సమ్మర్‌లో జుత్తుని కాపాడుకోవాలంటే...

 

సమ్మర్‌లో జుత్తుని కాపాడుకోవాలంటే...

 

 

సమ్మర్ వస్తోందనగానే ఆడపిల్లలకి మొదట కలిగే టెన్షన్... స్కిన్ పాడైపోతుందేమోనని. అందుకే ఒంటిని జాగ్రత్తగా కవర్ చేసేస్తుంటారు. క్రీములవీ పూసేస్తుంటారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే చాలాసార్లు జుత్తు విషయం మర్చిపోతుంటారు. వేసవి వేడికి స్కిన్ తో పాటు హెయిర్ కూడా పాడైపోతుంది. పొడిబారిపోతుంది. చిట్లిపోయి విరిగిపోతుంది. అందుకే సమ్మర్ లో హెయిర్ మీద కూడా శ్రద్ధ పెట్టండి.

ఆయిల్ ట్రీట్ మెంట్ వల్ల హెయిర్ కి ఎప్పుడూ మంచే జరుగుతుంది. జుత్తు పొడిబారిపోకుండా తేమగా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో తరచుగా నూనె పెట్టుకోండి. ఒకవేళ నూనె పెట్టుకుని బయటికి వెళ్లడం ఇబ్బంది అనుకుంటే రాత్రిపూట పెట్టేసుకుని, పొద్దున్నే తలంటుకోండి చాలు. తలస్నానం చేశాక హెయిర్ డ్రయ్యర్ ను వాడొద్దు. జుత్తుని గాలికే ఆరబెట్టుకోండి. లేదంటే మరింత డ్రై గా అయిపోయి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అయితే వేసవిలో మరీ ఎక్కువ సువాసన వచ్చే నూనెలు వాడకూడదు. చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఒక్కోసారి వెగటుగా అనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ వాసన లేని మామూలు నూనెను ఉపయోగించండి. అలాగే వీలైనంత వరకూ ఈ సీజన్లో హెయిర్ జెల్స్, స్ప్రేస్ వాడకుండా సింపుల్ చిట్కాల ద్వారా జుత్తుని జాగ్రత్త చేసుకోవడమే మంచిది.

కలబంద జెల్ మంచి మాయిశ్చరైజర్. అందుకే వారానికి రెండుసార్లయినా దీన్ని తలకు పట్టించి, రెండు గంటల పాటు ఉంచుకుని తలంటుకోండి. తేనె, ఆలివ్ నూనె కూడా జుత్తుకి మంచి రక్షణ. అందుకే ఈ రెండిటినీ కలుపుకుని వారానికోసారైనా తలకు పట్టించండి. బాగా ఆరిన తర్వాత శుభ్రంగా తలంటుకోండి. పెరుగు, కోడిగుడ్డు కలిపి ప్యాక్ వేసుకోవడం కూడా ఉపకరిస్తుంది. ఇవన్నీ చేయమని కాదు... వీటిలో మీకు అనుకూలమైనది ఏదో ఒకటి అనుసరిస్తూ ఉంటే హెయిర్ ను వీలైనంతవరకూ కాపాడుకోవచ్చు.

ఈ చిట్కాలు పాటించడంతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని... వీలైనంత ఎక్కువ నీరు తాగడం. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మానికే కాదు... జుత్తుకి కూడా తేమ అందుతుంది. పొడిబారడం తగ్గుతుంది. అలాగే ఆహారం విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, పొటాసియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా బైటికి వెళ్లినప్పుడు తప్పకుండా టోపీ కానీ, స్కార్ఫ్ కానీ ధరించండి. లేదంటే కనీసం పల్లూనో చున్నీనో కప్పుకోండి. నేరుగా సూర్యరశ్మి హెయిర్ ని తాకిందో... ఆ డ్యామేజ్ ని ఆపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సమ్మర్ తో మీ హెయిర్ కి వచ్చిన చిక్కేమీ లేదు.

 -Sameera