Next Page 
పేక మేడలు పేజి 1


                           పేక మేడలు
                                                                   ---ముప్పాళ రంగనాయకమ్మ

                     


    భాను పగలబడి నవ్వుతూంది. ఉలిక్కిపడి లేచాను. ఏదోభయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో! ఈ అర్దరాత్రి.....ఒక్కతీ. చాలాసేపు చీకటిలోనే లేచి కూర్చున్నాను. ఒక సారి వెళ్ళివద్దామా అనిపించింది. కాని నేను అంత అర్దరాత్రి వెళ్తే అతను ఏమైనా అనుకోవచ్చు. అనవచ్చు కూడా...... ఆలోచనలలోనే మగతగా నిద్ర పట్టింది కొంత సేపు. ఎవరో కంగారు కంగారుగా లేపుతున్నారు. త్రుళ్ళి పడ్డాను. అతను ... భాను భర్త-రాజశేఖరం! మనిషంతా కంపించిపోతున్నాడు-"భాను...లేదు. ఈ.....ఉత్తరాలు..." అంటున్నాడు తడబడుతూ. నేను అదిరిపోయాను. శరీర మంతా గడ్డకట్టిపోయింది. ఏదో పీడకల జరుగుతున్నట్లుతోచింది. గొంతు పెగుల్చుకున్నాను. కంగారుగా అడిగాను-"భాను....ఇంట్లో లేదూ? ఏమైంది?"

