Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 21


                                     23

              
    పుట్టింటి కి వచ్చిన దుర్గకు రెండు మూడు రోజుల వరకూ స్వర్గం లో ఉన్నట్లు అనిపించింది. కానీ, నాల్గవ తోజు నుంచీ, ఏమీ తోచలేదు. ఏదో దిగులు, వెలితీ ఆమెను క్రమ్ము కుంటున్నాయి. గిరి తనకు కనాబడక పోవడం, ఆ దిగులును, మరింత అధికం చేసింది. దగ్గిర -- దగ్గిర ఎనిమిది నెలలవుతుంది. గిరిని చూసి. ఇంతకాలం కనబడకుండా ఎన్నడూ లేడు. వంట్లో కులాసాగా లేదా! ఎందుకో గిరి ప్రస్తావన తేగానే హరి అన్నయ్య మండి పడ్తున్నాడు. తల్లి నడుగుతే తనకు తెలియదంది. ఒకసారి తనే వెళ్లి చూసివద్దామని బయల్దేరింది దుర్గ-- అది గమనించి హరి 'ఎక్కడకు ?" అన్నాడు.
    దుర్గ అమాయకంగా, "గిరి దగ్గరకూ అన్నయ్యా! నాకు కనిపించి ఎనిమిది నెలలవుతుంది. ఎలా ఉన్నాడో చూసి వద్దామని అంది.
    "ఏం? బెంగ పెట్టుకున్నావా?" కఠినంగా అన్నాడు హరి.
    అతని స్వరంలోని కాఠిన్యానికి తెల్లబోయింది దుర్గ--
    'అవును, నాకేం తోచటం లేదు. ఎనిమిది నెలల క్రిందట, నా దగ్గరకు వచ్చి తేజ్ పూర్ వేడ్తున్నానని చెప్పాడు. అంతే మళ్ళీ కనబడలేదు."
    "ఏమిటీ? గిరి తేజ్ పూర్ -- వెళ్ళాడా?!"
    హరి గర్జించాడు. హరి ముఖంలో వ్యక్త మవుతున్న ద్వేషానికీ, కసికీ, దుర్గ వణికి పోయింది. ఆమెకూ ఏమీ అర్ధం కాలేదు. అన్న ముఖంలోకి చూస్తూ నిలుచుండి పోయింది.
    "దుర్మార్గుడు -- నీచుడు ----నమ్మక ద్రోహి --నిలువెల్లా విషం -- రోగ్----నా దగ్గిరా వీడి ఆటలు? స్నేహంలో ప్రాణం పెట్టినట్లే ద్వేషంతో ప్రాణం తీస్తానని తెలియదు--
    నిజంగా హంతకుడి లాగే ఉన్నాడు హరి -- దుర్గ భయంగా "ఎవరిని గురించి అన్నయ్యా??" అంది--
    హరి విసురు దుర్గ మీదకు తిరిగింది.
    "ఎంత నంగనాచివి తల్లీ అసలా వెధవ ని మళ్ళీ మీ ఇంట్లో ఎందుకడుగు పెట్ట నిచ్చావ్? నువ్వు వాడిని పెళ్లి చేసుకోనందుకు చాలా సంతోషిస్తున్నాను-- కానీ, కానీ,, ఈ చను వెందుకూ?వాడు....వాడు స్వార్ధపరుడు-- నీ సంసారం లో కలతలు రేపి నీ మనసుని బలహీనం చేసి, నిన్ను లొంగ దీసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ ఉమ దగ్గిర ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడర్ధమవుతుంది. వాడి కౌటిల్యమంతా-- చండాలుడు! వాడి మూలంగానే , నా ఉమ నాకు కాకుండా పోయింది. ఇది కాకుండా తేజ్ పూర్ కూడా వెళ్ళొచ్చాడు. మనందరి జీవితాలూ నాశనం చేస్తేనే కాని, ఈ రాక్షసుడి కి నిద్ర పట్టదులా ఉంది. తీయని చిరునవ్వుతో మెత్తని మాటలతో ఒక్కొక్కళ్ళ నీ బుట్టలో వేసుకుని అందరి గొంతుక లూ కోస్తున్నాడు."
