జుట్టు పెరుగుదల కోసం రోజ్మేరీ ఆయిల్ వాడుతున్నారా...ఈ ప్రమాదం ఉందని తెలుసా!

 


ఆరోగ్యకరమైన జుట్టు కోసం అమ్మాయిలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.  అంతేనా బోలెజు జుట్టు పెరుగుదల ఉత్పత్తులు ఉపయోగిస్తారు.  జుట్టు ఆరోగ్యం విషయానికి వస్తే కొబ్బరి నూనె, ఉల్లిపాయ నూనె,  బాదం నూనె వంటివి చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో జుట్టు పెరుగుదల విషయంలో   రోజ్మేరీ బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది జుట్టు పెరుగుదల కోసం రోజ్మేరీ నూనెను ఉపయోగించమని రికమెండ్ చేస్తున్నారు కూడా. అయితే ఇది  కేవలం సోషల్ మీడియా ట్రెండ్ అయితే కాదు..  ఎందుకంటే రోజ్మేరి చాలా ఏళ్ల నుండే జుట్టు పెరుగుదలలో, జుట్టు సంరక్షణలో ఉపయోగించబడుతోంది.  అయితే రోజ్మేరీ వల్ల జుట్టు పెరుగుదల అని చెప్పడమే కాకుండా.. జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది.  ఇది నిజమేనా అని చాలా మంది షాకవ్వచ్చు. కానీ ఇది నిజమే.. రోజ్మేరీ జుట్టు పెరుగుదలకు ఎలా సహాయపడుతుందో? ఇదే రోజ్మేరీ జుట్టు రాలిపోవడానికి కూడా ఎలా కారణం అవుతుందో తెలుసుకుంటే..

రోజ్మేరీ ప్రయోజనాలు..

జుట్టు పెరుగుదల..

రోజ్మేరీ నూనె తలకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఇది జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది.  ఆరు నెలలు రోజ్‌మేరీ నూనెను ఉపయోగిస్తుంటే జుట్టు పెరుగుదల చాలా ఆశాజనకంగా ఉంటుంది.  

చుండ్రును తగ్గిస్తుంది : రోజ్మేరీ  నూనెలో  యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి చుండ్రును ఎదుర్కోవడానికి సహాయపడతాయి. రోజ్మేరీలో రోస్మరినిక్ ఆమ్లం, కార్నోసిక్ ఆమ్లం,  కార్నోసోల్ ఉన్నాయి, ఇవి యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి.   రోజ్మేరీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద లేదా చికాకు కలిగించే నెత్తిమీద చర్మాన్ని ట్రీట్ చేస్తాయి. కాలక్రమేణా పొరలుగా మారడాన్ని తగ్గిస్తాయి.

రోజ్మేరీ ఆయిల్ జుట్టు రాలడానికి కారణమవుతుందా?

రోజ్మేరీ నూనె జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడినప్పటికీ ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుందని కొందరు అంటున్నారు.  దానికి ఈ కింది విషయాలు కారణం కావచ్చు.

పలుచన ..

రోజ్మేరీ నూనె చాలా గాఢంగా ఉంటుంది. క్యారియర్ ఆయిల్‌తో కలపకుండా నేరుగా తలకు పూయడం వల్ల చికాకు కలుగుతుంది. ఇది చర్మం ఎర్రబడటం, దురద,  వాపుకు దారితీస్తుంది. దెబ్బతిన్న తల చర్మం జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.

అధిక వినియోగం..

రోజ్మేరీ నూనె జుట్టు రాలడానికి  దాన్ని అతిగా వాడటం కూడా కారణం కావచ్చు. దీన్ని తరచుగా రోజువారీగా లేదా అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నెత్తిమీద నూనె పేరుకుపోతుంది. ఇది జుట్టు కుదుళ్లు మూసుకుపోవడానికి, సహజ నూనె ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది.  దీని వల్ల తలలో అధిక జిడ్డును ఏర్పడుతుంది. ఈ రెండూ జుట్టు బలహీనపడటానికి,  జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి.

 అలెర్జీ..

కొంతమందికి రోజ్మేరీ నూనె అప్లై చేసిన తర్వాత అలెర్జీ రియాక్షన్స్  ఉండవచ్చు. అలెర్జీ రియాక్షన్స్   లక్షణాలలో దురద ఒకటి. ఇది  పదేపదే తలలో గోకడానికి కారణమవుతుంది.  తలపై తరచుగా గోకడం వల్ల  జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఇది  జుట్టు సహజంగా పెరగడానికి  ఆటంకం కలిగిస్తుంది.  జుట్టు రాలడానికి దారితీస్తుంది.

బలహీనమైన జుట్టు..

రోజ్మేరీ నూనె జుట్టు రాలడానికి కారణమవుతుంటే దానికి మూలకారణం రోజ్మేరీని కొత్తగా వాడటం మొదలుపెట్టడమ. ఈ నూనె వాడటం ప్రారంభిచిన కొత్తలో కొంతమందికి జుట్టు రాలడం పెరుగుతుంది . దీనికి కారణం రక్త ప్రసరణ మెరుగుపడి కొత్త, ఆరోగ్యకరమైన జుట్టు పెరగడం ప్రారంభించినప్పుడు  బలహీనమైన జుట్టు రాలిపోవచ్చు. ఇలా జుట్టు రాలడాన్ని నూనె సైడ్ ఎఫెక్ట్ గా భావించకూడదు.  ఈ సమస్య కొన్ని వారాలలోనే సాల్వ్ అయిపోతుంది.

తల చర్మ ఆరోగ్యం..

 సెబోర్హెయిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి  సమస్లుయ ఉంటే రోజ్మేరీ ఆయిల్ సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఇది ఈ నెత్తిమీద సమస్యల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. జుట్టు రాలడానికి కూడా దారితీయవచ్చు. ఇలాంటి చర్మవ్యాధి సమస్యలు ఉన్నవారు  రోజ్మేరీ ఆయిల్‌తో సహా ఏదైనా ముఖ్యమైన నూనెను ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.


                                             *రూపశ్రీ.