తనకు నిర్ణయించిన గదిలోకి వెళ్ళింది.
    హోల్డాలు మీద కూర్చుని కిటికీగుండా ఎక్కడో చూస్తున్న అమ్మాయి ఉలిక్కిపడి చూసింది.
    ఆ అమ్మాయి కళ్ళు శ్రావణ భాద్రపదాల్లా ఉన్నాయి.
    ఆ రూములో మూడు మంచాలు, మూడు టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ మీద టాయ్ లెట్ సామానులూ అవీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఆ రూములో సీనియర్ ఒక రున్నారన్న మాట!
    ఏడుస్తున్న అమ్మాయి వైపు జాలిగా చూసింది. పలకరింపుగా నవ్వింది వీణ. "నా పేరు వీణ. మీ పేరు?" అంది.
    కన్నీళ్లు గబగబ తుడుచుకొంటూ వీణ కళ్ళవంక చూసింది జుబేదాబేగం. 'ఎంత చక్కటికళ్ళు! కనురెప్పలు దట్టంగా, పొడవుగా పైకి వంగి ఉన్నాయి. ఇక నా కథల్లో హీరోయిన్ ఇలా ఉంటుంది' అనుకొంది రచయిత్రి అయిన జుబేదా.
    ముస్లిం అయినా తెలుగు ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. అక్క పిల్లలు కథ, కథ అని వేధిస్తే అప్పటికప్పుడు రాక్షసులు - రాజకుమారుల కథలు కల్పించి చెప్పేది. కల్పించటం అలా మొదలై తేలికగా కథలు అల్లటం నేర్చుకొంది. ఒకటి, రెండు కథలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
    "ఆఁ! అమ్మాయి. అందులో బేగం. అందుకు వేసుకొన్నారు. ఇంతోటి కథ ఎవరు వ్రాయలేరు!?"
    "ప్రేమకథలు. ఎంతో స్వానుభవం ఉంటేగాని వ్రాయలేరనుకో! లేకుంటే అలాటివి ఎలా తెలుస్తాయి పెళ్ళికాని పిల్లకు?!"
    ఇలాటి మాటలు ఎన్నో వింది. కొంతమంది వింతగా ఎలాగో చూడటం మొదలుపెట్టారు.
    అభినందనలు, ప్రశంసలు అందుకొంటాననుకొన్న జుబేదా తానేదో తప్పు చేసినట్లు అనుకోవలసి వచ్చింది. ఒకరిద్దరు ఉత్సాహపరిచిన వాళ్ళూ ఉన్నారు.
    "పిచ్చి పిచ్చి వ్రాతలు మాని చదువుకో!" అని కఠినంగా ఆజ్ఞాపించారు బాబా!
    వాళ్ళలో ఆడపిల్లలు చదువుకోవటం బహు అరుదు. ఎలాంటి అవాంతరం కలిగి చదువు దెబ్బ తింటుందోనని రచనకు స్వస్తి చెప్పినా, గుడుగుడుమని పశ్చిమాద్రి చాటున రవి అస్తమించగానే నీలాకాశాన్ని అరుణిమ పులుముకొన్నప్పుడు, ఊరి బయట పౌర్ణిమ చంద్రోదయాన్ని చూసినప్పుడు అలా ఆ చివరకు పరుగెత్తి భూమికి అంటుకొని ఉన్నట్లున్న చందమామను తాకాలని ఎంత ఉబలాటం కలుగుతుందో! అలా చెట్టు క్రింద చెప్పులు కుట్టేవాణ్ణి, గొడుగు క్రింద కూర్చుని శెనక్కాయలు కుప్పలు పెట్టి అమ్మే ఆమెను చూసినా, చక్కటి అమ్మాయిని. అబ్బాయిని చూసినా ఏవో ఊహలు అల్లిబిల్లిగా తనలో అల్లుకొంటూ ఉంటాయి.
