సందీప్ కిషన్ ' రన్ ' కంప్లీట్ రివ్యూ
on Mar 24, 2016
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మళ్లీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సందీప్ కిషన్. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, సందీప్ కు వర్కౌట్ అవలేదు. అందుకే ఆల్రెడీ హిట్టయిన నేరమ్ సినిమాను నమ్ముకుని, తెలుగులో రన్ పేరుతో వచ్చాడు. మరి ఈసారైనా హిట్ కొట్టాడా..? చూద్దాం రండి
కథ
సంజయ్(సందీప్ కిషన్) తన స్నేహితుడి సాయంతో అత్యంత క్రూరుడైన వడ్డీ రాజా(బాబీ సింహా) దగ్గర అప్పు తీసుకుంటాడు. అదే సమయంలో, ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తానని తన ప్రేయసి అమూల్య తండ్రి(కాశీ విశ్వనాథ్) చెప్పడంతో అమూల్య(అనీషా ఆంబ్రోస్) ప్రేమను గెలుచుకోవడం కోసం జాబ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతలోనే అప్పు కట్టాల్సిన టైం చివరి రోజుకు వచ్చేస్తుంది. అప్పు తీర్చడమే కాక, తన ప్రేమను గెలిపించుకోవాలి, తనపై అమూల్య తండ్రి పెట్టిన పోలీస్ కేసు నుంచి తనను తాను కాపాడుకోవాలి. మరి ఆ చివరి రోజు సంజయ్ ఏం చేశాడు. చివరికి ఏం జరిగింది అనేది బ్యాలెన్స్ కథ.
పెర్ఫామెన్స్
సందీప్ కిషన్ తనకు అలవాటైన రీతిలో చాలా ఈజ్ తో నటించాడు. చిన్న చిన్న సీన్స్ లో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ పై మాత్రం ఇంకా దృష్టి పెట్టాలి. యాక్టింగ్ పరంగా అనీషా చేయగలిగిందేమీ లేదు. విలన్ పాత్ర వేసిన బాబీ సింహా పూర్తి స్థాయిలో విలనీని పండించాడు. ఎస్ ఐ పద్మావతిగా బ్రహ్మాజీ నవ్వించడానికి ట్రై చేశాడు గానీ పేలలేదు. పోసాని ఎంటర్టైన్ చేస్తే, మహత్ రాఘవేంద్ర బోర్ కొట్టించాడు.
టెక్నికల్ గా
రీమేక్ ను, యాజ్ ఇటీజ్ గా దింపేశాడు డైరెక్టర్ అనిల్ కన్నెగంటి. స్క్రీన్ ప్లే పరంగా కానీ, సీన్స్ తెరకెక్కించిన విధానంలో గానీ ఎక్కడా మార్పులు లేవు. పైపెచ్చు, కథలో కన్ఫ్యూజన్ తో కామెడీ చెయ్యబోయి ప్రేక్షకులను కూడా కన్ఫ్యూజ్ చేసేశాడు. సినిమాటోగ్రఫీ పర్లేదు. డైలాగులు అక్కడక్కడా మాత్రమే పర్లేదనిపిస్తాయి. సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. పాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.
ప్లస్ లు
సందీప్ కిషన్
విలన్ బాబీ
ఆసక్తికరమైన కథ
మైనస్ లు
బోర్ కొట్టించే కథనం
సాగదీసిన ఫస్ట్ హాప్
క్లైమాక్స్
తెలుగువన్ వ్యూ
తమిళ సూపర్ హిట్ కు రీమేక్ అనగానే, ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ టైప్ సినిమాలు ఇప్పటి వరకూ తెలుగులో చాలానే వచ్చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రన్ కోసం హాల్ కు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా టీవీల్లోకి వచ్చిన తర్వాత చూస్కోవడం మేలు.
రేటింగ్ : 2.25/5
-- లోకేష్ బండి