Previous Page
సంపెంగ పొదలు పేజి 24


                                       27
    టేబిల్ మీది ఉత్తరం ఫెన్ గాలి కి అల్లలాడు తుంటే గిరి మనసు కూడా గతంలో పరి భ్రమించింది. ఆనాడు దుర్గ విషయంలో తనతో తగవు పెట్టుకుని వెళ్లి పోయిన హరి మళ్ళీ తనతో మాట్లాడలేదు. ఎన్నోసార్లు తాను మాటలు కలపాలని ప్రయత్నించినా మోటుగా ముఖం తప్పించి, వెళ్ళిపోయాడు.
    ఇన్నాళ్ళ కు ఈ ఉత్తరం. తనతో మాట్లాడ వలసినంత అవసరమైన సంగతు లేమోచ్చాయో హరికి?
    మనసు పరిపరి విధాల పోతుంటే, దడదడలాడుతున్న గుండెలతో హరి ఇంట్లోకి ప్రవేశించాడు గిరి.
    గిరిని చూడాగానే హరి ఒక్క పరుగున వచ్చి గిరిని గాడంగా కౌగలించు కున్నాడు. హరి కౌగిలి లో సమస్యమూ మరిచి, గిరి కూడా, హరిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. ప్రాణ మిత్రులిద్దరూ సమస్తమూ మరిచి, ఒకరి కళ్ళలోకి ఒకరు సంతృప్తి తో సంతోషంతో చూసుకున్నారు.
    అంతలో గిరి తెలివి తెచ్చుకుని "హరీ! నువ్వెప్పుడూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటావు. మళ్ళీ ఎమొచ్చిందో చెప్పు" అన్నాడు.
    హరి ముఖం చిట్లించి నవ్వుతున్న పెదిమలను పంటితో నొక్కి పట్టి "దుర్గ కొడుకుని కందని తెలిసీ, ఇక్కడే కూర్చున్నావా? మేమంతా కాని వాళ్ళమయి పోయామన్న మాట!" అన్నాడు. గిరి మొదట తెల్లబోయాడు. అంతలోనే అతని కంతా అర్ధమయింది. వర్ణింప నలవి కాని ఆనందంతో అతని కెక్కడ లేని హుషారూ వచ్చింది చేతులు జోడించి "ఈ దాసుడు తమ అజ్ఞాను సర్వ బద్దుడు." అన్నాడు.
    "అయితే, రైల్వే స్టేషను కి పద!"
    "చిత్తం! ఏ ఊరికో అడగవచ్చా!"
    'అవసరం లేదు----"
    సూటు కేసూ అదీ!!........
    "నేనున్నానులేవోయ్ పద! పద!"
    ఒకరి వెనుక ఒకరు వస్తున్న హరి, గిరిలను చూసి దుర్గ సంభ్రమం తో "గిరీ" అని కేక వేసింది. గిరి దుర్గ దగ్గిరగా వచ్చి ఆమె తల నిమురుతూ "ఉద్రేక పడకు. విశ్రాంతి తీసుకో!" అన్నాడు. దుర్గ కళ్ళ నుండి జాలు వారుతున్న ఆనందాశ్రువులను తన చేతులతో తుడిచాడు. అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆప్యాయంగా "పిచ్చి పిల్లా!" అన్నాడు. శంకర్ చేతిని మృదువుగా ఊపుతూ "శంకర్! నీ ముక్కుకు కళ్ళెం వేసేవాడూ మా దుర్గకు అంగరక్షకుడు , జన్మించాడు. ఇంక ఆటలెం సాగవు. జాగ్రత్త" అన్నాడు.
    దుర్గ అందుకని "పాపం! ఈయన ఆటలెం  ఉన్నాయి. గిరీ! ఏదో ఆ మాత్రం బలహీనత లెవరి లోనైనా ఉంటాయి." అంది. గిరి పకపక నవ్వాడు .
    "అబ్బో! భర్త గారి వంటి మీద ఈగ వాలకూడదు. లెంప లేసుకుంటూన్నానులే దుర్గా!"
    చిన్న సూట్ కేసు చేత్తో పుచ్చుకుని ఎంతో గాభరాగా అక్కడకు వచ్చిన ఉమను చూసి హరి తప్ప అందరూ ఆశ్చర్య పోయారు. ఉమ కూడా అంతే ఆశ్చర్యంగా అందరి వంకా చూసి సూట్ కేస్ క్రింద పారేసి, సోఫాలో కూలబడి "హమ్మయ్య! అందరూ సుఖంగా ఉన్నారు. నాకు కాస్త మంచి నీళ్ళియండి. ఎవరైనా?" అంది.
