హీరోయిన్స్ కేవలం అందుకేనా?
on May 29, 2015
ఇంతవరకూ హీరోయిన్ లేని సినిమా ఉందా? ఒకవేళ sసినిమాలో హీరోయిన్ లేకపోతే ప్రేక్షకులు థియేటర్ కు వెళతారా? సినిమా పేరు వినగానే హీరో-హీరోయిన్స్ ఎవరు అని అడుగుతారు కానీ....కేవలం హీరోగురించే మాట్లాడుకుంటారా? ఇంత ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ కి ఇస్తున్న క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ విలువెంత? ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగు పాటలు, మీటరు దుస్తులు! నేటి నాయికల పరిస్థితి ఇంతే? కారణం ఎవరు? దర్శకుడా?హీరోనా?ప్రేక్షకులా?
సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకూ అందరి ఫోకస్ హీరోయిన్ మీదే. విడుదల తర్వాత ఆ తార చొటెక్కడ? సినిమాలో ఫస్ట్ లుక్ లోనే నడుమో, పెదాలో లేదా ఎట్రాక్ట్ చేసే పార్ట్ ఏదో చూపించాకే హీరోయిన్ ని ఫుల్ గా చూపిస్తారు. అప్పటి నుంచీ పొదుపుమంత్రం తప్పని సరిగా పాటిస్తారు. గడ్డకట్టే మంచులో హీరోగారు చేతికి గ్లౌజెస్ తో సహా వేసుకుంటే అమ్మడు మాత్రం అందాల ప్రదర్శన చేయాల్సిందే. ఏమైనా అంటే ప్రేక్షకుడికి కావాల్సింది ఇదే అంటారు? నిజంగా ఇది నిజమేనా? ఇల్లీ నడుము, తమన్నా బొడ్డు, నయనతార బ్యాక్, అనుష్క స్ట్రక్చర్, కాజల్ ఫిగర్....రీసెంట్ గా చూస్తే రాశీ ఖన్నా హొయలు, రకుల్ విరుపు, రెజీనా ఒంపుసొంపులు. ఎక్కడ చూసినా హీరోయిన్ గురించి ఇవే డిస్కషన్ తప్ప వాళ్లలో అంతో ఇంతో ఉన్న నటన గురించి ప్రస్తావించరా?
పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది తమన్నా.చాలా సినిమాల్లో తమ్మూ చూట్టే కథ తిరుగుతుంది. వాటి విజయాల్లో ఈ బ్యూటీకి కూడా భాగం ఉంది. కానీ ఆ క్రెడిట్ అంతా హీరోలకు లేదా డైరెక్టర్స్ కి వెళ్లిపోయింది. టాలీవుడ్ ని మాయ చేసి ఎంట్రీ ఇచ్చిన సమంత వరుస హిట్లు కొట్టింది. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ సమంతని హిట్టిచ్చే హీరోయిన్ గా మాత్రమే చూశారు. లక్ష్మీ కళ్యాణంతో లక్షణంగా అడుగుపెట్టిన అందాల చందమామ టాలీవుడ్ దుమ్ముదులిపింది.అందం, అభినయంలో సరిసమానంగాతూగే కాజల్ కు ఇప్పటి వరకూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రే దొరకలేదు. ఫస్ట్ సినిమా దేవదాసుతో ఫుల్ మార్క్స్ కొట్టేసిన ఇలియానాలో నడుము తప్ప నటన ఎవ్వరూ చూడలేదు. కానీ బాలీవుడ్ లో ఫస్ట్ సినిమా 'బర్ఫీ'తో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. పద్నాలుగేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఛార్మి.. హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్ చేసి కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకుంది. కానీ అందాల ప్రదర్శనకే వాడుకుని మూడుపదులైనా నిండకుండానే బోర్ కొట్టేలా చేశారు. శ్రియ మేని వంపులపై తప్ప నటనకు ఆస్కారం ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఏ అవార్డ్ చూసి ఆఫర్లు ఇచ్చారో... ఆ తర్వాత అందుకు తగ్గ పాత్ర ఇవ్వలేదు. ప్రస్తుతం తెరపై ఉన్న అందరి కన్నా అంతో ఇంతో నెట్టుకొస్తున్నారంటే అనుష్క,నయనతార, నిత్యామీనన్ మాత్రమే. అరుంధతితో వచ్చిన విజయాన్ని ఒడిసిపట్టుకుని అనుష్క దూసుకుపోతుంటే...కండిషన్స్ అప్లై అంటూ మొండిగా ముందుకెళ్తోంది నయనతార. కేవలం నటనతో మెప్పిస్తున్నది నిత్యామీనన్ మాత్రమే.
