|
Karthika Masam Splecial page
|
|
|
|
|
మార్కండేయుని మనోరథం పరమశివుని ప్రమోదం |
కైలాసానికి చేరుకున్నమార్కండేయుడు అక్కడ జగతికే అదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని చూసి పరవశుడైపోయాడు.అంతే!ఒళ్ళు పులకరించిపోయింది .జన్మ ధన్యమైందనుకున్నాడు .రెండు చేతులు జోడించి మాతాపితరుల ముందు సాగిలపడి దండప్రమాణాలు ఆచరిస్తూ ఇలా అంటున్నాడు''స్వామీ చంద్రశేఖరా!లోకమంతానన్నునీ భక్తుల్లో అగ్రగణ్యుడిగా భావిస్తుంది.నీ గురించి పూర్తిగా తెలిసిన వాడినని నన్నుకీర్తిస్తుంది.అయితే నాకు నీ గురించి నీ విశేషమైన మహిమల గురించి,విశిష్టవైభవాన్ని గురించి పెద్దగా తెలియదు . ఇది నాకు చాలా చిన్నతనంగా ఉంది. అదీగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసిందే ఎక్కువగా ఉంటుంది .నీ తత్త్వాన్ని అర్ధం చేసుకునేందుకు ఆ నారాయణుడికే భోదపడలేదు ఇక నేననగా ఎంతటివాణ్ణి కాబట్టి నా యందు దయుంచి......... |
 |
''శ్రీ గిరి నిలయా !నీకిదె
సాగిలపడి మొక్కుచుంటి సత్కృపసాంద్రా!
నీగుణ లీలాచరితము
లాగమములకన్నమాకు అధికమ్మీశా!!''
అంటు తాను వచ్చిన పనిని శంకరునికి నివేదించాడు .ఎంతో ఆర్తిగా,భక్తితో అడిగిన ఆ కోరికకు శంకరుడు కరిగిపోయాడు .అసలే ఆయన భోళాశంకరుడు. అడిగిన వారికి అడిగినట్టే వరాలిచ్చే అభయప్రదాత.దుర్మార్గులను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే ఆ అభయంకరుడు ఇక భక్తుల విషయంలోనైతే చెప్పాల్సిన అవసరం ఏమిటి? మార్కండేయుడిని చేరదీసి '''నాయనా మార్కండేయా!నీవు కోరిన కోరిక ఎంతో సమ౦జసమైనది .నీ కోరిక మూలంగా నీకే కాదు ,ఈ లోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది .,నీ అభీష్టాన్నితీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు .నా చరితాన్ని నీకు స్పష్టంగా ,నీవు కోరిన విధంగా తెలియచెయ్యగలవాడు నందీశ్వరుడే.కాబట్టి అతడిని ప్రసన్నం చేసుకుని నీ కోరిక నివేదించు .నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుంది''అన్నాడు మహేశ్వరుడు.
ఎప్పుడైతే కైలాసవాసుడు ఆ విధ౦గా మార్కండేయునితో చెబుతాడో ,వెంటనే అతడు పార్వతీపరమేశ్వరులకు వినమ్రంగా మరోసారి నమస్కరించి నందీశ్వరుని వద్దకు వస్తాడు .
''నందీశ్వరా !నీవు శివభక్తులోకెల్లా గొప్పవాడవు .అయన మహత్యాన్ని బాగా తెలిసినవాడవు అదీగాక ,పార్వతీ పరమేశ్వరుల గురించి వారి సంతానం విఘ్నేశ్వరుడు ,కుమారస్వామిలకు కూడా తెలియని ఎన్నో సంగతులు నీకు బాగా తెలుసు .దీనికంతటికి శివానుగ్రహం కావాలి . నా కోరిక తీర్చగల సమర్డుడివి నువ్వే .ఆ విషయం సాక్షాత్తు ఆ పరమశివుడే నాకు తెలియజేసాడు .కాబట్టి నన్ను ,అనుగ్రహించి శివ దేవుని లీలలు ,వైభవాలు మహిమలు కూలంకుషంగా నాకు తెలియజేసి నన్ను పావనం చెయ్యి''అంటూ నందీశ్వరుడిని అర్దిస్తాడు మార్కండేయుడు .అందుకా నంది ఎ౦తో పొంగిపోయి ,''మునికులశ్రేష్ట!ఈ శివ పురాణాన్ని ఎవరైతే శ్రద్దగా పఠిస్తారో వాళ్ళకి జన్మే ఉండదు .నియమనిష్టలతో విన్నా ,రాసినా సకల సంపదలు చేకూరుతాయి .భోగ ,మోక్షదాయకమైనది శివ పురాణం కాబట్టి నేను నీకు తప్పక వినిపిస్తానంటాడు నందీశ్వరుడు ''. అంటూ ఈ విషయాన్ని సూతపౌరాణికుడు శౌనకాది మహర్షులకు వివరిస్తాడు .''ఇంతటి విశిష్ట మహిమాన్వితమైన శివపురాణాన్ని మీకు వినిపించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ''అంటూ కథా విషయంలోకి వస్తాడు సూతుడు.
|
ఇంకా ఉంది..... |
|
|
|
|
|