కార్తీకమాసంలో…

కార్తీకమాసం వచ్చిందంటే ఆడవారికి తలమునకలయ్యేంతటి పనులు. ఒక పక్క ఇంటి పని, మరో పక్క పూజలు; ఒకవైపు భక్తి, మరోవైపు ఆరోగ్యం… ఇలా అన్నింటికీ ప్రాధాన్యతని ఇస్తూ ముందుకు సాగాలి. ఇలాంటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పుణ్యం, పురుషార్థం రెండూ సాధించవచ్చు.

ఆచారాలు


దీపం ఏ సమయంలో ఎలా పెట్టాలి? కార్తీక స్నానం ఎలా చేయాలి?... ఇలా కార్తీక మాసంలో రకరకాల సందేహాలన్నీ కలుగుతాయి. ఎవరైనా పెద్దలను అడిగో, పుస్తకాలు చూసో వీటిని నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఆచారాన్ని పాటించడం కుదరకపోతే ఏదో పాపం చేసినట్లుగా బాధపడిపోవడం వల్ల ఉపయోగం లేదు. అన్నింటికంటే మనసు ప్రధానం కాబట్టి, ఆ మనసులో ఓసారి శివకేశవులను భక్తితో తల్చుకుని క్షమించమని వేడుకుంటే సరి!

ఉపవాసాలు


కార్తీక మాసం అంతా ఒంటి పూట భోజనమో లేకపోతే పుణ్యతిథులలోనో ఉపవాసం చేయడమో చేస్తుంటారు. ఆరోగ్యపరంగా కార్తీక మాసం ఉపవాసాలకు అత్యంత అనువైన సందర్భం కావచ్చు. కానీ ఇంటిపనులలో తలమునకలై ఉన్నప్పుడు, ఉపవాసంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. నీరసం అనిపించినప్పుడల్లా తేనెతో కూడిన నిమ్మరసాన్ని తప్పక తీసుకోవాలి. తేనెలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్ అనే రెండు రకాల చక్కెర పదార్థాలు ఉంటాయి. గ్లూకోజ్‌ మనకు తక్షణ శక్తిని ఇస్తే, ఫ్రక్టోజ్‌ నిదానంగా శరీరంలోకి చేరుకుని చక్కెర నిల్వలు తగ్గకుండా చూస్తుంది. అది కూడా సరిపోకపోతే… పాలు, పళ్లులాంటి అపక్వ ఆహారాన్ని తీసుకోవడంలో కూడా దోషం లేదు.

వనభోజనాలు


కార్తీకం అంటేనే వనభోజనాలకో, అన్నసమారాధనకో హాజరు కావలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనేటప్పడు మన వంతుగా సాయపడితే మంచిది. లేకపోతే కలివిడిగా ఉండరన్న మాట వచ్చే ప్రమాదం లేకపోలేదు. శారీరక శ్రమ చేయలేనప్పుడు పండ్లు వంటి వస్తువుల రూపంగానో, ఆధ్యాత్మిక పుస్తకాల వంటి బహుమతుల రూపంగానో సాయపడవచ్చు. నలుగురూ కలిసే చోట అనవసరమైన భేషజాలు, మాటలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఆధ్మాత్మికపరమైన సంభాషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది.

ఖర్చులు


యాత్రలు, వనభోజనాలు, దానాలు, పూజలు, సమారాధనలు… ఇలా ఈ మాసంలో ఒకేసారి వచ్చే ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. అందుకని ముందుగానే ఒక బడ్జెట్‌ను కేటాయించుకుంటే మంచిది. తమలపాకులు, పూలు, పండ్లు దగ్గర నుంచి ఏవి ఎంత అవసరమో, అంతే కొనుక్కుంటే వృధాకాకుండా ఉంటాయి. దానాలు కూడా మన శక్తికి తగినట్లుగా చేసుకోవడంలో తప్పులేదు. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో దీపదానం చేస్తే, అలా చేయలేనివారు గోధుమపిండితో దీపదానం చేస్తారు. శక్తికి మించి ఖర్చు చేయమని పెద్దలు ఎప్పుడూ చెప్పరు. కాబట్టి ఆదాయాన్ని అనుసరించి, ఆచారాన్ని పాటించడంలోని సులువులను కూడా గ్రహించుకోవాలి.

ఇంతేకాదు! కార్తీకమాసంలో నదీస్నానం చేసేటప్పుడు కానీ, దీపాలు వెలిగించేటప్పుడు కానీ ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఒక పక్క ధర్మాన్ని పాటిస్తూనే మరో పక్క జాగరూకతతో ఉండాలి. అప్పుడే కార్తీకమాసం శుభప్రదంగా మిగిలిపోతుంది.

- నిర్జర