ప్రభాస్ అడ్డాలో... అదిరిపోయే ర్యాలీ!
on Jul 9, 2015
బాహుబలి ఫీవర్ మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులు ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. అలాంటప్పుడు ప్రభాస్ అడ్డా భీమవరంలో పరిస్థతి మామూలుగా ఉంటుందా? అక్కడ ఏకంగా పండగ సంబరాలే చేసుకొంటున్నారు అభిమానులు. గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో పూర్తయ్యాక 3 ఏనుగులు 40 గుర్రాలు, 150 ఎన్‌ఫీల్డ్ బైకులూ, 5 వేలమంది అభిమానులతో భీమవరంలో కనీ వినీ ఎరుగని ర్యాలీ నిర్వహించడానికి అభిమానులు సన్నాహాలు చేసుకొంటున్నారు.
భీమవరంలోనే కాదు, ఆ చుట్టు పక్కన గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వహిస్తారు. అయితే పోలీసు శాఖ మాత్రం ర్యాలీలో ఏనుగులను తీసుకురావడానికి అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. బాణ సంచా ధాటికి ఏనుగులు చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఒక వేళ ఏనుగులకు పర్మిషన్ ఇవ్వకపోతే.. మరో 20 గుర్రాలను సమీకరించి... ర్యాలీని అట్టహాసంగా జరపాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఓ సినిమా కోసం ఈ స్థాయిలో ర్యాలీ నిర్వహించడం టాలీవుడ్‌లోనే చర్చనీయాంశమైంది. భీమవరం బుల్లోళ్ల హడావుడి చూసి.. నైజాంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ తరహా.. ర్యాలీ ఒకటి నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.