పండగ చేస్కో రివ్యూ
on May 29, 2015
సక్సెస్ ఫార్ములా పట్టుకొని సినిమాలు తీయడం - కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే అన్న సంగతి మనవాళ్లకు ఎంత చెప్పినా బుర్రకెక్కదు. ఫలానా సినిమా హిట్టయ్యింది కదా అని చంకలు గుద్దుకొని, అదే కొలతలతో, అవే పడికట్టు సూత్రాలతో మరో సినిమా తీసేయడం.. పులిని చూసి నక్కవాతపెట్టుకోవడం లాంటిదే! డీ, రెడీ..ఈ సినిమాలు తెలుగు `సినిమా`కి చేసిన మేలేంటో తెలీదుగానీ కీడు మాత్రం చాలా ఎక్కువే చేశాయి. విలన్ ఇంట్లో హీరో తిష్టవేసుకొని కూర్చోవడం, మొత్తం గ్యాంగ్‌ని అంతటినీ అదే ఇంటికి తీసుకురావడం, అక్కడ జిమ్మిక్కులు చేయడం - విలన్లను ఇరగబాదేసి, వాళ్లకు బుద్ది చెప్పి శుభం కార్డు వేసేసుకోవడం - అంతే. సినిమా ఖతం. దుకాన్ బంద్! ఎన్ని సినిమాలు తీస్తారు? మనం ఇలాంటి కథలు ఎన్ని చూడాలి? సేమ్... అదే ఫార్మెట్‌లో రంగులు పూసుకొని వచ్చేసిన సినిమా... పండగ చేస్కో. రెండు మూడేళ్లుగా హిట్టంటే ఎరుగని రామ్... ఈ విన్నింగ్ ఫార్ములాని నమ్ముకొని - దిగిపోయాడు. ఇంతకీ పండగ చేస్కో కథేంటి? ఇందులో ఉన్న ఆ రోటీన్‌ఫార్ములా ఏంటి? రామ్‌కి ఈ సినిమా ఎంత వరకూ ఉపయోగపడుతుంది? తెలుసుకొందాం.. రండి.
పోర్చుగల్‌లో కార్తిక్ (రామ్) ఓ బిజినెస్ మాగ్నెట్. చిన్న వయసులోనే కోట్లు సంపాదిస్తాడు. పక్కా మనీ మైండెడ్. సేమ్ ఇలాంటి లక్షణాలే అనుష్క (సోనాల్)లోనూ ఉంటాయి. తానూ బిజినెస్ కోసం ఏమైనాచేస్తుంది. కార్తిక్‌ని పెళ్లి చేసుకొంటే.. తన బిజినెస్ మరింత డవలప్ అవుతుందని, రూ.300కోట్ల ఆస్తి కలిసివస్తుందని మ్యారేజ్ ప్రపోజల్ పెడుతుంది. దానికి కార్తీక్ కూడా ఓకే అంటాడు. మరో నెల రోజుల్లో పెళ్లి అనగా కార్తిక్ కంపెనీకి ఓ సమస్య వస్తుంది. ఇండియాలో ఉన్న కార్తిక్ కంపెనీ ఓ స్వచ్చంద సంస్థ వల్ల మూతపడే ప్రమాదంలో పడుతుంది. అదేంటో తేల్చుకొందామని ఇండియా వస్తాడు కార్తిక్. తన కంపెనీపై కేసు వేసింది ఎవరో కాదు.. సంధ్య (రకుల్ ప్రీత్‌సింగ్) అనే అందమైన అమ్మాయి అని తెలుసుకొంటాడు. సంధ్య కథ పూర్తిగా వేరు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోతారు. మావయ్య (సాయికుమార్ ) దగ్గర పెరుగుతుంది. తన నాన్న (సంపత్) అంటే సంధ్యకి ఇష్టమే. కానీ నాన్న, మావయ్య దెబ్బలాడుకోవడం మాత్రం తట్టుకోలేకపోతుంది. అందుకే ఇల్లు వదిలి వచ్చేస్తుంది. ఇండయా రాగానే... సంధ్య వెంటపడతాడు కార్తిక్. ఫ్యాక్టరీ మాట కూడా వదిలేసి.. 'నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ వెంటపడతాడు. సరిగ్గా ఇంట్రవెల్ సమయంలో ఓ విలన్ గ్యాంగ్ నుంచి సంధ్యను రక్షిస్తాడు. సరిగ్గా అప్పుడే... 'ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు.. సంధ్య కోసమే. సంధ్యని పెళ్లి చేసుకొందామనే ఇక్కడికి వచ్చా' అంటాడు. అసలు కార్తిక్‌కీ సంధ్యకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సంధ్యని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే... అనుష్కతో ఎందుకు ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నాడు. అసలు కార్తిక్ కథేంటి.?? అనేది తెలుసుకోవాలంటే సెకండాఫ్ కూడా చూడాల్సిందే.
