Next Page 
విధి విన్యాసాలు  పేజి 1

 

                                         విధి విన్యాసాలు

                                                                                   కావిలిపాటి విజయలక్ష్మీ

                       

    ఎవరైనా జీవితంలో ఏమైనా కావచ్చు. ప్రతిభ, ముఖ్యంగా పట్టుదల ఉండి, ఏకగ్రమైన లక్ష్యంతో కృషి చేయడం వల్ల ఏమైనా సాధించవచ్చు. అంగబలమూ, ఆర్ధిక బలమూ లేని వారు ఆకాశం లోకి చూస్తె ఉట్టి కేగరలేని వాడు అంటారు. 'కండక్టర్ కొడుకు కలెక్టరవుతాడా!" అని అవహేళన చేస్తారు. భరించడం కష్టం అవుతుంది.
    కండక్టర్ కొడుకు కలెక్టరవుతాడా?'
    రాజశేఖరం గలగలా నవ్వు !
    చివాల్న తలెత్తి చురుగ్గా అతని వైపు చూసింది మధుమతి.
    కండక్టరు ఎంత హీనంగా కనిపిస్తున్నాడీ రోజు! ఓనాడు ఇతన్ని మందలించి విద్య చెప్పిన గురువా కండక్టరు కాడా? ఇతను చేసేఅల్లరి పనులు కప్పి పుచ్చి తండ్రి చేత తన్నులు తప్పించిన వాడా కండక్టరు కాడా? ఆమె పళ్ళు కరకర లాడాయి. నాన్నగారు చదివించను పొమ్మంటే , 'రాజూ నే చదివిస్తాలేవోయ్' అంటూ అభయమిచ్చి చదివించిన ఆయన్ని.... కండక్టరని ఎంత తేలిగ్గా అవమానపరుస్తూన్నాడు!
    ఆమె రోషారుణిత లోచనాల్లో నీటి తెరలు మెరిశాయి. విసురుగా లేచి చీత్కారంగా రాజశేఖరం వైపాక్కసారి చూసి వెళ్ళిపోయింది తన గదికి.

                          *    *    *    *
    రాత్రి పది దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాలేజీ లో చదవాలనే తన వాంఛ , ఆశ కూలిపోగా నిస్సహాయంగా, దీనంగా తనలో తనే విలపించిన వాసు టక్కున ఏదో స్పురించినట్టు లేచి మధుమతి మంచం వైపు నడిచాడు.
    'అమ్మా! నిద్రపోతున్నావా?' తట్టి పిలిచాడు వాసు.
    వత్తిగిలి , ఉబ్బిన కనురెప్ప లెత్తి కొడుకు వైపు జాలిగా చూస్తూ, "ఏం బాబూ, ఇంకా నిద్ర పోలేదా?' అని ఎదురు ప్రశ్న వేసింది మధుమతి.
    నెమ్మదిగా ఆమె పక్కలో కూర్చుంటూ, "నిద్ర పట్టడం లేదమ్మా!" అని సంకోచిస్తూ రెండు క్షణాల తరువాత, 'అమ్మా! నాన్న బస్ కండక్టరు గా పని చేస్తున్నారా?' అన్నాడు.
    త్రుళ్ళి పడింది ఒక్కసారి మధుమతి. కంగారుగా వాసు వైపు చూసి మౌనంగా తల తిప్పుకుంది.
    "ఏమమ్మా! చెప్పవా?" అతని గొంతు దీనంగా ఉంది.
    దీర్ఘంగా నిట్టూర్చి "ఇందులో చెప్పకపోవడానికి దాచడానికి ఏముంది బాబూ? అవును" అంది నిర్లిప్తంగా నవ్వుతూ.
    "ఎక్కడున్నారిప్పుడు?' ఆత్రంగా అడిగాడు వాసు.
    "నాకు తెలియదు, బాబూ!" ఆమె గొంతు వణికింది.
    కొన్ని క్షణాలిద్దరి మధ్యా మౌనంగా దొర్లాయి.
    "గవర్నమెంటు ఉద్యోగానికి వయసు చాలదు. నాకేమో చదువుకోవాలని ఉంది. డబ్బు లేదు. చదివించే వాళ్ళు లేరు. ఏం చేసేదమ్మా!" దుఃఖంతో గొంతు జీరబోతుంటే అన్నాడు వాసు.
    రెండు చేతులతో గట్టిగా కళ్ళు మూసుకుంది మధుమతి. ఐదు నిమిషాల తరవాత ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి కూర్చుని "ఛఛ! ఏడుస్తున్నావా? ఏదీ నా వైపు చూడు" అంటూ అతని వదనం తన వైపు తిప్పుకుని, చీర చెరగు తో అతని కన్నీళ్ళు వత్తుతూ , "చార్జీ లిస్తాను, చిన్న మామ్మయ్య దగ్గరి కెళ్ళు ఏం చేయ్యమంటాడో!" అని అర్ద్రమైన గొంతుతో నెమ్మదిగా అంది మధుమతి.