                                   
    అతను అపరాధిలా తల దించుకున్నాడు. జంకుతున్నాడు - "ఏమో! నాకూ తెలీదు. బాబు ఏడుస్తోంటే మెలుకువ వచ్చింది. వాళ్ళమ్మ వస్తుందిలే అని కాస్సేపు పడుకున్నాను. వాడు వంటగదిముందు కెళ్ళి ఏడుస్తోంటే లేచివెళ్లాను. ఎంతపిలిచినా జవాబులేదు. నాకేదో అనుమానం వచ్చి గబగబా గదిలోకి వచ్చి చూశాను. టేబుల్ మీద ఉత్తరాలు వున్నాయి. నన్ను అడ్రస్ చేసింది పైన ఉంది. తీసి చూస్తే-మీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాననో ఏమిటో రాసింది. నేను పూర్తిగా చదవలేదు. బాబును పక్కింటి వాళ్ళకు అప్పజెప్పి ఇలా వచ్చేశాను.... మీరు..." ఆగిపోయాడు.
    అంతా అర్ధమైంది. రాత్రి ఏదో గొడవ జరిగింది. భాను అన్ని బంధాలూ తెంపుకొని, కన్న ప్రేమను కూడా చంపుకొని తెగించింది. బలవంతంగా చచ్చిపోవటానికి వెళ్ళిపోయింది. "భానూ!" అంటూ వెర్రిగా అరిచాను. దుఃఖం ముంచుకొచ్చింది. భరించలేక గోడకు తల బాదుకున్నాను. "అయ్యో! భానూ!"
    చటుక్కున కర్తవ్యం గుర్తు వచ్చింది. స్టాండు మీది చొక్కా తగిలించుకున్నాను. భాను రాసిన ఉత్తరాలు చదివే సమయంకాదు. జేబులో తోసేశాను. పక్కగదికి వెళ్ళి  స్నేహితులు ఇద్దర్నీ లేపి క్లుప్తంగా సంగతి చెప్పాను. క్షణాలలో బీచ్ వైపు, రైల్వే లైను వైపు సైకిళ్ళ మీద బయల్దేరి పోయాం. మూడు గంటల రాత్రి. కన్ను పొడుచు కున్నా కానరావటం లేదు. చీకటి కాటుకలా చిక్కపడింది. బీచ్ అంతా గాలించివేశాను. తడి ఇసుకలో దిగబడి పోయే కాళ్ళను ఈడ్చుకుంటూ పరుగుగాని పరుగు పెడుతూ నీళ్ళవారకు టార్చి లైటు వేస్తూ విరిగిపడే కెరటాలలోనికి చూపు పోనిస్తూ- "భానూ! భానూ! చెల్లీ! భానూ!" అని శక్తికొలది అరుస్తూ మూడు గంటల సేపు తిరుగుతూనే ఉండి పోయాను. భళ్ళున తెల్ల వారింది. ఆశాజ్యోతి ఆరిపోయింది. భాను మాయమైంది. అనంత సాగర గర్భంలో నిత్య నాతన ప్రవాహంలో కలిసిపోయింది. శాశ్వతంగా వెళ్ళిపోయింది. "చెల్లీ!" కూలబడిపోయాను. పెద్ద పెట్టున ఏడ్చాను- "భాను వెళ్ళి పోయింది. ఇక లేదు, లేదు."
    మరుక్షణంలోనే ఆ దుఃఖం-గుండెల్నిపిండే ఆవేదన-భరించలేని ఆ ఆందోళన-అన్నీ అన్నీ-మారిపోయాయి. అతని మీద కసి! క్రోధం! అసహ్యం! ప్రతీకారం! పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు నలిగిపోయాయి. శ్వాస సెగ అయింది. బయల్దేరాను.
    వాళ్ళు ముగ్గురూ ఎదురు పడ్డారు. రైలుకట్టంతా వెదికి వచ్చారు. అతను నన్ను చూస్తూనే అన్నాడు- "రాత్రి రైల్వే లైన్ లో ప్రమాదం ఏమీ జరుగలేదు. స్టేషన్లో నేను కనుక్కున్నాను." కొంచెం తలదించాడు.
    "గొప్ప పని చేశావు. ఏ ప్రమాదం జరిగినా నీ దగ్గరే జరగాలి. నిజం చెప్పు. రాత్రేం గొడవ జరిగింది?"
    అతను తెల్లబోయాడు-పరుషంగా చులకనగా మాట్లాడుతున్నానని కాబోలు. మళ్ళీ అడగ కుండానే అన్నాడు:
    "రాత్రి...... ఏం జరగలేదే!"    
    "ఏమీ......జరగలేదూ? ఏమీ..."
    "ఏమీ.....లేదండీ!"
    "అలాగా? ఏమీ జరగకుండా ఉత్త పుణ్యానికే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే పసిబిడ్డను-కన్న కొడుకును విడిచి వెళ్ళిపోయిందా? దొంగ రాస్కెల్! నీ పాపం పండింది. నా చెల్లిని నీయిష్టం వచ్చినట్టూ ఏడిపించి..... ఏడిపించి చివరికి ప్రాణాలు తీశావ్! మనిషిని నిలువునా హత్య చేసే.....నిన్ను......నిన్ను...." ఫెడీ ఫెడీ మని లెంపలు పగలగొట్టాను. తన్నాను. పొడిచాను. చంపినంత పని చేశాను. స్నేహితులు అడ్డబోతే పరుగెత్తాను. ఆ స్థితి వర్ణనాతీతం! అయోమయం! అధ్వాన్నం! భాను చచ్చిపోయింది. కొడుకును విడిచి చచ్చిపోయింది. వాడి బాధ్యత నాది. నాది.
    
                              *    *    *

    బాబు ఒడిలో నిద్రపోతున్నాడు. ఆ పసితనం చూస్తున్నకొద్దీ దుఃఖం పొర్లుకొస్తూంది. కన్నీళ్ళు జారి బాబు బుగ్గలమీద పడుతున్నాయి. తల దించుకొని తడి తుడుస్తున్నాను. రైలు శరవేగంతో పరుగిడుతూంది-రైలుకు వ్యతిరేకంగా నా మనస్సు వెనక్కు...

