బ్యూటీ కోసం బనానా ట్రీట్‌మెంట్!

 

బ్యూటీ కోసం బనానా ట్రీట్‌ మెంట్!

 

 

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే అందుకు ఏం చేయాలో మాత్రం అందరికీ తెలియదు. బ్యూటీ పార్లర్లు, కాస్మొటిక్ ట్రీట్మెంట్లు అవసరమేమో అనుకుంటారు. అక్కర్లేదండీ. ఒక్క అరటిపండు చాలు... మిమ్మల్ని అందంగా చేయడానికి. అదెలా అంటారా? ఇలా చేసి చూడండి.

 

- అరటిపండులో కాస్త తేనె కలిపి మెత్తగా చేసుకోండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఎంత గ్లో వస్తుందో చూడండి.

 

- అరటిపండు గుజ్జులో పాలు కలిపి, ఆ గుజ్జుతో ముఖాన్ని బాగా రుద్ది కడగాలి. నిర్జీవంగా మారిన ముఖానికి జీవం వస్తుంది.

 

- అరటిపండు, ఓట్స్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసి చూడండి... కొత్త మెరుపు వస్తుంది.

 

- వేసవికాలంలో చర్మం కమిలిపోయి కాంతిని కోల్పోతుంది కదా. అలాంటప్పుడు అరటిపండు గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. ఓ పదిహేను నిమిషాలుంచి కడిగేసుకోండి. మళ్లీ ఫ్రెష్ గా అయిపోతుంది.

 

 

- కాస్త తెల్లబడాలి అనుకునేవాళ్లు అరటిపండులో చందనపు పొడి కలిపి పూసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకట్రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

 

- అరటిపండు, పాలు, తేనె కలిపి మెత్తగా చేసేయండి. దీనిలో కాస్త రోజ్ వాటర్ కూడా కలపండి. దీనితో ముఖం, మెడ, కాళ్లు, చేతులు రుద్ది కడిగేసుకోండి. వేసవిలో వారానికోసారి ఇలా చేస్తే... ఎండ మీ చర్మానికి ఏ చేటూ చేయలేదు.

 

- డ్రై స్కిన్ ఉన్నవాళ్లు అరటిపండు గుజ్జులో బాదం నూనె కలిపి ముఖానికి తరచూ ప్యాక్ వేసుకుంటూ ఉంటే తేమ పెరిగి చర్మం తళుకులీనుతుంది.

 

అరటి ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా ఎంత మేలు చేస్తుందో చూశారు కదా! అందుకే మీ అవసరాన్ని బట్టి ఈ చిట్కాలను క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. అందంగా ఆనందంగా ఉండండి.


- Sameera