                           *    *    *    *
    "ఏం రోయ్ ఇలా వచ్చావ్? పాసయ్యావటగా? ఎలా వచ్చాయి మార్కులు? అంతా బాగున్నారా?' ఆప్యాయంగా వాసు భుజం పై చరుస్తూ అడిగాడు గోపాల్రావు.
    "ఐదు వందల పైన మార్కులు వచ్చాయి. అమ్మ వెళ్ళమంది నీ దగ్గరికి. "వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడ్డు వస్తున్న అభిమానాన్ని చీల్చుకుంటూ అన్నాడు వాసు.
    "వెరీ గుడ్! ఇంకేం , తెలివైన వాడవే!"
    "స్కాలర్ షిప్ ఇస్తారట." ఆశగా అతని వైపు చూస్తూ అన్నాడు వాసు.
    "సరేలే. తరువాత ఆలోచిద్దాం. స్నానం చేసి భోజనం చెయ్యి. లక్ష్మీ! వాసోచ్చాడు , చూశావా?' అని పిలిచాడు భార్యని గోపాల్రావు.
    ఆదరంగా కుశల ప్రశ్నలు వేసింది లక్ష్మీ.
    అన్యమనస్కంగా స్నానం , భోజనం అయాయనిపించాడు వాసు. గమ్యం తోచని అతని లేత మనస్సు పెనుగాలికి లతలా ఊగిసలాడుతుంది. ఎందరో కాలేజీ కి వెళ్ళబోతూన్న తన సహద్యాయులు గుర్తు వచ్చారు. 'వాళ్ళంతా అదృష్ట వంతులు. తానో? తండ్రీ, డబ్బూ కరువై ఇతరుల పంచన కాలం వెళ్ళ బుచ్చె నిర్భాగ్యుడు.' అతని గుండెలు పిండి నట్లయింది. కళ్ళ నిండుగా నీరు కమ్మింది.
    "ఎవరమ్మా ఆ అబ్బాయి?" సన్నని గొంతు ఆ పక్క గదిలోంచి వినిపించి, గబగబా కళ్ళు తుడుచుకుని ఆ ప్రశ్నకు వచ్చే జవాబు వినాలని చెవులు రిక్కించాడు వాసు.
    "మరిచిపోయి ఉంటావు -- అత్తయ్య కొడుకు. వాసు. "లక్ష్మీ గొంతు.
    "ఎందుకోచ్చాడు?" మళ్ళీ మొదటి సన్నని మృదువైన గొంతు.
    "తప్పు , అలా అడక్కూడదు . నెమ్మది , విని పోతాడు. ఏం, రాకూడదా? వాళ్ళ మామ్మయ్య ఇంటి కొచ్చాడు" అంది లక్ష్మీ.
    తేలిగ్గా నిట్టూర్చాడు వాసు.

                           *    *    *    *
    రాత్రి పిల్లలు నిద్రపోయేక తన గదికి పిలిచి అడిగాడు గోపాల్రావు , తన పక్కలో కూర్చోమని చోటు చూపిస్తూ -- "నువ్వు పాసైనట్టు తెలిశాక అమ్మా, అమ్మమ్మా ఏమిటన్నారు? పెద్ద మామయ్య ఏమిటన్నాడూ?' అని.
    నవ్వబోతున్న మొహంలో చొప్పున విషాదరేఖ అలుముకోక మౌనంగా తల వంచుకున్నాడు వాసు.
    మళ్ళీ వెంటనే వెనుదిరిగి తన పక్కలో కూర్చున్న వాసు భుజం పై హాస్యంగా చరుస్తూ, "ఏం రా! కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చేస్తాడేమో-- చదివిస్తా ననలేదూ?' అన్నాడు చిన్నగా నవ్వుతూ గోపాల్రావు.
    "బాగుంది హాస్యం! ఆ అబ్బాయి ఎలా చిన్న బుచ్చుకున్నాడో గమనించారా? చదివించాలి కాని ఎవరికి లేరు అమ్మాయిలూ?' మందలింపుగా అంది లక్ష్మీ.
    'అమ్మా ఏమీ అనలేదు. అమ్మమ్మ నన్ను కాలేజీలో జాయిను చెయ్యమని పెద్ద మామయ్య నడిగింది. 'కండక్టరు కొడుకు కలెక్టర్ అవుతాడా?' అంటూ హేళనగా నవ్వాడు. కాలేజీ లో చదవడానికి కండక్టరు కొడుకు అర్హుడు కాదు కాబోలు , అతని దృష్టి లో. అలాంటి వాడు....ఒక ఆఫీసరు కి .....అయినా అలాటి షరతులకి నేనసలు ఒప్పుకోను. నే నలా అమ్ముడు పోను, మామయ్యా! అలా చదవలేను కూడా!" చిన్నగా కంపించిందా గొంతు.
    "అబ్బో! ఇంకేం? ఇంకా చిన్న అబ్బాయి ననుకుంటున్నాను. కాని, ఒరేయ్ , వాసూ, కాలేజీ , కుర్రాడి లక్షణాలు చాలా వచ్చేశాయ్ రా నీకు!" నవ్వేశాడు వాత్సల్యంగా , జాలిగా వాసు వైపు చూస్తూ గోపాల్రావు.
    అతని నవ్వు, హాస్యం వాసు సున్నిత హృదయాన్నో విధంగా గాయపరిచాయేమో! చివాల్న లేచి నిలుచున్నాడు.
    "రా, కూర్చో. మామయ్యా ను కదా మరి!! ఆ మాత్రం హాస్యం చెయ్యకుండా ఎలా మాట్లాడను, చెప్పు?" టక్కున వాసు చెయ్యి పట్టుకుని మళ్ళీ పక్కలో కూర్చో పెట్టుకున్నాడు గోపాల్రావు.
    రెండు క్షణాల నిశ్శబ్దం తరవాత, "నువ్వన్నట్టు నేనూ ఒక అఫీసర్నే కాని, ఈ మహాపట్నం లో చాలీ చాలని బ్రతుకై పోతుంది మరి. నీలాటి తెలివైన కుర్రాడు డబ్బూ దక్షతా లేక ఈ స్కూలు ఫైనలు తో ఆగి గుమస్తా గా , చిన్న స్కూలు మాస్టారుగా జీవితం ఈడుస్తాడంటే సహించను లేను. వసతీ, భోజనం వగైరా నేనిస్తాను. ఒక్క ఫీజు మాత్రం పెద్ద మామయ్య కడతాడేమో అమ్మను అడగమను. ఏం? ఏమంటావ్?' అన్నాడు నిదానంగా అలోచించి ఓ నిశ్చయానికి కొచ్చిన గోపాల్రావు.