                              *    *    *

    స్కూలు ఫైనలు ఫలితాలు వచ్చాయి. సంతోషం ముంచుకొచ్చింది. క్షణాలమీద వెళ్ళి నా సంతోషాన్ని ముంచుకొచ్చింది. క్షణాలమీద వెళ్ళి నా సంతోషాన్ని పంచిపెట్టాలనీ, భానుసంతోషాన్ని పంచుకోవాలనీ అనిపించింది. అయినా నాన్న పురమాయింపులతో రెండు రోజులు ఊరుకదలటానికి వీల్లేకపోయింది.
    పట్టణంలో బాబాయిగారి ఇల్లు చేరేసరికి సాయంకాలమైంది. వీధి గుమ్మంలో అడుగు పెడుతూనే పిన్నీ, బాబాయీ, అక్కయ్యలూ అంతా ఎదురుపడి పలకరించారు. మేమిద్దరం పాసైనందుకు సంతోషం వెలిబుచ్చారు. మా యింటి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. మా ఊరి విశేషాలు తెలుసుకున్నారు. ఉభయ కుశలోపరి, అంతా ఏకసందడి!-"కేశవ్ అన్నాయ్ వచ్చాడు," "కేశవ్ మామయ్య వచ్చాడు" అంటూ ఇంట్లో పిల్లలంతా అన్ని వరసలవాళ్ళూ బిలబిల్లాడుతూ ముట్టడించారు. అందరికీ మిఠాయి పంచిపెట్టాను. బూరాలూ ఈలలూ తీసి ఇచ్చాను. నా చేతుల్లోంచి లాక్కొంటూనే పిల్లలంతా మూక ఉమ్మడిగా చెవులు పెట్టి పోయేటట్లు బూరాలు ఊదుతూ, ఈలలు వేస్తూ సంతగోల చేసేస్తూంటే భాను విసుక్కొంటూ లేచి వెళ్ళిపోయింది. మొదటి సంవత్సరమే పరీక్ష పాసైనందుకు ఎంతో సంతోషంగా ఉంటుందనీ, నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి గలగలా మాట్లాడుతుందనీ.....అదేం లేదు. ఎందుకో ఉదాసీనంగా విచారంగా ఉన్నట్లు కన్పించింది. పిల్లల్ని పోగేసుకొని పిల్లలకన్న మిన్నగా అల్లరి చేసే భాను అంత ముభావంగా ఉండటం ఎన్నడూ చూపిన గుర్తు లేదు.
    "ఏం భానూ! అలా ఉన్నావ్" అని నవ్వుతూ పలుకరిస్తే, "ఏం లేదు" అనేసింది పొడిగా. అంతలోనే పిల్ల వెదవల గోలకు చిరాకుపడి వెళ్ళి పోయింది. నాకేం అర్ధం కాలేదు. పిన్ని వంటింటి కేసి వెళ్ళుతూంటే వెనకే నడుస్తూ-"ఎందుకు పిన్నీ! భాను అదోలా ఉంది?" అన్నాను.
    పిన్ని వంటగదిలోకి నడిచి పీట వాల్చింది కూర్చోమని. తను బియ్యం చేట దగ్గరికి తీసుకుని కూర్చుంది- "పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోయాక ఎన్ని చదువులు చదివితే మాత్రం ఏం లాభంరా? కాలేజీ చదువులు చదువుతుందటా. కూడదన్నామని పొద్దుటి నుంచీ పంతం పట్టి అలా ఆకలి కడుపు మాడ్చుకొంటూ కూర్చుంది. చూడు కేశవ్....."పిన్ని ఏదో చెప్పబోతూంటే ఆశ్చర్యంకొద్దీ-"అయితే భాను కాలేజీలో చేరదూ?" అన్నాను.
