ఈ కొరియన్ సీక్రెట్ టిప్స్ ఫాలో అయితే చెక్కు చెదరని అందం మీ సొంతం..!

 


అందానికి నిర్వచనంగా అమ్మాయిలను చెబుతుంటారు.  అందుకే అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం ఉవ్విళూరుతుంటారు.  అయితే అందరికీ ఇది అంత సులువు కాదు.  చక్కని జీవనశైలి,   మంచి ఆహారం అందంగా కనిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.  అయితే అన్నింటికంటే  అందం అనేది పుట్టుకతో లభించాలి.  ఆ తరువాతే దాన్ని ఆరోగ్యకరమైన పద్దతులలో కాపాడుకోపచ్చు. కొందరికి అందం ఉన్నా దాన్ని కాపాడుకోవడం తెలియదు.  అంతా నిర్లక్ష్యం చేసి ఆ తరువాత అయ్యో అప్పుడు జాగ్రత్త పడాల్సిందే అనుకుంటూ ఉంటారు.  కానీ ఇప్పుడు ప్రపంచమంతా కొరియన్ల వైపే దృష్టి కేంద్రీకరిస్తోంది.  గాజులాంటి ముఖ ఛాయతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు కొరియన్లు.  దీనికోసం కొరియన్లు పాటించే సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే అందరూ గాజు బొమ్మలు అయిపోవచ్చు.  


గువాషా ఫేషియల్..


గువాషా ఫేషియల్  చాలా ప్రత్యేకమైనది.  ఇందులో ఒక ప్రత్యేకమైన రాయితో ముఖాన్ని మసాజ్ చేస్తారు.  ఇది రక్త ప్రసరణను పెంచుతుంది.  ముఖం ఉబ్బినట్టు ఉండటాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీనికోసం సూచించిన రాయిని కొనుగోలు చేసి,  మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుని  దీన్ని అందరూ  ఫాలో కావచ్చు.


జాడే రోలింగ్..


 జాడే రోలింగ్ లో జేడ్ రోలర్ తో ముఖాన్ని మసాజ్ చేస్తారు. ఇది చూడటానికి కూరగాయల తొక్క తీసే పీలర్ ను పోలి ఉంటుంది.  దీనికి పై భాగంగా నునుపుగా ఉన్న రాయి సెట్ చేసి ఉంటారు.  దీన్ని పైకి కిందకూ కదిలిస్తుంటే రాయి ముందుకు, వెనక్కు మూవ్ అవుతుంది.  ఈ రోలింగ్ పద్దతి చర్మాన్ని చల్లబరుస్తుంది.  చర్మ వాపులు తగ్గిస్తుంది.  

 

కప్పింగ్ థెరపీ.


గ్లాస్ కప్పు సహాయంతో వాక్యూమ్ ఏర్పడేలా చేస్తారు. ఇది రక్తప్రసరణను పెంచుతుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది.


ఫేషియల్ మసాజ్..


భారతీయులకు చాలామందికి తెలిసింది ఫేషియల్ మసాజ్ మాత్రమే.  ఇది ముఖ కండరాలను సడలించండంలోనూ,  రక్త ప్రసరణను పెంచడంలోనూ సహాయపడుతుంది.  ఫేషియల్ కోసం వాడే పదార్థాలు ముఖానికి అదనపు ప్రయోజనాలు చేకూరుస్తాయి.


ఆక్యుపంక్చర్..


ఆక్యుపంక్చర్ సాధారణంగా కొన్ని అనారోగ్యాలు తగ్గించడానికి వాడతారు. కానీ బ్యూటీ ప్రపంచంలో మాత్రం బ్లాక్  హోల్స్ ను వదిలించుకోవడానికి, రక్త ప్రసరణ మెరుగ్గా ఉండటానికి,  కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ఆక్యుపంక్చర్ ఉపయోగిస్తారు.


తాయ్ చి..


తాయ్ చి అనేది ఒక పద్దతి.  ఇందులో లోతైన శ్వాస తీసుకుంటూ శరీరాన్ని వివిధ భంగిమలలోకి చాలా నెమ్మదిగా మార్చడం జరుగుతుంది.  ఇదొక శారీరక వ్యాయామ ప్రక్రియ.  ఇది శరీరాన్ని రిలాక్స్ గా ఉంచడంలోనూ,  ఒత్తిడిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.


క్విగాంగ్..


ఇది కూడా శ్వాసను నియంత్రించడం మీద ఆధారపడిన వ్యాయామం.  ఇది చాలా పురాతన పద్దతి.  ఇది శరీరంలో శక్తిని సమతుల్యం చేయడంలో,  శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.


 పై పద్దతులు అన్నీ పాటిస్తూంటారు కాబట్టే కొరియన్లు అంత అందంగా ఉంటారు. కేవలం బ్యూటీ టిప్స్ మాత్రమే అందాన్ని ఇవ్వవు,  వ్యాయామం,  వారి ప్రాచీన పద్దతులు, శ్వాస వ్యాయామాలు, వారి  జీవన విధానం వారికి అందాన్ని ప్రసాదిస్తున్నాయి.  భారతీయులు కూడా భారతీయ ప్రాచీన జీవనశైలి, ఆహారపు అలవాట్లు,  ప్రాచీన ఆయుర్వేద పద్దతులు,  ఆహార నియమాలు పాటిస్తుంటే ఇలాంటి అందం ఖచ్చితంగా సొంతమవుతుంది.


                                          *రూపశ్రీ.