    శంకర్ గ్లాసు తో మంచి నీళ్ళందించాడు. గిరి ఆశ్చర్యంగా ఉమ వంకా, హరి వంకా చూడసాగాడు. హరి పెదవుల మీది కొంటె చిరునవ్వు అతనికేదో అనుమానాన్ని కలుగ జేసింది. గుండెలు దడదడ కొట్టుకున్నాయి.
    తన ముఖానికి పట్టిన చెమటను జేబురు మాలుతో తుడుచుకుంటూ "అలా వైరిచ్చావెం బావా! ఏం కొంప మునిగిందో నని హడలి పోతూ పరుగెత్తు కొచ్చాను. ఎందుకిలా చేశావ్?" అంది ఉమ.
    హరి నవ్వుతూ 'కొంపలు మునిగాయి కనుకనే వైరిచ్చాను. ఈ గిరి చూడు లేకపోతె , పెద్ద పెద్ద త్యాగాలు చేసి గొప్ప వాడై పోదామను కుంటున్నాడు. నేనా, సాగనిచ్చేది?"
    హరి మీసాలు మేలేసుకున్నాడు.
    గిరి ముఖం ఎర్రబడింది. "నేను త్యాగాలు ఏమీ చెయ్యలేదు. నా వస్తువు దేనినైనా వదులు కుంటే కదా, త్యాగం చెయ్యటానికి? ఇక చేస్తే  నువ్వు చెయ్యాలిప్పుడు గొప్ప తనానికి."
    "పోనీలేవోయ్! నేనే చేస్తాను త్యాగం! ఇలా రా ఉమా!' అంటూ అయోమయంగా నిల్చున్న  ఉమను బలవంతంగా గిరి దగ్గరకు లాక్కొచ్చి, ఆమె చేతిని గిరి చేతిలో పెట్టబోయాడు -- గిరి వెంటనే తన చేతిని వెనక్కు లాక్కుని "నాటకం లోలాగ చెయ్యకు. ఇది నాకెంత మాత్రమూ ఇష్టం లేదు.' అన్నాడు తీవ్రంగా.
    హరి అంతకంటే తీవ్రంగా "ఇది నాటకం కాదు నీ నాటకానికి భారత వాక్యం . మా మరదలిని అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటా ననుకున్నావా?' అన్నాడు.
    గిరి ఆవేదనతో "నా మాట విను హరీ! నువ్వు ఉమా భార్యా భర్త లయితే చూసి సంతోషించాలని కోరుకుంటున్నాను." అన్నాడు. హరి స్నేహస్వరంతో "నేనూ, సరిగ్గా అదే కోరుకుంటున్నాను గిరి!. నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకోకు. ఉమ నా ప్రేమను అంగీకరించి ఉంటె, ప్రపంచం లోని ఏ విలువ కోసరమైనా ఆమెను వదులు కునే వాడిని కాదు. ఇప్పుడు నేను ఉమను చేసుకున్నా, మా ఇద్దరిలో ఎవరమూ సుఖ పడలేము. మీరైనా సుఖ పడండి. నన్నేప్పుడూ  మీ స్నేహితుడిగా భావించండి.' అన్నాడు. అతని కంఠం స్వల్పంగా గద్గదికమయింది.
    దుర్గ సంతృప్తి గా అందరి వంకా చూస్తూ "మీరంతా నావాళ్ళని అనుకోవటానికి గర్వంగా ఉంది. దేవతలు." అంది. గిరి అడ్డు తగిలి. 'దేవతలు అని మమ్మల్ని అవమానం చెయ్యకు దేవత లంటే అసలు ఉద్వేగాలే లేని వాళ్ళు. కానీ మాకు, ఈర్ష్యలు , కోపాలూ, ద్వేషాలూ, ఆకర్షణ లూ, ప్రలోభాలూ, అన్నీ ఉన్నాయి. కానీ మా బలహీనతలు, మేము గుర్తించ గలిగాం. వాటిని చక్క దిద్దుకోవటానికి ప్రయత్నించాం. మీరు అసలైన మానవులు అంటే మమ్మల్ని నిజంగా పొగిడిన దానినవుతావు." అన్నాడు. శంకర్ "అయితే ఇక ఉమ తేజ్ పూర్ వెళ్ళదా?" అన్నాడు. ఉమ వెంటనే "తప్పక వెళతాను." అంది.
