"కాని ఆ తర్వాతయినా" ఆందోళనగా అంది "జూలీకి ప్రమాదమేగా..."

 

    "నేను ప్రపంచమంతగా విస్తరించాలని మీరు నిజంగా కోరుకుంటే ఒక మామూలు తండ్రిలా నా ఒక్క కూతురికోసం కుచించుకుపోయే స్థితిని ఆశించకండి. కొన్ని వందలాది రేష్మీల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలీ అంటే నేను చెప్పినట్టు చేయండి."

 

    యాంత్రికంగా రాజీవ్ కి ఫోన్ చేసింది శ్రీహర్ష చెప్పినట్టుగా.

 

    ఒక పథకానికి అంకురార్పణ జరిగిపోయింది.

 

    అయితే...

 

    జూలీ విషయంలో చివరగా చెప్పాలనుకున్న నిజాన్ని అతడికి చెప్పలేక పోయింది.

 

    శ్రీహర్షనబడే వ్యక్తిని ప్రత్యర్థివర్గంపై దూసుకుపోయేట్టు చేయాలని జూలీపేరుని ఆమె ఉపయోగించిందే తప్ప నిజానికి జూలీ కిడ్నాప్ చేయబడలేదు.

 

    డెహ్రాడూన్ లోని ఓ రెసిడెన్ షియల్ స్కూల్లో చదువుకుంటూంది ప్రస్తుతం రేష్మీ సంరక్షణలోనే...

 

    శ్రీహర్ష భార్య లూసీ రేష్మీకి ప్రాణస్నేహితురాలని గాని, ఆమె చివరి అభ్యర్థనమేరకే జూలీని తను ఈ దేశానికి తీసుకువచ్చిందనిగాని ఈ దేశంలో తెలిసిన వ్యక్తి రాణా...

 

    రేష్మి కళ్ళు చెమ్మగిల్లాయి వెళ్ళిపోతున్న శ్రీహర్షని చూస్తుంటే...

 

    "ఎలాగయినా ముగిసిపోయే మీ జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడే మార్గంలోకి మళ్ళించాలనుకున్న నా ఆలోచన స్వార్థపూరితమైనా కానీ అపకీర్తిని కాక కీర్తినే మీరు అవశేషంగా మిగుల్చుకోవాలన్నది మిమ్మల్ని ఆరాధించే వ్యక్తిగా నా ఆకాంక్షకూడా. అందుకే యీక్షణంలో సైతం నిశ్శబ్దంగా వుండిపోతున్నాను. శాశ్వతమో అశాశ్వతమో నాకు తెలీదు శ్రీహర్షా. కాని మీ జీవితం ఆర్తులకళ్ళలో సుడులు తిరిగే శ్రీహర్ష భాష్పం కావాలి"

 

    ప్రహరీదాకా నడిచిన రేష్మికి తెలీదు రాజీవ్ ఏర్పాటు చేసిన వ్యక్తులు ఆ యింటి రాకపోకల్ని అప్పటికే గమనిస్తున్నారని.


                                    *  *  *


    మిట్ట మధ్యాహ్నంవేళ...

 

    సూర్యుడి కిరణాలు భూమిగుండెని కాల్చిన గునపాలతో సర్జరీ చేస్తున్నాయి.

 

    నైతిక విలువల్ని తాగి వాంతిచేసుకునే సగటుమనిషిలా సముద్రం హోరుమంటోంది.

 

    చరిత్ర నిర్మించిన గ్రీష్మ శిధిలాలయంలా కనిపిస్తున్న యూనివర్సిటీలో నుంచి ఓ యువతి బయటికి వస్తూంది నడుచుకుంటూ.

 

    ఆమె గుండెలకి ఆనించుకున్న పుస్తకాలు, పుస్తకాలవెనుక రొప్పుతున్న గుండెలు ఆమె దేనివిషయంలోనో ఆందోళన చెందుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

 

    క్లాసులు జరుగుతున్న సమయం కావడంతో యూనివర్సిటీ రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి.

 

    ఫాలభాగంపై పేరుకుంటున్న స్వేదాన్ని తుడుచుకుంటూ ఆమె యూనివర్సిటీ ప్రాంగణం దాటింది.

 

    బయట బస్ స్టాప్ లో ఆగలేదు.

 

    బంగాళాఖాతం వేపు సాగిన రోడ్డుపై చకచకా నడుస్తుంది.

 

    ఆ మార్గం చరిత్ర విసిరేసిన శిధిల శకలాలకి సరాసరి లక్ష్యంలా అనిపిస్తున్నా.

 

    నిర్జనంగావుండే ఆ ప్రాంతంలోనే చాలామంది యువతుల భవితవ్యం సమాధి అయిన సాక్ష్యాలు గాలి అలల్లో ప్రేతాత్మల ఘోషలా వినిపిస్తున్నా...

 

    అదేమీ తన గమ్యానికి అడ్డంపడనట్టు ఆత్రుతగా ముందుకు సాగిపోయింది.

 

    రెండు ఫర్లాంగుల దూరం నడిచిందో లేదో...

 

    సమీపంలో పొదల్లోనుంచి ఓ చప్పుడు వినిపించింది.

 

    వెనువెంటనే తననెవరో వెంటాడుతున్న అనుమానం...

 

    వెనక్కి తిరిగి చూసింది.

 

    నలుగురు వ్యక్తులు వేగంగా నడుచుకొస్తున్నారు.

 

    జనారణ్యం తమ నివాసమన్నట్టు ఇక్కడ వేటాడే హక్కు తమదే అన్నట్టు ఆమెకు చేరువగా వచ్చారు.

 

    కొద్దిగా భయమనిపించిందేమో... ...

 

    కంగారుగా చూసింది.

 

    మెరుస్తున్న మిణుగురుల్లా కనిపించిన వ్యక్తుల కళ్ళని చూస్తూ ముందుకు పరుగెత్తింది.

 

    అలసట... నిస్త్రాణతో పుస్తకాలు క్రిందపడ్డాయి.

 

    ప్రాణభీతిలాంటి వేగంతో చాలా దూరం పరుగెత్తింది.

 

    ఆమె కేక పెట్టలేదు.

 

    రొప్పుతూ పరుగెడుతూనే మలుపు తిరిగింది.

 

    దూరంగా ఓ మోటార్ బైక్ వస్తున్న చప్పుడు...

 

    కొద్దిగా ధైర్యాన్ని చిక్కబట్టకుంది...

 

    తనే ఆపాలనుకుంది కాని ఆమె స్థితిని గమనించినట్టు మోటార్ బైక్ ఆగింది సమీపంలో.

 

    "...కమాన్ కూర్చోండి"

 

    ఆపదలో వున్న వాళ్ళని కాపాడ్డమే తమ ధ్యేయమన్నట్టు బైక్ నడుపుతున్న వ్యక్తి ఆత్రుతని ప్రదర్శించాడు.

 

    కూర్చుంది వెంటనే.

 

    మోటార్ బైక్ సిటీవేపు కాక భీమిలీరోడ్డులో దూసుకుపోతూంది...

 

    ఇందాకటి నలుగురూ జీప్ లో అనుసరిస్తున్నారు.

 

    "వాళ్ళు వస్తున్నారు" అంది సన్నగా కంపిస్తూ.

 

    "భయపడకండి... నేనున్నాగా."

 

    అయిదు నిమిషాలలో వేగాన్ని పెంచిన ఆ వ్యక్తి ఓ తోటలోని గెస్టుహౌస్ కి తీసుకువచ్చాడు...

 

    "హర్రియప్... మీరా గదిలో దాక్కోండి..."