ఢీ, రెడీ, రభస, కందిరీగ, బృందావనం, లౌక్యం... ఇలా ఏ కథని తీసుకోండి. ఒకే ఫార్మెట్ లో ఉంటాయి. హీరో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. హీరోయిన్ ని ప్రేమలో దించడానికి ప్రయత్నిస్తుంటాడు. అతనికో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓ ట్విస్టుతో ఇంట్రవెల్ పడుతుంది. సెకండాప్‌లో ఆ ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు. తన లక్ష్యం కోసం ఓ ఇంట్లో అడుగుపెడతాడు. ఆ ఇంటికే విలన్లతో సహా, టీమ్ అంతటినీ దింపేసి.. దాగుడు మూతలు ఆడేస్తాడు. క్లైమాక్స్‌లో ఇంటిబయట ఓ ఫైట్. అంతే.. మబ్బులు విడిపోతాయి. అందరూ తప్పు తెలుసుకొని ఓ గ్రూప్ పొటోకి ఫొజిస్తారు. శుభం కార్డు పడిపోతుంది. ఇంతకు మించి.. పండగ చేస్కోలో ఒక్క ముక్క ఎక్కువా లేదు. ఒక్క ముక్క తక్కువా లేదు. సరిగ్గా ఇవే కొలతలతో, పది పదిహేను సినిమాల్ని కలిపేసి ఓ చొక్కొ కుట్టేశాడు దర్శకుడు.
అరె.. ఈసీన్ ఫలానా సినిమాలో ఉందే. అని అడుగడుగునా ప్రేక్షకుడు ఉలిక్కి పడితే... ఆ తప్పంతా దర్శకుడిదే. ఏం చేసినా, ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టినా ప్రేక్షకుడికి వినోదాలు పంచేయడమే దర్శకుడి ఉద్దేశం కావచ్చు. కానీ కాపీ కాట్ లా పాత కథల్ని, పాత సన్నివేశాల్ని నమ్ముకొంటే ప్రతిఫలం ఉంటుందా? ఎంత కామెడీ చేసినా.. పాత సినిమాలకు పేరడీ సీన్లు చూసినట్టు ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. సీను సీను చూస్తుంటే టీవీలో కామెడీ బిట్టు గుర్తొస్తుంటాయి. అంతే తప్ప.. కథలోకి ప్రేక్షకుడు వెళ్లే అవకాశమే లేకుండా చేశాడు దర్శకుడు. పోర్చుగల్ ఎపిసోడ్ బోర్ కొట్టిస్తుంది. కార్తిక్ ఇండియాకొచ్చాక.. కాస్త ఫన్ పండే అవకాశం కనిపించింది. అయితే ఎమ్మెస్ చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పింది.. ఇది మారుతి బ్రాండు సినిమాఏమో అనే అనుమానాలు వచ్చేలా చేశాడు దర్శకుడు. `మా అమ్మాయితో ఓ రౌండ్ వేసుకురా అల్లుడూ` అంటూ చీప్ డైలాగులు పలికించాడు. ప్రేక్షకులంతా ఊహించినట్టే ఇంట్రవెల్లో ఓ ట్విస్టు. దాంతో సెకండాఫ్ ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మరీ ఘెరంగా ఉంటుంది. చెల్లాయి తప్పు చేస్తే.. పెళ్లాల్ని వదిలేసే అన్నయ్యలు మనకు ఈసినిమాలోనే కనిపిస్తారు. సెకండాప్ లో విడిపోయిన కుటుంబాల్ని కలిపేసి సరిగ్గా రెడీ స్ర్కిప్టుని ఇంకోసారి వాడుకొన్నాడు రామ్. బ్రహ్మానందంని రంగంలోకి దింపి, తనతో వచ్చీరానీ కామెడీ చేయించి.. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని వాడుకొని, చివరికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమానీ పేరడీ చేసి... కలగూరగంపలాంటి సినిమాని అందించాడు.
