చాణక్య మూవీ రివ్యూ
on Oct 5, 2019
నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్, నాజర్, ఉపేన్ పటేల్, సునీల్, అలీ, రఘుబాబు తదితరులు
పాటలు: రామజోగయ్య శాస్త్రి
మాటలు: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల
ప్రొడక్షన్ కంపెనీ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరు
విడుదల తేదీ: 05 అక్టోబర్ 2019
గోపీచంద్ సరైన విజయం అందుకుని చాలా రోజులైంది. అయినప్పటికీ... 'చాణక్య'కు పాజిటివ్ బజ్ నెలకొంది. దేశభక్తి, తీవ్రవాదం అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ 'రా' ఏజెంట్ గా నటించారు. ఆయన నటన ఎలా ఉంది? సినిమా సంగతేంటి?
కథ:
అర్జున్ శ్రీకర్ (గోపీచంద్) ఓ రా ఏజెంట్. ఇండియాలో ఉగ్రదాడుల సూత్రధారి ఇబ్రహీం ఖురేషి ముఖ్య అనుచరుడు సలీం భాయ్ ను ప్రాణాలతో పట్టుకుని మన దేశానికి తీసుకొస్తాడు. అతడి నుండి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చంపేస్తాడు. సలీం భాయ్ ను చంపడంలో, అర్జున్ బృందంలో కీలక సభ్యులను ఖురేషి కుమారుడు సోహైల్ ఖురేషి (ఉపేన్ పటేల్) కిడ్నాప్ చేసి పాకిస్థాన్ తీసుకు వెళతాడు. ఇండియన్ రా ఏజెంట్స్ తో సోహైల్ ఏం చేయాలనుకున్నాడు? అతడి ప్లాన్ ఏంటి? దాన్ని అడ్డుకుని రా ఏజెంట్స్ ను ఇండియాకు అర్జున్ ఎలా తీసుకొచ్చాడు? మధ్యలో జుబేదా (జరీన్ ఖాన్) ఎవరు? పాకిస్థాన్ లో ఉన్న ఆమె అర్జున్ కు ఎందుకు సహాయం చేస్తుంది? మధ్యలో ఐశ్వర్య (మెహరీన్)తోరామకృష్ణ గొడవ, ప్రేమ కహానీ ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
హిందీలో ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) నేపథ్యంలో 'బేబీ', 'డి డే', 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులకు ఈ 'చాణక్య' సినిమా అసలు నచ్చదు. పైగా... సినిమా చూస్తున్నంతసేపూ పైన చెప్పుకున్న సినిమాల్లో సన్నివేశాలు మరోసారి కళ్ళ ముందు మెదులుతున్నట్టు ఉంటాయి. సినిమా ప్రారంభంలో సలీం భాయ్ ను హీరో పట్టుకునే సన్నివేశం 'బేబీ'లో సన్నివేశాన్ని, ఆ మిషన్ తర్వాత ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగిగా హీరో ఇంట్రడక్షన్ సీన్ 'ఏక్ థా టైగర్'లో ఒక సన్నివేశాన్ని... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. హిందీ సినిమాలు గుర్తు చేసుకోకుండా... ఓ కొత్త సినిమాలా 'చాణక్య'ను చూస్తే కొంత వరకూ పర్వాలేదని అనిపిస్తుంది.
సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రారంభంలో వచ్చే యాక్షన్ సీన్ నేరుగా హీరో పాత్రను పరిచయం చేయడంతో పాటు అసలు కథలోకి తీసుకు వెళుతుంది. కానీ, ఆ తర్వాత కమర్షియల్ విలువల పేరుతో లవ్ ట్రాక్, పాటలు అంటూ విశ్రాంతి ముందు వరకూ అసలు కథలోంచి బయటకు వచ్చేశారు. గోపీచంద్, మెహరీన్ మధ్య లవ్ ట్రాక్ ఏమంత ఆసక్తికరంగా లేకపోగా... హీరో హీరోయిన్లతో పాటు సునీల్, అలీ, రఘుబాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. కుక్క, కండోమ్ అంటూ చేసిన కామెడీ ఓవర్ ది బోర్డ్ వెళ్ళింది. మాస్ ప్రేక్షకులకు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వు తెప్పిస్తాయేమో. కుటుంబంతో, పిల్లలతో సినిమాకు వెళితే కొంచెం ఇబ్బంది తప్పదు. విశ్రాంతి తర్వాత మళ్ళీ కథ మెయిన్ ట్రాక్ ఎక్కుతుంది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు, స్పేస్ తీసుకుని మరీ ఇరికించిన పాట థియేటర్లో పక్క చూపులు చూసేలా చేసినా... ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు హెల్ప్ అయింది. అయితే... పాటలు సోసోగా ఉన్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే.
ప్లస్ పాయింట్స్:
గోపీచంద్
క్లైమాక్స్ 15 మినిట్స్
కొన్ని యాక్షన్ సీన్స్
శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే
మెహరీన్ తో లవ్ ట్రాక్
పాటలు
'కుక్క' నేపథ్యంలో కామెడీ
నటీనటులు:
గోపీచంద్ గడ్డంతో కొంచెం కొత్తగా కనిపించాడు. ఇంతకు ముందు పలు యాక్షన్ సినిమాలు చేసిన అనుభవంతో అర్జున్ శ్రీకర్ పాత్రలో అవలీలగా నటించాడు. మెహరీన్ కొత్తగా చేసిందేమీ లేదు. గత సినిమాల్లో నటించినట్టు ఏదో ఒక ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలన్నట్టు ఇచ్చి మమ అనిపించింది. నాజర్ పాత్ర పరిధి మేరకు చేశారు. జరీన్ ఖాన్ కూడా ఏదో మమ అనిపించారు. సన్నివేశాల పరంగా చూస్తే సునీల్, అలీ, రఘుబాబు బాగా చేసినట్టే. ఓవరాల్ సినిమాను లెక్కలోకి తీసుకుంటే... ఇటువంటి సినిమాలో అటువంటి కామెడీ ఎందుకు? అనిపిస్తుంది. ఉపేన్ పటేల్, జయప్రకాశ్ తదితరుల తమ పరిధి మేరకు చేశారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కమర్షియల్ సినిమా తీయాలా? రా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ తీయాలా? అనే సందిగ్ధంలో దర్శకుడు తిరు అటు ఇటు కాకుండా సినిమా తీశాడు. ఇటు కమర్షియల్ అంశాలకు న్యాయం చేయలేకపోయాడు. అటు పర్ఫెక్ట్ థ్రిల్లర్ తీయలేకపోయాడు. కమర్షియల్ మిక్చర్ సరిగా కుదరలేదు. కానీ, కొన్ని యాక్షన్ సీన్స్ బావున్నాయి. బాగా డిజైన్ చేశారు. తన నటనతో గోపీచంద్ కొంతవరకూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మాస్ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందేమో. బి, సి సెంటర్ ఆడియన్స్ రెస్పాన్స్ మీద సినిమా ఏవరేజ్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అనేది డిసైడ్ అవుతుంది.
రేటింగ్: 2.25/5