    శంకర్ గిరి వంక చూసాడు. గిరి నవ్వి "ఉమ ఇష్టానికి నేను అడ్డు రాను." అన్నాడు.
    శంకర్ ఆశ్చర్యంగా "ఇద్దరూ చెరొక చోటా..." అని మాట పూర్తీ చేయక ముందే , గిరి అడ్డు తగిలి ఇద్దరమూ చెరొక చోటా ఎందుకూ? నేనూ అక్కడికే వెడతాను." అన్నాడు.
    శంకర్ ఆశ్చర్యం మరింత అధికమయింది.
    "ఇక్కడ ఇంత మంచి ప్రాక్టీస్ వదులుకుని వెడతావా, ఆడదాని సంపాదనతో బ్రతుకుతావా?"
    గిరి నిరసనగా నవ్వాడు--
    "నా భార్య చదువుకున్నది కావటానికి, ఉద్యోగస్తురాలు కావటానికీ, నాకభ్యంతరం లేనప్పుడు ఆవిడ నాకంటే ఎక్కువ సంపాదిస్తే మాత్రం నేనెందుకు అభ్యంతరం పెట్టాలి? మా మధ్య అనురాగ బంధం తప్ప ఎక్కువ తక్కువలు లేవు."
    ఈ సమాధానంతో శంకర్ మనసుకు అంగీకారం కాకపోయినా, గిరితో వాదించలేక ఊరుకున్నాడు.
    తన భర్తతో బయల్దేరుతున్న ఉమకు వీడ్కోలు లివ్వటానికి స్టేషన్ కు వచ్చిన జానకి "ఉమా! నీ అంగీకారం లేకుండా నీ ఉత్తరాలన్నీ హరికి చూపించాను. మీందరి క్షేమమూ కోరి అలా చేశాను. క్షమించు.' అంది.
    ఉమ జానకిని కౌగలించుకుని "నువ్వు నాకు మహోపకారం చేసావు. క్షమించటమేమిటీ? ఎన్ని జన్మల కయినా నీ ఋణం తీర్చుకోలేను." అంది.
    గిరి నవ్వుతూ "మీరింత వారని అనుకోలేదు" అన్నాడు.
    జానకి గిరి వంక తిరిగి "గిరిగారూ! మీకందరికీ అనవసర మనస్తాపం కలిగించిన అన్నయ్య తరపున నేను క్షమాపణ వేడుకుంటాను." అంది.
    "మన జీవితాలు సంపెంగ పొదల వంటివి. తీయని పరిమళాన్ని వెదజల్లే ఆ పుష్పాల మాటున ప్రచ్చన్నంగా కాలనాగులు కూడా ఆవాసాన్ని కల్పించు కుంటాయి. మనసుల్ని పవనశింప చేసే ఆ దివ్య సుగందాలతో పాటు వొడలు జలదరింప చేసే ఆ విష వాయువులు కూడా మనం భరించక తప్పదు."
    "జానకి గారూ! నేటి మన సమాజం ఆహామహామికతో ముందుకు పరుగెత్తుతుంది కానీ ఈ పరుగు సమసౌష్టవంగా లేదు. కొంత భాగం మరీ ముందుకు ఉంటె, కొంత మరీ వెనుకబడి ఉంది-- ఒక నిర్దిష్టమైన క్రమంలో స్థిరమైన విలువలను ఏర్పరచుకొని మన సమాజంలో మనమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం ఇందులో ఒకరిని ఒకరు నిందించు కోవలసింది కానీ , క్షమార్పణ కోరుకోవలసింది కానీ ఏమీ లేదు."
    అవునన్నట్లు రైలు కూసింది. గిరి, ఉమ జానకి దగ్గర సెలవు తీసుకొని పెట్టెలో ఎక్కి కూర్చున్నారు.
    ఒకరి చూపులకు ఒకరు పరవశించి పోతున్న ఆ దంపతులను ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్ కు చేర్చాలనే ఆత్రుతతో రైలు ముందుకు సాగింది.

                         -------అయిపొయింది.--------


 Previous Page

WRITERS
PUBLICATIONS