భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..
భారతదేశంలో వివాహ బంధానికి చాలా గొప్ప ప్రాధ్యాన్యత ఉంది. అయితే దురదృష్టవశాత్తు నేటికాలంలో ఈ వివాహ బంధం చాలా పెలుసుగా మారిపోయింది. నిన్నటిదాకా ఎంతో నవ్వుతూ గడిపిన భార్యాభర్తలు సడన్ గా గొడవ పడతారు. ఆ తరువాత విడాకులు అంటారు. ఇలాంటి సంఘటనలే ఎక్కువ ఉన్నాయి చాలాచోట్ల. పెళ్ళిళ్ళు ఏమో ఆకాశమంత పందిరి వేసి ఎంతో ఘనంగా చేసుకుంటారు కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం చతికిలబడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినా, విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యకారణం ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే వెంటనే చేయాల్సిన పని ఒకటుంది.
షేరింగ్ వద్దు..
భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే చాలామంది తమకు దగ్గరగా ఉన్న వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అయితే తల్లులు, స్నేహితురాళ్లు,ఎవరూ ఊహించని విధంగా వారి నుండి దూరమైన పాత ప్రియుడికి కూడా తన భర్తతో ఉన్న విభేధాల గురించి చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల గొడవ గురించి అందరికీ చెప్పుకోవడం వల్ల బంధం పట్ల ఇతరుల్లో చులకన భావం ఏర్పడుతుంది, మనుషుల మీద కూడా చిన్న చూపు కలుగుతుంది. ఇలాంటి సందర్బాలలో చాలామంది రెచ్చగొడుతుంటారు. నువ్వలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంటారు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ నిజమేనని అనిపిస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే బంధం మరింత బలహీనం అవుతుంది తప్ప తిరిగి బలంగా తయారవ్వదు.
వీళ్ళకు దూరంగా ఉండాలి.
లైఫ్ పార్టనర్ తో గొడవలు జరిగినప్పుడు పొరపాటున ఎప్పటినుండో పరిచయం ఉన్నవారికి చెప్పుకుంటే వారు కొన్ని సలహాలు ఇస్తారు. నిజానికి మంచి కోరేవారు అయితే బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో వారికి తెలిసి ఉంటుంది. సందర్భానికి తగినట్టు మంచి సలహా ఇస్తారు. కానీ అవతలి వారి జీవితంలో కూడా భార్యాభర్తల గొడవలుండి వారితో బంధం తెంచుకుని ఉంటే మాత్రం వారి సలహాలు తీసుకోకూడదు. ముఖ్యంగా జీవితంలో వివిధ సమస్యలతో డిప్రెషన్ అనుభవిస్తున్న వారి సలహాలు తీసుకోవడం, వారికి దగ్గరగా ఉండటం చేయకూడదు. డిప్రెషన్ ఉన్నవారికి సహాయం చేయవచ్చు కానీ వ్యక్తిగత బంధాలు, వాటి నిర్ణయాలు వారి చేతిలో పెట్టకూడదు.
ఎంటర్టైన్మెంట్ కావొద్దు..
కొందరికి గొడవలంటే భలే ఇష్టం ఉంటుంది. ఇలాంటి వారు భార్యాభర్తల మధ్య గొడవలను చూసి పైకి అయ్యో పాపం అంటున్నా లోలోపల సంతోషపడుతుంటారు. వీరిది కాస్త మానసిక శాడిజం అని చెప్పవచ్చు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా చెప్పేవారు కూడా ఎంతో స్నేహితులు అయినట్టు ఉంటారు. వీరినుండి కూడా దూరం ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు భార్యాభర్తల విషయాలు చెప్పడం కానీ, వారి సలహా తీసుకోవడం కానీ చేయకూడదు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదని అనుకున్నా, జరిగిన గొడవలు పరిష్కారం కావాలన్నా కచ్చితంగా పైన చెప్పుకున్న మనుషులకు దూరంగా ఉండాలి.
*నిశ్శబ్ద.