    దుర్గ చెవులు మూసుకుంది. ఆందోళన తో ఆమె స్వరం కంపించింది. "కాదు! అన్నయ్యా! నువ్వు పోరపడుతున్నావ్! గిరి....."
    "షటప్! " దుర్గ మాటలు పూర్తీ కాకుండానే విరుచుకు పడ్డాడు హరి.
    "అతని మీద నీకు పెరిగిన వ్యామోహం లో నువ్వు సరిగా ఆలోచించ లేక పోతున్నావ్. నాకు సరిగ్గా ఏడెనిమిది నెలల క్రిందట , ఉమ దగ్గిర నుండి ఒక ఉత్తరం వచ్చింది . తనకు నన్నువివాహం చేసికోవటానికి ఏమీ అభ్యంతరం లేదనీ, కాని తన ఉద్యోగానికి మాత్రం ఈ వివాహం ఆటంకం కాకూడదనీ వ్రాసింది. నాకేం తెలుసు. ఇదంతా ఈ వెధవ పన్నాగమని? నా మీద ప్రేమ తోనే, ఉమ ఇలా వ్రాసిందనుకుని "నీ ఉద్యోగం వల్ల మన ఇద్దరికీ సుఖం లేదు. నువ్వక్కడ తేజ్ పూర్ లోనే ఉండ దల్చు కుంటే, మనం పెళ్లి చేసుకునీ ప్రయోజనం లేదు-- కావాలంటే ఇక్కడే ఉద్యోగం చేయవచ్చు" అని సమాధానం వ్రాశాను. మళ్ళీ ఉమ దగ్గర నుండి ఉత్తరమే లేదు-- నా మీద అభిమానంతో మొదటి ఉత్తరం వ్రాస్తే కదా, మళ్ళీ సమాధానం వ్రాయటానికి? ఈ దరిద్రుడు అక్కడకు వెళ్లి చెప్పిన ఉపాయం ఇది --  నా సమాధానం ఎలాగో ఇలా ఉంటుందని వాడికి తెలుసు -- నా నోటి తోనే కాదనిపించుకుని ఉమను స్వాధీనం చేసుకోవాలని వాడి ఎత్తు. ఛీ! ఇట్లాంటి నీచుడిని, చిన్నతనం నుంచీ, ప్రాణ స్నేహితుడుగా చూసాను. వీడి కోసం ఏం చేయ్యామన్నా సంతోషంగా భావించాను. నా దురదృష్ట దేవత వీడి రూపంలో నా నెత్తి మీద ఉందని తెలిసి కోలేక పోయాను."
    దుర్గ ఏమీ మాట్లాడలేక పోయింది. ఆమె అంతరాత్మ గిరి ఉత్తముడని గోల పెడ్తుంది. కానీ, చికాకులతో కలత పొంది, తన ప్రణయ వైఫల్యానికి క్షోభించే హరికి, ఆసలు విషయం ఎలా అర్ధమవుతుంది?
    "దుర్గా! సీరియస్ గా చెపుతున్నాను. ఇక మీదట నువ్వా గిరి పేరు ఎత్తినా, వాడిని కలుసుకోటానికి ప్రయత్నించినా, నీకూ, నాకూ ఏం సంబంధ ముండదు. అన్నగా నామీద నీకే మాత్రమైనా గౌరవ ముంటే , ఆ గిరిని పూర్తిగా మర్చిపో! నా కోసం కొద్దీ చెప్పటం లేదు. నీ మేలు కోరి చెపుతున్నాను.'
