సంక్రాంతి మెగా ఫ్యామిలీదే
on Nov 18, 2014
ఇంకొన్ని సంవత్సరాలైతే టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక సినిమా రన్నింగ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవిని అలా వుంచితే, ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలుగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ రంగంలో వున్నారు. త్వరలో నాగబాబు కొడుకు రంగంలోకి దిగబోతున్నాడు. చిరంజీవి వరస చూస్తుంటే ఆయన కూడా వరసబెట్టి సినిమాలు చేసే ఊపులో కనిపిస్తున్నారు. ఇలా అయితే కొద్ది రోజుల్లో టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ సినిమాల తర్వాతే మరే ఫ్యామిలీ సినిమాలైనా అన్నట్టుగా పరిస్థితి మారే అవకాశం వుందని సినీ పండితులు అంటున్నారు. ఎప్పటిదాకో ఎందుకు... రాబోయే సంక్రాంతి మాదే అని మెగా ఫ్యామిలీ కర్చీఫ్‌లు వేసేసింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ముకుందా’ సినిమాల విడుదల సంక్రాంతికి విడుదల కన్ఫమ్ అయిపోయింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన రెండు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీ పడతాయా అనే విషయాన్ని అలా వుంచితే, ఇద్దరు మెగా హీరోల మధ్యలో దూరి ఇబ్బందులు పడటం ఎందుకని కొన్ని సినిమాలు కూల్‌గా పక్కకి తప్పుకుంటున్నాయని సమాచారం. సంక్రాంతి బరిలో నిలిచి గెలిచే మెగా పందెం కోడి ఎవరో వాళ్ళే తేల్చుకుంటార్లే అని మిగతా సినిమాల వాళ్ళు సంక్రాంతి సీజన్ తర్వాత తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది.