
ఎవ్వరూ లేకుండా చూసి నెమ్మదిగా "నువ్వేం అలా డల్ గా ఉంటున్నావు ఒంట్లో బాగుండ లేదా" అడిగాడు రామకృష్ణ. తాను వచ్చిన పదిరోజులనుంచీ తానడిగిన ప్రశ్నకు పొడిగా సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతూన్న రాధను ఓ రోజు.
"ఏమీ లేదు..."
"ఏదో ఉంది..."
"... ... ..."
"మాట్లాడవా?"
"... ... ..."
"అబ్బా, విసిగించకు రాధా! నీ ఈ మౌనాన్కి ముభావాన్కీ అర్ధమేమిటి? ఎందుకో అలా ఉంటున్నావు. నాతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు ఏదో జరిగింది."
"ఏమీ జరగలేదు కృష్ణా......నన్నూ, నా ఉనికినీ నేను తెలుసుకున్నాను" పేలవంగా నవ్వింది రాధ.
"నిన్నూ, నీ ఉనికినీ, అన్నీ తెలుసుకునే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను"
"మనిద్దరం స్వతంత్రులం కాము."
"ఎందుకు కాము!"
"నిర్భాగ్యురాలను. దరిద్రురాలను. యింకా అనామకురాలను. నన్ను....నన్ను పెళ్ళి చేసుకుని మీరేం సుఖపడతారు? తల్లీ తండ్రీ మీ బంధువు లందరూ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. నాకేదో భయంగా ఉంది మరెప్పుడూ దయచేసి ఇలాటి ప్రసక్తి తీసుకురాకండి..... ఒక స్నేహితుడిగా ఆప్తుడిగా మాత్రమే నాకు...... నాకు వుండిపొండి' ఆమె కెందుకో కట్టలు తెంచుకు వచ్చింది దుఃఖం.
చీర చెంగుతో కళ్ళువత్తుకుంటూ రోదిస్తూంది రాధ. పరిశీలనగా ఆమెవైపు చూస్తున్నాడు రామకృష్ణ.
కొన్ని క్షణాలు మౌణంగా దొర్లిపోయాయ్.
"నేను వెళ్ళాక నీ కెవరన్నా. నాతో చనువు ప్రదర్శించవద్దని హెచ్చరించారా?" అన్నాడు రామకృష్ణ.
ఒక్కసారి అతనివైపు చూసి. వాసూరావ్ తననన్న ప్రతిమాటా చెప్పింది రాధ. యింకా విశ్వనాధన్ తనకు దగ్గరవబోతూన్నట్టు అనుమానిస్తున్నానని కూడా చెప్పింది.
రామకృష్ణ వదనం ఒక్కసారి కోపంతో ఎరుపెక్కింది, మళ్ళీ కొన్ని నిమిషాల మౌనం తర్వాత "నీ వయస్సెంత రాధా?" అడిగాడు తను.
"పదహారు నిండాయి."
"శ్రీనివాసయ్యరుగారు నీ కేదన్నా సంబంధం చూసి పెళ్ళి చేస్తే చేసుకుంటావా? అడిగాడు రామకృష్ణ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
తల అడ్డంగా ఊపింది రాధ.
"మరి" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
"పరీక్ష ప్యాసాయి ఏదన్నా ఉద్యోగం చేసి నన్ను నేను పోషించుకుంటాను."
"తర్వాత?"
"ఆయువు చెల్లితే అందరిలాగే బుగ్గయి పోతాను సరా!" మళ్ళీ ఆమె కళ్ళు వర్షించాయి.
"పిచ్చి రాధా. ఏడవకు ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎవరడ్డంగా నిలిచినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను." అంటూ చొరవగా ఆమె కన్నీరొత్తాడు. రామకృష్ణ.
* * *
"వాసూ! రాధకు నువ్వేమైనా జాగ్రత్తలు చెప్పావా? అంత రిజర్వుగా వుంటోంది". నవ్వబోతూ అడిగాడు రామకృష్ణ.
"చెప్పాను. ఏం?"
"నన్నొక ఫూల్ గా. స్కౌండ్రల్ గా, భావిస్తున్నావన్నమాట."
"నిష్ఠూరాలాడకు భాయ్. మాఇంటి ఆడపిల్లకు మేం పెట్టవలసిన అదుపులు మేం పెట్టడం మా బాధ్యత కాదా! ఇప్పటికే రాధ జీవితం రకరకాలుగా నలిగిపోయింది కృష్ణా.... అమ్మ తన కూతురుగా భావిస్తున్న ఆ పిల్ల నాకు చెల్లెలు. రాధ కోసం రాధ సౌఖ్యమైన జీవితం గడపటాన్కి ఏమైనా చేస్తాను." ఆవేశంగా అంటూన్న వాసూ రావ్ ముందుకి చెయ్యి దాచుతూ" "అలా దైవసాక్షిగా హృదయపూర్వకంగా మాట ఇయ్యి" అన్నాడు రామకృష్ణ. అతని మాట కడ్డువస్తూ.
