ముఖానికి ఆవిరి పడితే కలిగే లాభాలు ఇవే..!


ఆడవారికి అందం మీద చాలా ఆసక్తి ఉంటుంది.  ఎవ్వరిముందైనా సరే అందంగా కనిపించాలనే కోరుకుంటారు. కొందరు మేకప్ తో అందానికి మెరుగులు దిద్దుకున్నా నేచురల్ బ్యూటీ అనే ట్యాగ్ వేయించుకోవడం అందరికీ ఇష్టం.  ముఖారవిందాన్ని ద్విగుణీకృతం చేసే చిట్కాలు చాలానే ఉంటాయి.  వాటిలో ముఖానికి ఆవిరి పట్టడం కూడా ఒకటి. బ్యూటీ పార్లర్ కు వెళితే తప్పనిసరిగా ఆవిరి కూడా బ్యూటీ ట్రీట్మెంట్  లో ఉంటుంది. ముఖానికి ఆవిరి పడితే చాలా లాభాలు ఉంటాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  అవేంటంటే..


ముఖానికి ఆవిరి పడితే మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి.   చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.  చర్మ రంధ్రాలలో పేరుకున్న మురికి తొలగిపోతుంది.  ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. అలాగే బ్లాక్  హెడ్స్ రాకుండా నివారిస్తుంది కూడా.  అయితే ముఖానికి ఆవిరి పట్టడం మంచిదని దీన్ని రెగ్యులర్ గా ఫాలో అయితే చర్మం చాలా సెన్సిటివ్ అవుతుంది.  చర్మ రంధ్రాలు చాలా వెడల్పు అవుతాయి. కాబట్టి ఆవిరిని వారానికి ఒక సారి లేదా 10 రోజులకు ఒకసారి పట్టాలి.


అప్పుడప్పుడు ఆవిరి పట్టడం వల్ల ముఖం పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ అవుతాయి.  చర్మం క్లియర్ గా మారుతుంది.  చర్మంలో అదనపు నూనె పేరుకోవడం తగ్గుతుంది.  ఇది జిడ్డు చర్మం నివారించడంలో సహాయపడుతుంది. చర్మం హైడ్రేట్ గా ఉండటంలో తోడ్పడుతుంది.


ముఖ చర్మంలో మురికి,  నూనెలు పేరుకుపోవడం, చర్మ సంరక్షణ పాటించకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు వస్తాయి.  అదే ముఖానికి అప్పుడప్పుడు ఆవిరి పడుతూ ఉంటే చర్మ రంధ్రాలు క్లియర్ గా ఉంటాయి.  ఇది మొటిమలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది.


ముఖానికి ఆవిరి పట్టడం హైడ్రా ఫేషియల్ లాగా పనిచేస్తుంది.  హైడ్రా ఫేషియల్ ముఖంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.  ముఖానికి  ఆవిరి పట్టడం వల్ల కూడా అదే ఫలితాలు ఉంటాయి.  దీని వల్ల ముఖం  కాంతివంతంగా మారుతుంది.


కనీసం వారానికి ఒక్కసారి ముఖానికి ఆవిరి పడుతూ ఉంటే ముఖ చర్మం రిలాక్స్ గా ఉంటుంది.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  అంతేకాదు ఇలా వారానికి ఒకసారి ఆవిరి పడుతూ ఉంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.  ఆవిరి ప్రక్రియ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.


                                                      *రూపశ్రీ.