ఆడవాళ్లు ఎందుకు ఏడుస్తారు!

ఒక రోజు ఓ పిల్లవాడు నిద్రలేచేసరికి తన తల్లి ఏడుస్తూ కనిపించింది. ‘ఏమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు?’ అని అడిగాడు పిల్లవాడు.‘మన ఇంటి ఎదురుగుండా ఓ పావురం చనిపోయింది. దాన్ని చూసి ఏడుపొచ్చింది’ అని జవాబు ఇచ్చింది తల్లి. ఆ విషయం ఎందుకో పిల్లవాడికి అర్థం కాలేదు. తన తండ్రి దగ్గరకు వెళ్లి ‘నాన్నా అమ్మ ఎందుకని ప్రతి చిన్నదానికీ ఏడుస్తుంది’ అని అడిగాడు.

‘ఏమో నాకు తెలియదు. నేను మాత్రం నాకు ఏడుపు వచ్చినా ఆపుకుంటాను తెలుసా!’ అని గొప్పగా చెప్పాడు తండ్రి. తండ్రి మాటలు విన్న పిల్లవాడు తను కూడా బలవంతంగా కన్నీరుని ఆపుకునేవాడు. కానీ అతని మనసులో కన్నీటితో ఉన్న తన తల్లి రూపం మాత్రం నిలిచిపోయింది. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడయ్యాడు. గొప్ప హోదా, పెద్ద జీతంతో దేశదేశాలూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఓ రోజు తన మనసులో ఉన్న ప్రశ్నని మళ్లీ తన తల్లి ముందు ఉంచాడు.

‘అమ్మా! నా చిన్నప్పటి నుంచీ నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు నీ కన్నీళ్లని ఎందుకు ఆపుకోవు. ఆ మాటకి వస్తే ఆడవాళ్లంతా ఎందుకంత త్వరగా ఏడుస్తారు? వాళ్లంత బలహీనులా!’ అని అడిగేశాడు కొడుకు.

కొడుకు ప్రశ్నని విన్న తల్లి ఒక్కసారి అతణ్ని తేరిపార చూసింది. తను చెప్పే జవాబు విని అర్థం చేసుకునే పరిణతికి చేరుకున్నాడని రూఢి చేసుకుంది. ఆపై ఇలా చెప్పసాగింది…


‘బాబూ ఆడవాళ్ల బలహీనులు అని నువ్వెలా అనుకోగలవు? ఒక బిడ్డను నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించడంలో నీకు బలహీనత కనిపిస్తోందా! లేక ప్రతి కష్టాన్నీ అనుభవించి ఆ బిడ్డను పెంచడంలో బలహీనత కనిపిస్తోందా! భర్త చేసే అవమానాలనీ, బిడ్డలు చేసే తప్పులనీ, లోకం వేసే నిందలనీ…. ఒకోసారి సహిస్తూ, ఒకోసారి ఎదురుతిరుగుతూ జీవితాన్ని ఓ పోరాటంలా గడిపే స్త్రీ  బలహీనురాలు ఎలా అవుతుంది!’ అని అడిగింది.

‘నిజమే! స్త్రీ అంటే సామాన్యురాలు కాదని నేనూ ఒప్పుకుంటాను. మరి ఎందుకంత త్వరగా ఏడుస్తారు?’ అని అడిగాడు కొడుకు.

‘ఎందుకంటే మా బాధని దాచుకోం కనుక. ఏదన్నా కష్టం కలిగితే బాధపడి, మమ్మల్ని మేం ఓదార్చుకుని ముందుకు సాగిపోతాం కనుక. ఎవరో ఏదో అనుకుంటారని మా మనసుకి కలిగిన చెమ్మని మేం దాచుకోము. మేం స్పందిస్తాము. కన్నీటితో మా బాధని ప్రకటిస్తాం.’ అంది తల్లి.

ఆ మాటలకి కొడుకు హృదయం చెమ్మగిల్లింది. కానీ ఈసారి అతను తన కన్నీటిని ఆపుకోలేదు.

--nirjara