|
Chandrodaya Uma Vratham Atla Tadde| Shiva |Shiva Linga |Jyothirlingams |God Shiva | Vishnu Sahasranama |Vishnu | God Vishnu |sivapuranam
|
"చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" |
ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా!
|
 |
వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు ..చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు. |
ఈపండుగను పల్లెలలో అయితే ఊయల పండుగ అంటూ, మరికొందరు గోరింటాకు పండుగ అంటూ, ఇలా ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" పండుగను వివిధ నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. స్త్రీలకు ఇటు చక్కని ఆనందాన్ని అటు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పండూగలోని ఆ "ఉమాదేవిని" ఒక్కసారి ఇలా ప్రార్థించి మరలా ముచ్చటించుకుందాం! |
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాం భాం కటాక్షై రశికుల
భయదాం మౌలిబద్దేందురేఖాం
శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి
కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్
సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం
తేజసా పూరయంతీం
ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం
త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః || |
ఇక ఈ పండుగ ముందు రోజు భోగి అంటారు. ఈ రోజు స్త్రీలు, పిన్నలు, పెద్దలు చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని, ఎవరిచేయి బాగా పండితే వారు అంత అదృష్టవంతులై వారి అభీష్టాలు అన్ని నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తరువాత ఒకరిచేతులు ఒకరికి చూపించుకుంటూ నాచేయి బాగా పండింది అంటే! నా చేయి బాగా పండింది అంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఈ పండుగ కోసం ప్రతి ఇంటా వారి పెరిటిలో ఊయల కట్టుకుంటారు. మరుసటి రోజు ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, "చద్దీన్నం గోంగూరపచ్చడి పెరుగు అన్నం" తో కడుపార భుజించి, ఇరుగు పొగురువారినందరిని లేపుతూ.... అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్...అంటూ! పాటలు పాడుతూ ఇరుగు పొరుగువారిని లేపి వారికి తోడ్కొనివచ్చి వివిధరీతుల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, ఊయల ఊగుటలో ఒకరిపై ఒకరు పోటీపడుచూ పల్లెవాసులందరికీ మరింతగా కనువిందు చేస్తారు.
ఇక ఆరోజు "చంద్రోదయము" అయ్యేవరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి, చంద్రోదయముకాగానే స్నానమాచరించి మడిగా అట్లు వేసుకొని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. అనంతరం షోడశోపచారములతో 'ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను చెప్పుకుని, ఆ కథాక్షతలను శిరస్సులపై ఉంచుకొని ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. ఇలా ఆచరిస్తే, కన్నెపిల్లలకు నవయవ్వనవంతుడైన అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహముతో మంచి సౌభాగ్యము కలిగి సర్వసౌఖ్యములను అనుభవిస్తూ పిల్లపాపలతో సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పై కూడా, ఒక గాధ ఉన్నది.
పూర్వం ఒక మహారాజుకు రూప లావణ్యవతి అయిన కూతురు ఉండేది ఆమె పేరు "కావేరి". ఆమె తల్లి వలన ఈ వ్రతమహత్మ్యమును తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్ళు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి " ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని" అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రికూతురికి, సేనాపతి కూతురికి, పురోహితుని కూతురుకి వివాహ వయస్సు రాగానే నవయవ్వనవంతులైన అందమైన భర్తలతో వివాహము జరిగింది. అంత మహారాజు! అమ్మాయి స్నేహితురాండ్రకు వివాహములు జరిగిపోవుచున్నవి అని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నములు చేయనారంభించగా కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులే తారసపడసాగిరి. మహారాజు ప్రయత్నములన్నీ విఫలములగుట చూచిన రాకుమార్తె చివరకు తన తండ్రి వివాహము చేయునేమో అని భయముచెంది, ఆ రాజ్యమునకు సమీప అరణ్యమునకు పోయి ఘోరమైన తపస్సు చేయసాగింది.
ఒకరోజు పార్వతీ పరమేశ్వరులులోక సంచారముచేస్తూ ఘోరమైన తపమాచరిస్తున్న ఆ ముక్కు పచ్చలారని రాకుమారైపై అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై ఓ కన్యాకుమారీ! ఎందులకై ఈ ఘోరమైన తపమాచరించుచున్నావు? నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా 'ఓ ఆది దంపతులారా! నేను నా స్నేహితురాండ్రముకలిసి నా తల్లి ద్వారా తెలుసుకున్న "చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించగా వార్కి మంచి భర్తలు లభించుట ఏమిటి? నా తండ్రిగారు చేయు ప్రయత్నములు ఫలించక కురూపులు, వృద్ధులు అయినవారు లభించుట ఏమిటి? ఇందులో నాదోషమేమిటి?' అని దుఃఖించసాగెను.
ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ నోము నోచుసమయాన నీవు ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లి పడిపోగా; విషయమంతా నీతల్లి ద్వారా నీ సోదరులు తెలుసుకుని ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్ష విరమించినావు. ఆ వ్రత భంగమే ఇది. నీ సోదరులకు నీపైగల వాత్సల్యముతో అలా చేసినారు. అయినా! ఇందులో నీవు దుఃఖించవలసిన పనిలేదు, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరంచు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని "కావేరి"ని ఆశీర్వదించి అంతర్థానమైనారు.
అలా ఆ రాకుమారై తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, తనమనసెరిగినవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగినది. అట్టి పుణ్య ప్రదమైన "ఈ చంద్రోదయ ఉమావ్రతం "అట్లతద్ది" భక్తిశ్రద్దలతో ఈ వ్రతమాచరించి ఉమాశంకరుల అనుగ్రహపాత్రులౌదురుగాక. |
|
|
|
|