    దుర్గ లోపలకు పోయి, సోఫాలో కూలబడింది. క్షోభ తో ఆమె హృదయం కుమిలి పోయింది-- తన అశాంతిని భరించలేక ఇక్కడకు వస్తే, ఇక్కడ ఇది!--
    "శంకర్ పై పైకి కసి కొద్దీ ఏదో తనను గురించి అవమానకరంగా మాట్లాడినా, అతని అంతరంగం లో తన మీద ఏ అవిశ్వసమూ లేదు. గిరికీ, తనకూ మధ్య గల అనుబంధం విషయంలో అతడే నాడూ అసహనాన్ని చూపించ లేదు.అన్నయ్య రెండాకు లేక్కువ చదువు కున్నాడు. తనను నిజంగానే అనుమానిస్తున్నాడు. చిన్నతనం నుంచీ తమ ముగ్గురి నడుమ, పెంపొందిన ఆత్మీయత క్షణం లో మరిచిపోయాడు. మొదటి నుంచీ గిరి తన నెంతగా అభిమానించే వాడో తెలిసీ ఈనాడు గిరిని గురించి తేలికగా మాట్లాడ గలిగాడు. ! ఏం మనుష్యులూ? ఎందుకింత త్వరగా అపార్ధాలు పెంచుకుంటారు?
    "ఏం ఆడజన్మ? తానొక మగవాడై ఉంటె, హరి అన్నయ్య తననిలా నిర్భంధించే గలిగేవాడా? స్వార్ధ పరులైన మొగవాళ్ళతో నిండిన, ఈ సభ్య సమాజం లో , ఆడదానిగా జన్మించటం కంటే, సభ్యత అనే మాటకు అర్ధం తెలియని ఆటవిక జాతుల్లో జన్మించటం వేయి రెట్లు నయం."

                                        24
    అ ఉత్తరం చదువుతూనే తల తిరిగి క్రింద పడిపోయింది దుర్గ -- సావిత్రమ్మ ఆవేదన కంతులేదు . ఎంతో అపురూపంగా పెరిగిన దుర్గ దెబ్బ మీద దెబ్బ, సహించ వలసి రావటం ఆ మాతృహృదయం భరించలేక పోతుంది. హరి గాభరా చెప్పక్కరలేదు. ఆందోళన తో అతని మనసు పని చెయ్యటమే మానుకుంది. చికాకుగా వూరికే అటూ, ఇటూ తిరుగుతూ , తల్లి మీద విసుక్కున్నాడు.
    "వూరికే, అలా, ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? కొంచెం కాఫీ పెట్టు లోపలకు వెళ్లి-- నేను దుర్గను మంచం మీద పడుకోబెడతాను." అన్నాడు. సావిత్రమ్మ కంగారుగా వంట గదిలోకి వెళ్ళింది. హరి దుర్గ ముఖం మీద కొంచెం చన్నీళ్ళు జల్లి, రుమాలుతో ముఖం తుడిచాడు. దుర్గ కళ్ళు కొంచెం తెరిచి, వెంటనే నీరసంగా రెప్పలు వాల్చింది -- హరి ఆమెను లేవదీసి మంచం మీద పడుకోబెట్టాడు.
    ఆ ఉత్తరం, కామేశ్వరమ్మ వ్రాయించింది. శంకర్ కు ముందర కొంచెం జ్వరం తగిలి, అది క్రమంగా మశూచికం లోకి దింపిందని-- తల్లి అందించిన కాఫీ త్రాగి దుర్గ "అమ్మా? నా సామానులన్నీ సర్ది పెట్టావా?' అంది నీరసంగా.
    హరీ!సావిత్రమ్మా కూడా గతుక్కు మన్నారు.
    "అంటే?!" అన్నాడు హరి తీక్షణంగా -----
    "తొమ్మిది నెలలూ కూడా నిండాయి. నువ్వక్కడికి ఎలా వెళ్తావమ్మా!' అంది సావిత్రమ్మ ప్రాధేయ పూర్వకంగా.
    దుర్గ దృడంగా , "కాదమ్మా! వెళ్ళాలి." అంది.