రామకృష్ణ చెయ్యి మృదువుగా పట్టివదుల్తూ.....గాలిలో మేడలు కట్టబోతున్న రాధను మందలించాను కృష్ణా! నువ్వు నిజంగా పెద్ధల్నెదిరించి కట్నం కానుకలూ వదిలీ ఉదారంగా రాధను భార్యను చేసుకుంటే అభినందించాల్సిందే. కాని.......
"కాని.....లేధ. ఏం లేదు. ఇవాళని కాదు. ఏరాడన్నా రాదనే భార్యగా చేసుకుంటాను. లేకపోతే ఇలాగే ఉండిపోతాను."
"హబ్బో.....అంత ముదిరిందన్నమాట పాకం బాబూ జాగ్రత్తరా! పెళ్ళికాకుండా ..." వ్యంగ్యంగా నవ్వాడు వాసూరావ్.
"ఛఛ. ఇన్నాళ్ళ స్నేహములో ఇదా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది!"
"అందరి ఆడపిల్లల ముందూ బుద్దిమంతుడిలా తల వాల్చేస్తావు కాని.....రాధ"
"రాధ దగ్గర అంతకన్నా బుద్ద్గిగా మసులుకుంటాను సరా?"
అంతలో శ్రీనివాసయ్యరు పిలవడంతో వెళ్ళి పోయాడు వాసూరావ్.
* * *
పార్వతికి జ్వరం తిరగబెట్టింది. కంగారుగా పెద్ద డాక్టర్ని తీసుకువచ్చారు శ్రీనివాసయ్యరు.
ఎవ్వరి వైద్యాన్కీ లొంగని జ్వరం పార్వతిని బలి తీసుకుంది. ఆ ఇల్లే శ్మశానవాటికలా అయి పోయిందా రోజు మతి చలించినవాడిలా తిరిగారు శ్రీనివాసయ్యరు. మూగగా రోదిస్తున్నా రామెకొడుకులు, పార్వతి కళేబరం పైబడి కళ్ళు వాచిపోయేలా హృదయం పగిలిపోతూంటే ఏడుస్తూంది రాధ.
అందర్నీ ఓదార్చి మిత్రుడిగా. ఆప్తుడిగా ఆదుకున్నాడారోజు. రామకృష్ణ.
మర్నాటి కంతా బంధువులు చేరారు. "అమ్మా రాధా.....మీ కక్కి వెళ్ళిపోయింది......బంధువు లంతా వచ్చారు. వారికేం తెలియదుగదా మనింటి పనులు ఇక్కడే వస్తువులున్నాయో అందరికీ మర్యాదలు..... తింటే భోజనం, కాఫీ వగైరా చూడు" అన్నాడతను. అతని వదనం గంభీరంగా వుంది.
"బాబయ్యా!" బోరున ఏడ్చింది రాధ.
"ఏడిస్తే తిరిగివస్తుందా? తల్లీ. నేను జీవించి ఉన్నంతవరకూ నా రక్షణలో నీకేం భయంలేదు. నిన్నో ఇంటిదాన్ని చేసి .....పార్వతి ఆత్మకు తృప్తి కలిగిస్తాను." అంటూ రధ తల గుండెల కదుముకు ఓదార్చారు. శ్రీనివాసయ్యరు.
చురుగ్గా, తెలివిగా ఇంటి పనులు చేస్తూ పరీక్ష రాసిన రాధ తెలివికి మెచ్చుకున్నారు శ్రీనివాసయ్యరు. రాధ పట్ల ఏదో అభిమానం చూపిస్తూ ఆమెతో చనువు ప్రదర్శించే విశ్వనాధన్ ప్రవర్తన గ్రహించిన శ్రీనివాసయ్యరు తన గదికి ఏకాంతంగా కొడుకుని పిలచి అడిగారు నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం!" అని.
మౌనంగా ఉండిపోయాడు విశ్వనాధన్.
"మీ అమ్మపోయి ఆరునెలలు కావస్తూంది. ఇంటికి ఆడ దక్షత కావాలి"
"రాధ ఉందిగా! అతని మాట కడ్డువస్తూ అన్నాడు విశ్వనాధన్.
"ఎన్నాళ్లుంటుంది రాధ, తనకు మాత్రం పెళ్ళిచేసి అత్తఃగారింటికి పంపించవద్దూ?' కొడుకు మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాసయ్యరు.
మౌనంగా ఉండిపోయాడు విశ్వనాధన్.
"మీ అమ్మ పోయిన తర్వాత నేనూ పోయినట్టే లెక్క! ఇంక ఇల్లూ, హోటలూ అన్ని వ్యవహారాలూ నువ్వే చూసుకోవాలి నాకు మతి సరిగ్గా ఉండడం లేదు"
అప్పటికీ మౌనమే సమాధానం.
"సమ్మంధాలున్నాయి రేపు వెళ్ళి చూసి వద్దామా?"
"వద్దు నాన్నా?"
"పోనీ నువ్వెవరినన్నా చేసుకుందామనుకుంటున్నావా?" చెప్పు నాకు జాతి, మతం, సంప్రదాయం ఇలాంటి పట్టింపులు లేవు. ఈ ఇంటి కోడలుగా వచ్చే పిల్ల సుగుణ వతియై ఉండాలి. అంతే."
ఇంకా తలవంచి సిగ్గు పడ్తూన్న విశ్వనాధన్ వైపు చిరునవ్వుతో చూస్తూ "పోనీ రాదనే మన ఇంట్లో ఉంచేసుకుందామా?" అని అడిగారు.
"అలా చెయ్యండి నాన్నా? అని మరి నిలవకుండా వెళ్ళిపోయాడు విశ్వనాధన్.
రాధ.....అందమైన తెలివైన మంచిపిల్ల. రాధ కోడలైతే తన జీవితం తన వార్ధక్యం నిశ్చింతగా వెళ్ళిపోతుంది. గుండెల నిండుగా హాయిగా గాలి పీల్చుకున్నారు. రాధ ఆ ఇంటి కోడలౌతుందని ఊహల్లో శ్రీనివాసయ్యరు.
* * *
ఆ రోజు కొడుకులిద్దరూ భోజనం చేసి వెళ్ళే దాకా. తాను డైనింగ్ రూమ్ కు హాజరుకాలేదు శ్రీనివాసయ్యరు.
"ఏం బాబయ్యా ఇవ్వాళ ఇంతాలస్యంగా వచ్చారు భోజనానికి ఇలా అయితే ఆరోగ్యం పాదవదూ" అంది రాధ టేబుల్ మీద ప్లేటుంచి అన్నం పెడుతూ.
"నా ఆరోగ్యం పాడయి తొందరగా ఈ ప్రపంచాన్ని దాటి పోవాలనుందమ్మా! అతని గొంతులో ఆవేదనా వీచికలు.
"బాబయ్యా!" అలా నిస్పృహ చెందకండి బాబయ్యా మేమంతా ఏం కావాలి! .... మీరూ లేక పోతే....నేనెలా బ్రతకాలి!" దుఃఖపూరిత కంఠంతో అంది రాధ.
గబగబా నాలుగు మెతుకులు కెలికి భోజన మైందనిపించి లేచి ఎళ్తూ రాధా, ఓ సారి నా గదికి రామ్మా నీతో కొంచెం మాట్లాడాలి" అన్నారు శ్రీనివాసయ్యరు.
గబగబా వంట ఇంటి పనులు ముగించి శ్రీనివాసయ్యారు గదికి వెళ్తూన్న రాధ గుండె లెందుకనో దడదడ లాడాయి.
"రామ్మా ఇలా కూర్చో" చిరునవ్వుతో పలకరించారు శ్రీనివాసయ్యరు.
బిడియంగా అతని ఎదురుగా కూర్చుంది రాధ.
"మీ కక్కి పోయిన దగ్గర నుంచి నువ్వు చాలా శ్రమపడుతున్నావమ్మా.... నీపై పెద్ద బాధ్యత పెట్టాననిపిస్తూంది...." అన్నారామె వైపు పరిశీలనగా చూస్తూ శ్రీనివాసయ్యరు. అతన్కి రాధ బాగా చిక్కినట్టు కనిపిస్తూంది.
"కక్కి పోయిందనే బాధకన్నా..... ఇంకే శ్రమలూ నన్ను బాధించవు బాబయ్యా..... నేను మీ అందరికీ కక్కిలా సక్రమంగా భోజన సదుపాయాలూ సమకూర్చలేకపోతున్నానేమో! ఆమెలేని లోటుమరి పూరింపబడదు....
అందుకనే.... అందునే ఈ ఇంటి కోడలు అంటే విశ్వనాధన్ కు పెళ్ళిచేయాలనుకుంటున్నాను.
అలా చెయ్యండి బాబయ్యా, తొందరగా, సంతోషంగా అంది రాధ.
"ఈ ఇల్లు చక్కదిద్ది ఈ ఇంటి మర్యాదలు, పరువు ప్రతిష్టలూ అర్ధం చేసుకుని మెసలగలిగే అమ్మాయి రావాలిగా!....."
మౌనంగా తల వాల్చింది రాధ. అవును అదీ సమస్యే మరి అనుకుంటూ
'నేనొక మాట అడుగుతాను నువ్వు మరే సంకోచం మొహమాటం భయం లేకుండా నీ మనస్సులోని ఉద్దేశ్యం చెప్పాలి అలా చెప్పగలవా" అడిగారు శ్రీనివాసయ్యరు. అతని గొంతు గంభీరంగా ధ్వనించింది.
"అడగండి బాబయ్యా?" కృతజ్ఞతా పూర్వకంగా అతనివైపు చూస్తూంది రాధ. ఏమిటో ఆయన అడగబోయేది అనే కలవరపాటు అణచుకుంటూ.