    ఊహల్లో ఎన్నో కథలు రచించింది. తన ఊహలే, తనమాట్లే ఏవో పత్రికల్లో మరో రచయితలు కథల్లా వ్రాస్తూనే ఉంటారు. అదె తృప్తి, అదే ఆనందం జుబేదాకు. ఏదో ఒకనాడు తనూ అలా ప్రకాశించగలదని నమ్మకం!
    తననే చూస్తున్నా చూపుల భావం ఎక్కడో ఉందని వీణ ఖాళీగా ఉన్న ఒక అలమారులో తన టాయ్ లెట్ వస్తువులు సర్దుకోసాగింది.
    టేబుల్ మీద గ్రీన్ కలర్ క్లాత్ పరిచింది. పుస్తకాలు సర్దింది. హోల్డాలు విప్పి పరుపు చెక్క మంచంమీద వేసింది. గ్రీన్ కలర్ బెడ్ షీటు వేసింది. అదే రంగు ఉన్న తలగడలు రెండు పెట్టి వాటిమీద పలచని గుడ్డ వేసింది. 'గలీబులకు నూనె అంటకుండా ఉండడానికి కాబోలు!' ప్రతి చర్య నీటుగా, నాజూకుగా చేస్తున్న వీణను గమనిస్తూ అనుకొంది జుబేదా.
    తనుకూడా లేచి సర్దుకొందామనుకొంది. ప్రయాణపు బడలిక ఇంకా తీరలేదు. ఇంటిమీద బెంగగా ఉంది. ఈల వినిపించి గదిలో ఉన్న ఇద్దరు ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు.

             
    పుస్తకం భుజం పై, జడ ముందుకు, తల కొద్దిగాచెదిరి, వాడిన నల్లని ముఖం, పెద్ద కళ్ళు, కురచగా ఉన్న నాసిక, సగం బుగ్గల్ని ఆక్రమించుకొన్న నోరు, క్రింద పెదవి కొంచెం ముందుకు వచ్చి-'సెక్సీగా ఉంది' జుబేదా పరిభాషలో!
    అలాగే ఈల వేసుకొంటూ, పుస్తకం మంచం మీదకు విసిరి, కూర్చుని కాళ్ళను చేతులతో చుట్టి ముందుకు, వెనక్కి ఊగుతూ, తమాషాగా వారిద్దరిని చూస్తూ ఉంది.
    వీణ, జుబేదాలకు ఇబ్బందిగా ఉంది.
    'అంత నిర్భయంగా ఎలా ఉంటారో! కొన్నాళ్ళు పోతే మేమూ అలా తయారవుతాము కాబోలు' అనుకొంది వీణ.
    "అమ్మాయ్! నేను సీనియర్ ని, మీకు మర్యాద లేదు. నిన్నే!"
    జుబేదా కళ్ళు విప్పారాయి.
    "నిద్రకళ్ళూ! నీ పేరు?" అంది.
    'ఛీ! అంత చక్కటి కళ్ళు. దట్టమైన కనురెప్పల భారంతో క్రిందికి వాలి ఉన్న డ్రీమ్ ఐస్ నిద్రకళ్ళా!' జుబేదా తన హీరోయిన్ ని అలా పిలిస్తే చాలా బాధ పడింది.
    అలా బొమ్మల్లా ఉండిపోయిన వారిని చూడగానే జాలి వేసింది. పైకి నవ్వేస్తూ, "కొత్తమ్మాయిలూ! మరీ అంత డెలికేట్ గా చూడకండి. కాస్త గట్టిదనం అలవరుచుకోవాలి. మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది.  పైగా నా రూముమేట్సుకూడా. మిమ్మల్ని 'ఫూలింగ్' అంటే 'రాగింగ్' అని 'ఎలా చెప్పాలో' అని స్వగతంగా పలికి, "చేస్తూ మాలో కలుపుకొంటాము. మీరు బెదిరిపోక సీనియర్స్ చెప్పినట్లు చేసేయండి" అంటూ అలాగే నవ్వుతూ వారివైపు చూసింది.
