|
Karthika Masam Splecial page
|
|
|
|
|
మోహానికి నారదుని దాసోహం |
అలానే నీ కూతురు స్వయంవరానికి తప్పకుండా వస్తానని రాజును, రామాదేవినీ ఆశీర్వదించి అక్కడినుంచి సరాసరి వైకుంఠానికి వస్తాడు నారదు. హాయిగా శ్రీదేవి పాదాలు వత్తుతుంటే, మెత్తనైన శేషతల్పంపై శయన భంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువుని దర్శించి భక్తి మనస్కుడై నమస్కరిస్తాడు. మునీంద్రుని చూసిన శ్రీహరి ఉచితరీతిన సత్కరించి కుశలప్రశ్నలు అడిగిన అనంతరం నారదుడు ఇలా అంటాడు –‘’స్వామీ! లోకంలో నిన్ను బోలిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ అందమైన జీవితాన్ని గడుపుతున్నావు.భార్యవల్ల కలిగే సుఖం ముందు ఇంకే సుఖమైనా తృణప్రాయమే అంటారు. |
 |
నేనా, సన్యాసిని. భార్య సుఖమేమిటి? అసలు ఆడదాని ఊసే ఎరగని వాణ్ణి, అదేమి చిత్రమో కానీ, ఇన్నాళ్ళకు నాకు స్త్రీపైనా, సంసారంపైనా ధ్యాస మళ్ళింది. అందులోనూ, మొన్న కల్యాణపురం రాజు కూతురు రమాదేవిని చూశాక అది మరీ ఎక్కువైంది. ఇంతెందుకు ఆమెపై నేను మనసుపడ్డాను. ఎలాగైనా సరే! ఆమెనే పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను. దానికి నీవు కొంత నాకు సహకరించాలి’’ అన్నాడు.
ఈ మాటలకు విష్ణువు ఆశ్చర్యపోయాడు. ‘’అదేమిటి నారదా! ఇంద్రియాలను జయించానని పెద్ద ఎత్తులో ప్రగల్భాలు పలికావు కదా! మళ్ళీ ఇప్పుడు వ్యామోహం, పెళ్ళి, సుఖమూ, సంతోషమూ లాటి ఐహిక వాంఛలతో కూడిన తుచ్చమైన పదాల్ని ఉచ్చరిస్తున్నావేమిటి?’’ అన్నాడు విష్ణువు. ‘’ఇప్పటికీ నేను అదే మాట మీదున్నాను స్వామీ! అన్ని విషయాలపైనా అవగాహన ఉండడం మంచిదంటారు కదా, గృహస్థాశ్రమంలోని సుఖాన్ని కూడా అనుభవించి అందులోని సారాన్ని గ్రహిద్దామనే ఈ ఆలోచనకు వచ్చాను తప్ప మరేమీ కాదు. ఇప్పటికే నేను ఏ మాయకూలొంగని వాణ్ణే. ఇందులో ఎంతమాత్రం అసత్యంలేదు’’ అంటాడు గర్వంగా.
‘’మాయను జయించిన వాడికి అతివలపై దృష్టి మళ్ళడమేమిటి? ఇది మాయకంటే కూడా అతిప్రమాదకరమైనది. అయినా సంసారబంధంలో ఒకసారి చిక్కుకున్నావంటే దాన్నుంచి బయటపడడం నీవనుకున్నంత సులభసాధ్యం కాదు. మరొక్కసారి ఆలోచించుకో’’ అంటాడు నారాయణుడు నారదునితో.
‘’వేలమంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవించే నీవు సంసారం గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. నీరజాక్షా! నన్ననుగ్రహించి నీ సుందరమైన మొహనాకారాన్ని నాకు ఒక్కసారి వరంగా ప్రసాదించు. ఎందుకంటే, ఆ రమాదేవి కూడా నీపైన ఇష్టం పెంచుకుని ఉంది. నీ రూపంతో కనుక నేను అక్కడికి వెడితే ఆమె తప్పకుండా నన్ను వరిస్తుంది. ఇక్కడ నీవు భ్రమిస్తున్నట్టు నేను ఏ మాయకూ చిక్కుకోలేదు.శివ, విష్ణు మాయలు నన్ను ఏమీ చేయలేవు. కాబట్టి నా యందు దయ ఉంచి నాకీ సహాయం చెయ్యి. ఇంతవరకూ నిన్ను నేనేమీ అడగలేదు. ఈ ఒక్క కోరికా మన్నించు’’ అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తాడు నారదుడు.
‘’నీ కోరిక మన్నించడం పెద్ద కష్టమైనా పనేమీ కాదు. మరోసారి ఆలోచించు. తరువాత ఎంత బాధపడ్డా ప్రయోజనం శూన్యం’’ అంటాడు సాత్వికంగా విష్ణువు. ‘’నీ అనుగ్రహం ఉంటే దేన్నైనా సాధించగలం. ఈ కోరికను కాదనకుండా తీర్చు. ఆపై అంతా మంచే జరుగుతుంది. ఇందులో అనుమానించాల్సిన పనిలేదు’’ అన్నాడు నిశ్చయంగా నారదుడు.
‘’తథాస్తం’’టాడు నారాయణుడు. |
|
|
|
|
|