మహిళల ప్రాణాలు కాపాడే బొట్టు


బొట్టు... హిందూ మహిళల జీవితంలో ఒక భాగం. మహిళల నుదుట ఉదయించే సూర్యుడిలా మిలమిల మెరిసే బొట్టు భారతీయ సంప్రదాయానికి చిహ్నం. బొట్టు  అందాన్నిస్తుంది.. బొట్టు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మహిళలకు బొట్టు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మహిళలను కాపాడుతుంది. అవును ఇది నిజం.

భారతదేశంతోపాటు అనేక పేద దేశాల్లో మహిళలు అయోడిన్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. అయోడిన్ లోపం కారణంగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్, బ్రెయిన్ డ్యామేజ్, ప్రసూతి సంబంధిత వ్యాధులతో మహిళలు బాధపడుతున్నారు. అయోడిన్ లోపాన్ని సవరించుకోవడానికి సప్లిమెంట్స్ వున్నాయి. కానీ, పేద మహిళలు వాటిని కొనుక్కునే పరిస్థితిలో లేరు. చాలామంది పేద మహిళలు అయితే తమకు అయోడిన్ లోపం వుందని కూడా గుర్తించలేని స్థితిలో వున్నారు. అలాంటి అందరికీ ప్రాణదానం చేసే కార్యక్రమానికి మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నీల్ వసంత్ ఫౌండేషన్’  ఒక పథకానికి రూపకల్పన చేసింది. ఆ పథకం పేరు ‘లైఫ్ సేవింగ్ డాట్’ (జీవన్ బిందీ). ఈ సంస్థ రూపొందించిన బొట్టును మహిళలు రోజూ క్రమం తప్పకుండా తమ నుదుటన పెట్టుకుంటే చాలు... మహిళల ఆరోగ్యం బావుంటుంది. ఆ బొట్టు ఏ షాపులోనే విక్రయించే ఆషామాషీ బొట్టు కాదు.. ప్రత్యేకంగా రూపొందించిన ‘లైఫ్ సేవింగ్ డాట్’.

ఈ ‘లైఫ్ సేవింగ్ డాట్’ (బొట్టు) పెట్టుకోవడం వల్ల దానిలో నిక్షిప్తం చేసిన అయోడిన్ ఒక మహిళకు ప్రతిరోజూ ఎంత అయోడిన్ అవసరమో అంత అయోడిన్‌ ఆమె శరీరంలోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ బొట్టును భారతదేశంలోని అనేక గ్రామాల్లో నీల్ వసంత్ మెడికల్ ఫౌడేషన్ ప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. నేపాల్‌లోని గ్రామాల్లో కూడా ఈ బొట్టు పంపిణీ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యని గుర్తించి, దానికి తగిన పరిష్కారాన్ని కనుగొని, దాన్ని అమలు చేస్తున్న నీల్ వసంత్ మెడికల్ ఫౌండేషన్‌ని అభినందించాల్సిందే.