కాఫీ తీసుకుంటూ ఓరగా మాళవికకేసే చూస్తున్నాడు శ్రీధర్ వుండుండి.

 

    తను మాళవిక రూపంలో శ్రీధర్ కి తారసపడకుండా వుంటే, పూజగానే లవ్ గేమ్ ని మంచి రక్తి కట్టించేది.

 

    లేదా పూజగా తనాడుతున్న నాటకం చివరి అంకానికొచ్చినా, పూజ పాత్రముందున్న తెరని ఎత్తేసి, తనే పూజని చెప్పేది.

 

    అప్పుడు ఈ ద్విపాత్రాభినయం తప్పేది. ఇప్పుడెలా?

 

    తప్పదు... ఎంత కష్టమైనా మరికొన్నాళ్ళు ఈ డ్రామా ఆడకతప్పదు.

 

    నవగ్రహాల్లో ఏడు నిజ గ్రహాలయితే, రాహు, కేతువులు ఛాయా గ్రహాలయినట్టు పూజ పాత్ర ఛాయాపాత్రగానే వుంచాలి.

 

    "పాపా, బామ్మ ఎక్కడ?" ఏం మాట్లాడకపోతే బాగోదని అడిగాడు శ్రీధర్.

 

    "బంధువులింటికి వెళ్ళారు" అంది నిర్మల ఇద్దరికేసి, వారి చూపులకేసి మార్చి-మార్చి చూస్తూ.

 

    "ప్రస్తుతం మీ వ్యాపకమేమిటి? మీ భవిష్యత్ ప్రణాలికలేమిటి?" తిరిగి అడిగాడు శ్రీధర్.

 

    ఒక్క క్షణం గాఢంగా నిట్టూర్చింది నిర్మల.

 

    "ఒకప్పుడు నాకు-యోగికి పెళ్ళికాకపోయినా, మా మధ్య ఒకర్ని ఒకరు విడిచి వుండలేని ప్రేమ వుండేది. కాని, ఆ తరువాత నాకు పెళ్ళయినా నాకు నాభర్తకి మధ్య పిసరంత ప్రేమ వుండేది కాదు.

 

    భగవంతుడు మనుషుల మంచిచెడులతో, లాభనష్టాలతో కష్టసుఖాలతోటే కాదు, ప్రేమానుబంధాలతో కూడా ఆడుకోవడం అన్యాయం.

 

    బెంజిమన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు- Where there is marriage eithout love there will be love without marriage అనేది పచ్చినిజం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.

 

    ఇప్పుడు నాకు, యోగికి మధ్య ప్రేమ వుంది. అప్పటి ప్రేమ తాత్కాలికంగా కాలచక్రపు ఇరుసుల దుమ్ము కప్పుకున్నా.

 

    అయితే భార్యాభర్తలం మాత్రం కాదు. కాకపోతే ఏం! మనకోసం మరొకరు నిరీక్షణలో వుండడం ఎంత గొప్ప అనుభూతి.

 

    ప్రేమ లేకపోయినా భర్తద్వారా మాతృత్వపు అనుభూతిని, ఆనందాన్ని పొందాను. పెళ్ళికాకపోయినా యోగిద్వారా ప్రేమ శిఖరాల్ని స్పృశించాను. ఒక స్త్రీకి ఈ రెంటికి మించి మరేమన్నా కావాలా? కావాలని నేననుకోను" భారంగా ఊపిరి వదులుతూ అంది నిర్మల.

 

    "సారీ" అన్నాడు శ్రీధర్. అనవసరంగా ఆమె గతాన్ని కెలికానేమోనన్న ఫీలింగ్ తో.

 

    "నో...నో...అలా ఫీలవ్వొద్దు. స్నేహితులు కావాలంటే ఎంతో కొంతయినా గతం తెలుసుంటే దాని పునాది పటిష్టంగా వుంటుంది. కాఫీ బాగుందా? ఫిల్టర్ కాఫీనే" అంది నిర్మల మాళవికకేసి నవ్వుతూ చూస్తూ.

 

    మాళవిక మౌనంగా వుండిపోయింది. కాని లోలోపల మాత్రం ఉద్రిక్తతని అనుభవిస్తోంది, ఎంతో కొంత అశాంతితో.

 

    "చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మీ చిన్నదాని ఆచూకీ ఏమైనా తెలిసిందా?" అడిగింది నిర్మల.

 

    "లేదండీ! అదో పెద్ద టెన్షనయిపోతోంది. ఆమె సస్పెన్స్ ఎప్పటికి విడిపోతుందో. ఆమెని ప్రత్యక్షంగా ఎప్పటికి చూడగలుగుతానో. అసలీ జన్మకి అది సాధ్యమవుతుందో లేదో అర్థంకావడంలేదు" నిర్లిప్తంగా అన్నాడు శ్రీధర్.

