హాట్ సమ్మర్లో హెల్దీ ఫుడ్స్


ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో ఉడకబెట్టేస్తున్నాయి. ఈ ఎండాకాలంలో ఫుడ్‌ విషయంలో ఏమరపాటుగా ఉన్నామా... రోగాలతో అవస్థలు పడాల్సిందే. అందుకే తీసుకునే ఆహారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే... ఈ సుర్రుమనే  సమ్మర్‌ను కూల్‌గా లాగించేయొచ్చు. చాలా మంది స్పైసీ ఫుడ్‌ అంటే  పడిపోతుంటారు. మసాలాపై ఎంతో మమకారాన్ని పెంచుకుంటారు. అలాంటి వారు ఆగండి...ఆలోచించండి. మసాలాపై మోజు తగ్గించి ద్రవ పదార్థాల్ని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. ఎండ వేడికి ఒంట్లో నీరంతా బయటకు పోయి నీరసించిపోతాం. అందుకే సమ్మర్లో మూడుగంటలకు ఓసారి లైట్‌గా పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. నూనె దినుసుల్ని ఇష్టంగా తింటూ ఒబెసిటీతో బాధపడే వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్లు ఆయిల్‌ను తగ్గించాల్సిందే. వెన్న, నెయ్యి, మాంసం జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆల్కహాల్‌, ధూమపానం, ఫ్రై ఫుడ్‌... పూర్తిగా మానేయాలి. ఎర్రగా కాలింది.. ఆయిల్‌లో భలే ఉడికింది... అని లాగించేద్దాం అనుకుంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని కాస్త కంట్రోల్‌ చేసుకోండి.

 

ఉదయాన్నే తీసుకునే కాఫీ, టీలకు బదులు అంబలి, మజ్జిగ తాగితే... ఆ రోజంతా ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, కమలాపండ్లు అయినా ఫర్వాలేదు. ఆ తర్వాత అరగంటకు రెండు ఇడ్లీలు, లేదంటే నూనెలేని చపాతీలు రెండు తీసుకోవాలి. పదకొండింటికి లెమన్‌ టీ లేదా గ్రీన్‌ టీ తాగడం  అలవాటు చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ ముగిసిందా... లంచ్‌ సంగతి చూద్దాం.

 

 

మధ్యాహ్నం ఓ కప్పు రైసు... లేదంటే రెండు చపాతీలు.  అది కూడా ఆకు కూరలతో తీసుకుంటే మంచిది. మజ్జిగో, చారో తప్పనిసరిగా ఉండాలి. తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకండి. జీర్ణప్రక్రియలో ఇబ్బందులొస్తాయి. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. మధ్యాహ్నం మూడింటికి  వెజిటబుల్‌ సలాడ్‌ లేదా ఏదైనా పండ్లరసం తీసుకోవాలి. మజ్జిగ అయినా పర్వాలేదు.

రాత్రికి వెజిటబుల్‌ సలాడ్‌ ఓ కప్పు, రెండు పుల్కాలు లేదా జొన్నరొట్టెలు ఆకుకూరలతో తీసుకోవాలి. మూడుపూటలా మజ్జిగ తప్పనిసరిగా తాగితే మంచిది. రాత్రిపూట పెరుగు, పాలు అస్సలు తీసుకోవద్దు. త్వరగా జీర్ణమయ్యే ఫుడ్‌ తినడమే మంచిది. భోజనాన్ని రాత్రి తొమ్మిదిలోపు ముగించాలి. కాసేపు అటూ ఇటూ తిరిగి... పదింటికల్లా నిద్రపోవాలి. ఈ కాలంలో నిద్రలేమి అనేది చాలా డేంజర్‌. ఎంత నిద్రపోతే అంత మంచిదంటున్నారు వైద్యులు.

ఈ సమ్మర్‌ సీజనంతా.. ఇలా పక్కా ప్లాన్‌‌తో ముందుకెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. టైం మెయింటెయిన్‌ చేయడం కష్టమనుకుంటే... కష్టాలు తప్పవు. అందుకే బీ కేర్ ఫుల్‌.