    హరి కోపంగా "బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడతావెం? ఇవాళో రేపో ప్రసవించే సమయంలో, రైలు ప్రయాణం చేసి అక్కడకు వెళ్తావా? వెళ్లి మాత్రం నువ్వేం చేయగలవు?' అన్నాడు.
    దుర్గకు ఎక్కడ లేని అవేశమూ వచ్చింది.
    "వెళ్తాను! వెళ్తాను! అక్కడకు వెళ్లి, ఏం చెయ్యలేక పోయినా, సరే! దారిలో చచ్చినా సరే! నువ్వు నేను నీ చెల్లెల్ని కాననుకున్నాసరే! నన్నాయన రానీయక పోయినా సరే! నేనక్కడికి వెళ్ళిపోతాను. నన్నెవరూ ఆపలేరు."
    ఎర్రబారిన కళ్ళతో తడబడే -- అడుగులతో దుర్గ తానె తన పెట్టె దగ్గరకు వెళ్ళింది. సావిత్రమ్మ అడ్డు తగిలి "నువ్వుండు, నేను సర్దుతాను. నన్ను కూడా రమ్మంటావా? నిన్నోక్క దాన్నీ పంపటానికి భయంగా ఉంది.' అంది.
    'అంతకంటేనా అమ్మా! హరిఅన్నయ్య ఏమైనా అంటాడేమో నని కాని."
    "ఇట్లాంటి సమయంలో ఎమంటాడూ?" అని ఆవిడ హరి వంక చూసింది-- హరి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
    వెక్కి వెక్కి ఏడుస్తూ తన గుండెల మీద వాలిపోయిన దుర్గ ను ఆప్యాయంగా నిమిరాడు శంకర్. అతనికి దృడంగా తెలుసు -- తన అస్వస్థత గురించి వింటే, మరణ శయ్య మీద ఉన్నాసరే, దుర్గ లేచి వస్తుందని--
    "మీకు నా మీద నిజంగానే , ఇంత కోపం వచ్చిందా? ఇన్ని రోజుల వరకూ, నా కెందుకు తెలియ పరచడం లేదూ ?" అంది దుర్గ బాధగా.
    "ఇలా ముంచుకు వస్తుందని నేనూ అనుకోలేదు దుర్గా! మామూలు జ్వరమను కున్నాను."
    శంకర్ బాధగా మూలిగాడు. దుర్గ అతని బాధ చూసి సహించలేక పోయింది. నున్నని అతని శరీరం నిండా పెద్ద పెద్ద పొక్కులు సందు లేకుండా వ్యాపించి ఉన్నాయి. జ్వరంతో వళ్ళు పేలిపోతుంది.
    దుర్గ భయంతో వణికింది. తన ప్రవర్తన లో ఏమైనా, లోపముందా? ఆ కారణంగా , భగవంతుడు తననిలా శిక్షింప దలచుకున్నాడా? దుర్గ అర్తయై భగవంతుడి ని మనసులోనే ప్రార్ధించుకుంది. "నాకేంతటి ఘోర శిక్ష ల నైనా ఇయ్యి-- ఎంతటి వేదన నైనా కలుగజెయ్యి-- కానీ, నా మంగల్యాన్ని మాత్రం నాకు దూరం చేయకు. ఇందుకు ప్రతిఫలంగా నా దగ్గర నుండి ఏమైనా తీసుకో! నన్నే తీసుకుపో!'
    దుర్గ కు శంకర్ అస్వస్థత తప్ప ఇంకోటేమీ మనసులో లేదు. భాధతో మూలిగే అతని కంఠస్వరం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. తాను నిండు మనిషి నన్న మాటే మర్చి పోయింది. తనకు కష్టమే కలుగుతుందో, సుఖమే కలుగుతుందో ఆమెకు తెలియటం లేదు. అందరూ వోరగా కాసేపు నిద్ర పోవడానికి కనులు మూయగానే, శంకర్ బాధతో మూలిగి నట్లయి, వెంటనే లేచి శంకర్ దగ్గర కూర్చునేది.
