చివాలున కంచందగ్గర నుంచి లేచి వెళ్ళి పోయింది రాధ.
"అలానే చేసెయ్యండి" అంటూ తలెత్తి పార్వతివైపు చూడబోయిన్ రామకృష్ణ కు అన్నం వదిలి వెళ్ళిపోతూన్న రాధ కనుపించి అతని వదనం చిన్నబోయింది.
"అప్పుడే వాడు నీ మెళ్ళో తాళి కట్టెయ్యలేదులే. అంత అదృష్టం పట్టాలి గదా! రా....భోజనం చెయ్యి" తీవ్రంగా మందలించాడు వాసూరావ్.
ఆ సంభాషణ ఇష్టంలేని విశ్వనాధన్ చిరాగ్గా "ఎందుకమ్మా! పదహారేళ్ళు నిండలేదు దానికి పెళ్ళేమిటి అన్నాడు.
తడికళ్ళు వత్తుకుంటూన్న రాధవైపు జాలిగా చూస్తూ "ఎందుకు వాసూ అంతలా గసిరావ్. పెళ్ళంటే రామకృష్ణ మొగుడంటే సిగ్గొచ్చే సింది. దాని సిగ్గు రామకృష్ణ చూస్తాడని, వెళ్ళి పోయింది ఏమే రాధా...." రాధ తలనిమిరిఆమెను మళ్ళీ కంచం ముందు కూర్చోబెట్టి. రాధ తలమీద ముద్దు పెట్టుకుంది పార్వతి, ఆమె కళ్ళెందుకనో చప్పున చెమ్మగిల్లాయి,
"మా అమ్మకి రాధంటే గారం" అన్నాడు వాసూరావ్.
"ఆడపిల్ల కదూ!" అన్నాడు విశ్వనాధన్.
"మీలో ఒక్కరు ఆడపిల్లై పోరాదూ? అంబ పురుషత్వం తెచ్చుకున్నట్టు" అంది పార్వతి నవ్వుతూ.
అందరూ నవ్వారామె మాటకు. చిన్నగా నవ్వుతూన్న రాధవైపొక్కసారి చూసి చూపులు తిప్పుకున్నాడు రామకృష్ణ.
"నాన్నగారుంటే గప్ చిప్ గా కామ్ గా భోజనాలయిపోతాయ్. ఆయన పంక్తిన లేకపోతే అలకలూ, లేచిపోడాలూ, అంటూ రాధ తలమీద చిన్నగా మొట్టాడు వాసూరావ్.
"బాబయ్యుంటే నువ్వలా నన్ను కసరగల వేమిటి?" అంది రాధ.
"అబ్బా దానితో నీకేమిటిరా వాసూ? లేమ్మా చెయ్యి కడిగేసుకో" అంది పార్వతి.
* * *
కిటికీ ఊచలు పట్టుకు ఎటో శూన్యంలోకి చూస్తున్న రాధ.
"రాధా! అన్న మృదు గంభీరమైన గొంతువిని ఉలికి పాటుగా వెనుదిరిగి చూసింది.
రామకృష్ణ - ఆమె గదిలోకి నెమ్మదిగా బరువుగా అడుగులు వేస్తూ వస్తున్న రామకృష్ణ.
"ఏం అలా ఉన్నారు? వంట్లో బాగుండలేదా" కలవరపాటుగా ప్రశ్నించింది రాధ.
"బాగానే వుంది కాని అలా కూర్చుని మాట్లాడు. మధ్యాహ్నం భోజనాల దగ్గర మీ పార్వతి కక్కి అలా అనేసరికి ఎందుకు అన్నం వదిలి లేచిపోయావ్.......అని అడిగాడు.
బాగుంది. ఫెడీమని..... ఒక్కసారి.....నువ్వు రాధను పెళ్ళాడ్తావా? ఏమిటా అడగడం. మీరూ నేనూ ఓ దగ్గర ఉన్నప్పుడు అలా అడగొచ్చా?" ఎదురు ప్రశ్న వేసింది.
"నీ కిష్టంకాదా?"
"కాదు."
"సరే.....వెళ్తాను....మరి ఈ ఇంటికి రాను. నీకు కనిపించను," చివాలున వెనుదిరిగి వెళ్ళబోతూన్న రామకృష్ణ "ఏమండీ కృష్ణగారూ!" కంపించే రాధగొంతు విని వెనుతిరిగి రాధవైపు చూశాడు.
రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత, "మీరు నా కోసం వస్తున్నారా?" సూటిగా ప్రశ్నించింది రాధ.
"చెప్పలేను... అని తల వాల్చాడతను.
"తల్లీ తండ్రీ ఎవ్వరూ దిక్కులేని దాన్ని. ఒకరి పంచన రోజులు వెళ్ళబుచ్చే పేదరాల్ని నేను. మీరు....మీరు....ధనికులు. తల్లితండ్రులకు ఒక్కగానొక్క బిడ్డమీరు, మీపై కోటి కోర్కెలు పెంచుకుని ఉంటారు వారు..."
"అవన్నీ అనవసరం..... నేను..... నేనంటే నీకు ఇష్టంకాదా!
అలా ప్రశ్నిస్తున్న అతనివైపు తేరిపార చూసింది తెల్లబోయి ఆశ్చర్యంగా.
నేను అంత అత్యాశకు పోవడం భావ్యం కాదేమో!" అందామె.
నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నేను వచ్చే వేళకు ఎందుకు ఎదురు చూస్తూంటావ్? నేను ఇంకా కొంత కాలం నీ సమక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావ్? నాకు అందంగా కన్పించాలనీ నన్ను మెప్పించాలనీ నువ్వు ప్రతిక్షణం తాపత్రయ పడుతున్నావ్. నేనొక రోజు కన్పించకపోతే నిష్ఠూరాలాడుతున్నావ్? ఇవన్నీ ఏమిటి రాధా? నువ్వు నన్ను కోరుకోవడం లేదూ?,........ నీకు తెలియదు. నీ మనసు నువ్వు తెలుసుకునే వయస్సు నీకింకా రాలేదు, అని ఒక్కక్షణం ఆమెవైపు చూసి, మళ్ళీ చదువులో ప్రవేశించబోతున్నాను. ఏ విశాఖపట్నమో పోతాను-" అన్నాడు రామకృష్ణ.
"మీకు చదివే చదువు ఈ ఊళ్ళో లేదా?" అప్రయత్నంగా ప్రశ్నించింది రాధ.
అతని వదనంలో క్రమ్ముకున్న విషాద మేఘాలు చప్పున విడిపోయాయ్. పెదవులపై హాసరేఖ విసిరింది. "ఉంది. రీసెర్చి చెయ్యాలని. ఈ ఊర్లోనే ఉండిపొమ్మన్నావా?" అడిగాడు.
"అలవాటైన ఊరు వదిలి ఎటో వెళ్ళిపోవడ మెందుకని?"
"సరే...... ఇక్కడే వుండిపోతాను."
"థాంక్సు" తేలిగ్గా ఊపిరి వదిలిందామె.
"ఎందుకనో!" కొంటెగా ఆమెవైపు చూశాడతను.
"ఏమో నాకు తెలియదు బాబూ" అంటూ గదిలోంచి వెళ్ళబోతూన్న ఆమెకు చేతులాడ్డంగా చాచి, 'అలా తప్పించుకుపోవడానికి వీల్లేదు, చెప్పాలి' అన్నాడు రామకృష్ణ కొంటెగా ఆమె వైపు చూస్తూ.
"చెప్పకపోతే ఏం చేస్తారేం?"
నీ మెళ్ళో తాళికట్టి తర్వాతేమన్నా చేస్తాను....."
"అబ్బా పొండి.....దారియ్యండి."
"నేను వెళ్ళిపోతానంటే..నీకేమనిపించింది? చెప్పు."
"అబ్బా. ఏమీ అనిపించలేదు, ప్లీజ్ వెళ్ళనివ్వండి. మనం ఇలా మాట్లాడుకోవడమ ఎవరన్నా చూస్తారు..."
"చూడకపోతే?"
"ఫరవాలేదు...."
"రా..... వాసూ వెళ్ళిపోతావేం?" అంటూన్న రాధ మాటకు ఉలికిపాటుగా వరండాలోకి చూశాడు రామకృష్ణ.
అతన్ని తప్పించుకు గబగబా వెళ్ళిపోయింది రాధ. నవ్వుకున్నాడు రామకష్ణ.
