విజిల్ సినిమా రివ్యూ
on Oct 25, 2019
నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు తదితరులు
తెలుగు పాటలు, మాటలు: రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
నిర్మాతలు: కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్
తెలుగు విడుదల: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు
దర్శకత్వం: అట్లీ కుమార్
విడుదల తేదీ: 25 అక్టోబర్ 2019
తెలుగులో విజయ్ మార్కెట్ పెద్దది కాదు. కానీ, అతనికి కొంతమంది అభిమానులున్నారు. దీనికి తోడు అట్లీ చిత్రాల్లో 'రాజా రాణీ' మంచి విజయం సాధించింది. 'పోలీస్, అదిరింది' పర్వాలేదనిపించుకున్నాయి. అందువల్ల, 'విజిల్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ చూస్తే... హాకీ నేపథ్యంలో వచ్చిన షారుఖ్ ఖాన్ 'చెక్ దే ఇండియా'ను ఫుట్ బాల్ నేపథ్యం తీశారా? అనే సందేహాలను కలిగించింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ:
బిగిల్ అలియాస్ మైఖేల్ (విజయ్) మంచి ఫుట్ బాల్ ప్లేయర్. అతడి తండ్రి రాజప్ప (విజయ్) విశాఖలో రౌడీ. తండ్రి నేపథ్యం కారణంగా జాతీయ జట్టులో బిగిల్ కి చోటు దక్కదు. నేషనల్ ఫుట్ బాల్ టీమ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శర్మ (జాకీ ష్రాఫ్)తో రాజప్ప మాట్లాడి, కుమారుడికి చోటు దక్కేలా చూస్తాడు. బిగిల్ ఢిల్లీకి వెళ్లేరోజు రైల్వే స్టేషన్లో రాజప్పపై ఎటాక్ జరుగుతుంది. తండ్రి మరణాన్ని కళ్లారా చూసిన ఫుట్ బాల్ ప్లేయర్ కత్తి పడతాడు. కొన్నేళ్ల తర్వాత అదే ప్లేయర్ ఆంధ్రప్రదేశ్ మహిళల ఫుట్ బాల్ జట్టుకు ఎలా సెలెక్టర్ అయ్యాడు? తండ్రి కలను ఎలా సాకారం చేశాడు? మధ్యలో ఏంజిల్ ఆశీర్వాదం (నయనతార)కు, మైఖేల్ రాజప్పకు మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనేది సినిమా.
విశ్లేషణ:
పెళ్లి తరవాత మహిళా క్రీడాకారులు తమకు ఎంతో ఇష్టమైన ఆటకు దూరం కావడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆటపై దృష్టి పెడుతున్న అమ్మాయిలకు ప్రేమ పేరుతో వేధించే పోకిరీల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి? వంటి సమస్యలను సినిమాలో ప్రస్తావించాడు దర్శకుడు అట్లీ కుమార్. 'ప్రతిభకు, ఆత్మాభిమానానికి అందమైన ముఖం అవసరం లేదు' అని చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. పెళ్లి తరవాత మహిళలు వంటగదికి మాత్రమే పరిమితం కాకూడదని చెప్పాడు. 'చెక్ దే ఇండియా' స్ఫూర్తితో తమిళ నేటివిటీకి తగ్గట్టు కథను వండి వార్చాడు. తమిళంలో విజయ్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఫస్టాఫ్ అంతా సన్నివేశాలు రాసుకున్నాడు. ఆ తమిళ వాసన తెలుగు ప్రేక్షకులకు అంత ఇంపుగా అనిపించకపోవచ్చు. తెలుగులో విజయ్ కు స్టార్ ఇమేజ్ లేకపోవడం వలన, ఫస్టాఫ్ లో కొన్ని కొన్ని సన్నివేశాలు ఓవర్ అనిపిస్తాయి. ఫైట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ రొటీన్ ఫార్మాట్ లో ఉన్నాయి. తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ అనుకుంత రేంజ్ లో ఎలివేట్ కాలేదు. రాజప్ప ఆశయాన్ని ఒక్క సన్నివేశంలో మాటలతో చెప్పించడంతో సరైన ఇంపాక్ట్ కలగలేదు. సెకండాఫ్ లో 'చెక్ దే ఇండియా' తరహాలో ఫుట్ బాల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బావున్నాయి. ఏఆర్ రెహమాన్ పాటల్లో 'శివంగి', 'మానని' బావున్నాయి. మిగతావి విజయ్ అభిమానులను సంతృప్తి పరచడానికి అన్నట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావించిన తీరు
సెకండాఫ్
'మానని', 'శివంగి' పాటలు
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్
తమిళ నేటివిటీ
బలమైన ఎమోషన్ లేకపోవడం
కమర్షియల్ టెంప్లెట్ స్టోరీ, సీన్స్
నటీనటులు:
రాజప్ప, మైఖేల్... రెండు పాత్రల్లో విజయ్ వేరియేషన్స్ చూపించాడు. రెండు పాత్రలకు న్యాయం చేశాడు. విజయ్ మేనరిజమ్స్ అతడి అభిమానులకు నచ్చుతాయి. నయనతార పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. వివేక్ కామెడీ పండలేదు. యోగిబాబుది కూడా. విలన్ పాత్రలో జాకీ ష్రాఫ్ మంచి నటన కనబరిచాడు. ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలందరూ పాత్రలకు తగ్గట్టు చక్కగా చేశారు. లావుగా ఉన్న నటి ప్రేక్షకులకు గుర్తుండే సన్నివేశాల్లో నటించింది.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కమర్షియల్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్... సినిమాలో రెండూ ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో తమిళ నేటివిటీ ఎక్కువైతే, సోషల్ మెసేజ్ లో మహిళలను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కమర్షియాలిటీ వల్ల సినిమా నిడివి ఎక్కువైంది. ఫస్టాఫ్ ను, విజయ్ మేనరిజమ్స్ ను సగటు తెలుగు ప్రేక్షకులు కొంచెం భరించగలిగితే, సెకండాఫ్ లో సోషల్ మెసేజ్ ను అప్రిషియేట్ చేయవచ్చు. 'చెక్ దే ఇండియా' చూసిన ప్రేక్షకులకు సినిమా అసలు నచ్చదు. సాంప్రదాయ కుటుంబాల్లో మహిళలను వంట గదులకు ఎలా పరిమితం చేస్తున్నారనే సన్నివేశం, యాసిడ్ బాధితులు బాధతో నాలుగు గోడల మధ్య ఉండకూడదనే సన్నివేశం తప్పితే మిగతాదంతా రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ సినిమాగా అనిపిస్తుంది.
రేటింగ్: 2.25/5