లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకేచోట ఎందుకు ఉండదు.. దీని వెనుక కారణం ఇదే..!

 

లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకేచోట ఎందుకు ఉండదు.. దీని వెనుక కారణం ఇదే..!


లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి,  ధనానికి అధిదేవత.  లక్ష్మీదేవి ఉన్న చోట ఆర్థిక సమస్యలు ఉండవని, ధనం బాగా లభిస్తుందని, ఇల్లు అబివృద్ది చెందుతుందని చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ లక్ష్మీదేవి గురించి చాలామంది ఇంకొక మాట కూడా చెబుతారు. అదే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదని.  ఈరోజు ఉన్న చోట రేపు ఉండదని,  మనిషి చేతిలో కూడా ఈ రోజు ధనం ఉంటే రేపు ఉండదు అని కూడా అంటుంటారు. కానీ లక్ష్మీదేవి ఇలా స్థిరంగా ఉండకపోవడం వెనుక ఒక కథ ఉంది. అదేంటో తెలుసుకుంటే..

పురాణ గ్రంథాలు ఏం చెప్పాయి?

మన గ్రంథాలు లక్ష్మీదేవిని చంచల స్వభావం కలదిగా, అంటే ఒకే చోట నిలకడగా ఉండదని వర్ణిస్తాయి. కానీ లక్ష్మీ దేవి  ఇలా స్థిరంగా ఉండకపోవడం వెనుక కారణం ఉంది.  ఇందులో మత సంబంధ విషయమే  కాకుండా.. జీవిత పాఠంగా కూడా ఉంది.

డబ్బు గర్వాన్ని నాశనం చేయడానికి..

మనిషికి  అకస్మాత్తుగా చాలా డబ్బు లభించినప్పుడు, వారు తరచుగా అహంకారం పెంచుకుని, ఇతరులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తారు. లక్ష్మీదేవికి ఇది అస్సలు నచ్చదట.  మనిషికి ఏర్పడే ఈ  గర్వాన్ని దెబ్బతీయడానికి లక్ష్మీదేవి ఒక చోటు నుండి మరో చోటుకు వెళుతుందట. సంపద శాశ్వతమైనది కాదని, కాబట్టి దాని గురించి ఎన్నడూ గర్వపడకూడదని ఇది  బోధిస్తుంది.

విశ్వ సమతుల్యత..

లక్ష్మీదేవి ఒకే చోట స్థిరంగా ఉండకపోవడానికి మరో ముఖ్య కారణం ప్రపంచం సజావుగా సాగిపోవడం కోసమే. సంపద అంతా కొద్దిమంది  చేతుల్లోనే కేంద్రీకృతమైతే, మిగతా ప్రపంచం గతి సమతుల్యత దెబ్బతింటుంది.  సమాజంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ధన ప్రవాహం కొనసాగడం చాలా కీలకం. లక్ష్మీదేవి ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారినప్పుడే వ్యాపారాలు నడుస్తాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది , ప్రతి ఒక్కరి కుటుంబం సజావుగా సాగుతుంది. ఇందుకే స్థిరంగా ఉండదని చెబుతారు.

పరిశుభ్రత..

 లక్ష్మీదేవిని  ఇంట్లో శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి? అని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి మొదటి , సులభమైన నియమం పరిశుభ్రత. మురికి, చెత్త , దుర్గంధం ఉన్న ప్రదేశాల నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. శుభ్రంగా, చక్కగా ఉండి, ఉదయం , సాయంత్రం దీపం వెలుగుతూ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఇంటికి మాత్రమే లక్ష్మీదేవి  వస్తుంది.

నిజాయితీతో సంపాదించడం..

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత మంచి  మార్గం చేసే పనులు, చేసే ఉద్దేశ్యాలు సరిగ్గా ఉండటం. అక్రమ మార్గాల ద్వారా, దొంగతనం లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు ఇంటికి ఎన్నడూ ఎదుగుదలను తీసుకురాదట. తన కష్టార్జితాన్ని తింటూ, స్వచ్ఛమైన మనసుతో ఉంటూ, ఇతరులకు సహాయం చేస్తూ, తన సంపాదనలో కొంత దానం చేసే వ్యక్తిపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన ఆశీస్సులను ఉంచుతుంది.

                                           *రూపశ్రీ.