 

    "Doing the expected is always a bore... ఊహించింది జరిగినప్పుడే జీవితంలో మజా అంటే ఏమిటో అనుభవంలోకొస్తుంది. వైవిధ్యం, మానవత్వం, కొత్త వ్యక్తుల పరిచయాలు, స్నేహాలు ఐమీన్... వెరైటీ. వెర్సాటిలిటీ లేని జీవితాలు వృధా నా దృష్టిలో. ఎందుకు వూరికే టెన్షన్ పడతారు. ఎప్పుడో ఒకసారి ఆమె ఎదురుపడక తప్పదు" అంది మాళవిక నవ్వుతూ.

 

    ఆమె నవ్వు కొద్దిక్షణాలు శ్రీధర్ ని సమ్మోహితుడిని చేసింది. చిరు చినుకుల ఆకాశపు పందిరి కింద నించున్నప్పుడో... వెండి వెన్నెల్లో సేదతీరినప్పుడో... నిశ్శబ్దపు ఒంటరి చీకటిలో పచార్లు చేస్తున్నప్పుడో... ఘంటసాల పాటా... బిస్మిల్లాఖాన్ షెహనాయో విన్నట్టుగా వుంది శ్రీధర్ కి.

 

    ఆమె ఓర ఓర దోరచూపులు... వెన్నెల చిలకరింపు లాంటి నవ్వు... కవ్వింపు మాటలు శ్రీధర్ ని వివశుడ్ని చేస్తున్నాయి.

 

    ఏదో స్పందన గుండెలోతుల్లో... దగ్గరయినట్టే దగ్గరయి, దూరమై పోతున్న అపర్ణ దగ్గరగానే వుంటున్నానన్న భావనని కలిగిస్తూ ఎప్పటికీ దగ్గరికి రాని అపరిచితురాలికన్నా... యాదృచ్చికంగా, పదేపదే తారసపడి గుండెలోతుల్లో గూడుకట్టుకుంటున్న ఈమె తనకు సరైన జోడీయేమో... పరిపరివిధాల విస్తరించుకు పోతున్నాయి అతని ఆలోచనలు.

 

    లేత సూర్యుడి తేజస్సుతో... పూర్ణచంద్రుని పోలిన మోముతో విశాలమైన నేత్రాలతో...ధనస్సును పోలిన కనుబొమ్మలతో...బిత్తరచూపులతో...సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో... దానిమ్మగింజల్లాంటి పలువరుసతో... ఎర్రగా దొండపండులా మెరుస్తున్న సన్నని పెదవులతో, చిదిమితే పాలుగారేట్లుగా వున్న నున్నటి చెక్కిళ్ళతో, ఒత్తయిన పొడవాటి అందమైన, నల్లటి జుత్తుతో... ఎప్పుడూ మోమున చిరునవ్వుతో... శంఖాన్ని పోలినమెడతో... విశాలమైన ఎత్తయిన వక్షస్థలంతో... సన్నని నడుముతో... చక్కని శరీరాంగ అమరికతో, పొడవుగా నడచి వెళుతుంటే ప్రాణం వచ్చి ప్రియుడికేసి ఆదుర్దాగా వెళ్ళే రెబెక్కా సుందరిలా కనిపిస్తున్న మాళవికలో ఇంకా ఏవో గొప్ప లక్షణాలు గుప్తంగా దాగివున్నాయనిపిస్తుంది ఎప్పుడూ.

 

    మనస్సు ఒకరివేపు....

 

    ఆలోచనలు మరొకరివేపు....

 

    చూపులు ఇంకొకరివేపు....

 

    ఈ ముగ్గురిలో ఎవరు తనకు కావలసినవాళ్ళు? ఎవరివేపు తను మొగ్గుచూపాలి? ఎవరితో తన జీవితం ముడిపడితే సుఖంగా వుంటుంది?

 

    ఆలోచిస్తూనే లేచి లేటవుతుందంటూ తన ఫ్లాట్ కేసి వెళ్ళిపోయాడు శ్రీధర్.

 

    "పాపం! అమాయకుడు ట్రయాంగిల్ లవ్ లో పడిపోయాడు... నిన్నెప్పుడో ఆ అపర్ణని చూశాను. నిన్ను రోజూ చూస్తూనే వున్నాను. ఇంతకీ ఆ అపరిచితురాలెవరో?" తనలో తానే అనుకోబోయి పైకే అనేసింది నిర్మల.

 

    చిన్నగా నవ్వింది మాళవిక.


                                                        *    *    *    *


    తన ఫ్లాట్ కొచ్చినా శ్రీధర్ కి పదే పదే మాళవికే గుర్తుకొస్తోంది. అందమైన కళ్ళు, సన్నని నడుము, మెరిసే చెక్కిళ్ళు, పొడవాటి చేతివేళ్ళు, నల్లని కురులు, బ్రీత్ టేకింగ్ బ్యూటీలాంటి మాళవిక అందమైన ఆకారాన్ని మర్చిపోలేక, ఆకలిని కూడా మర్చిపోయి అలాగే సోఫాలో కూలబడిపోయాడు.