|
Karthika Masam Splecial page
|
|
|
|
|
ఇదే! ఇంద్రియనిగ్రహం |
ఆ ప్రకారం వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన నారదునికి లోపల మాత్రం గర్వం పోలేదు. తన మాటను అంగీకరించి ఎంతగానో ప్రశంసిస్తారని భావించిన త్రిమూర్తులు ముగ్గురూ ఒకరకంగా హెచ్చరికలు లాంటివే చేసి పంపించారు. ఈ విషయాన్ని కొత్తగా పెరిగిన అహం నారదుడిని సవ్యమైన రీతిలో జీర్ణించుకోనివ్వడంలేదు. దాంతో చాలా అసహనంగా ఉంటున్నాడు. ఎంత ముక్కు మూసుకుని కారడవుల్లో తపస్సు చేసుకునే మౌనైనా అహం అనేది ఆవహిస్తే ఇలానే ఉంటుంది సుమా అనిపించేలా ఉంది నారదుని పరిస్థితి. తరతమ విచక్షణగానీ, జయాపజయాలతో గానీ పనిలేని కాలం దాని పంథాలో అది గిరగిరా సాగిపోతోంది. |
 |
భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది. సస్యశ్యామలమై దేనికీ కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు. ఆ పట్టణాన్నేలే రాజుకు అతిలోక సౌందర్యరాశియైన ఒక కూతురు ఉంటుంది. ఆమెపేరు రమాదేవి. సృష్టిలోని అందాన్నంతా రాశిపోసి ఆ ఒప్పులకుప్పను సృష్టించాడా బ్రహ్మ అనిపించేలా ఉంటుందామె.
దానికి తగినట్టుగా ఆమె యవ్వనంలోకి ప్రవేశిస్తుంది. పున్నమి చంద్రునిలాంటి ముఖారవిందంతో, నిండైన ఓంపుసో౦పులతో ఆమె మగవారినే కాదు స్త్రీలను కూడా చూడగానే ఇట్టే ఆకర్షిచేస్తుంది. ఒకసారి ఆమెను చూసినవారెవరైనా మరోసారి చూడకుండా ఉండలేనంత గొప్ప అందం ఆమెది. అలాటి ఆమెకు స్వయంవరం చాటిస్తాడు రాజు. అయితే రమాదేవి మాత్రం తన మనస్సును ఏనాడో శ్రీమన్నారాయణుడికి అంకితం చేసేస్తుంది. లోకాలేలే ఆ లోకేశ్వరుడినే పెళ్ళి చేసుకోవాలన్న గట్టి తలంపుతో ఉంటుందామె.
ఇలా ఉండగా, కల్యాణపురం రాజు కూతురి పెళ్ళికోసం స్వయంవరం చాటి౦చాడన్న విషయం నారదుడికి తెలిసి అక్కడికి వస్తాడు. నారద మునీంద్రుడిని చూసిన రాజు సింహాసనం దిగివచ్చి ఎదురెళ్ళి ఆర్ఘ్యపాద్యాదులతో గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేస్తాడు. యవ్వనవతి అయి పెళ్ళికి సిద్ధంకాబోతున్న తన కూతురిని పిలిచి ఆశీర్వదించమని నారదుడిని అర్థిస్తాడు రాజు.
ఆమె కదలివస్తుంటే శతకోటి మయూరాలు తరలి అక్కడకు వస్తున్నాయా అనిపిస్తుంది. ఆమె ప్రతీ కదలికలోనూ ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఇంద్రియాలను నిగ్రహించడంలో నా అంతవాడు లేడని విర్రవీగుతున్న నారదుని మనస్సు ఒక్క నిమిషం ఈమెను చూడగానే చలించిపోతుంది.
సంయమీంద్రునిగా పేరుపొందిన నారదుడు ఈ లావణ్యవతిని చూడగానే తబ్బిబై పోతాడు. రెప్పవాల్చకుండా ఆమె అందాన్ని జుర్రేస్తున్న నారదుణ్ణి వింతగానూ, భయంగానూ చూస్తుందామె. రాజు కూడ మౌని ప్రవర్తనకు ఒకింత సిగ్గుపడుతూ ‘’స్వామీ! మా అమ్మాయిని మీరు నిండుమనస్సుతో మంచి వరుడు దొరకాలని ఆశీర్వదించండి. సర్వసంత పరిత్యాగులయిన మీలాటి యోగులు దీవిస్తే అది తప్పక ఫలిస్తుంది’’ అన్నాడు. ఆ మాటతో ఉలిక్కిపడ్డ నారదుడు –
‘’రాజా! మీ అమ్మాయి అందానికి నేను ముగ్ధుడనైపోయాను. ఆ వివశత్వం నుంచి బయటకు రాలేకుండా ఉన్నాను. వరుడికోసం స్వయంవరం ఎందుకు? నీవు ఇష్టపడితే నేనే ఈమెను పెళ్ళి చేసుకుంటాను’’ అంటాడు. అందుకా రాజు ముందు ఆశ్చర్యపోయినా, దాన్ని ముఖంలో కనిపించనీయకుండా ‘’మునీంద్రచంద్రమా! మీరు అన్నది సబబుగానే ఉంది. స్వయంవరం ఎలానూ చాటించాను కదా. రేపు మీరూ దానికి హాజరుకండి. అప్పుడు నా కూతురు ఒకవేళ మిమ్మే వరించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. నా కూతురైన రమాదేవి శ్రీహరిని బాగా ఇష్టపడుతోంది. ఎలాగైనా ఆయన్నే పెళ్ళి చేసుకోవాలని కూడా భావిస్తోంది. మరి దాని అదృష్టం ఎలా ఉందో ఈ స్వయంవరం తేల్చేస్తుంది. కాబెట్టి అక్కడికి రండి’’ అని వినయంగా సెలవు తీసుకుంటాడు రాజు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|
|