* * *
"వాసూ! నీ ఫ్రెండ్ ఊళ్ళో లేరా!" సంకోచంగా అడిగింది రాధ.
వీధిలోకి వెళ్ళబోతూన్న వాసూరావ్. "ప్చ్...నీతో చెప్పడం మరచిపోయాను. వాళ్ళ తాత గారికి సుస్తీగా ఉందట. వెళ్ళాడు అంటూ వెళ్ళి పోయాడతను.
"బామ్మ...... తాత..... బాగుంది. చదువు ఉద్యోగం సాగినట్టే" గొణిగింది రాధ.
స్కూలు ఫైనలు పరీక్షలు వ్రాసింది రాధ.
వేసవి సెలవులిచ్చారు. రామకృష్ణ వెళ్ళి నెల రోజులు దాటిపోయింది.
ఓ రోజు మధ్యాహ్నం వేళ పత్రిక తిరగవేస్తూన్న వాసూరావ్ దగ్గరకొచ్చి ఏవేవో మాట్లాడి "రామకృష్ణ నీకు లెటర్సు వ్రాస్తున్నారా?" అని అడిగింది రాధ.
"అస లతని గురించి అడగాలని నా గది కొచ్చావు., ఏవేవో అర్ధం లేకుండా మాట్లాడేవు అవునా?" చిలిపిగా నవ్వాడు వాసూరావ్.
"ఏం అడిగితే...... అతని గురించి అడిగితే తప్పా?" ఉదాసీనంగా మారిపోయింది రాధ.
కొన్ని క్షణాలిద్ధరిమధ్యా మౌనంగా దొర్లాయి.
చెమ్మగిల్లిన కళ్ళు వత్తుకుంటూన్న రాధవైపు జాలిగా చూస్తూ......." అతనిపై మమతలు పెంచుకోకు రాధా......అతను నీ భర్త కావాలనే కోరిక మనసులోకి రానీయకు. మమతా ఆశా హృదయంలో వేళ్ళునాటి మహావృక్షమైతే.....రామకృష్ణ సంఘం, సంప్రదాయం, కట్నం స్టేటస్సు..... ఇవన్నీ తుఫానై నీ హృదయం లోని వృక్షాన్ని పెకలించిపారేస్తాయి. విధి వెక్కిరిస్తూంటే మనస్సగ్నిగోళంలో వేగిపోతూంటే తట్టుకోలేవు రాధా!
నీ హృదయ మాక్రమించబోతూన్న రామ కృష్ణకు చిరునవ్వుతో చోటియ్యకు.....రామకృష్ణ తల్లితండ్రుల కేకైక పుత్రుడు. మేనమామ ఆస్తికి వారసుడు. పుట్టుకతోనే అదృష్టవంతుడు రామకృష్ణ. మరోలా ఫీలవకు రాధా.... నీ శ్రేయస్సుకోరే నే నిలా చెప్తున్నాను."
జలజలా కన్నీళ్ళు కారుస్తూ మౌనంగా ఉండిపోయిన రాధ కళ్ళొత్తుతూ, హితవు వినడానికి మనస్సెదురు తిరుగుతుంది. చెప్పే వ్యక్తిపై కోపం వస్తుంది. కాని రాధా ఆలోచించు.....బిచ్చగాడు కోటికి పడగలెత్తాలనుకోవటం ..... ఎంత సమంజసమైన కోరికో....
"సరే.....అతన్ని కూడా ఇలా హెచ్చరించు" అంటూ గబగబా వెళ్ళిపోయింది రాధ.
* * *
పరీక్ష ఫెయిలయింది రాధ. మళ్ళీ చదివి కట్టమని ప్రోత్సహించింది పార్వతి.
ఘంటో, అరో, వాసూరావ్ ఆమెకు పాఠం చెప్తున్నాడు. రోజులో ఎలా అయినా ప్యాసవ్వాలనే పట్టుదలతో చదువుతూంది రాధ. కొన్నాళ్ళుగా అందంగా ఎదిగిన రాధపై అదొకరకమైన ఇష్టం ఏర్పరుచుకున్న విశ్వనాధన్. ఏవేవో పనులా అమ్మాయికి పురమాయిస్తూ వెనుక తిప్పుకుంటున్నాడు.
వినయంగా అతను చెప్పిన పనులన్నీ అతనికి డ్రస్ తీసి పెట్టడం బాత్ రూం లో నీళ్ళు తోడటం, తువ్వాలూ, సబ్బూ ఇవ్వడం ఇలాటి పనులన్నీ రాధచేత చేయించుకుంటున్నాడు విశ్వనాధన్. కాదనలేకపోతుంది రాధ.
"పనివాళ్ళున్నారుగా! దానికెందుకు చెప్పావలాంటి పనులు!" అంటూ మందలించిందోసారి పార్వతి.
"తాను చేసిపెట్టినంత మాత్రాన తప్పేముందమ్మా?" నవ్వేశాడు విశ్వనాధన్.
విశ్వనాధన్ ని "అన్నయ్యా" అని సంబోధించడం మొదలుపెట్టింది రాధ.
కొన్ని రోజులు విని మరీ వినలేకపోయిన విశ్వనాధన్ "ఏమిటా పిలుపు? అన్నయ్యా అని.....ఇదివరకులా పేరుపెట్టి పిలువు" విసుక్కున్నాడో రోజు.
"నువ్వు నాకు అన్నయ్యలా కన్పిస్తున్నావ్. నీకు అన్ని అమర్చిపెడుతూంటే అన్నయ్యకు నేను సేవచేస్తూన్నట్టని పిస్తూంది." అంది నవ్వేస్తూ.
విసుగ్గా ఆమెవైపొకసారి చూసి వెళ్ళి పోయాడు విశ్వనాధన్.
* * *
రాత్రి ఎనిమిది ఘంటల వేళ సరాసరి ట్రయిను దిగి శ్రీనివాసయ్యరు ఇంటివైపు నడిచాడు రామకృష్ణ.
భోజనం ముగించి డ్రాయింగ్ రూం లో కూర్చున్న శ్రీనివాసయ్యారు పేపరు చూస్తూ. అడుగుల చప్పుడికి తలెత్తి అటువైపు చూసి హుందాగా నవ్వుతూ........."ఇదేనా రావడం. రా తాతగారు కులాసానా?" అని ప్రశ్నించారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండానే అన్ని విషయాలూ తెలుసుకో గలిగే కుశాగ్రబుద్ధి" ఆయనది.
"అలానే మంచాన ఉన్నారండీ" అంటూ బిడియంగా "వాసు.....వాసు ఉన్నాడా!" అడిగాడు రామకృష్ణ.
"ఆ లోపల డైనింగ్ రూమ్ లో ఉన్నట్టున్నాడు ఇవ్వాల్టికి ఉండిపో. రేపు నీ రూమ్ కి వెళ్దువు గాని....." ఆజ్ఞాపించినట్టుంది ఆయన గొంతు.
భోజనం చేస్తూన్న విశ్వనాధన్ వాసూరావ్. వారికి వడ్డన చేస్తూన్న రాధా.... "హేండ్ బాగ్ రెండవ చేతిలోకి మార్చుకుంటూ చిన్నగా దగ్గాడు రామకృష్ణ వారివైపు చూస్తూ.
అందరూ ఒకేసారి గుమ్మంవైపు చూశారు. "రా! ఇదేనా రావడం బేగ్ నా గదిలో పెట్టిరా...రాధా అతనికికూడా అన్నం వడ్డించెయ్యి" అన్నాడు వాసూరావ్.
"మీరు కానివ్వండి. స్నానం చెయ్యాలి. అక్కయ్యేరీ!" అడిగాడు రామకృష్ణ.
"అమ్మకి జ్వరంగా వుంది. రాధా అతనికి నీళ్ళు రెడీగా ఉన్నాయో లేదో చూడు...." అన్నాడు వాసూరావ్.
వెళ్ళబోతూన్న రాధ. "వడ్డన పూర్తయ్యాక వెళ్ళు" అన్న విశ్వనాధన్ మాటకు నిల్చుండి పోయింది.
"అప్పటివరకూ అతన్నలా నించోబెడితే బాగుండదు! సాంబారూ, నెయ్యి, పెరుగూ, టేబిలు మీదుంది వెళ్ళు" అన్నాడు వాసూరావ్.
అలానే చేసింది రాధ.
* * *
