ఆడవాళ్ళు ...చాడీలు 

"ఆ!! ..నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఏముంది , చాడీలు చెప్పుకోవడం తప్ప " అని అనడం మగవారికే కాదు ఆడవారికి కూడా పరిపాటే. ఇందులో చాలా వరకు నిజం కూడా లేకపోలేదు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడ కలిసినా ,మూడో మనిషి గురించి భర్త గురించో, అత్తవారి గురించో చాడీలు చెప్పేసుకోవడం మొదలు పెట్టేస్తారు. వీళ్ళు ఇలా, వాళ్ళు అలా అంటూ బుగ్గలు నొప్పెట్టేలా నొక్కేసుకుని మరి చెప్పేసుకుంటారు. సాధారణంగా చాడీలు చెప్పుకోవడం అందరికీ టైమ్ పాస్ గా బానే ఉంటుంది, అదీ ఒక కళే. కానీ ప్రతిసారి అవే మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం ఆలోచించాలి. ఈ కబుర్లవల్ల మనకి ఏదన్నా ఉపయోగమా? దీంతో ఏమన్నా సాధిస్తామా? అంటే లేదనే చెప్పాలి.

అసలు ఇందులో ఇబ్బంది ఏంటంటే, అలా మాట్లాడడం అలవాటైన ఆడవాళ్ళు ప్రతి నిముషం అలా మాట్లాడడానికి సరైన కబుర్ల కోసం వెతుకులాటలోనే ఉంటారు. వారి ఆలోచన ప్రక్రియ మొత్తం దీని మీదే పెడతారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా ప్రమాదం ఉంది.

మీరు మాట్లాడే మాటలు, మీరు ఎవరిగురించైతే మాట్లాడుతున్నారో వారికి చేరాయనుకోండి, వారు మిమ్మల్ని అడిగారనుకోండి, అదీ ఎవరితో అయితే మీరు మాట్లాడారో వారి ముందే, అప్పుడు మీ పరిస్థితి ఏంటి?? తప్పించుకోగలరా??

మరొక్క విషయం మీతో ఇలాంటి కబుర్లు చెప్పే ఆడవాళ్ళు మీ గురించి కూడా ఇలానే ఎవరిదగ్గరైన మాట్లాడే అవకాశం లేదంటారా??

ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, మీరు ఇలా మనుషుల ముందు ఒకలా, వారి వెనక వారి గురించే ఇంకోలా మాట్లాడడంపై మీ పిల్లలు కన్ను పడకుండా ఉండదు, మరి వారికి మీరు నేర్పిస్తున్నది ఏంటి ? మనిషి ముందు ఒకలా వెనక ఇంకోలా ఉండమనా ?? అది మీ పిల్లల ఆలోచనకి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఏవిధంగా  సహాయపడుతుందో చెప్పండి ??

ఎప్పుడైనా ఒక్కసారి ఇలా మాట్లాడుకోవడం నవ్వుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అదే మీ పని కింద మార్చుకోకండి.
మరి ఏం మాట్లాడాలి అంటారా ?? దాని గురించి తెలుసుకోవాలంటే...ఇక్కడే చెప్తా చూస్తూ ఉండండి
:-)

 

--Pushpa