విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ..


'కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నిలవద"ని పండితుడు, చరిత్ర కారుడు, విజ్ఞానచంద్రికా మండలి స్థాపకుడు అయిన శ్రీ కొమ్మ జాజు లక్ష్మణ రావుగారి భావన. సంఘ సంస్కారి, సేవాతత్పరురాలు, విద్యావతి, అబలా సచ్చరిత్ర రత్నమాల అనే బృహద్గ్రంధ రచయిత్రి అయిన శ్రీమతి భండారు అచ్చమాంబ శ్రీ లక్ష్మణరావు సోదరి. ఆమె అకాలమరణం చెందగా  ఆమె పట్లగల ఎనలేని  గౌరవ అభిమానాల కారణంగా ఆయన తన కూతురుకి అచ్చమాంబ అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాధికంగా పెంచి తనలో చెలరేగే వున్నత భావాలను, ఆదర్శాలను, సంస్కార భావాలను పసితనంనుంచే ఆమెకు నూరి పోశారు. అందుకే ఆమె దృష్టిలో స్త్రీ అంటే చీటికి మాటికి బేలగా కన్నీరుకార్చే బలహీనురాలు, వాజమ్మకాదు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో పరిష్కరించుకుని నిబ్బరంగా ముందుకు సాగిపోగల ఆత్మాభిమాని, కరుణామయి. సానుభూతికి బదులు గౌరవం అందుకోవలసిన మానవ జాతిలో సగభాగం స్త్రీ అని భావన.

ఆమె 1906 అక్టోబరు 6న గుంటూరులో జన్మించారు. ఆమె తల్లి శ్రీమతి రామకోటమాంబ. ఆమె పెరగటం, చదవటం మద్రాసులో జరిగింది. అశాంతి, కల్లోలం తొలగించి ప్రశాంతత నెలకొల్పాలని అవసరంలో వున్నవారికి చేయి అందించాలని ఆమెకు చిన్ననాటినుంచే అనిపించేవి. వస్తుతః స్వతంత్రభావన అధికంగాగల ఆమె చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితుసాలైంది. విదేశీ వస్తు వస్త్రాలను బహిష్కరించింది. నూలు వడికేది, ఖాదీ ధరించేది ఉబుసుపోక కాలక్షేపానికి యేపని చేయటం ఆమెకు నచ్చదు. ప్రతిదాని గురించి చాల తీవ్రంగా ఆలోచించటం అలవాటు. 

1923లో అనుక్షణం ఆమెను తీర్చిదిద్దుతున్న తండ్రి అకస్మాత్తుగ గుండెపోటుతో మరణించారు. జీవితానికొక లక్ష్యమంటూ ఉండాలన్న సంకల్పంతో ఆమె మెడికల్ కాలేజిలో చేరారు. ఎప్పుడూ యేవో సభల్లో సమావేశాలలో పాల్గొంటు ధాటిగా వుపన్యసించేవారు. సైమన్ కమిషన్ పట్ల నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించిన యూత్ లీగ్ లో చేరి జాతీయోద్యమ ప్రచారం చేశారు. తల్లి రామకోటమాంబగారితో సహా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి వుద్యమం నడిపారు. తుపాకి పోట్లకి, లాఠీ దెబ్బలకు క్షతగాత్రులయిన వాలంటీర్ల సపర్యలకు చికిత్సకు ఆసుపత్రి నెలకొల్పారు. 1931 నాటికి మెడికల్ కాలేజీలో చదువు ముగిసింది. కాని ఆమెకు సంతృప్తి కలగలేదు. శిశు సంరక్షణ, ప్రసూతి శాస్త్రాలు యింకా బాగా చదివి, దేశంలోని స్త్రీలకు మరింతగా వైద్య సహాయం అందించాలన్న తలంపుతో ఇంగ్లండులో  చదివి, మూడు ప్రత్యేక పరీక్షలు నెగ్గి డిగ్రీలతో వచ్చారు. 

స్త్రీలకు విజ్ఞాన వికాసాలు కల్పించాలనే కోరికతో ప్రసూతి, శిశు పోషణ అనే గ్రంథాన్ని తెలుగులో సులభ శైలిలో అందరికి అర్థమయ్యే పదాలతో వ్రాశారు. ఆనాటివరకు అటువంటి వైద్య పుస్తకం సామాన్య ప్రజల అందుబాటులోకి రాలేదు. అందువల్ల ఆ పుస్తకం  ప్రచారంపొంది ఆమె ఆశయం తీరింది. అధిక ఆహారోత్పత్తి ప్రచార సందర్భంలో డాక్టరు అచ్చమాంబ స్వయంగా గునపం పట్టుకుని ప్రతి రోజు కొన్ని గంటలకాలం తవ్వటం, మట్టి మోయటం వంటి పనులు చేశారు. అతి నాజూకైన సూక్ష్మ పరికరాలు పట్టి ఆపరేషన్లు చేసే డాక్టరు గునపంపట్టి యెండలో తవ్వుతుంటే మరి అనుసరించే అభిమానులకు కొరత వుండదుగదా. ప్రజలకు అత్యంత సన్నిహితులై నారు. 1940లో వఝల వెంకటరామశాస్త్రి గారిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి లక్ష్మీ వారి ఏకైక సంతానం.  

పసివారిని చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తతో పెంచి, తీర్చి దిద్దితే వాళ్లు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యవంతులైన చక్కని భావి పౌరులు కాగలరని ఆమె నమ్మకం. 20 మంది పిల్లలు, 11 మంది టీచర్లతో ఆమె విజయవాడలో స్థాపించిన మాంటిసోరీ స్కూలు ఈనాడు వేలకొద్దీ పిల్లలతో, వందమంది టీచర్లతో, బ్రహ్మాండమైన గ్రంథాలయంతో స్వంత భవనాలతో విజయవంతంగా నడుస్తోంది. 1948 జూన్లో శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు. రాయవేలూరులో 7 నెలలు గడిపి వచ్చారు. 1957లో కాంగ్రెసు తరఫున శాసన సభకు ఎన్నికయినారు.  1964 అక్టోబరు 20న గుండె పోటుతో మరణించారు. ఆ సమయంలో ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టుకున్నారు. ఇలా కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది.

                                          *నిశ్శబ్ద.