భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే..

మనిషి దృఢ సంకల్పంతో ఉంటే ఎంత పెద్ద పని అయినా  సులభంగా చేయగలుగుతాడు. ఈ  విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఎంతోమంది వ్యక్తుల  జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇలాంటి వారిలో బచేంద్రి పాల్ కూడా ఒకరు. బచేంద్రి పాల్ అనే పేరు వినగానే చాలామందికి ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తోందా?  చిన్నప్పుడు  జి.కే బిట్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు పరిచయమే. ఎవరెస్టు శిఖరాన్ని అధిగమించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్ అని టక్కున చెప్పేవాళ్ళం.  1984లో మహిళలకు ఈ సమాజంలో ఏమాత్రం ప్రోత్సాహం లభించని కాలంలో బచేంద్రి పాల్ సాధించిన ఈ ఘనతకు ప్రపంచం యావత్తు సలామ్ చేసింది. మహిళలకు స్పూర్తిని రగిలించే ఈమె గురించి తెలుసుకుంటే..

బచేంద్రి పాల్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా నకూరి గ్రామంలో 1954 మే 24న జన్మించారు. ఈమె అప్పటికే  బిఎలో గ్రాడ్యుయేషన్,  సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, బచేంద్రి పాల్ తన బి.ఎడ్ పూర్తీ చేసింది. ఆమె ఉపాధ్యాయురాలు కావాలని ఆమె కుటుంబం ఆశించింది. అందుకు తగ్గట్టే ఆమెను భోదనా రంగంవైపు వెళ్లమని సూచించింది. కానీ బచేంద్రి పాల్ కు మౌంటెనింగ్ మీద చాలా ఆసక్తిగా ఉండేది. ఆమె లక్ష్యం, కుటుంబ సభ్యుల అభ్యర్థన వేరు వేరు ఉండటంతో ఆమె ఏం చేయాలనే విషయం పై గందరగోళం అనుభవించింది. కానీ చివరికి తన అభిరుచినే ఆమె కొనసాగాలని నిర్ణయించుకుంది.  కానీ పర్వతారోహకురాలు కావడానికి పాల్‌కు  కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. బచేంద్రి పాల్ తండ్రి కిషన్ పాల్ సింగ్ సాధారణ వ్యాపారవేత్త.

లక్ష్యం వైపు ఎలా వెళ్ళిందంటే..

బచేంద్రి పాల్ మౌంటెనీరింగ్ మీద  ఆసక్తితో   నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది.  ఈ  ఇన్‌స్టిట్యూట్‌ వారు 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఒక సాహసయాత్ర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరు  పేరు ఎవరెస్ట్ 84. ఈ టీమ్‌లో బచేంద్రి పాల్ కూడా ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కడానికి వీరికి శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ తర్వాత వీరి  బృందం అదే సంవత్సరం మేలో ఎవరెస్ట్ అధిరోహణకు  బయలుదేరింది. మే 23, 1984న, బచేంద్రి పాల్  ఎవరెస్ట్ అధిరోహిస్తున్న సమయంలో వాతావరణం చాలా వ్యతిరేకంగా ఉంది, మంచు  తుఫాను ప్రభావం అధికంగా ఉంది. అయనా ఆమె ఎక్కడా వెనుదిరగకుండా  కఠినమైన మార్గం గుండా ప్రయాణించి  ఎవరెస్ట్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించింది.

ఈమె  భారతదేశానికి తెచ్చిన గుర్తింపుకు గానూ 1984లో పద్మశ్రీ, 1986లో అర్జున అవార్డు అందుకున్నారు. ఇది కాకుండా, ఈమె 2019 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలిచారు.

                                                                  *నిశ్శబ్ద