English | Telugu
Home  » 

వై.వి.యస్.చౌదరి ఇంటర్వ్యూ

on Feb 1, 2012

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు వై.వి.యస్.చౌదరి. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో వేరే దర్శకులతో సినిమాలను నిర్మించటం ప్రారంభించి, తొలి ప్రయత్నంగా మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, "నిప్పు" అనే విభిన్న కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు వై.వి.యస్.చౌదరి. అటువంటి వై.వి.యస్.చౌదరి.తో "నిప్పు" సినిమా గురించి తెలుగువన్ డాట్ కామ్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్ వ్యూ మీ కోసం....!

తెలుగువన్ డాట్ కామ్ - నమస్కారం వై.వి.యస్.చౌదరి గారూ

వై.వి.యస్.చౌదరి - నమస్తే సోదరా...రండి రండి...!

తెలుగువన్ డాట్ కామ్ - మీరు నిర్మిస్తున్న "నిప్పు" సినిమా గురించి మా తెలుగువన్ ప్రేక్షకులకు తెలియజేస్తారా...!

వై.వి.యస్.చౌదరి - తప్పకుండా భయ్యా...అడగండి ఏం చెప్పమంటారు...?

తెలుగువన్ డాట్ కామ్ - మీరు స్వయంగా దర్శకుడై ఉండి, గుణశేఖర్ గారి దర్శకత్వంలో "నిప్పు" సినిమా తీయటానికి గల కారణాలేంటి...?

వై.వి.యస్.చౌదరి - మద్రాసులో నటి అనూరాధ గారింట్లో నేను రవితేజ పై రూమ్ లో ఉండేవారం క్రింద గదిలో గుణశేఖర్ గారుండేవారు. ఆయన ఎప్పుడూ వ్రాసుకుంటూ ఉండేవారు. ఆయన కథలు దినపత్రికల్లో, వారపత్రికల్లో పడుతుండేవి. అప్పటి నుండీ ఆయన నాకు మంచి మిత్రుడు. పైగా ఆయన ఒక ప్రూవ్డ్ టెక్నీషియన్. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా, రవితేజ హీరోగా, నేను దర్శక, నిర్మాతగా ముగ్గురం సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాం. నాకీ మధ్య వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ "నిప్పు" సినిమా తీయటానికి కారణం. నాకు రాని ఆలోచనలు వేరే దర్శకులకు రావచ్చు కదా..! అలా నాకు సత్సంబంధాలున్న దర్శకులకు ఏదైనా ఒక విభిన్నమైన ఆలోచన కథగా తోస్తే వారితో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా గుణశేఖర్ గారిని అప్రోచయ్యాను. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అదే ఈ "నిప్పు" సినిమాగా రూపొందింది. ఇక హీరోగా రవితేజ ఆ కథకి సరిగ్గా సరిపోతాడని ఆయన్ని తీసుకున్నాం.

తెలుగువన్ డాట్ కామ్ - ఏ నిర్మాతైనా లైమ్ లైట్ లో ఉన్న దర్శకుడితో సినిమాలు తీస్తారు. అలా చూస్తే గుణశేఖర్ గత చిత్రాలు సైనికుడు, అర్జున్, వరుడు సరిగ్గా ఆడలేదు...మరి గుణశేఖర్ తో సినిమా ఎందుకు చేస్తున్నారు.

వై.వి.యస్.చౌదరి -  భయ్యా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అందరికీ హిట్లుంటాయి...అలాగే ఫ్లాపులూ ఉంటాయి...! ఏవో కొన్ని సినిమాలు ఫ్లాపయినంత మాత్రాన అతని డైరెక్టోరియల్ ఎబిలిటీస్ ని అనుమానించటం సరికాదు. అలా అనుకుంటే అతని దర్శకత్వంలో వచ్చిన సొగసు చూడతరమా, బాలరామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వాటి గురించి కూడా ఆలోచించాలి కదా...!

తెలుగువన్ డాట్ కామ్ - సినిమాకి అవసరమున్నా లేకున్నా భారీ సెట్లు వేయిస్తాడన్న అపప్రథ గుణశేఖర్ మీద ఉంది....మరి మీ "నిప్పు"సినిమాలో కూడా భారీ సెట్లు వేయించాడా గుణశేఖర్...?

