మీలో ప్రత్యేకత ఏంటో  మీరే గుర్తించండి

ఆడవాళ్ళలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరిలో అన్నీ కళలని గుర్తిస్తారు, వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి, తరువాత చూద్దాంలే అనుకుంటారు. ఒక సంగీతమో ,సాహిత్యమో, లేక ఇంకేదైనా ఒక ఇష్టమైన పనో ఉందనుకోండి దాన్ని నెరవేర్చడానికి టైమ్ కావాలి, కానీ అందరి బాగోగులు చూసేసరికి వారికి తమకంటూ సమయమే మిగలదు. ధాంతో ఆ ఆశ ఎక్కడో అడుగున పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదనట్టు వదిలేస్తారు. కానీ ఇలా కొన్ని ఏళ్ళు గడిచాక ఎక్కడో ఎవరో తమకి నచ్చిన పని చేస్తూ. కనబడతారు, అంతే ఇంకమనసులో బాధ మొదలు. ఇంకా ప్రతి నిముషం ఆ విషయం మనసుని  తోలుస్తూనే ఉంటుంది. ఆ బాధలో ఇంట్లో పనులు భారంగాను కష్టపడి పోతున్నట్టు అనిపిస్తుంది వారికి. చిరాకు ఎక్కువై చిర్రుబుర్రు మంటుంటారు.

ఇంట్లో వాళ్లకేమో విషయం అర్ధం కాక "మొన్నటిదాకా బానే ఉండేది ఈ మధ్య ఏమైందో ఎంటో", అనుకుని బాధపడుతుంటారు. పోనీ ఆడవారు చెప్పచ్చుగా అనుకోవచ్చు, నిజమే చెప్పచ్చు కానీ తనకంటూ ఒక ఇష్టం ఉందని చెప్పడం ఆడవారికి ఇంకా అలవాటు కావటం లేదు, నవ్వుతారేమో అన్న భయం కూడా తొడవుతుంది.

దాంతో ఈ సమస్య పెద్దదై ఇంట్లో గొడవలు మొదలవుతాయి.. అందుకే ఆడవారు తమ ఇష్టాలు తమలో ఉన్న టాలెంట్ ని వారే గుర్తించి బయటపెట్టుకోవాలి, అందరికీ నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. ఇంక ఈ విషయంలో  ఇంట్లో వారి బాధ్యత కూడా చాలా ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఇదెందుకు అని అనకుండా,వారిని ప్రోత్సహించాలి.

 

* ఎంతో లేట్ అయిందని అనుకునే కన్నా, ఇప్పటికైనా మొదలు పెట్టా కదా, అని మిమ్మల్ని మీరే శెభాష్ అనుకోండి.

* ఇంట్లో వారి పనులు అన్నీ మీరే చేసెయ్యాలనుకోకుండా పనిని అందరితో పంచుకోండి అప్పుడు మీకంటూ కాస్త సమయం దొరుకుతుంది.

* మీలానే ఆలోచించే ఇంకొకరినో లేదా ఒక గ్రూప్ నో కలుసుకోండి. అప్పుడు మీకు తోడు దొరకడమే కాదు ఆ పనిలో ఉత్సాహం కూడా కలుగుతుంది.

* ఒకవేళ ఇంట్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారు లేరనుకోండి, నిరాశపడకండి, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో దొరకని వీడియో లేదు, మీ కావాల్సింది మీ ఫ్రీ టైమ్ లో మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు.

చివరిగా ఒక మాట మీ బాద్యత మీ ఇంటి పట్ల ఉండాలనుకోవడంలో అస్సలు తప్పులేదు ,కానీ అదే బాధ్యత మీ పట్ల కూడా కాస్త చూపిస్తే, జీవితం సుఖమయంగా ఉంటుంది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, ఆలోచించండి.....

--Pushpa