చీరలు తొందరగా పాతబడిపోతున్నాయా? ఇలా చేశారంటే కొత్త లుక్ మారవు..!
భారతదేశానికి, చీరలకు, మహిళలకు ఉన్న అవినాభావ సంబందం చాలా పెద్దది. సగటు భారతీయ మహిళ వార్డ్ రోబ్ లో బోలెడు రకాల చీరలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి ఏడాది వివిధ సందర్భాల కోసం మహిళలు చీరలు కొంటూనే ఉంటారు. అయితే కొత్తగా కొన్నప్పుడు చీరలకు ఉన్న లుక్ ఆ తరువాత కొన్ని రోజులకు ఉండదు. మరీ ముఖ్యంగా ఓ మూడు నాలుగు సార్లు కడితే చాలు అప్పుడే చీర పాతదానిలా కనిపిస్తూ ఉంటుంది. కానీ చీరలు ఎన్నాళ్లు అయినా సరే కొత్త లుక్ మారకూడదంటే ఈ కింది టిప్స్ పాటిస్తే సరి..
ఫోల్డింగ్ మిస్టేక్స్..
చీరలు ఉతకగానే వాటిని మడతపెట్టి, ఐరన్ చేయించి భద్రపరచడం అందరూ చేసే పని. అయితే చీరలు ఇలా మడత పెట్టి ఎక్కువకాలం అలాగే ఉంచకూడదు. దీనివల్ల చీరల రంగు చాలా తొందరగా డల్గా మారిపోతుంది. పైపెచ్చు చీరలు చాలా దట్టమైన ముడతలు పడతాయి. అందుకే చీరలు మడతపెట్టి బీరువా లేదా వార్డ్ రోబ్ లో ఉంచితే వాటిని అప్పుడప్పుడు తిరిగి మడతపెడుతూ ఉండాలి. అదేవిదంగా చీరలను వెలుతురు పడని ప్రదేశాల్లో ఉంచాలి.
వాషింగ్ మిస్టేక్స్..
చీరలు ఉతికే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్ని చీరలు ఒకే విధంగా ఉతకడం సరికాదు. కొన్ని చీరలు వాషింగ్ మెషీన్లో వేయవచ్చు, మరికొన్ని డ్రైక్లీనింగ్ ఇవ్వవచ్చు. మరికొన్ని చీరలు చేతితో తేలికగా ఉతకడం మంచిది. చీరలు కొన్నప్పుుడే వాటిని ఎలా ఉతకాలో తెలుసుకోవాలి.
ఐరన్ మిస్టేక్స్..
ఐరన్ చేయడం వల్ల చీరలు మాత్రమే కాదు ఏ దుస్తులు అయినా కొత్తగా, మరెంతో నీట్ గా కనిపిస్తాయి. అయితే దుస్తులను ఎప్పుడూ ఎక్కువ వేడి మీద ఐరన్ చేయకూడదు. తక్కువ వేడి మీద అందులోనూ స్టీమ్డ్ ఐరన్ బాక్స్ లు మంచి నాణ్యత కలిగిన వాటితో మాత్రమే చేయడం మంచిది. ఇక మరీ ముఖ్యంగా సిల్క్, పట్టు చీరలు, కాటన్.. వంటి ఫ్యాబ్రిక్స్ కు అనుగుణంగా టెంపరేచర్ ను సెట్ చేసుకోవాలి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు వాటి మీద కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేయాలి. ఇలా చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినదు. రంగు కూడా మారదు.
స్టైన్ మిస్టేక్స్..
దుస్తులన్నాక ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో మరకలకు గురి కావడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇలా మరకలు పడినప్పుడు కంగారులో ఎలా పడితే అలా వాటిని తొలగించకూడదు. మొదట మరకను నీటితో క్లీన్ చేయాలి. ఆ తరువాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేయాలి.
స్టోరేజ్ మిస్టేక్స్..
చీరలను స్టోర్ చేయడంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పట్లో చీరలు థ్రెడ్ వర్క్ లోనూ, స్టోన్ వర్క్ లోనూ, మగ్గం వర్క్ లోనూ, మరికొన్ని బీడ్స్ వర్క్ లోనూ ఉంటాయి. వీటిని విడి విడిగా స్టోర్ చేయాలి. అన్ని కలగలిపి పెడితే రాళ్లు, పూసలు, దారాల మధ్య రాపిడి జరిగి చీరల దారప్పోగులను, చీర ఫ్యాబ్రిక్ ను దెబ్బ తీస్తాయి.
*నిశ్శబ్ద.