అయితే సినిమా విజయంలో భాగం పంచని సినీ యూనిట్..పరాజయంలో మాత్రం మొత్తం హీరోయిన్ పైకే నెట్టేస్తారు. తాప్సీ, దీక్షాసేథ్, గబ్బర్ సింగ్ కు ముందు వరకూ శ్రుతిహాసన్..ఇలా చాలామందిని ఐరెన్ లెగ్ అంటూ ముద్రవేసారు. ఆ మద్య తెల్లపిల్ల తాప్సీ ఈ విషయంపై నిలదీసింది కూడా.... ఏం హిట్ వస్తే మీది ఫ్లాప్ వస్తే మాదా? అని. టాలీవుడ్ లో విసిగిపోయి ఎంచక్కా తమిళంలో, హిందీలో అదృష్టం పరీక్షించుకుంటోంది. లేటెస్ట్ గా గంగ సినిమాలో విశ్వరూపం చూపించి విజయంలో తన వాటా ఉందనిపించుకుంది. డాన్స్ లో హీరో అదరగొట్టాడు, డైలాగ్ సూపర్ గా చెప్పాడు, టేకింగ్ చాలా బావుంది, స్టోరీ హైలెట్.....ఇలా హిట్టైన సినిమాల గురించి ప్రస్తావించుకుంటారే.... ఒక్కరైనా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారా? అంటే అంతా ముఖాలు చూసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆమె అందాలు ఎరవేసి ప్రేక్షకులను రప్పించుకోవాలనుకుంటున్నారకే కానీ అభినయానికి అవకాశం ఇవ్వడం లేదు. ఏమైనా అంటే కుప్పలు తెప్పలుగా వస్తున్న హీరోయిన్స్...దేనికైనా రెఢీ అనడంతో ఇలా చేయాల్సి వచ్చిందంటున్నారు. కానీ హీరోయిన్ ని సక్రమంగా వాడుకునే టాలెంట్ లేదని ఒప్పుకోవడం లేదు.
ఎందుకంటే గత చిత్రాల్లో సావిత్రి, భానుమతి, అంజలి, జమున, కాంచన, కృష్ణకుమారి, చంద్రకళ, వాణిశ్రీ వీళ్లంతా హీరోలతో సమానంగా-కొన్నిసార్లు హీరోలను మించి మార్కులేయించుకున్నారు. కేవలం నటనతోనే....ఎక్స్ పోజింగ్ చేయలేదు, పాటలకే పరమితమలేదు. ఆ తర్వాత జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుహాసిని, సౌందర్య, మీనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్స్ గతంలో హీరోతో సమానంగా పోటీపడ్డారు. దర్శకనిర్మాతలు వారికి ఆ అవకాశం ఇచ్చారు. కేవలం అందాల ప్రదర్శనే కాకుండా నటనలో వీళ్లకు వీళ్లే సాటి అని గౌరవంగా నిలబెట్టారు. కానీ నేటి దర్శకులకే విలువల్లేవ్....ఇక హీరోయిన్స్ కి విలువేం ఇస్తారు. మహా అయితే ఈ సినిమాలో న్యూడ్ సీన్ లో అద్భుతంగా నటించింది, హగ్ ఇవ్వమంటే ముద్దిచ్చింది, సీన్ డిమాండ్ చేసినట్టు నటించింది, అస్సలు మొహమాటం లేని పిల్ల అని అందంచందాల గురించే తప్ప వారి నటన గురించి ఒక్క మహానుబావుడూ మాట్లాడరు. వీళ్లలో నిజంగా మేటర్ లేదా అంటే.... ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ గ్లామర్ కే పరిమితమైన అనుష్క అరుంధతి, వేదంలో అద్భుతంగా నటించలేదా? ఏం మాయ చేశావ్ లో ముద్దులతో మురిపించిన సమంత ఈగలో మతిపోగొట్టే అభినయం ప్రదర్శించలేదా? వళ్లంతా ప్రదర్శించే ఛార్మీ మంత్రతో మంత్రం వేయలేదా? ఇలా ప్రతిఒక్కరిలోనూ నటనా కౌశలం ఉంటుంది. కానీ ఆ అవకాశం ఇవ్వాలి కదా?
అసలు సినిమా హిట్టయ్యాక హీరోయిన్ గురించి ప్రస్తావించడం లేదంటే వారికి తగిన పాత్ర ఇవ్వలేదని డైరక్టర్లు ఒప్పుకుంటున్నట్టేనా? తారలు కేవలం తళుకుళకోసమే అని అంగీకరిస్తున్నారా? ఆడియన్స్ ని రప్పించేందుకు మేం విసిరే వల మాత్రమే హీరోయిన్ అనే వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారా? అతివల అందాల చూసేందుకే ఆడియన్స్ థియేటర్ కి వస్తున్నారంటే అది నూటికి నూరు శాతం అబద్ధం. అలా అయితేసావిత్రిని చూసేవారే కాదేమో! ఇకనైనా మారండయ్యా బాబూ........