తల్లి ఎప్పుడూ జంట ఆలోచనలే చేస్తుంది. ఒకటి తనకోసం...ఇంకోటి పిల్లలకోసం! దయామయుడని పేరుపడ్డ ఆ భగవంతుడు కన్నతల్లి నుండి ఆమె పేగు చీల్చుకుని వచ్చిన బిడ్డల్ని ఎలా దూరం చేయగలడో!

 

    అమ్మ దుఃఖం చూస్తుంటే సముద్రపు అలలు గుర్తొచ్చాయి. ఇంక ఆమె బ్రతికున్నంతకాలం దానికి అంతం లేదు.

 

    తాతయ్య చిన్న పిల్లాడిలా 'బే...ర్...'మని ఏడుస్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోకుండా మా అందరికీ ఇష్టమైన మా చిన్నక్క నిశ్చింతగా కళ్ళుమూసుకుని ఉంది.

 

    మమ్మల్ని గులాబీ రేకులమీద నడిపించాలని ఎంతగానో ఆశపడింది ఒకనాడు! ఇప్పుడు ఒంటి ఒత్తి ప్రమిదై రెపరెపలాడ్తోంది. అన్నీ అడగకుండానే అందించే పిన్ని ఇంక లేదని అర్థమైన అక్క పిల్లలు ఆపకుండా ఏడుస్తున్నారు.

 

    బావ పెద్దక్కని ఓదారుస్తూ "ఈ సమయంలో అమ్మ, నాన్ననీ ఓదార్చాల్సిన దానివి... నువ్వే ఇలా అయిపోతే ఎలా?" అన్నాడు.

 

    గుమ్మం దగ్గర నిలబడ్డ నా భుజం మీద చెయ్యిపడి తల తిప్పి చూశాను. చైతన్య కనిపించాడు. భారమైన గొంతుతో "కాళింది పోతూ పోతూ నీకు బాధ్యతలు పెంచేసిపోయింది ఆముక్త" అన్నాడు.

 

    నేను అతనితో "బావా నాకో సహాయం చేస్తావా?" అని అడిగాను.

 

    "ఏం చెయ్యాలో చెప్పు తొందరగా" అన్నాడు చైతన్య.

 

    "ఓ పది గంపల గులాబీలు తెచ్చి పెడ్తావా?" అన్నాను.

 

    "అలాగే!" అని అక్కడినుండి వెళ్ళిపోయాడతను.

 

    వైజూ, చిత్రా, వెంకట్, రఫీ అందరూ వచ్చారు.

 

    అక్కని గులాబీరేకలు అమర్చిన పడకమీద పడుకోపెట్టాము. అయినా అదిచేసిన దానికి ఇది చాలా తక్కువే! ఎంత సుఖపెట్టాలని తపనపడింది మమ్మల్ని?

 

    మాధవ్ తల్లి "బంగారు తల్లిలాంటిపిల్ల మా కోడలౌతుందని ఆశపడ్డాను. భగవంతుడు చిన్న చూపు చూశాడు" అని శోకం పెట్టింది.

 

    మాధవ్ పాపం అన్నీ దగ్గరుండి చేస్తున్నాడు. అక్క బాడీని తీసుకురావడం దగ్గర్నుంచి అన్నీ తనే...

 

    "ఆ రోజు వెనక్కి పిలవకూడదనుకుని ఊరుకున్నాను తల్లీ! ఇంక అసలు వెనక్కే రావని తెలీదు" అంటూ అమ్మ నుదురుకొట్టుకుని ఏడ్చింది.

 

    మాధవ్ మొహంలో చాలా బాధ కనిపిస్తోంది.

 

    చివరిసారిగా అతనే అక్కతో మాట్లాడిన వ్యక్తి!

 

    'అమ్మ వెనక్కి పిలిచి వుంటే...' ఆలోచనలకి బ్రేక్ పడింది! అమ్మ ఎందుకు పిలవాలనుకుందీ? ఎర్రడైరీ మర్చిపోయిందని కదూ! అందులో ఏం రాసిందో...