    "బావుందిరా నువు చెప్పేది. చీమల పుట్టలా గంపంత కుటుంబం. ఇంటినిండా ఆడమూక. పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, పురుళ్ళూ, పుణ్యాలూ-పుట్టేవాళ్ళు పుడుతూంటే-ఎదిగేవాళ్ళు ఎదుగుతూంటే-ఇల్లంతా ఖర్చుల మయం అయిపోతూంటే ఎంతకనీ భరించటం? వందలూ వేలూ వచ్చిపడుతున్నాయా? ఉన్న ఊళ్ళో స్కూలు ఉంది కాబట్టి ఇంతవరకూ చదువుకొంది. బాగానే ఉంది. ఆడపిల్లను పొరుగూళ్ళు పంపి చదివించటం అంటే మనకు శక్తి ఉందీ? దానికి మాత్రం ఇవన్నీ తెలీవనా చెప్పను?" పిన్ని కాస్సేపు ఊరుకొంది. నేను అయోమయంగా కళ్ళు పెట్టుకు చూస్తూ కూర్చున్నాను.
    "దానికి సరస్వతీ కటాక్షం ఉంది. నిజమే. చదివిస్తే వృద్దిలోకి వస్తుంది. కాని మనకు తాహతేది నాయనా?  దాని కోరికలన్నీ తీరేరాత ఉంటే నా కడుపున ఎందుకు పుడుతుంది?" పిన్ని గొంతు పూడిపోయింది. కొంగుతో కళ్ళు ఒత్తు కొంటూంటే నా మనసంతా వికలమై పోయింది. పేదరికమంటే ఏమిటో తొలిసారి అర్దమైంది.
    నిజమే! బాబాయికి ఆస్తి తక్కువ! సంతతి ఎక్కువ! రాబడి తక్కువ!  ఖర్చులెక్కువ. ఒక కూతుర్ని కాలేజీ చదువులు చదివించడం బాబాయికి సాధ్యమయే పనికాదు. పిన్నికి కూతురు మీద అంతులేని ప్రేమ ఉండీ, కూతురు తెలివితేటలమీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండీ చెయ్యగలిగిందేమీ లేదు......కానీ......భాను కోరికను ఇంత తేలిగ్గా తోసివేస్తే భాను ఏ మౌతుంది? ఎలా భరిస్తుంది?
    భాను........భానుమతి......నాకు పెదనాయనమ్మ మనవరాలు. క్రిందటి సంవత్సరం వరకూ మాకు బంధువులను నే పరిచయం తప్ప మరేమీ లేదు. నేను మొదటి సంవత్సరం స్కూలు ఫైనల్ తప్పినప్పుడు అత్తయ్యగారి ఊళ్ళో చదువుమానేశాను. నాన్న ఇక్కడ హైస్కూల్లో చేర్చి బాబాయిగారి ఇంట్లో ఉంచాడు. భాను ఫిఫ్తుఫారం పాసై స్కూలు ఫైనలుకు వచ్చింది. ఇద్దరం ఒకే క్లాసు కావటంతో చాల సంతోషం కలిగింది. ఇంట్లో అందరికన్నా నాకు భాను ఎక్కువ చేరికైంది. నేను వచ్చిన మొట్టమొదటిరోజు బిడియంగా వీధి గదిలో కూర్చున్నాను. భాను వచ్చి చాలా చనువుగా పలకరించింది. "అన్నయ్యా! అమ్మ భోజనానికి రమ్మంటూంది" అంది. నా శరీరం జలదరించింది, హృదయానికేదో పారవశ్యం కలిగించింది- 'ఆ అన్నయ్యా' అన్న పిలుపు! నా స్వంత చెల్లికూడా అన్నయ్యా అని ఎన్నడూ పిలిచి ఎరుగదు. ఎందుకో దానికి నన్ను అమ్మపిలిచినట్టు-"కేశీ!" అని పేరు పెట్టి పిలవటమే అలవాటై పోయింది. చిన్నతనంలో అది తప్పని ఎవరూ చెప్పలేదు. నేను పెద్దవాడి నయ్యాక ఎంత చెప్పినా ఫలితం కన్పించలేదు. "నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తా. నీకేం? పలక్క పోతే మాను" అని మొరాయిస్తుంది.