    చిన్నపిల్లల్లా తల ఊపారు ఒకటేసారి.
    "నేను సోఫియా! ఫోర్తు ఇయర్!"
    "జుబేదా!"    
    "వీణ."
    వీణ పచ్చటి నుదుటిపై ఎర్రటి తిలకం చూసి, 'తను క్రిస్టియన్ తక్కిన గరల్స్ హిందూ, ముస్లిం. తన రూము కాంబినేషన్ చాలా బాగుంది' అనుకొంది సోఫియా.
    బాత్ రూములోకి వెళ్ళి ముఖం కడుగుకొని వచ్చి పైట చెంగుతోనే అద్దుకొంటూ, "రండి, భోజనానికి" అంటూ వారిని పిలిచింది. చెరొక వైపు వారిద్దరు నడుస్తుండగా, హాస్టల్ విషయాలు విడమరచి చెప్పసాగింది.
    'పందెం, వీణ కళ్ళు చూసి బాయిస్ అందరూ దాసోహమంటారు. థ్రిల్లింగ్ గానే ఉంటుంది. ఐ లైక్ హెర్!...' సోఫియా తలంచింది.
    మెయిన్ హాస్టల్లోకి వెళ్ళారు. నవ్వులు, చప్పట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ గర్ల్స్ ఫ్రెషర్స్ ని రాగ్ చేస్తున్నారు.
    ఒక అమ్మాయి మునివేళ్ళతో అన్నం మెతుకులు తీసి నోట్లో ఉంచుకొంటూ ఉంది.
    "ఎంత నాజూకుగా తింటూ ఉందో! అంత నాజూకు పనికిరాదమ్మాయ్! అంత స్లో! స్లో! డాక్టర్ చదవటానికి వచ్చావా!" అంటున్నారు సీనియర్స్ చుట్టూ నిలబడి.
    అల్లంత దూరంలో వీణా వాళ్ళని చూసి, "సోఫీ! ఆ ఫెయిర్ లేడీస్ ని ఇక్కడికి పట్రా!" అని అరిచారు.
    అక్కడే ఆగిపోయారు వీణ, జుబేదాలు.
    "ఊఁ పదండి." చెయ్యి పట్టుకొని వచ్చింది. భోజనం వాళ్ళకి వడ్డించింది.
    తింటున్న అన్నంలో కూర ఉండగానే సాంబారు, రసం, మజ్జిగ పోసి అన్నీ కలిపి తినమంది ఒక సీనియర్.
    లోగొంతుకతో, "తింటున్నట్లు నటించండి" అని చెప్పింది సోఫియా. అదే పని చేశారు వాళ్ళు.
    "ఛీ! నేను తినను" అంది ఓ కొత్త అమ్మాయి గొంతు.
    "తిననా! పోనీ! తాగు" అంటూ గ్లాసు అందించింది సీనియర్.
    ఉప్పు కలిపిన నీళ్ళు. బెక్కుతూ, బెక్కుతూ తాగిందా అమ్మాయి.    
    వీణ, జుబేదాల పని పట్టించాలనుకొన్నారు. కాని, సోఫియా వాళ్ళ దగ్గర ఉంది.
    కొత్తవాళ్ళు కొంతమంది ఆకలితో లేస్తే, కొంత మంది గొంతు వరకు బలవంతపు తిండి తిని లేచారు.
    సీనియర్స్ కొందరు ఇదేమీ పట్టించుకోకుండా గబగబ తిని వెళ్ళిపోతున్నారు.
    'వాళ్ళెంత మంచివాళ్ళో' నన్నట్లు ఆరాధనగా చూసింది జుబేదా వారివైపు.
    "వారికి తీరిక లేదు. ఫైనల్ ఇయర్స్." మనస్సులో మాట చదివినట్లుగా సోఫియా అంది.


Next Page 

WRITERS
PUBLICATIONS