 

    "ఇదంతా ఎలా జరిగిందీ? తను డాక్టరే కదా...కిడ్నీ ప్రాబ్లెమ్ అని తెలుసుకోలేదా?" అడిగాడు వెంకట్.

 

    "నిజమే! ఈ అనుమానాలు నాకూ వచ్చాయి. అక్క ఓ రెండు నెలలు ఉద్యోగ ప్రయత్నాలు అంటూ ఇంటికి రాలేదు. అప్పుడే ఏదో జరిగింది...ఏం జరిగుంటుంది!"

 

    అక్క అంతిమయాత్రకు వీడ్కోలు ఇచ్చిన తరువాత నేను మొదటిగా చేసిన పని అక్క ఎర్ర డైరీ పెట్లోంచి తీసి నా అల్మారాలో దాచడం!

 

    శ్శాశాన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మా ఇంట్లో వాతావరణం చెప్తోంది. ఎవరూ ఎవరికి ఎదురుపడకుండా, ఎదురుపడ్డా మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నాం.

 

    ఏం మాట్లాడినా చిన్నక్క జ్ఞాపకాలే ముసురుకుంటాయి. టీ.వీ.మీద కప్పిన బట్ట దగ్గర్నుంచీ కూరగాయల బుట్ట వరకూ అది తీర్చి దిద్దినవే!

 

    అత్తయ్యా, చైతన్యా ఇంకా ఊరువెళ్ళలేదు!

 

    తాతయ్య పూర్తిగా మంచంలో పడిపోయాడు.

 

    అమ్మకి మతి చలించిందేమోనని ఒక్కోసారి అనుమానం వస్తోంది. "అదిగో...నా చిన్న తల్లి... ఎర్రచీరలో దిష్టికొట్టేట్లుంది" ...అనో "తాతయ్యకు ఓసారి బీపీ చూడుతల్లీ" అనో కలవరిస్తోంది.

 

    నాన్నగారు పలుకురాని బొమ్మే అయిపోయారు.

 

    నాకు వంటపనితో సరిపోతుంది. వంట చెయ్యడం, వీళ్ళకి తినిపించడం రెండూ మహాయజ్ఞాలే! చైతన్య నాకు సహాయం చేస్తున్నాడు.

 

    నాన్న పెరట్లో చాలాసేపు ఉండిపోవడంతో, వెళ్ళి చూస్తే, పాత సైకిల్ రిపేరు చేస్తూ కనపడ్డారు!

 

    ఎందుకూ? అని అడగడానికి భయపడ్డాను. అప్పటికే వాలుకుర్చీ అటకమీదా, ఉన్నికోటు పెట్లో దాచేశారు.

 

    ఈ వయసులో రేపట్నుండీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడ్తారేమో అనిపించింది!

 

    నా వెనక అడుగుల శబ్దమై వెనక్కి తిరిగితే చైతన్య.

 

    "నిన్ను చూస్తే జాలేస్తోంది ముక్తా. మేం వెళ్ళిపోయాకా ఈ పెద్దవాళ్ళందర్నీ ఎలా సమర్ధిస్తావు" అన్నాడు.

 

    "నిజమే!! భవిష్యత్తు గూర్చిన ఏ ఆశాలేని రిక్తహృదయాలతో ఉన్న వారితో కలిసి నేనూ ఈ శూన్య గృహ్యకంలో ఓ కరిగిపోయే రోజుగా మారిపోతానేమో! బావి పళ్లెం దగ్గరే కూర్చున్నాను. నా పక్కన చైతన్య.

 

    "పెళ్ళి గురించి ఏం ఆలోచించావు ముక్తా?" నెమ్మదిగా అన్నాడు చైతన్య.

 

    "ప్రస్తుతానికి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను" అన్నాను.

 

    "నీ చదువు ఆగకూడదు. కావాలంటే నేను..."

 

    "వద్దు. నా ఇంటి బాధ్యతలు నన్ను తీసుకోనీ!"

 

    "నువ్వు బాగా చదువుకోవాలన్నది కాళింది కోరిక."

 

    "నాన్నగారు కష్టపడకూడదన్నదీ అక్క కోరికే!"