రామ్ ఎనర్జీని ఎప్పట్లానే 100శాతం చూపించాడు. కానీ కథల ఎంపికలో చేసిన తప్పేచేస్తున్నాడు. తాను చేసిన రెడీ, కందిరీగ కథల్నే మళ్లీ చెబితే... ఎలా గుడ్డిగా నమ్మేసి.. ఊ కొట్టాడో అర్థం కాదు. పతాక సన్నివేశాల్లో అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్‌లో బారెడు డైలాగులు చెప్పి , ఎమోషన్ పండించే ప్రయత్నం చేశాడు. అక్కడా కాపీనేనా.?? రకుల్ పాటల కోసమే వచ్చింది. సోనాల్ అయితే అదీ లేదు. ఎప్పుడో సినిమా స్టార్టింగ్‌లో కనిపించి, మళ్లీ ఎండింగ్‌లో దర్శనమిచ్చింది. మగరాయుడిలా వచ్చీరాని నటనతో భయపెట్టింది. ఓ పాటలో కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేసింది. సంపత్, సాయికుమార్, రావు రమేష్... ఇలా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరినీ సరిగా ఉపయోగించుకోలేదు. ఆఖరికి వీకెండ్ వెంకట్రావ్‌గా కూడా బ్రహ్మీ తన మ్యాజిక్ చూపింకలేకపోయాడు. అరవై డబ్భైమంది ఆర్టిస్టులను పెట్టుకోవడం కాదు. వాళ్లకు సరైన పాత్రలివ్వాలి. లేకపోతే.. తెరపై ఎంతమందున్నా వ్యర్థమే.
తమన్ బాదుడు ఈసినిమాలోనూ కంటిన్యూ అయ్యింది. రెండు పాటలు థియేటర్లో `చూడ్డానికి` బాగున్నాయి. బయటకు వచ్చి మళ్లీ వినేంత ఓపిక ఎవ్వరికీ ఉండదు. `మగధీర` టైపు ఆర్.ఆర్ ఒకటి వినిపించి తలపోటు తెప్పించాడు తమన్. కెమెరా వర్క్ బాగుంది. పాటల పిక్చరైజేషన్ ఆకట్టుకొంటుంది. కోన వెంకట్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి శాపంగా మారింది. ఎందుకంటే పాత వాసనలతో ప్రేక్షకుడికి ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు.
విన్నింగ్ ఫార్ములా అంటే.. పాత కథలనో, హిట్టయిన సినిమాలనో స్ఫూర్తిగా తీసుకోవడం కాదు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ కొత్తదారిలో నడిచి.. మరెన్నో కథలకు, సినిమాలకు ఆదర్శంగా నిలవాలి. అలా నిలిచిన సినిమాలు డీ, రెడీ అయితే.. కాపీ కొట్టి పాసైపోదామనుకొన్న సినిమాల లిస్టులో పండగ చేస్కో చేరుతుంది.