    దుర్గ తపన, శ్రమ ఫలించాయి. మశూచికం తిరుగు ముఖం పట్టింది. శంకర్ మృత్యువు నోటి నుంచి బయట పడ్డాడు-- అందరూ హమ్మయ్యా అనుకున్నారు.
    సరిగా నిద్ర పోకుండా తనదగ్గర కూర్చున్న దుర్గను చూసి శంకర్ "నాకు తగ్గింది కదా! నువ్వు విశ్రాంతి తీసుకో! కాసేపు నిద్రపో!' అన్నాడు--
    "ఫరవాలేదు .' అంది దుర్గ సంతృప్తి గా నిట్టురుస్తూ.
    "ఎందుకు ఫరవాలేదు? నువ్వు శ్రమ పడితే పడ్డావు కానీ, నా పాపను శ్రమ పెడితే వూరుకొను."
    దుర్గ హృదయం పులకించింది. ఇది చాలు-- ధనమక్కరలేదు. హోదా లక్కర్లేదు. ఏమీ అక్కర్లేడు . ఈ మాత్రపు ఆప్యాయత చాలు --
    శంకర్ మశూచి విడిచి పెట్టినా, దాని చాయలు మాత్రం శంకర్ ముఖం మీద నిలిచి పోయింది. అతడు కృంగి పోయాడు.
    "దుర్గా నేనెంతో వికారంగా ఉన్నాను, కదూ!' అన్నాడు.
    ఆ దీన స్వరానికి దుర్గ కడుపు తరుక్కు పోయింది. శంకర్ అతిశయాని కంతకూ , మూలమైన అతని రూపం దెబ్బతింది. ఈ దెబ్బకు శంకర్ తట్టుకోగలడా?
    "ఏం లేదు. ఏవో రెండు మచ్చలు ముఖం మీద ఉంటె మాత్రమేం? మీ కళ్ళలోని తేజస్సు ఎక్కడకు పోతుందీ? నాకిది వరకటి , ఇప్పటికీ ఏం తేడా కనుపించటం లేదు. ఇప్పుడే, ఇంకా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇంకా మనం అదృష్ట వాంతులం, ఏ, కన్నో, కాలో పోకుండా ఇలా బయట పడ్డాం."
    ఈ సమాధానంతో శంకర్ కు కొంత స్వాంతన కలిగింది. "నేను వికారంగా ఉంటె, నన్ను ఇదివరకులా ప్రేమించ గలవా?' శంకర్ మళ్ళీ అడిగాడు. ఈ ప్రశ్న దుర్గ మనసుకు కొంచెం కష్టం కలిగించింది.
    "అంటే, నేను మీ రూపాన్ని చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాననా?"
    ఇది పూర్తిగా అబద్దం కాకపోయినా, నిజం కూడా కాదు. సృష్టి కర్త మానవులకు ప్రసాదించే అపురూపమైన వరాలలో రూపం ఒకటి అని ఒప్పుకుంటాను. స్త్రీ పురుషుల పరస్పరాకర్షణ లో దీనికి ప్రధానమైన స్థానం ఉన్న విషయం కూడా యదార్ధమే! కానీ మనం ఒకరిని ప్రేమించ గలిగినప్పుడు వాళ్ళు అందంగా ఉన్నా, లేకపోయినా, మంచి వాళ్ళయినా, చెడ్డ వాళ్ళయినా, మనసు అభిమానించినా, ద్వేషించినా మన ప్రేమ నాశనం కాదు. అందరి విషయమూ , ఏమో, నా అనుభూతిలోకి వచ్చేది మాత్రం ఇదే!"
    శంకర్ దుర్గ చేతిని ఆప్యాయంగా నొక్కి "నా అదృష్టాన్ని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నాను దుర్గా!' అన్నాడు.
    దుర్గ సంతృప్తిగా నిట్టూర్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS