ముచ్చటగా మూడో సారి కలుస్తున్నారు!!
on May 22, 2019
యంగ్ హీరో రామ్ కి కలిసొచ్చిన దర్శకులలో కిషోర్ తిరుమల ఒకడు. వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన `నేను శైలజ`(2016) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అనంతరం `ఉన్నది ఒకటే జిందగీ` (2017) తోనూ ఈ కాంబినేషన్ అలరించింది. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఈ ద్వయం జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం `తడమ్` ను తెలుగులో రీమెక్ చేయనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని సమాచారం. రామ్ నటిస్తున్న `ఇస్మార్ట్ శంకర్` విడుదల అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే తడమ్ రీమేక్ వెర్షన్ పై క్లారిటీ వస్తుంది.