సమయస్ఫూర్తి

ఈ ప్రపంచం ఎప్పుడూ ఆడవారికి సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ఆ సవాళ్లకు విసిగి ఎక్కడో అక్కడ ఆగిపోతే, నా వల్ల కాదంటూ సర్దుకుపోతే నలుగురిలో ఒక్కరిగా మిగిలిపోతారు. కానీ… సవాలు ఎదుర్కొన్న చోట ఒక్క క్షణం ఆలోచిస్తే ఓ కొత్త దారి కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా చెప్పుకునే ఓ కథ ఇది!

అనగనగా ఇటలీలో ఓ పేద కుటుంబం! ఆ కుటుంబంలోని పెద్ద ఏదో కారణం చేత ఓ అప్పు చేశాడు. ఆ అప్పుని ఇచ్చినవాడు పరమ చండశాసనుడు. వడ్డీ మీద వడ్డీ వేసి, లెక్కలకి మసిపూసి రూపాయికి వందరూపాయల అప్పుని చూపించాడు. వడ్డీని చెల్లించీ చెల్లించీ విసిగిపోయాడు ఇంటి పెద్ద. ఇక అతని వల్ల కాలేదు. అప్పుడు తన మనసులోని మాటని బయటపెట్టాడు వ్యాపారస్తుడు. ఆ ఇంటి పెద్దకి ఓ బంగారంలాంటి కూతురు ఉంది. రూపంలోనూ, గుణంలోనూ, తెలివిలోనూ ఆమెకి చుట్టుపక్కల సాటిలేదని చెప్పుకునేవారు. ఆమెని కనుక తనకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుని మాఫీ చేయడం కాదు కదా, తనే బోల్డంత ఎదురు కట్నం ఇస్తానని ఆశ పెట్టాడు వ్యాపారస్తుడు. ఆ చండశాసనుడితో పెళ్లంటే ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయింది. ఆ విషయం చెప్పగానే వ్యాపారస్తుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఎలాగొలా తను లాభపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు.

``మనమంతా రేపు ఊరు చివర ఉన్న చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం. అక్కడ ఊరిపెద్దల సమక్షంలో నేను ఓ సంచిలో రెండు గులకరాళ్లను పెడతాను. వాటిలో ఒకటి తెల్లది, మరొకటి నల్లది ఉంటాయి. మీ అమ్మాయి కళ్లు మూసుకుని ఓ రాయిని బయటకి తీయాలి. నల్లరాయిని బయటకు తీస్తే తను నన్ను పెళ్లి చేసుకోవల్సి ఉంటుంది. తెల్లరాయిని బయటకు తీస్తే ఆమె గురించి, అప్పు గురించీ నేను మర్చిపోతాను. అసలు ఈ షరతుకి ఆమె ఒప్పుకోకపోతే, మీ ఇంటిపెద్దను జైల్లో పెట్టించవలసి ఉంటుంది`` అన్నది వ్యాపారస్తుని షరతు. దానికి ఆ కుటుంబం ఒప్పుకోక తప్పలేదు.

మర్నాడు అందరూ చెరువు గట్టు దగ్గర సమావేశమయ్యారు. అంతా సవ్యంగా ఉంటే వ్యాపారస్తుడి కోరిక నెరవేరే అవకాశం ఉండేదేమో! కానీ వాడు అత్యాశపరుడు కదా! ఎలాగైనా ఆ అమ్మాయిని చేజిక్కించుకోవాలని మూటలో రెండూ నల్లరాళ్లనే వేశాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి చూడనే చూసింది. నలుగురికీ ఆ మోసాన్ని చెప్పి విషయాన్ని సాగతీయడమా, షరతుకి వెనక్కితగ్గి తన తండ్రిని చెరసాలకు పంపడమా లేకపోతే నిశ్శబ్దంగా ఓ నల్లరాయిని బయటకు తీసి అతనికి భార్యగా మారడమా!... ఈ మూడు పరిష్కారాలు కనిపించాయి. కానీ అక్కడే తను కాస్త సమయస్ఫూర్తిని ఉపయోగించింది.

వ్యాపారస్తుడు తన చేతికి మూటను అందించగానే, ఒక రాయిని గుప్పిట్లో ఉంచుకుని బయటకు తీసింది. కానీ దాన్ని అందరికీ చూపించేటప్పుడు చెరువులోకి జారిపోయినట్లుగా నటించింది. ``అరే! నేను బయటకు తీసిన రాయి చెరువులో పడిపోయిందే! ఇప్పుడు మూటలో ఉన్న రాయిని బట్టి నేను తీసిన రాయి ఏదో తెలుసుకుందాం`` అన్నది. అంతే! మూటలో ఎలాగూ నల్లరాయి ఉందికాబట్టి ఆ అమ్మాయి బయటకు తీసింది తెల్లరాయి అనుకున్నారంతా! మూడు మాత్రమే పరిష్కారాలు కనిపించే చోట ఆమె నాలుగో పరిష్కారాన్ని కనుగొంది. తను ఆపద నుంచి బయటపడ్డమే కాదు, తన కుటుంబం పరువు కూడా కాపాడింది.

--Nirjara