    రెండు మూడు సార్లు ఏమో మాట్లాడ బోతూన్నట్టు వాసు పెదవులు కదిలాయి. కాని మౌనంగానే ఉండిపోయాడు.
    "ఏం? అలా చెయ్యి..... రేపే వెళ్ళిరా. మళ్ళీ సీటు దొరకడం కష్టం. అలా అతను ఒప్పుకుంటే కాలేజీ లో సీటుకు అప్లై చేద్దాం" అన్నాడు గోపాల్రావు వాసు వైపు పరిశీలనగా చూస్తూ.
    "మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసా మామయ్యా. నీకు?' అని అడిగాడు వాసు.
    ఒక్కసారి తెల్లబోయినట్టయి , మళ్ళీ చిన్నగా నవ్వుతూ, "చాలాకాలం క్రితం ఓసారి విశాఖ లో మిలాప్ హోటలు దగ్గర కనిపించాడు. అతనే నన్ను పోల్చాడు లే. నేనతన్ని గుర్తుపట్టలేక పోయాను. అదివరకు బస్సులో కండక్టరు గా తిరిగేవాడుట. కాని ఏదో బిజినెస్ చేస్తున్నాడట ఎవరితోనో జాయింటు గా.  లక్ష్మీ, నా లెదర్ బాగ్ ఇలా తీసుకురా. నేనడక్క పోయినా అడ్రసిచ్చి వెళ్ళాడు." అంటూ లేచి కూర్చున్నాడు గోపాల్రావు.
    బాగ్ తెరిచి అందులో భద్రపరిచిన కాగితాలు ఒక్కోటి చూస్తూ, 'అంత అవసరమేమిట్రా , మీ నాన్న అడ్రసు?" అన్నాడు గోపాల్రావు నవ్వుతూ.
    "వద్దు . వెతుక్కులే మామయ్యా. ఇప్పటివరకూ మా నాన్నంటూ ఒకాయన ఉన్నట్టే నా దగ్గర మీరెవరూ అనలేదు. ఎప్పుడో నాన్న పోయారు కదా బొట్టెందుకు పెట్టుకున్నావని అమాయకంగా అమ్మ నడిగాను. చావ బాదేసింది. పోనీ, చెప్పిందా ఫలానా చోట ఉన్నారని? నాన్న అనే మాట ఉచ్చరించవద్దని కొట్టింది. బస్. ఆనాటి కీనాడు మళ్ళీ తెలుసుకోవా లనిపించింది.' అతని గొంతు రుద్డం కాగా మౌనంగా తల వాల్చాడు.
    "ఇదిగోరా , అడ్రసు. చూడు.'
    గోపాల్రావు చేతిలో ఉన్న చిన్న చీటీ ఆత్రంగా లాక్కున్నట్టు తీసుకున్నాడు వాసు.
    "మహా గొప్ప నాన్నలే. ఏనాడో మరిచి పోయాం అతనొక మనిషీ, మమతా ఉన్నవాడు కాడని. పోనీలే , ఆ భోగట్టా లెందుకు? ఉదయం ట్రెయిన్ లో వెళ్ళి కనుక్కుని రా. తొందరగా రా" అన్నాడు గోపాల్రావు.
    అడ్రసు కాగితం జేబులో పెట్టుకుని తనకని నిర్ణయించిన పక్క మీద పడుకున్నాడు వాసు.
    ఎదోచేయ్యాలని మనస్సుకు తోచింది. గుండె దడదడ లాడింది. మేను కంపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. చాలా రాత్రి తరువాత మగత నిద్రలో కమ్మని కలలు కన్నాడు. ఆ కలల నిండుగా మేడలూ, డబ్బూ, కాలేజీ , పుస్తకాలూ.

                                                  *    *    *    *


Next Page 

WRITERS
PUBLICATIONS