    ఈనాడు...భాను మనసారా- "అన్నయ్యా!' అని పిలిచింది. చక్కటిచెల్లి! భాను మొహంలోకే చూస్తూ ఉండిపోయాను. భాను నవ్వుతూ, "ఆకలి వెయ్యటంలేదేమిటి?" అంది. నేను మౌనంగా లేచాను. ఆనాడే భాను నా మనసులో సుస్థిరమైన విశాలమైన చోటు ఆక్రమించుకొంది. అప్పటినుంచీ నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తూ వచ్చిన చెల్లి ఒకే ఒక భాను. భాను నాకన్నా రెండు సంవత్సరాలు చిన్నది. తెల్లగా సన్నగా అందంగా ఉంటుంది. రూపానికి మించిన తెలివితేటలు గలది. నేను రెండో సంవత్సరం చదువుతూ కూడా చదువుకు సంబంధించిన చాలా విషయాలు-పాఠాలు-లెక్కలు-భాను దగ్గర నేర్చుకొనేవాడిని. భాను నాకు ఒక విషయం బోధపరుస్తూంటే నాకే గర్వం కలిగేది. భానుకు సైన్సులో, లెక్కలలో ఎప్పుడూ ఫస్టు మార్కులే వస్తూ ఉండేవి. ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్ళేవాళ్ళం. కలిసి సినిమాలు చూసేవాళ్ళం. కలిసి నవలలు చదివే వాళ్ళం. కలసి స్నేహితుల ఇండ్లకు తిరిగేవాళ్ళం. ఏది చేసినా ఇద్దరం చెయ్యాలి. ఎక్కడ ఉన్నా ఇద్దరం ఉండాలి. ఇద్దరం తరుచూ సినిమాలు చూసీ కథలు చదివీ తర్కించుకొనేవాళ్ళం. భాను మనస్తత్వాన్ని చూరకత్తితో పోల్చితే సరిపోతుందేమో అనిపిస్తుంది. తల్లి అయినా ఒకమాట ఎక్కువ అంటే సహించలేని అభిమానం! మాటకు మాట జవాబు చెప్పేపౌరుషం! "అమ్మ ఏమైనా అంటేమాత్రం కుండబద్దలు కొట్టినట్లు జవాబు చెప్తావా?" అంటే- "ఏం? నన్ను అనవసరంగా అంటే నేను బాధపడలేదూ?" అంటుంది. మనిషికి వ్యక్తిత్వం కాపాడుకోవటం కన్నా ఎక్కువ ఏమీ లేదట. అదీ భాను వాదన!
    "నువ్వు ఆవేశంగా మాట్లాడుతావు భానూ! వ్యక్తిత్వాలు దెబ్బతినకుండా కాపాడుకోవటానికి అందరికీ, ఎల్లప్పుడూ పరిస్థితులు కలిసివస్తాయంటావా?"
    "ఎన్ని చెప్పు అన్నయ్యా! నీచంగా అభిమాన రహితంగా మనిషి బ్రతక్కపోతేనేం?"
    అవును, తనకు ఏ విలువా లేని స్థితిలో మనిషి బ్రతక్కపోతేనేం? కాని.. అటువంటి దౌర్భాగ్యులు ఎందరో ఇరవై నాలుగ్గంటలూ ఊపిరి పీల్చి క్షణక్షణమూ బ్రతుకుతూనే ఉన్నారు. ఎందుకో నాకు తెలీదు. భానుకూ తెలీదు.
    భాను స్నేహం నాకు అపురూపమైనదిగాతోస్తుంది. భాను స్నేహంతోనే నేను కొంత సెన్సిటివ్ గా తయారయ్యానేమో కూడా. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసే రోజల్లో ఏమాత్రం అవకాశం వచ్చినా భవిష్యత్తు గురించి ముచ్చటించుకోవటం ఒక్కటే ముఖ్యావసరం. "ఏ ఊళ్ళో కాలేజీ బావుంటుంది చెప్మా? ఇద్దరం ఓకే గ్రూపు తీసుకోవాలి సుమా! ఎంత చదివినా కలిసే చదవాలి. మరి నీకు డాక్టర్ కావాలని ఉందా? లాయరా? ఎంతేనా డాక్టరే హోదాగా ఉంటుంది లెద్దూ! డాక్టర్ కేశవరావ్! డాక్టర్ భానుమతీ దేవి!" ఫక్కుమని నవ్వుకుంటూ అంతులేనన్ని కోరికలు కోరుకునే ఆ సమయంలో ఈ అనుమానం ఒక్కళ్ళకైనా రాలేదేం?


Next Page 

WRITERS
PUBLICATIONS