పెదవుల పిగ్మెంటేషన్ పోవాలంటే...


టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది పెదవుల చుట్టూ నల్లగా ఉందని బాధ పడుతుంటారు. ఇది ఓ రకమైన పిగ్మెంటేషన్. చర్మం మీద అక్కడక్కడ ఏర్పడే గోధుమ రంగు మచ్చలే పిగ్మెంటేషన్ అంటారు. ఒకప్పుడు ఇది వయసు పెరిగాక వచ్చేది. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి తో , ఆహారపు అలవాట్లతో టీనేజ్ లోనే వస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ సమస్యను ఎదుర్కోవటం సులువే .
అవి

1. రోజు తగినంత మంచి నీరు తప్పనిసరిగా తాగాలి. అంటే  ఓ 12 గ్లాసుల నీరు అయినా తాగాలి.

2. పీచు పదార్దం సంవృద్దిగా లభించే ఆహారం తీసుకోవాలి.

3. సి - విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ జాతి పండ్లు ప్రతిరోజు ఆహారం లో ఉండేలా చూసుకోవాలి.

4. ముల్లంగి, కాకర, కీర, క్యారట్, చర్మ సంరక్షణలో ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వారంలో కనీసం మూడు రోజులు అయినా వాటిని తీసుకోవాలి.

5. ఆకుకూరలు లో వుండే విటమిన్- ఏ చర్మ సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజు ఒక ఆకు కూర ఆహరం లో ఉండేలా చూసుకోవాలి.

6. దానిమ్మ పండుని వారం లో రెండు సార్లు అయినా తింటే , అందులోని పోషకాలు చర్మానికి అందాన్ని ఇస్తాయి.

ఇంట్లో చేసుకోదగిన చికిత్సలు :

1. ఒక చెమ్చా పచ్చి పాలు లో ఒక చెమ్చా సెనగ పిండి, అర చెమ్చా పసుపు కలిపి పెదవుల చుట్టూ నల్లగా వున్న చోట రాయండి. 20 నిముషాలు పాటు ఆరనిచ్చి చల్ల నీటితో కడిగేయండి.

2. నల్లబడిన చర్మాన్ని మెరిపించగలిగే శక్తి నిమ్మ రసానికి వుంది. పావు చెమ్చా నిమ్మరసం లో ఒక చెమ్చా తేనె, ఒక చెమ్చా పెరుగు కలిపి పెదవుల చుట్టూ నల్లగా వున్న చోట రాసి ఆరాక కడిగేయాలి.

3. ఇంట్లో ఆలు వుంటుంది కదా. అది చాలు నల్లపడ్డ చర్మాన్ని తెల్లగా చేయటానికి. ఒక ఆలు ముక్కని తీసుకుని పెదవుల చుట్టూ నెమ్మదిగా రుద్దండి. ఇలా ఓ పావుగంట పాటు రోజు చేస్తే , 15 రోజులలో సమస్య తగ్గుముఖం పడుతుంది.

4. అరటిపండు, జామ పండ్లని మెత్తగా పేస్టు చేసుకుని నల్లబడిన చర్మం పైన రాసి.. బాగా ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి అయినా చేస్తే మంచి ఫలితం వుంటుంది.

5. టమాటోని మెత్తగా చేసి అందులో కొంచం నిమ్మరసం పిండి, పసుపు కలిపి పెదవుల చుట్టూ పట్టించి, ఆరాక కడిగేయాలి. టమాటో ముక్కతో నేరుగా చర్మం పైన రుద్దినా కూడా మంచి ఫలితం వుంటుంది.

6. ఆల్మండ్ ఆయిల్, వెనిగర్ కూడా చర్మాన్ని సంరక్షిస్తాయి. వీటిని నేరుగా చర్మం మీద రాశి ఆ తర్వాత కడిగేయాలి. వెనిగర్ ని నీటిలో కలిపి ముఖాన్ని కడిగినా కూడా మంచిదే.

-రమ