వై.వి.యస్.చౌదరి -  ఇదన్యాయం సోదరా....! కథ డిమాండ్ చేస్తేనే ఏ దర్శకుడైనా సెట్ కావాలనేది...అంతే కానీ అవసరమున్నా లేకున్నా ఎందుకు భారీ సెట్లు వేయించటం....? ఈ "నిప్పు" సినిమాలో అలాంటి భారీ సెట్లేం లేవు. కథకు వాటి అవసరం లేదు.

తెలుగువన్ డాట్ కామ్ - "నిప్పు" సినిమా హైలైట్స్ ఏమిటి...?

వై.వి.యస్.చౌదరి -  మా "నిప్పు" సినిమాకి చాలా హైలైట్స్ ఉన్నాయి భయ్యా...! హీరో రవితేజ ఒకటయితే, గుణశేఖర్ దర్శకత్వం, నేను నిర్మాత కావటం, తమన్ సాయి సంగీతం, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించటం, అలాగే శ్రీరామ్, భావన కూడా ప్రత్యేక పాత్రల్లో నటించటం, ముఖ్యంగా కథ, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

తెలుగువన్ డాట్ కామ్ - "నిప్పు" సినిమా సంక్రాంతికి రిలీజన్నారు. మళ్ళీ ఫిబ్రవరి 2 వ తేదీ అన్నారు.ఇప్పుడు ఫిబ్రవరి 17 వ తేదీ అంటున్నారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడటానికి గల కారణాలేంటి...?

వై.వి.యస్.చౌదరి -  ఇక్కడ నేను, గుణశేఖర్ ఇద్దరం కూడా పక్కా పర్ ఫెక్షనిస్టులం. ముందుగా అనుకున్న సమయానికి తీసిన సినిమాకు అవసరమైన టెక్నికల్ హంగులు, అనుకున్న సమయానికి పూర్తిగా అందించలేకపోయాం. తర్వాత "జై తెలంగాణా" సినిమా విడుదలకు థియేటర్లు దొరకటం లేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో వారంటూంటే దాని గురించి మళ్ళీ వాయిదా వేశాం. మనం ఎవరి వల్లా ఇబ్బంది పడకూడదు. అలాగే మనవల్ల కూడా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనుకోవటం వల్లే ఈ జాప్యం జరిగింది.

తెలుగువన్ డాట్ కామ్ - ఈ "నిప్పు" సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉండబోతోంది...?

వై.వి.యస్.చౌదరి -  చాలా విభిన్నంగా ఉండబోతోంది. రవితేజ స్టైల్లో ఉంటూనే ఆ పాత్రకు ఒక బాధ్యత కూడా ఈ సినిమాలో ఉంటుంది. 

తెలుగువన్ డాట్ కామ్ - ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఎలా ఉండబోతున్నాయి...? ఎన్ని ఉంటాయి...? వై.వి.యస్.చౌదరి - కణల్ కణ్ణన్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఆరు యాక్షన్ సీన్లు షూట్ చేశారు గుణశేఖర్. ప్రేక్షకులు, రవితేజ అభిమానులు వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.

తెలుగువన్ డాట్ కామ్ - మీకు, దర్శకుడు గుణశేఖర్ కీ, గొడవ జరగటం వల్ల హీరో రవితేజ మీ ఇద్దరికీ వార్నింగేదో ఉచ్చాడని ఒక టాక్ ఉంది...మీరేమంటారు...?

వై.వి.యస్.చౌదరి - (నవ్వు) భయ్యా మా మధ్య గొడవలు జరిగాయి...ఎవరికీ....పనీ పాటా లేకుండా ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తుంటారే వాళ్ళ ఊహల్లో...! అంతేకానీ నిజానికి ఏ గొడవా జరగలేదు సరికదా...చాలా హ్యాపీగా ఈ సినిమా చేయటం జరిగింది.

తెలుగువన్ డాట్ కామ్ - చాలా సంతోషం చౌదరిగారూ...మీ విలువైన సమయాన్ని మా తెలుగువన్ డాట్ కామ్ ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ "నిప్పు" సినిమా గురించి ఇన్ని విషయాలు తెలిపిన మీకు మా ధన్యవాదాలు...అలాగే మీ "నిప్పు"చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము.

వై.వి.యస్.చౌదరి -  మీక్కూడా  థ్యాంక్యూ భయ్యా...! థ్యాంక్యూ వేరీ మచ్...!

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here