'లౌక్యం' రివ్యూ: హీరో ఇల్లు మారాడోచ్
on Sep 26, 2014
సున్నాని తిప్పి రాస్తే...? సున్నానే.
కిటికి తిరిగేసి రాస్తే...? కిటికీనే.
ఎనిమిది తిరగేస్తే.. మళ్లీ ఎనిమిదే..! అంటే కొన్ని వస్తువుల్ని తిరగేసినా తేడా రాదన్నమాట. ఇప్పుడు తెలుగు సినిమా కథ కూడా అలానే తయారైంది. ఒకే కథని తిరగేసి మరగేసి తీసేస్తున్నారు. ఎంత తిప్పినా.. అదే కథ!
అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్ అనే సినిమా తీశాడు.
అదే కథలో సిద్దార్థ్ నటిస్తే.. అది ఆట అయ్యింది.
విష్ణు దూరితే ఢీ అయ్యింది.
రామ్ చేస్తే రెడీ అయ్యింది.
ఇప్పుడు గోపీచంద్ చేశాడంతే... అదే లౌక్యం! సున్నాని తిప్పి రాస్తే, ఎనిమిదిని తిరగేస్తే, కిటికిని అటూ ఇటూ చేస్తే పలితం ఏమైనా మారిందేంటి?? లౌక్యం సినిమా కూడా అచ్చం అలానే తయారైంది. అదే హీరో. అదే విలన్. అదే రొటీన్ స్టోరీ. కాకపోతే హీరో ఇల్లు మారాడు.
ఇది వరకు విలన్ ఇంట్లో తిష్ట వేసి, వాళ్లని బకరాలుగా మార్చి, కథానాయకుడు వినోదం పంచాడు. ఈ సినిమాలో మాత్రం విలన్ గ్యాంగ్ హీరో ఇంటికే వచ్చింది. అదీ సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఇంకాస్త డిటైల్డ్ గా చెప్పుకోవాలంటే...
వెంకటేశ్వర్లు అనే వెంకీ (గోపీచంద్)... ప్రతీసారీ మైండే వాడతాడు. అవసరమైనప్పుడు మాత్రమే హ్యాండికి పని చెబుతాడు. వరంగల్ మొత్తాన్ని తన కనుసన్నలతో నడిపించే బాబ్జీ(సంపత్) చెల్లెల్ని పెళ్లి పీటల నుంచి లేపుకొచ్చి... తన స్నేహితుడితో పెళ్లి చేస్తాడు. అందుకే వెంకీ కోసం బాబ్జీ తెగ వెతికేస్తుంటాడు. బాబ్జీకి కనిపించకుండా హైదరాబాద్ వచ్చేస్తాడు వెంకీ. ఇక్కడ ఓ గుళ్లో చంద్రకళ (రకుల్ ప్రీత్ సింగ్) ని చూసి మనసు ప్రేమలో పడతాడు. ఆమె ఎవరో కాదు.. హైదరాబాద్ డాన్ సత్య (రాహుల్ దేవ్) చెల్లెలు. కేశవ్ రెడ్డి (ముఖేష్ ఋషి) అనే ఫ్యాక్షనిస్ట్ చంద్రకళని చంపడానికి మనుషుల్ని పురమాయిస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. చంద్రకళ ఎవరో కాదు... వరంగల్ బాబ్జీ, హైదరాబాద్ సత్యల ముద్దుల చెల్లాయి. అంటే ఓ చెల్లాయిని పెళ్లిపీటల నుంచి లేపుకొచ్చి, మరో చెల్లాయిని ప్రేమిస్తున్నాడనమాట. ఈ సంగతి ఆ ఇద్దరు అన్నాదమ్ములకు తెలియకుండా వెంకీ తన లౌక్యం ఎలా చూపించాడు?? అసలు చంద్రకళను చంపడానికి ప్రయత్నిస్తున్న కేశవ్ రెడ్డి ఎవరు? ఈ కథలోకి బ్రహ్మానందం ఎలా ప్రవేశించాడు? అనే విషయాలు తెరపై చూడాలి.
ప్చ్.... తెలుగు సినిమా కథ మళ్లీ మారలేదు. ఎన్నో సినిమాల్లో చూసిన అదే కథ.. కేవలం హీరో, అందులోని కొన్ని పాత్రలూ మారాయంతే. హీరో విలన్ ఇంట్లో తిష్ట వేసేవాడు. ఇప్పుడు ఆ విలన్లనే తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కథలో ఏకైక కొత్త పాయింట్ అదే. హీరో మైండ్ గేమ్ ఆడి, విలన్లను ఓడించడం రణం స్టైల్. హీరో ఓ అమ్మాయిని ఎత్తుకొచ్చి, వాళ్ల చెల్లినే ప్రేమించడం పరుగు కథ. ఇక ఢీ, రెడీ, కందిరీగ... ఈమధ్య వచ్చిన సవాలక్ష తెలుగు సినిమాలు వరుసకట్టేస్తుంటాయి. అయితే ఈ విలన్‌ని బకరా చేసే ఫార్ములా గోపీచంద్ ఇంత వరకూ చేయలేదు. కాబట్టి.. తనకు కొత్త స్టోరీలా అనిపించి ఉంటుంది. బాయిలింగ్ స్టార్ బబ్లూ (ఫృద్వీ), సిప్పి (బ్రహ్మానందం), పిప్పి (చంద్రమోహన్) క్యారెక్టర్లు..... అవి పండించిన వినోదం పక్కన పెడితే.. లౌక్యం పరమ రొటీన్ సినిమానే. అయితే తెలిసిన కథనే తిప్పి తిప్పి చూపించినా ఈ మూడు పాత్రలూ పంచిన వినోదంతో బండి లాగించేశాడు. గోపీచంద్ లాంటి హీరో కూడా తొలిసారి కమెడియన్ల మీద ఆధారపడిపోయి బండి లాగించేయాలనుకోవడం చూసి బాధపడుతూ... మధ్య మధ్యలో బబ్లూ పేరడీ డైలాగులకు మురిసిపోతూ, బ్రహ్మానందం యాజ్ టీజ్ బకరా వేషాలకు భ్రాంతి చెందుతూ, దిగజారిపోతున్న విలనిజం చూసి బకెట్ల కొద్దీ సానుభూతి చూపిస్తూ... ఇలాంటి మిక్స్‌డ్ పీలింగ్స్ మధ్య లౌక్యం సినిమాని కాస్త భారంగా.. చూడొచ్చు.
రణంలో గోపీచంద్ ఏం చేశాడో... ఈ సినిమాలోనూ అదే చేశాడు. నిజానికి సినిమా చూసొచ్చాక ఫృద్వీనో, బ్రహ్మానందమో గుర్తొస్తుంటారు. కానీ గోపీచంద్ గుర్తుకురాడు. ఎందుకంటే... తను చేసిందేం లేదు. అందుకే గోపీచంద్ పాత్ర ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. రవితేజ, రామ్... ఇలాంటి హీరోలు చేయాల్సిన పాత్రలో గోపీ దూరడానికి కాస్త కష్టపడ్డాడు. కొన్ని చోట్ల... అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ రవితేజను గుర్తు చేస్తుంటుంది.
ఈ పాత్రలో హీరోయిజం పూర్తిగా తక్కువ. ఫైట్లు లేకపోతే మరీ బాగోదేమో అని మధ్యలో రెండు పెట్టారు. క్లైమాక్స్ మామూలే. రకుల్ ఈసారి అందాల ప్రదర్శననే ఎక్కువ నమ్ముకొంది. స్విమ్ సూట్‌లో కాస్త హాటుగా కనిపించింది. మరోసారి బ్రహ్మానందం ఈ సినిమాలో కీ రోల్ పోషించాడు. నీరసించిపోతున్న ఈ సినిమాకి టానిక్ అందించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. అందరికంటే ముఖ్యంగా ఫృద్వి గురించి చెప్పుకోవాలి. తన కామెడీ టైమింగ్, రైమింగ్ డైలాగులతో వినోదం పంచాడు. పతాక సన్నివేశాలు చూసి కాస్తనవ్వుకొంటూ బయటకు వచ్చారంటే అదంతా ఫృద్వీ మహిమే. చంద్రమోహన్ ఓకే. సంపత్‌కి పెద్ద పాత్ర దక్కింది. ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు విలన్లున్నారు అనే భ్రమ కల్పించినా.. చివరికి ఒక్క విలన్‌తో సరిపెట్టారు. ఆ విలన్ కూడా డమ్మీ క్యాండెట్‌లా మిగలడం బాధాకరం.
అనూప్ తన మూడ్ బాలేనప్పుడు ఇచ్చిన ట్యూన్స్‌లా ఉన్నాయి. ఈమధ్య అనూప్ అందించిన వీక్ ఆల్బమ్ ఇది. ఒక మెలోడీ పాట మాత్రం బాగుంది. సుర్రు సూపరే అనే ఐటెమ్ పాటలో ఆ పదం ఒక్కటే అర్థమైంది. నేపథ్య సంగీతం కూడా వీకే. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటులో ఏం కొట్టాడో తనకే అర్థం కావాలి. కెమెరా పనితనం బాగుంది. అయితే...ఎడిటర్ కత్తెరకు పదును తగ్గిందో, సినిమా కట్ చేయడానికి వీల్లేదని ముందే షరతు విధించారో తెలీదు గానీ,... కట్ చేయాల్సిన సొద చాలానే ఉంది. ట్రిమ్ చేస్తే ఇంకాస్త వేగం పెరుగుదును. శ్రీధర్ డైలాగులు బాగానే పేలాయి. అయితే ప్రాస కోసం ప్రాకులాట తగ్గించుకోవాలి. కోన వెంకట్, గోపీమోహన్ చేయొస్తే.. ఎలాంటి కథకైనా పాత ఫ్లేవర్ రావాల్సిందే. దానికి ఈ సినిమా ఉదాహరణ..
రొటీన్ కథ... రెండు మూడు నవ్వించే పాత్రలు.. కొన్ని పంచ్ డైలాగులు - లౌక్యం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇదీ. కథ ఎలాగైనా ఫర్లేదు, హీరోయిజం లేకున్నా సర్దుకుపోతాం.... లాజిక్కులు పట్టించుకోకుండా కాసేపు నవ్వుకొని వచ్చేద్దాం అనుకొన్న వాళ్లు ఈ సినిమా చూడొచ్చు. అంతకు మించి ఆశించి ఈ సినిమాకి వెళ్లారంటే మీకు లౌక్యం లేనట్టే.